×
ఈ వ్యాసంలో అంతిమ తీర్పు దినాన పనికి వచ్చే చిత్తశుద్ధితో కూడిన కొన్ని పుణ్యకార్యాల గురించి క్లుప్తంగా వివరించబడింది.

“క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీబంధం ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని, (అంతిమ తీర్పు) దినము రాక పూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి.” ఖుర్ఆన్ వచన భావ అనువాదం (అల్ బఖరా)

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా తమ పరిశుద్ధమైన సంపాదనలో నుండి ఒక ఎండు ఖర్జూరమంత దానం చేసినా (అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధ వస్తువులనే) స్వీకరిస్తాడు. సదఖా ఇచ్చు వారి సదఖాను, అల్లాహ్ వారు తమ దూడను పెంచి పోషించినట్లే, దానిని పెంచుతాడు. అది పెరిగి కొండంత పెద్దగా అవుతుంది”(ముస్లిం బుఖారీ)

సదఖా అంటే అల్లాహ్ అభీష్టానికి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం అని అర్థం. సదఖా క్రియాత్మక విశ్వాసాన్ని వ్యక్త పరుస్తుంది. నేను విశ్వసించే నా ప్రభువు మార్గంలో నా దానం, ప్రాణం, సమయం అన్నీ అర్పితం అని తెలియ పరుస్తుంది. “నిస్సందేహంగా నా నమాజు. నా త్యాగం, నా జీవనం నా మరణం – అన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే” (6:162)

సదఖా అనగానే మన మనస్సులో మొట్టమొదట భావన డబ్బు ఖర్చు పెట్టడం. ఎక్కువ ఖర్చు పెట్టిన్వారికే పుణ్యముంది, లేనివారికి లేదు అనే భావన రేకేత్తుతుంది. కాని సదఖా అనే పదానికి చాలా విస్తృతి ఉంది. మనల్నిసృష్టించిన సృష్టికర్తకు ప్రతి ఒక్కరి స్థోమత తెలుసు. ఎవరి వద్ద ఎంత శక్తీసామర్త్యం ఉంది, ఎవరు ఏమి చేయగలరనేది అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అల్లాహ్ కొందరికి దానం ఇచ్చాడు, కొందరికి విద్య, కొందరికి బుద్ధి, మరి కొందరికి వివేకము అయితే అల్లాహ్ మార్గంలో వీటని ఉపయోగించడం కూడా సదఖాలోకే వస్తుంది.

కొంత మంది ధనముండుట వలన అల్లాహ్ మార్గంలో రేయింబవళ్ళు ఖర్చు పెట్తూ ఉంటారు. లేనివారు వారిని చూసి, నిరాశానిస్పృహలతో ‘మా వద్ద ధనముంటే ఎంత చక్కగా ఖర్చు పెట్టేవారమో’ అంటూ బాధ పడతారు. అలాంటివారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేమంటే, “మంచి మాట కూడా సదఖాయే”
మరొక హదీథులో “నీవు ఏ చిన్న మేలునైనా కించపరచకు. అది నీ సోదరువు నీతో కలిసిన్ప్పటి చిరు మందాస్మినా సరే” అని అనబడింది.

ఒక సందర్భాన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “సదఖా ఇవ్వటం ప్రతి ముస్లింపై విధి” అన్నారు. అనుచరులు ‘ఓ ప్రవక్తా ! డబ్బు లేనివారు ఏం చేయాలి? అని ప్రశ్నించగా, దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “శ్రమించి మీరు లాభం పొందండి. ఆపైన దానం చేయండి. అలా చేయలేక పోతే మంచిని అనుసరించండి, చెడుకు దూరంగా ఉండండి” అని బదులిచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా బోధించారు. “మృదువుగా మాట్లాడ్డం సదఖా, నమాజు చేయడానికి మస్జిద్ వైపునకు తీసుకెళ్ళే ప్రతి అడుగూ సదఖా, ప్రతి పుణ్య కార్యం సదఖాయే, తన సోదరుడ్ని చిరునవ్వుతో ఆహ్వానించటం సదఖా, మీ బొక్కెన నుండో అతని బొక్కేనలో వంచటం కూడా సదఖాయే.”

