వర్షం
కూర్పులు
Full Description
వర్షం
﴿ صلاة الاستسقاء ﴾
] తెలుగు – Telugu – تلغو [
ٍషేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్
అనువాదం : -
పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లా
2010 - 1431
﴿ صلاة الاستسقاء ﴾
« باللغة التلغو »
الشيخ محمد نصير الدين
ترجمة: -
مراجعة: محمد كريم الله
2010 - 1431
అల్లాహ్ కారుణ్యానికి ఒక చిహ్నమైన వర్షం కురువకపోవడానికి కారణాలు?
వర్షాలు కురువక, అనావృష్టి దాపురించడానికి ముఖ్య కారణమేమిటో ఈ క్రింది హదీథ్ లో తెలుపబడింది. దీనిని శ్రద్ధగా చదివి, ఒకవేళ తనలో గనక అలాంటివి ఉంటే, వాటిని వెనువెంటనే దూరం చేసుకొనుటకు ప్రయత్నించాలి. ‘నేను ఒక్కడినే అలా చేస్తే ప్రయోజనం ఏమిటి?’ అన్న దురాలోచనను మీలో రానివ్వవద్దు. అల్లాహ్ నిన్ను - నీ గురించే ప్రశ్నిస్తాడు తప్ప, మరొకరి గురించి కాదు. ఇక అసలు విషయానికొద్దాం -
హదీథ్: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వైపు తిరిగి ఇలా బోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “ఓ ముహాజిరులారా! ఐదు విషయాలకు మీరు గురి అయ్యారంటే మీపై (శిక్షలు, విపత్తులు) విరుచుకుపడతాయి. మీరు వాటికి గురి కాకూడదని నేను అల్లాహ్ ను శరణు వేడుకుంటున్నానుః
1- ఏ సమాజంలో వ్యభిచారం విచ్చలవిడిగా, బహిరంగంగా ప్రబలిపోతుందో వారిలో ప్లేగు మరియు పూర్వ కాలాల్లో లేని రోగాలు అధికమవుతాయి.
2- కొలతలు, తూనికలలో తగ్గించి ఇచ్చేవారిపై కరువుకాటకాలు వస్తాయి, వారి కష్టాలు అధికమవుతాయి, దౌర్జన్యపరులైన పరిపాలకులు వారిపై నియమించబడతారు.
3- తమ ధన,ధాన్యాలలో నుండి ఇవ్వవలసిన జకాత్ (విధిదానం) ఇవ్వకుండా ఉంటే ఆకాశం నుండి వర్షం కురవదు. ఒకవేళ (అక్కడ) పశుపక్షాదులు గనక లేకుంటే (వారు అసలు) వర్షానికే నోచుకోరు.
4- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే అల్లాహ్ వారిపై వారి శత్రువులకు ఆధిపత్యం ఇచ్చేస్తాడు, వారు వీరి వద్ద ఉన్నదంతా దోచుకువెళతారు.
5- పరిపాలకులు అల్లాహ్ గ్రంథం మరియు ఆయన అవతరింపజేసిన వాటి (సహీహ్ హదీథుల) ప్రకారం తమ ప్రభుత్వాలు తీర్పు చేయకుంటే అల్లాహ్ వారి మధ్య అంతర్యుధ్ధం రగిలిస్తాడు.
పై హదీథు ద్వారా తెలిసిందేమిటి? ఎవరికైనా ఏదైనా కొలచి లేదా తూకం చేసి ఇచ్చేటప్పుడు తగ్గించి ఇచ్చే నైతిక రుగ్మత అనేది అనావృష్టి, ఆహారపదార్థాల కొరత, పరిపాలకుల దౌర్జన్యాలకు కారణమవుతుంది. ఈ కష్టాలు ఇలా ఉండగా సిరిసంపద గలవారు కూడా పిసినారితనానికి దిగజారి, విధిగా చెల్లించవలసిన దానం (జకాత్) సయితం చెల్లించనట్లయితే ఆకాశం నుండి వర్షాలు కురువడం ఆగిపోతాయి. ప్రజలు పాపాలు చేస్తున్నప్పటికీ అక్కడ వర్షాలు కురుస్తున్నాయంటే అది పశువులకై అల్లాహ్ యొక్క కారుణ్యం అని తెలుసుకోవాలి.
