×
ఇస్లాం ధర్మం గురించి తరుచుగా ప్రజలు అడిగే కొన్ని ప్రశ్నలు మరియు వాటి సరైన జవాబులు.

    ఇస్లాం గురించి కొన్ని ప్రశ్నోత్తరాలు

    ఇస్లాం ధర్మం అంటే ఏమిటి మరియు ముస్లింలు అంటే ఎవరు?

    ఇస్లాం ధర్మం ఒక సహజమైన మరియు సంపూర్ణమైన జీవన విధానం. సర్వలోక సృష్టికర్తతో మరియు ఆయన సృష్టితో తమ సంబంధం ఎలా ఉండాలనే ముఖ్యాంశంపై తగిన సావధానత చూపాలని మనల్ని ప్రోత్సహిస్తున్నది. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఆమోదించిన మంచిపనులు చేయడంలోనే ఆత్మలకు నిజమైన సంతోషం మరియు శాంతి లభిస్తుందని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఆ మంచిపనులు స్వంతానికీ మరియు సమాజానికీ ప్రయోజనకరమైనవై ఉంటాయి.

    ఇస్లాం ధర్మ సందేశం చాలా సామాన్యమైనది: ‘కేవలం ఏకైక నిజ ఆరాధ్యుడిని మాత్రమే విశ్వసించుట మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన యొక్క చిట్టచివరి ప్రవక్తగా స్వీకరించుట’. “ఇస్లాం” అనే పదానికి అర్థం ఏకైక నిజ ఆరాధ్యుడికి సమర్పించుకొనుట. జాతి, వర్ణ, కుల మత వర్గాలకు మరియు తెగలకు అతీతంగా అలా సమర్పించుకున్నవారినే ముస్లింలు అంటారు.

    అసలు జీవిత ఉద్దేశ్యం ఏమిటి?

    ఒక గమ్యం లేకుండా తమ ఇష్టానుసారం ఎలా పడితే అలా జీవించేందుకు సృష్టికర్త మానవులను సృష్టించలేదు. ఖచ్ఛితంగా మన కొరకు ఒక ఉత్తమ లక్ష్యం ఉన్నది. అదేమిటంటే – ఏకైక ఆరాధ్యుడిని గుర్తించుట మరియు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించుట. తద్వారా మన సృష్టికర్త మార్గదర్శకత్వంపై జీవించుట. ఈ మార్గదర్శకత్వం అన్ని విధాలా సాఫల్యవంతమైన మరియు శుభప్రదమైన జీవితాన్ని గడిపేలా మనకు దారి చూపుతుంది. అంతేగాక స్వర్గానికి చేరుస్తుంది మరియు నరకాగ్ని నుండి కాపాడుతుంది. ఇదే మన కొరకు విశ్వాస పరీక్ష. అంటే మనకు ప్రసాదించబడిన తెలివితేటలు మరియు శక్తియుక్తులను ఉపయోగించి అల్లాహ్ యొక్క సూచనలు మరియు చిహ్నాల గురించి లోతుగా ఆలోచించుట మరియు ఆయనను గుర్తించుట, ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించి జీవించుట.

    మనల్ని పరీక్షించుట కొరకు ఆ ఏకైక ప్రభువు మనకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించి, ఎవరు మనస్ఫూర్తిగా, తమ ఇష్టానుసారంగా ఆయన మార్గాన్ని అనుసరిస్తారో కనిపెడుతున్నాడు.

    అల్లాహ్ అంటే ఎవరు ?

    ఏకైక నిజ ఆరాధ్యుడి స్వంత పేరే అల్లాహ్. అల్లాహ్ కు భాగస్వాములు లేరు, సాటి లేరు, తల్లిదండ్రులు లేరు. పిల్లలు లేరు. అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలన్నీ పరిపూర్ణమైనవి, ఉదాహరణకు సర్వలోకాల సృష్టికర్త, ఏకైకుడ, అత్యంత కరుణామయుడు, అత్యంత శక్తిమంతుడు, అత్యంత న్యాయవంతుడు, అత్యంత వివేకవంతుడు మరియు ప్రతిదీ ఎరిగినవాడు. ఏ మానవుడికీ లేక వస్తువుకూ అల్లాహ్ యొక్క దైవత్వంలో మరియు ఆయన యొక్క దివ్యలక్షణాలలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. కాబట్టి, ఆరాధింపబడే అర్హతలు, యోగ్యతలు ప్రత్యేకంగా కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయి.