తాను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా విన్నానని హజ్రత్ బురైదా అస్లమీ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “ప్రతి శరీరంలో ౩౬౦ జోళ్ళు (ఎముకలు) ఉంటాయి, ప్రతి ఎముకకు ఒక సదఖా చెల్లించాల్సిందే” దానికి సహచరులు ఇదెలా సాధ్యం, ఎవరు చేయగలరిలా? అని ప్రశ్నించగా ఆయన ఇలా పలికారు: “మస్జిద్లో ఒక ఇటుక పది ఉండుట చూసి దాన్ని పేర్చినా, దారిలో ఇతరులకు హాని కల్గించే వస్తువును చూసి దాన్ని దారి నుండి తొలగించినా సదఖాయే, అది చేయలేని యెడల రెండు రకాతులు నమాజు చేసినా చాలు.”

హజ్రత్ అబూ జర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వెళ్లి – ‘నా వద్ద ఏమీ లేదు, నేనెలా సదఖా చేయను?’ అని అనగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బదులిచ్చారు, ‘నీవు అల్లాహు అక్బర్, సుభానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లాహ్, మరియు అస్తగ్ఫిరుల్లాహ్ - పలుకు, మంచిని ఆజ్ఞాపించు, చెడునుండి వారించు, ప్రజల దారికి అడ్డంగా పడి ఉన్న ఎముక లేక ముల్లు తీసివీయి, గ్రుడ్డి వానికి దారి చూపించు, చెవిటి వానికి, వెర్రివానికి మాట చక్కగా విడమర్చి చెప్పు, ఎవరినన్నా ఏదైనా వస్తువు వెతుకుతూ చూస్తే నీకు దాని జాడ తెలిస్తే చెప్పు, బలహీనున్ని లేపి నిలబెట్టు, నిస్సహాయునికి సహాయం చేయి, ఇవన్నీ సదఖాలోకే వస్తాయి” అన్నారు. అదీకాక ఓ రైతు పంట పండిస్తే దాన్నుండి పక్షులు తిన్నా, వచ్చేపోయే జనులు ప్రయోజనం పొందినా అదీ సదఖా క్రిందికే వస్తుంది. అల్లాహ్ మార్గంలో ఏ కొంచెం ఖర్చు చేసినా దాని పుణ్యము ఒకటి నుండి పది, పది నుండి నూరు, వంద నుండి ఏడు వందల వరకు వృద్ధి చెందుతుంది. కొన్ని సదఖాలకు పుణ్యాలు తాత్కాలికంగా లభిస్తాయి, కొన్ని సదఖాల్లో పుణ్యం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి లాభదాయకమైన పుస్తకాన్ని పరుల ఉపయోగానికి లైబ్రరీలో పెట్టినట్లైతే దాని నుండి ప్రజలు లాభం పొండుతున్నంత వరకూ పుస్తకం పెట్టిన వ్యక్తికి తెలియకుండా పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఎవరైనా తమ పిల్లలకు మంచి మాట నేర్పిస్తే అలా ఈ మంచి ముందుకు సాగిపోతుంది. నేర్పించిన వారి ఖాతాలో ఏ బ్యాంకులూ, స్కీములూ ఇవ్వని లాభాలు చేరుతూ ఉంటాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిన్చారుః “దానం చేయువారి ధనం తగ్గదు”.

ఎవరైతే ఇతరుల తప్పులను క్షమిస్తారో వారికి అల్లాహ్ ఆదరణ ప్రసాదిస్తాడు, ఎవరైతే అల్లాహ్ ముందు ప్రాధేయ పడతారో అతని ఆదరణ పెంచుతాడు. ఒక వ్యక్తి తన భార్యాబిద్దలపై ఖర్చు పెట్టటం కూడా సదఖాయే, వారిని పస్తులకు గురి చేసి ఇతరులపై ఖర్చు చేయటం మాత్రం తగదు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు, “తనపై, తన భార్యాపిల్లలపై ఖర్చుపెట్టేవాడికి రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకటి: సదఖ యొక్క పుణ్యం, రెండవది: తన సంబంధీకులను ఆదుకున్నందుకు పుణ్యం”. అలాగే ఒక ముస్లిం పుణ్యఫలాపెక్షతో తన కుటుంబీకులపై ఖర్చు పెడితే అతనికి దానం చేసిన పుణ్యం లభిస్తుంది అని కూడా అన్నారు.