ఇమాం బుఖారి రహిమహుల్లాహ్ సహీ బుఖారిలోని ‘కితాబుల్ ఇస్తిస్ కా’ అనే ప్రకరణంలోని ఒక అధ్యాయములో (బాబ్) ఇలా ఖరారు చేశారుః ‘ఇంతికాముర్ రబ్బి -అజ్జవజల్ల- మిన్ ఖల్కిహీ బిల్ ఖకహ్ తి ఇజంతుహికత్ మహారిముహు’ అంటే ‘ప్రజలు అల్లాహ్ నిషేధాజ్ఞలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన వారిని అనావృష్టికి గురి చేసి శిక్షిస్తాడు’.
సూరె బఖర (2)లోని 159వ ఆయతు చివరి భాగం “….వారిని అల్లాహ్ శపిస్తాడు, ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారు” అనే ఆయతు వ్యాఖ్యానంలో ప్రఖ్యాత వ్యాఖ్యానకర్త ముజాహిద్ ఇలా చెప్పారుః ‘భూమి ఎండిపోయి (పంటలు పండించలే) నప్పుడు పశువులు ఇలా అంటాయి: ఆదం సంతతిలో పాపానికి ఒడిగట్టిన వారి కారణంగా ఇలాంటి గడ్డు పరిస్థితి వచ్చింది. ఇలాంటి వారిపై అల్లాహ్ శాపం కురువుగాక’.
ప్రజలు విశ్వాస మార్గాన్ని అవలంభించి, పాపాలను విడనాడి, అల్లాహ్ ఆదేశాలు తూ.ఛ. తప్పకుండా పాటించారంటే అది శుభాలు, వరాలు పొందడానికి గొప్ప కారణమవుతుంది. చదవండి ఈ ఖుర్ఆను ఆయతులుః
“ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వారు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వారిని పట్టుకున్నాము. ఏమిటీ? ఈ నగరవాసులు రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా? ఏమిటీ? ప్రొద్దెక్కుతుండగా, ప్రొద్దెక్కినప్పుడు తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉండగా వచ్చిపడే మా శిక్ష నుండి నిశ్చింతగా ఉన్నారా? వారు అల్లాహ్ యుక్తి వ్యూహం (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నష్టపోయేవారు తప్ప మరెవరూ అల్లాహ్ యుక్తి వ్యూహం నుండి నిర్భయంగా ఉండరు”. (ఆరాఫ్ 7:96-99).
మానవులపై ఏ ఆపద వచ్చి పడ్డా, అది వారి ఏదో ఒక తప్పిదం వల్లనే కావచ్చు. అయినా అల్లాహు తఆలా చిన్న పెద్దా తప్పులన్నిటినీ పట్టించుకోడు. తన దయ, కరుణతో ఎన్నో తప్పిదాల్ని మన్నిస్తూ ఉంటాడు. “మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల (పాపాల) ఫలమే. ఆయనైతే (వాటిలో) ఎన్నో విషయాలను మన్నిస్తూ ఉంటాడు”. (షూరా 42:30).
పై వాక్యాలలో వర్షాలు కురువకపోవడానికి కారణాలు తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు మరో విషయం తెలుసుకుందాము రండిః
ఒక్కోసారి నీళ్లతో నిండి ఉన్నవి అని మనం భావించే మేఘాలే నీళ్ళు కాకుండా మరేమైన కురిపించవచ్చు. సస్యశ్యామలం, పచ్చని పైర్లు పండించ గలదు అని మనం అనుకున్న వర్షమే మనలోని కొంత మందిని తన పొట్టలో పెట్టుకుపోవచ్చు. అందుకే ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన వర్షాల చరిత్రను ఒకసారి పరిశీలిస్దాము. తద్వార గుణపాఠం నేర్చుకునే ప్రయత్నం చేస్దాము.