    ముహమ్మద్ అంటే ఎవరు ?

    ప్రవక్తల పరంపరలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త. ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని సకల మానవాళిని ఆహ్వానించుట కొరకు ఆయన పంపబడినారు. ఆయన ఒక అత్యుత్తమ తండ్రి, భర్త, బోధకుడు, నాయకుడు, న్యాయాధిపతి. పరిపూర్ణమైన నిజాయితీ, న్యాయం, కరుణ మరియు ధైర్యసాహసాలు కలిగిన ఒక అత్యుత్తమమైన మానవుడి ఉపమానం. ముస్లింలు ఆయనను ఎంతో గౌరవిస్తారే, ఆయనను ఆరాధించరు. అంతేకాదు, ముస్లింలు ఏ ప్రవక్తనూ ఆరాధించరు, మొరపెట్టుకోరు.

    ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన మూలాధారాలు ఏవి?

    ఖుర్ఆన్ - ఇస్లామీయ ధర్మజ్ఞానం మరియు ఇస్లామీయ బోధనా సూత్రాల యొక్క ప్రాథమిక మూలాధారం. సున్నత్ – ఇస్లామీయ ధర్మం యొక్క రెండవ మూలాధారం మరియు స్వంత సహచరుల ఉల్లేఖనల సాక్ష్యాధారాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేలాది ఉపదేశాలు మరియు ఆచరణల సంకలనం.

    అవన్నీ ఎంతో ప్రామాణికమైనవి కావటం వలన, ముస్లింలకు అవి ఖచ్ఛితమైన జీవన విధానం మరియు మార్గదర్శకత్వం చూపుతున్నాయి. మొత్తం ఇస్లామీయ బోధనలన్నీ ఈ రెండు మూలాధారాల నుండి తీసుకోబడిన సాక్ష్యాధారాలపైనే అధిక శాతం ఆధారపడి ఉన్నాయి.

    ఖుర్ఆన్ అంటే ఏమిటి ?

    మానవాళి కోసం పంపబడిన అంతిమ దివ్యగ్రంథం ఖుర్ఆన్. అదొక గొప్ప మార్గదర్శక గ్రంథం. మంచి -చెడులను వేరు చేసే గీటురాయి. అల్లాహ్ వాక్కు. దైవదూత జిబ్రయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడింది. దీని అవతరణతో అంతకు ముందు పంపబడిన తౌరా, గోస్పెల్ మొదలైన దైవవాణులన్నింటినీ రద్దు అయి పోయాయి. మన ఉనికి ఉద్దేశ్యం ఏమిటి, సరైన దైవభావన ఏది, సృష్టికర్త ఇష్టపడే మరియు అయిష్టపడే ఆచరణలు ఏవి, ప్రవక్తల వృత్తాంతాలు మరియు వాటి గుణపాఠాలు, స్వర్గనరకాలు మరియు అంతిమ తీర్పుదినం మొదలైన అనేక ముఖ్యాంశాల గురించి చక్కగా వివరిస్తున్నది మరియు స్పష్టం చేస్తున్నది.

    ఖుర్ఆన్ యొక్క ఒక గొప్ప మహిమ ఏమిటంటే, అది అవతరించిన నాటి నుండి అంటే 1400 సంవత్సరాల నుండి ఒక్క అక్షరం మార్పూ లేకుండా భద్రంగా, స్వచ్ఛంగా అవతరించిన అసలు రూపంలో నేటికీ సురక్షితంగా ఉన్నది. దీనిలో ఆనాటి ప్రజలు ఊహించను కూడా ఊహించలేని మరియు ఈ మధ్యనే కనిగొనబడిన అనేక వైజ్ఞానిక మరియు చారిత్రక వాస్తవాలు పేర్కొనబడినాయి. అనేక వైజ్ఞానిక మరియు చారిత్రక పరీక్షలలో తన ప్రామాణికతను ఋజువు చేసుకున్నది. తద్వారా అది సర్వలోక సృష్టికర్త పంపిన గ్రంథమని ఋజువు అవుతున్నది.

    ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన ఆచరణలు ఏవి ?

    ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన ఆచరణలు, ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలనే పేరుతో పేర్కొనబడినాయి.

    1వ మూలస్థంభం (మూలసిద్ధాంతం): సాక్ష్యప్రకటన లేక విశ్వాస ప్రకటన - ఒక్క అల్లాహ్ తప్ప, ఆరాధింపబడే అర్హతలు గల మరో దేవుడెవ్వడూ లేడు మరియు ముహమ్మద్ ఆయన యొక్క అంతిమ సందేశహరుడు.

    2వ మూలస్థంభం: నమాజులు. ప్రతిరోజు ఐదుసార్లు నిర్ణీత సమయాలలో నమాజు చేయవలసి ఉన్నది: ఉషోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత మరియు రాత్రి సమయాన.

    3వ మూలస్థంభం: నిర్ణీత మోతాదుతో దానధర్మం చేయుట. బీదసాదలకు తమ మిగులు సంపదలో నుండి ప్రతి సంవత్సరం దాదాపు 2.5% దానం చేయడం. ప్రాథమిక అవసరాలకు మించి మిగులు సంపద కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఇలా దానం చేయవలసి ఉన్నది.

    4వ మూలస్థంభం: రమదాన్ నెలలో ఉపవాసం ఉండుట. ఈ నెల మొత్తం ముస్లింలు ఉపవాసం ఉంటారు. ప్రాతఃకాలం (వేకువ ఝాము) నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు మరియు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటారు. అన్ని రకాల చెడు పనుల నుండి కూడా దూరంగా ఉంటారు.

    5వ మూలస్థంభం: హజ్ యాత్ర. ఒకవేళ ముస్లిం వ్యక్తి వద్ద తగిన సదుపాయాలు, శారీరక మరియు ఆర్థిక స్తోమత ఉంటే, తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారి సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్ళి, హజ్ యాత్ర చేయవలసి ఉన్నది. ఈ పవిత్ర యాత్ర నమాజులు, ప్రార్థనలు, దానధర్మాలు, ప్రయాణం మొదలైన వాటితో పాటు అణుకువ, నమ్రత, విదేయత మరియు అధ్యాత్మిక అనుభవాలతో కూడి, ముస్లిం సమాజంలో ఐకమత్యాన్ని మరియు సోదరభావాన్ని స్థాపిస్తున్నది.

    జీసస్ మరియు ఇతర ప్రవక్తల గురించి ముస్లింల విశ్వాసం ఏమిటి?

    ప్రతి జాతి కొరకు కనీసం ఒకరి చొప్పున, వేల కొలది ప్రవక్తలను అల్లాహ్ ఒకే దివ్యసందేశంతో పంపినాడు: కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు ఆయనకు సాటి కల్పించకండి, భాగస్వాములను కల్పించకండి. వారిలో కొందరు ఆదం, నూహ్, జోసెఫ్, అబ్రహాం, యాకోబు, ఇసాకు, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్తలలో జీసస్ అలైహిస్సలాం ఒకరు. ఆయన జననం ఒక అద్భుతం. కన్య మేరీకు స్త్రీపురుష కలయిక లేకుండానే జన్మించారు మరియు అనేక మహిమలు చేసి చూపారు – ఇదంతా కేవలం అల్లాహ్ అనుజ్ఞ ద్వారానే జరిగింది.

    కష్టాలు ఎందుకు వస్తాయి ?