? ప్రవక్త నూహ్ (నోవా) అలైహిస్సలాం 950 సంవత్సరాలు తమ జాతివారికి ఏకైక అల్లాహ్ ను (సృష్టకర్తను) మాత్రమే పూజించాలి, ఆయనకు ఎవరినీ భాగస్వామిగా నిలబెట్టవద్దు అని బోధించారు. (వివరాలకై ఖుర్ఆన్ గ్రంథం చదవండిః (అధ్యాయం:ఆయత్) 7:59, 10:71, 11:25, 21:76, 23:23, 26:105, 29:14, 37:75, 54:9, 71:1). ఎప్పుడైతే వారికి బోధచేసే గడువు సమాప్తమయిందో, వారే స్వయంగా అల్లాహ్ శిక్షను కోరడం మొదలుపెట్టారో, అప్పుడు వారిపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడింది. ఆ శిక్ష ఏమిటీ? ఆకాశం మరియు భూమిలో ఉన్నటువంటి జలద్వారాలన్ని త్రెంచుకుపడ్డాయి. ఎడతెగకుండా పై నుండి వర్షం, క్రింది నుండి భూజలం అంతా ఒక్కటయి ఏకదైవారాధన మార్గాన్ని అవలంభించని వారందరూ మునిగిపోయారు. ఆయన ఓ గొప్ప ప్రవక్త అయినప్పటికీ విశ్వసించని తన కుమారుడిని కూడా మునగకుండా కాపాడుకోలేకపోయాడని 11:42,43లో ఉందిః
? ప్రవక్త షోఐబ్ అలైహిస్సలాం తమ జాతి వారికి ఏకదైవారాధన వైపునకు పిలిచారు. కొలత మరియు తూకములలో న్యాయం పాటించమని బోధించారు. అయినా వారు ఏ మాత్రం ఆయన బోధనకు చెవి మ్రొగ్గకుండా ధిక్కారణ ధోరణి అవలంభించారు. (వారి వివరాలు చదవండిః 7:85, 11:84, 26:177, 29:36). చివరికి వారిపై వచ్చిపడిన శిక్ష ఇలా ఉండింది. ఏడు రోజుల వరకు వారిపై తీవ్రమైన ఎండ కాచింది. ఆ తరువాత ఆకాశంలో ఒక మబ్బు తునక వచ్చింది. వారంతా ఎండవేడి నుంచి కాపాడుకోడానికి ఆ మబ్బు తునక క్రిందికి వచ్చి చేరారు. కొన్ని నిమిషాలు చల్లదనాన్ని ఆస్వాదించారు. కాని మరికొద్ది సేపటికే ఆ మబ్బు తునక నిప్పుల వర్షం కురిపించసాగింది. మరో వైపు నుంచి భూమి ప్రకంపించింది. ఒక భయంకరమైన అరుపు వారిని శాశ్వితంగా మృత్యు ఒడిలోకి చేర్చేసింది. (ఏమిటీ? ఇందులో మనకు గుణపాఠం లేదా???).
? ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు మానవ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహా చెడ్డ కార్యాన్ని మొదలుపెట్టారు. అల్లాహ్ వారిని దాని నుండి వారించుటకు, ఏకదైవారధన వైపునకు పిలుచుటకు ప్రవక్త లూత్ అలైహిస్సలాంను పంపాడు. ఎన్నో సంత్సరాలు ఎన్నో మంచి విధాలుగా వారికి నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు. చివరికి వారి వినాశ కాలం సమీపించింది. అల్లాహ్ వారిని ఎలా అంతమొందించాడు ఈ ఆయతులో తెలిపాడుః “మా తీర్పుసమయం రాగానే ఆ బస్తీని తల క్రిందులుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గుళకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరఫున గుర్తు వేయబడినవి”. (11: 82,83). మరో చోట ఇలా తెలిపాడుః “మేము వారిపై ఒక ప్రత్యేకమైన (రాళ్ళ) వర్షం కురిపించాము. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది”. (షూరా 26:173). (ఇంకా వివరాలకు చూడండిః 7:80, 11:77, 15:58, 21:74, 26:160, 27:54, 29:28, 37:133, 54:33).
అవిశ్వాసానికి, దుష్చేష్టలకు ఒడిగట్టినవారిలో కొందరికి ఇవ్వబడిన శిక్ష వర్షం రూపంలో ఉండినది అని తెలిశాక, వర్షం, దానికి ముందు, దాని మధ్యలో కనవినబడే పిడుగులు, ఉరుములు వీటి గురించి ఖుర్ఆన్, హదీసులు ఏమంటున్నాయో తెలుసుకుందాము రండిః
“ఆయన సూచనలలో ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి”. మరో చోట ఇలా తెలిపాడుః “ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతో పాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా (ఆయనే) బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయననే ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు (యుక్తిపరుడు)”. (రఅద్ 13:12,13).
పై ఆయతులో తెలిసిందేమిటంటేః అల్లాహ్ వర్షానికి సూచనగా పంపే ఉరుములు, మెరుపుల్లో కేవలం వర్షం కురుస్తుందన్న ‘ఆశ’యే కాదు. ‘భయం’ కూడా ఉంది. ఈ క్రింది హదీథ్ సులు శ్రద్ధగా చదవండిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఉరుములు విన్నప్పుడు మాట ముచ్చట వదిలేసి “ఉరుములు మరియు దైవదూతలు భీతి వల్ల ఎవని స్తోత్రములతో పాటు పవిత్రతను కొనియాడుతున్నాయో ఆ అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు” అని అనేవారు. ఇంకా ఇలా అనేవారుః “నిశ్చయంగా ఇది భూవాసులకు ఓ గట్టి హెచ్చరిక”. (అదబుల్ ముఫ్రద్ లిల్ బుఖారి 723. ఇమాం అల్బానీ సహీ అని చెప్పారు).
హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “ప్రళయానికి సమీపాన పిడుగులు చాలా పడుతాయి. మనిషి తన జాతివారిలోకి వచ్చి నిన్న పిడుగు పడి ఎవరు చనిపోయారు అని అడుగిడుతే, ఫలానా, ఫలానా వారు చనిపోయారు అని వారు సమాధానమిస్తారు”. (ముస్నద్ అహ్మద్ 3/64. ఇది సహీ హదీథ్).
మబ్బులు, ఉరుములు చూసినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పరిస్థితి ఏమిటనేది మనకు హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా విశదపరుస్తున్నారు. శ్రద్ధగా పఠించండిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశంలో ఏదైనా అసాధారణ వస్తువు చూస్తే, ఉదాహరణకు మబ్బు లేక మెరుపు చూస్తే ఆయన ముఖ కవళికలు మారిపోతాయి, (ఎంతో ఆందోళన చెందుతూ) ఒకసారి ముందుకు, మరొకసారి వెనక్కి అడుగువేస్తారు. ఒకసారి లోపలికి, మరొకసారి బయటికి నడుస్తారు. అయితే వర్షం కురవగానే, ఆయన భయాందోళనలు దూరమయిపోతాయి. ఒకసారి హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ పరిస్థితి చూసి కారణం ఏమిటని అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారుః “ఆద్ జాతి గురించి దివ్యఖుర్ఆన్ లో వచ్చినట్లు మన మీద కూడా అలాంటి విపత్తు ఏదైనా వస్తుందేమోనని నేను భయపడుతున్నాను”. (ఖుర్ఆన్ లో ఆ సంఘటన ఇలా ప్రస్తావించబడిందిః) “వారు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి, ‘ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక’ అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందరపెట్టిన (విపత్కర) మేఘం. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది”. (అహ్ ఖాఫ్ 46:24).