    అల్లాహ్ ప్రజలను వేర్వేరు విధాలలో రకరకాల ఆపదలకు గురి చేసి, పరీక్షిస్తాడు. వాటిలో కొన్ని ఆరోగ్యం, కుటుంబం, ప్రకృతి వైపరీత్యాలు, సంపద లేక ఇతర పద్ధతులు. ఆపద సమయాలలో సహనం, ఓర్పుతో వహించడం మరియు సుఖసంతోషాల సమయాలలో అల్లాహ్ కు కృతజ్ఞత చూపడం ద్వారా మనం అల్లాహ్ కు దగ్గర కాగలం మరియు శాశ్వత స్వర్గంలో స్థానం సంపాదించగలం. ఆఫ్ కోర్స్, ఈ ప్రాపంచిక జీవితంలోని కష్టనష్టాలు, బాధలు తాత్కాలికమైనవే. స్వర్గ జీవితం మాత్రం శాశ్వతమైనది.

    చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది ?

    చావు అనేది ఈ ఇహలోకపు తాత్కాలిక జీవితం నుండి పరలోకపు శాశ్వత జీవితానికి చేర్చే వారధి. ఇహలోకంలో తాము చేసిన పాపపుణ్యాలకు బాధ్యత వహించడం కోసం అంతిమ తీర్పుదినం నాడు ప్రతి వ్యక్తీ మరలా లేపబడతాడు. ఆ మహా తీర్పుదినం నాడు ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ఇహలోకంలో ఎవరైనా దౌర్జన్యానికి గురైతే, అక్కడ అతనికి పరిహారం లభిస్తుంది మరియు అల్లాహ్ అతనికి సరైన న్యాయం చేస్తాడు. ఆయన అన్నీ ఎరిగినవాడు మరియు అత్యంత న్యాయవంతుడు. ఒకవేళ ఎవరైనా ఇహలోకంలో అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు విధేయత చూపుతూ మంచి, గౌరవప్రదమైన జీవితం గడిపితే, అల్లాహ్ అనుగ్రహం ద్వారా అలాంటి వారికి స్వర్గ ప్రవేశం ప్రసాదించబడుతుంది. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు అవిధేయత చూపుతూ జీవిస్తే, అలాంటి వారి కోసం నరకం ఎదురు చూస్తున్నది.

    ఒకవేళ మంచి పనులకు ప్రతిఫలం ప్రసాదించబడే మరియు చెడు పనులకు కఠిన శిక్షలు వేయబడే పరలోక జీవితమే లేకపోతే, అది సృష్టికర్త యొక్క సంపూర్ణ న్యాయానికి విరుద్ధం అవుతుంది మరియు జీవితంలో న్యాయవంతం కాజాలదు.

    ఇస్లాం ధర్మం ప్రకారం నీచాతి నీచమైన పాపం ఏది?

    సర్వలోక సృష్టికర్తకు సాటి కల్పించడం లేదా ఆయనకు ఇతరులను భాగస్వాములు కల్పించడం అనేది ఇస్లాం ధర్మంలో నీచాతి నీచమైన పాపం. ఇందులో సృష్టికర్త యొక్క కొన్ని దివ్యలక్షణాలను ఇతర సృష్టితాలకు కట్టబెట్టడం, దేవుడికి కుమారుడు, తల్లి లేదా ఇతర బంధువులు ఉన్నారని వాదించడం, ఆయనకు అవిధేయత చూపడం మరియు తిరస్కరించడం మొదలైనవి కూడా ఉన్నాయి.

    మహిళల గురించి ఇస్లాం ధర్మం ఏమంటున్నది ?

    ఇస్లాం ధర్మంలో, ప్రతిఫలం పొందడంలో మరియు తమ ఆచరణలకు బాధ్యత వహించడంలో అల్లాహ్ ముందు స్త్రీపురుషులు ఉభయుల మధ్య ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సరిసమానంగా చూడబడతారు. ఉభయులను సృష్టించింది అల్లాహ్ యే. ఆయనే వారిరువురిలో ప్రతి ఒక్కరికీ వారి శారీరక, మానసిక పరిస్థితులను అనుసరించి వేర్వేరు పాత్రలు మరియు బాధ్యతలు అప్పజెప్పినాడు. పురుషులు ఎలాంటి దౌర్జన్యం చేయకూడదని, హింసించరాదని ఆజ్ఞాపించి, స్త్రీలకు ఎంతో ఉన్నత గౌరవాభిమానాల స్థానాన్ని ప్రసాదించినాడు.

    ఇస్లాం ధర్మంలో ఆదిపాపమనే భావన ఉన్నదా?

    “ఆదిపాపం” అనే భావన ఇస్లాం ధర్మంలో అస్సలు లేదు. సృష్టికర్త అత్యంత న్యాయవంతుడు. కాబట్టి స్వయంగా చేయని పాపానికి ఏ ఒక్కరినీ ఆయన బాధ్యుడిగా చేయడు. అంటే ఎవరు చేసిన పాపకార్యాలకు వారు మాత్రమే బాధ్యులు గానీ మరొకరు కాదు.

    జిహాద్ అంటే ఏమిటి ?

    జిహాద్ అంటే సమస్త లోకాల ప్రభువు అయిన అల్లాహ్ సంతుష్టపడే విధంగా ఆయన సత్యధర్మం కోసం ప్రయాస పడటం, శ్రమించడం మరియు త్యాగం చేయడం. భాషాపరంగా, జిహాద్ అంటే “ప్రయాస పడటం, శ్రమించడం, పోరాడటం”. అంటే మంచి పనులు, దానధర్మాలు చేయడంలో ప్రయాస పడటం మరియు ఇస్లామీయ సైనికచర్యలలో పాలుపంచుకోవడం. మిలటరీ జిహాద్ అనేది సర్వసామాన్యంగా అందరికీ తెలిసిన జిహాద్ రూపం. వాస్తవానికి మిలటరీ జిహాద్ అంటే సమాజంలో హద్దుమీరి పోయిన అధర్మాన్ని నిర్మూలించేందుకు, సామాజిక భద్రత కొరకు, దౌర్జన్యం హద్దులు దాటి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు మరియు న్యాయాన్ని స్థాపించేందుకు అధర్మంపై, అరాచకంపై సర్వలోక సృష్టికర్త అనుమతించిన ధర్మయుద్ధం. అయితే చాలా మంది ముస్లిమేతరులు ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాగే కొందరు అజ్ఞాన ముస్లింలు కూడా దీని అసలు అర్థానికి భిన్నంగా ప్రవర్తిస్తూ, అమాయకులపై దాడి చేస్తున్నారు. అలాంటి చర్యలను ఇస్లాం ధర్మం తీవ్రంగా ఖండిస్తున్నది. ఖుర్ఆన్ లోని సూరా అల్ మాయిదహ్ లో “ఎవరైనా ఒక్క అమాయకుడిని చంపితే, అతను మొత్తం మానవాళిని చంపినట్లు” అని స్పష్టంగా ప్రకటించబడింది.

    టెర్రరిజాన్ని ఇస్లాం ధర్మం ఖండిస్తుందా?

    యుద్ధంలో అమాయక సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఒక గర్హణీయమైన మరియు నీచమైన చర్య. దీనిని ఇస్లాం ధర్మం తీవ్రంగా నిషేధిస్తున్నది. అమాయక మానవుల సంగతి తర్వాత గానీ అసలు శత్రుభూభాగంలోని మొక్కలు, పశుపక్ష్యాదులను సైతం అనవసరంగా చంపకూడదని ముస్లింలను శాసిస్తున్నది. యుద్ధరంగంలో పాటించ వలసిన ఇస్లామీయ నైతిక విలువలకు ఇదొక మచ్చుతునక. అయితే ఇక్కడ టెర్రరిజానికీ మరియు దురాక్రమణ, దౌర్జన్యాన్ని ప్రతిఘటించే పోరాటానికీ మధ్య ఉన్న భేదాన్ని మనం గుర్తించాలి. ఇవి రెండూ పూర్తిగా రెండు భిన్న ధృవాలు.

    మతాలన్నీ సమానమేనా?