సామాన్యంగా సర్వమానవులకు, ప్రత్యేకంగా విశ్వాసులకు ఆదర్శవంతమైన మహానీయ దయామయ దైవప్రవక్త విధానం కూడా మన ముందు స్పష్టమయ్యాక ఇకనైనా మనలో మార్పు తెచ్చుకుందామా? లేక మేము విద్యారంగంలో చాలా ముందుకు దూసుకుపోయిన వాళ్ళం, అన్నిట్లో పురాతణ పద్ధతులను పాటించే అవసరం లేదు, ఇది సైన్స్, టెక్నాలజీ యుగం అన్న పొకడలో పడి వినాశాన్ని మన చేతులారా కొని తెచ్చుకుందామా? అవును, నేను వెర్రిగా చెప్పడం లేదు, ప్రస్తుత ఆధునిక యుగంలో ఉండి, అల్లాహ్ తన అపార జ్ఞానంలో నుంచి మనకు ప్రసాదించిన స్వల్పజ్ఞానంతో తయారు చేసుకున్న యంత్రాల అనుభవాన్ని ఎరిగి మాట్లాడుతున్నాను. నంబర్ వన్ దేశాలు అని, వృద్ధి చెందిన దేశాలు అని పేరు గాంచిన ప్రాంతాల్లో పైన తెలుపబడిన ప్రకారం విపత్తులు కురుస్తున్నాయే, మన యంత్రాలు ఏ ప్రయోజనానికి మిగులుతున్నాయి. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ గా సూచనలు అందించే యంత్రాలు తయారు చేస్తున్నాము. అయినా అవి భూకంప నష్టాల నుండి, అగ్నిపర్వతాల పేలుడు వల్ల లేచే పొగలు అందులో రాకపోకలు స్తంభించిపోవడం అందువల్ల బిలియన్ల నష్టాల నుండి ఇంకా ఇలాంటి నూతన విపత్తుల నుండి ఎందుకు మననికు మనం కాపాడుకోలేకపోతున్నాం?
వాస్తవమేమిటంటే అల్లాహ్ కు ఎదురుగా ఏ శక్తి, యుక్తి, ఉపాయం పనికి రాదు. పనికి వచ్చేటివి కేవలం ఆయనను నమ్ముకోవడం, వేడుకోవడం, మన అశక్తతను అంగీకరించి, తప్పిదాలను ఒప్పుకొని ఆయన దయ, కరుణ, క్షమాపణ, మన్నింపును కోరడం. అల్లాహ్ మనందరికి సద్భాగ్యం ప్రసాదించు గాక! ఇహపరాల నష్టాల నుండి కాపాడుగాక! ఆమీన్!!
వర్షం కొరకు అల్లాహ్ వద్ద ప్రత్యేక వేడుకోలు
అల్లాహ్ వరాల్లో ఓ గొప్ప వరం “నీరు”. అది లేనిదే ఏ జీవి యొక్క జీవితం ముందుకు సాగదు. దివ్య ఖుర్ఆనులోని ఈ ఆయతు నీటి విలువను తెలియజేస్తుందిః
“మేము ప్రతి ప్రాణినీ నీటి నుండి పుట్టించాం. అయినా వారు విశ్వసించరా?”(అంబియా 21:30)
మానవులు, పశుపక్షాదులు త్రాగుటకు ఉపయోగించే నీటి మూలాధారాల్లో ఒక మూలాధారం వర్షం. అది అల్లాహ్ ఆజ్ఞతో, ఆయన కోరిన చోట, ఆయన తలచిన సమయంలోనే కురుస్తుంది. ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయతులను గమనించండిః
“మీరు త్రాగే మంచినీరు గురించి ఎన్నడైనా ఆలోచించారా? దానిని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదునీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు ఎందుకు కృతజ్ఞత చూపరు?”. (వాఖియ 56:68-70)
“వారిని ఇలా అడుగుః మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే (అడుగుభాగంలోకి దిగిపోతే) మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో చెప్పండి”. (అల్ ముల్క్ 67:30)
సోదరులారా! ఇస్లాం ధర్మంలో అల్లాహు తఆలా ప్రతి సమస్యకు పరిష్కారం చూపాడు. అజ్ఞాన కాలంలో వర్షాలు కురువకపోవటం వలన అనావృష్టి దాపురించినపుడు, ప్రజలు రకారకాల అజ్ఞాన కార్యాలకు పాల్పడేవారు, వాటిలో ఒకటిః ఎల్లప్పుడూ నిండుగా నీరు పారే నది ఒకవేళ ఎండి పోతే, దానిలో ఒక యువతిని బలి చేయటం ద్వారా అందులో మరల నీరు పొంగి పొరలుతాయని గుడ్డిగా విశ్వసించేవారు. అయితే ఆ మూఢాచారాలను రూపుమాపుతూ, ఇస్లాం దాని కొరకు సరైన పరిష్కారాన్ని బోధించినది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రవక్త మూసా మరియు సులైమాన్ అలైహిస్సలాములు కూడా వర్షం గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం సంఘటన ముస్నద్ అహ్మద్ అను హదీథ్ సు గ్రంథంలో ఇలా ఉందిః “హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం వర్షాన్ని అర్థించటానికి బయటికి వచ్చారు. ఆ సమయంలో ఒక చీమ తన వెనుకటి కాళ్ళను ఆకాశం వైపునకు ఎత్తి దైవాన్ని వేడుకోవటం ఆయన గమనించారు. ఆ చీమ ఇలా వేడుకోసాగిందిః ‘“దేవా! నీవు సృష్టించిన ఇతర ప్రాణుల మాదిరిగానే మేము నీ ప్రాణులం. నీ వర్షపు నీరు లేకుండా మేము కూడా మనజాలము’”. ఇది విన్నంతనే హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం “వెనుతిరిగి, ‘మరలిపోదాం పదండి, ఇతర జీవాల ప్రార్థనా ఫలంగా మీపై వర్షం కురిసినట్లే”’ అని వ్యాఖ్యానించారు.” ఆ పద్ధతి ఏమిటో క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాము మరియు దానిని ఆచరణలోకి తీసుకొద్దాము.