    మంచి నడవడిక మరియు ఇతరులపై దయ చూపడం మొదలైన విషయాలలో దాదాపు అన్ని ముఖ్య మతాల బోధనలు ఒకేలా ఉన్నా, సర్వలోక సృష్టికర్త యొక్క ఏకత్వం మరియు పరిపూర్ణత్వం విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదనే ముఖ్యాంశంపై ఇస్లాం ధర్మం అదనంగా దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇతర ధర్మాల వలే కాకుండా, సృష్టితో పోల్చలేని సృష్టికర్త భావన పూర్తిగా విభిన్నమైనది మరియు అద్వితీయమైనదని, సకల ప్రశంసలు మరియు ఆరాధనలు తిన్నగా కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయని ఇస్లాం ధర్మం ప్రాథమికంగా బోధిస్తున్నది. ఇస్లాం ధర్మం సమగ్రమైనది, సంపూర్ణమైనది, చాలా సింపుల్ గా ఉన్నా అత్యంత గాఢమైనది. అవతరించిన నాటి నుండి ఒక్క అక్షరం మార్పు లేకుండా సురక్షింతగా కాపాడబడిన దివ్యగ్రంథం కలిగి ఉన్నది. ఏ దైవప్రవక్తనూ నిరాకరించదు. వారందరూ ఒకే సందేశాన్ని తీసుకు వచ్చారని ప్రకటిస్తున్నది.

    హలాల్ ఆహారం అంటే ఏమిటి ?

    హలాల్ లేదా అనుమతించబడిన ఆహారం అంటే ముస్లింల కొరకు అల్లాహ్ అనుమతించిన ఆహార పదార్థాలు. ఇస్లాం ధర్మం సాధారణంగా, పంది మరియు మద్యం తప్ప దాదాపు అన్ని రకాల ఆహారపానీయాలను హలాల్ గానే పరిగణిస్తుంది. మాంసాన్నిచ్చే కోడి, గొర్రె, మేక, ఆవు, ఒంటె మొదలైన వాటిని జిబహ్ చేసేటప్పుడు, మానవత్వంతో వ్యవహరించాలి మరియు సరైన పద్ధతిని అనుసరించాలి. అలాగే అల్లాహ్ పేరు మీదనే ఖుర్బానీ చేయాలి మరియు ఖుర్బానీ పశువు బాధను తగ్గించేందుకు వీలయినన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఎవరు ముస్లింగా మారవచ్చు ?

    ముస్లింగా మారడమంటే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఘనతను గుర్తించడం, ఆయనకు విధేయత చూపడం ద్వారా ఆయనతో దగ్గరి సంబంధాన్ని పెంపొందించుకోవడం మరియు కొనసాగించడం. ఇది ఇహపరలోకాల జీవితంలో సుఖసంతోషాలకు మరియు సంతుష్టానికి దారి చూపుతుంది.

    అల్లాహ్ ప్రజల భూత, వర్తమాన పరిస్థితులకు సంబంధం లేకుండా మొత్తం మానవజాతి కొరకు ఇస్లాం యొక్క ద్వారాలను తెరిచి ఉంచినాడు. కాబట్టి, సింపుల్ గా ఇస్లాం ధర్మాన్ని విశ్వసించడం మరియు ఈ క్రింది విశ్వాస సాక్ష్యప్రకటనను ఉచ్ఛరించడం ద్వారాఎవరైనా ఎప్పుడైనా ముస్లింగా మారవచ్చు:

    ‘అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడనీ మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని’.

    ముస్లింగా మారిన తర్వాత, అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అనుసరిస్తూ, అల్లాహ్ పై భయభక్తులు చూపుతూ ఉద్దేశ్యపూర్వకమైన మరియు సంపూర్ణమైన జీవితాన్ని గడపాలి మరియు ఆ దైవభక్తి ఆధారంగా పరలోకంలో అల్లాహ్ మీకు స్వర్గంలో మంచి స్థానం ప్రసాదించే అవకాశం ఉన్నది.

    http://islamicpamphlets.com/category/text-version/