· శుభమైన వర్షం కురిపించమని అల్లాహ్ ను వేడుకోవాలి. సాధారణంగా చేస్తూ ఉండే నమాజులలోనూ, ప్రతి నమాజు తర్వాతనూ, జుమా ఖుత్బాలోనూ (ప్రసంగంలోనూ) దుఆ చేయవచ్చు. వీటన్నింటితో పాటు ప్రజలందరు ప్రత్యేకంగా ఊరి బయట (ఉదాః పండుగ నమాజు చేసే స్థలంలో) సామూహికంగా పండుగ నమాజు చేసినట్లు రెండు రకాతుల నమాజు చేయాలి. అది సంభవం కాకుంటే జుమా మస్జిదులోనే చేయాలి. దీనినే ‘సలాతుల్ ఇస్తిస్ కా’ అంటారు. దీని కొరకు అదాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడదు.
· ఆ తర్వాత ఇమాం ప్రజలనుద్దేశించి ఉపన్యాసించాలి (ఖుత్బా ఇవ్వాలి). అందులో ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వాన్ని ప్రజలు మనసా, వాచ, కర్మ అంగీకరించి, తమ నిత్యజీవితంలో ఆచరిస్తూ, పాపాల నుండి బయటపడి, పుణ్యకార్యాలు చేయుటకు ప్రోత్సహించాలి. చిన్న పెద్ద అన్ని రకాల పాపాల నుండి తౌబా, ఇస్తిగ్ఫార్ చేయాలని, అంటే అల్లాహ్ వైపునకు మరలి, పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాలని, ‘ఓ అల్లాహ్! నీవు మన్నించు’ అని వేడుకోవాలని బోధించాలి. బంధవులతో సత్సంబంధాలు పెంచుకోమని ఆదేశించాలి. అలాగే ఎవరి మీదైనా ఇతరులది ఏదైనా హక్కు ఉంటే దానిని త్వరగా ఇచ్చివేయాలని తెలియజేయాలి.
· ఖుత్బాలో ఈ క్రింద తెలుపబడే ఖుర్ఆన్ ఆయతు ఇంకా పాపాల క్షమాభిక్ష కోరండని ప్రోత్సహించే ఇలాంటి ఆయతులను వాటి పూర్తి అర్థభావాలతో తెలుపడం మరీ మంచిదిః
“క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీ సిరిసంపదల్లోనూ సంతానంలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు, మీ కొరకు తోటల్ని ఉత్పత్తి చేస్తాడు, ఇంకా మీ కొరకు నదీనదాలను, కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్ 71:10-12).
· సలాతుల్ ఇస్తిస్ కా గురించి వెళ్ళేటప్పుడు చాలా సాధారణ (నిరాడంబరమైన) వస్త్రాలు ధరించి, ఎంతో వినయవినమ్రత, అణుకువతో వెళ్ళాలి.
· రెండు చేతులు ఎత్తి దుఆ వర్షం అడుగుతూ దుఆ చేయాలి. ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆ తప్పకుండా చదవాలి. (ఈ దుఆ చివరి పేజిలో చూడండి)
· మీద ధరించి ఉన్న రూమాలు, టోపి, జుబ్బ లాంటి వస్త్రాలు తిరగవేసుకోవాలి.
· చాలా సేపు దీధీనంగా అల్లాహ్ ను వర్షం కొరకు వేడుకొని, తిరిగి తమ ఇళ్ళలకు రావాలి. ఆ తర్వాత వర్షం కురిస్తే అల్ హందులిల్లాహ్ అని పలకాలి, వర్షం కురువకపోతే, మరోసారి అలాంటి నమాజే చేయాలి.
· తొలి వర్షం నీళ్ళలో కొంత వరకు తడుడిస్తే మంచిదే, అప్పుడు ఈ దుఆ చదవాలి. అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅ (ఓ అల్లాహ్ ప్రయోజనకరమైన వర్షం కురిపించు). ఇంకా ఇలా అనాలిః ముతిర్నా బి ఫజ్లిల్లాహి వ రహ్మతిహీ (అల్లాహ్ దయ, కారుణ్యంతోనే మాకు వర్షం కురిసింది).
· ఒక వేళ వర్షం అవసరానికి మించి, లేదా నష్టం ఏర్పడినట్లు కురిస్తే ఈ దుఆ చేచదవాలిః అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా అల్లాహుమ్మ అలజ్జరాబి వల్ ఆకామి వ బతూనిల్ ఔదియతి వ మనాబితిష్ షజర్ (ఓ అల్లాహ్ మాచుట్టుప్రక్కల్లో వర్షం కురిపించు, మాపై వద్దు, ఓ అల్లాహ్ కొండల్లో, లోయల్లో, చెట్లు చేమలు ఉన్నచోట).
· వర్షం కొరకు ప్రత్యేక దుఆ
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ الرَّحْمَنِ الرَّحِيمِ مَلِكِ يَوْمِ الدِّينِ لَا إِلَهَ إِلَّا اللَّهُ يَفْعَلُ مَا يُرِيدُ
اللَّهُمَّ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أنتَ الْغَنِيُّ وَنَحْنُ الْفُقَرَاءُ
أَنْزِلْ عَلَيْنَا الْغَيْثَ وَاجْعَلْ مَا أَنْزَلْتَ لَنَا قُوَّةً وَبَلَاغًا إِلَى حِينٍ
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీం, మాలికి యౌమిద్దీన్, లాఇలాహ ఇల్లల్లాహు యఫ్అలు మా యురీద్, అల్లాహుమ్మ అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ ఘనియ్యు వ నహ్ నుల్ ఫుఖరా, అంజిల్ అలైనల్ ఘైసథ వజ్అల్ మా అంజల్ త లనా ఖువ్వతన్ వ బలాగన్ ఇలా హీన్
اللَّهُمَّ اسْقِ عِبَادَكَ وَبَهَائِمَكَ وَانْشُرْ رَحْمَتَكَ وَأَحْيِ بَلَدَكَ الْمَيِّتَ
అల్లాహుమ్మస్ కి ఇబాదక వ బహాఇమక వన్షుర్ రహ్మతక వఅహ్ యి బలదకల్ మయ్యిత్
اللَّهُمَّ اسْقِنَا غَيْثًا مُغِيثًا مَرِيعًا مَرِيئًا طَبَقًا غَدَقًا عَاجِلًا غَيْرَ آجِلا نَافِعًا غَيْرَ ضَارٍّ
అల్లాహుమ్మస్ కినా ఘైసథమ్ ముగీసథ, మరీ‘అమ్ మరీఆ తబకన్ గదకన్ ‘ఆజిలన్ ఘైర ఆజిలిన్ నాఫి‘అన్ ఘైర జార్ర్
· జుమా ఖుత్బా సందర్భంలో దుఆ చేస్తున్నప్పుడు కూడా పై దుఆలు చదవవచ్చును. ఏదైన సందర్భంలో సంక్షిప్తంగా దుఆ చేయదలుచుకనే వారు కేవలం అల్లాహుమ్మస్ కినా అల్లాహుమ్మస్ కినా అల్లాహుమ్మస్ కినా అని కూడా అనవచ్చును.