×
మానవులంతా సమానమే అనే ఇస్లాం ధర్మపు ఉన్నతమైన వాస్తవాలను ఈ వ్యాసం స్పష్టంగా వివరిస్తున్నది.

    మానవులంతా సమానమే

    ﴿في الإسلام المساواة الحقيقية بين الناس﴾

    ] తెలుగు – Telugu – التلغو [

    Imam Muhammad Baianonie

    అనువాదం : సయ్యద్ యూసుఫ్ పాషా

    పునర్వమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

    2009 - 1430

    ﴿في الإسلام المساواة الحقيقية بين الناس﴾

    « باللغة التلغو »

    إمام محمد بَيْيانوني

    ترجمة: سيد يوسف باشا

    مراجعة: محمد كريم الله

    2009 - 1430

    అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

    మానవులందరూ సమానులే అని ఇస్లాం ధర్మం ప్రకటిస్తున్నది

    సూరా అల్-హుజురాత్(49:13)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు."

    దివ్య ఖుర్'ఆన్ లోని ఈ వచనంతో మానవులందరూ సమానులే అని ఇస్లాం ధర్మం ప్రకటిస్తున్నది. ఎందుకంటే ఇస్లాం ప్రతి మనిషినీ మనిషిగా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. రెండు వర్గాల మధ్య గానీ, రెండు జాతుల మధ్య గానీ లేక రెండు వర్ణాల ప్రజల మధ్య గానీ వ్యత్యాసాన్ని చూపదు. ప్రవక్త ముహమ్మద్ (అల్లాహ్ యొక్క కరుణ, కృప ఆయనపై కురియుగాక) తన చివరి హజ్ యాత్ర సందర్భంగా, ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. తమ ప్రసంగంలో వారు ఇలా అన్నారు “ఓ ప్రజలారా! మీ దేవుడు ఒక్కడే; మీ అందరి తండ్రీ ఒక్కడే. ఒక అరబ్బు దేశస్తునికి అరబ్బేతరునిపై గానీ, లేక ఒక అరబ్బేతరునికి ఒక అరబ్బు పై గానీ, అలాగే ఒక తెల్లవానికి నల్లవానిపై గానీ, లేక ఒక నల్లవానికి తెల్లవానిపై గానీ ఎటువంటి ఆధిక్యతా లేదు – కేవలం అత్యంత ధర్మనిష్టా పరునికి తప్ప. మీలో ఎవరైతే అతి ధర్మనిష్టాపరులో వారే అత్యంత గౌరవనీయులు."

    'సర్వమానవ సమానత్వాన్ని' ఇస్లాం ఒక ధార్మిక సిధ్ధాంతంగా నొక్కి చెప్పటమే కాకుండా, ఆచరణలలో కొన్ని ఆరాధనల ద్వారా చేసి చూపెట్టినది కూడా. ఆ విధంగా 'సర్వ మానవ సమానత్వ సిధ్ధాంతాన్ని' ప్రజల మనస్సులలో నుంచి తొలగించలేని, ఒక గమనార్హమైన సత్యంగా ఆవిష్కరింపజేసినది.

    1. నమాజులు:- మస్జిదులలో ప్రతి రోజూ ఐదు పూటలు ఆచరించబడే నమాజులు, మరియు వారానికి ఒక్కసారి ఆచరించబడే శుక్రవారపు నమజులు మానవులంతా సమానమే అనే ఇస్లాంధర్మ ప్రకటనకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రజలలో ఉండే అన్ని రకాల హెచ్చుతగ్గులకూ, తారతమ్యాలకూ అక్కడ స్థానం లేదు. నమాజు కొరకు మస్జిదుకు ముందుగా చేరుకునే వారు ముందు వరుసలలో ఆశీనులౌతారు -బయట సమాజంలో వారి ఆర్ధిక స్థాయి ఏమైనప్పటికీ, వారి హోదా ఎటువంటి దైనప్పటికీ. ఆలస్యంగా వచ్చేవారి స్థానం చివరి వరుసలే – వారు కోటీశ్వరులైనప్పటికీ, హోదాలో మహారాజులైనప్పటికీ. మస్జిదులో నమాజు ఆచరించబడేటప్పుడు ఆ వరుసలను ఒక్కసారి గమనిస్తే, ధనవంతులూ – పేదవారూ, మేధావులూ – సామాన్యులూ, అరబ్బులూ - అరబ్బేతరులూ, తెల్లటి వారూ - నల్లని వారూ, ఇలా అందరూ ఒకే వరుసలో, ఒకరి భుజాలకు మరొకరి భుజాలను ఆన్చి, ఒకరి మడమలకు మరొకరి మడమలను కలిపి ఉంచి, ఎటువంటి భేదభావాలు చోటులేకుండా స్థిరంగా నిలబడటాన్ని మీ కళ్ళారా చూడవచ్చు. వారిలో తరతమ భేదాలు, హెచ్చుతగ్గులూ, బీదాగొప్ప తారతమ్యాలూ, వర్ణ వైషమ్యాలూ ఏవీ ఉండవు – అల్లాహ్ ముందు అందరూ సమానులే అనే వాస్తవ భావన తప్ప. అందరి దేవుడూ (అల్లాహ్) ఒక్కడే అయినట్లు, వారు నమాజు ఆచరించే దిశ కూడా ఒక్కటే, వారు అనుసరించటానికి అవతరించబడిన దివ్య గ్రంథమూ (ఖుర్'ఆన్) ఒక్కటే, ఇమామ్ వెనుక నమాజు ఆచరిస్తున్న వారందరి కదలికలలో ఏమాత్రం తేడా ఉండదు.
    1. ఉమ్రా – హజ్జ్ లు:- పవిత్ర మక్కా నగరంలో ఆచరించబడే 'ఉమ్రా', మరియు సంవత్సరానికి ఒక్కసారి అక్కడ ఆచరించబడే 'హజ్జ్' ఆరాధనలలో – మానవులంతా సమానమే – అనే భావన మరింత బలంగా, స్పష్టంగా తెలియజేయబడుతుంది. సాధారణంగా నమాజులలో ప్రజలు ధరించే దుస్తులు వివిద వర్ణాలలో, వివిధ రకాలుగా, వారివారి స్థోమతను బట్టి బాగా ఖరీదైనవిగా లేదా సాధారణమైనవిగా ఉండవచ్చు. కానీ 'ఉమ్రా' లేదా 'హజ్జ్' ఆరాధనలు ఆచరించేవారెవరైనా సరే విధిగా 'ఇహ్రామ్' దుస్తులను ధరించాలి. 'ఇహ్రామ్' దుస్తులంటే రెండు తెల్లని వస్త్రాలు, ఒకటి - నడుము చుట్టూ కట్టుకోవటానికి, మరొకటి - భుజాల మీదుగా కప్పుకోవాటానికి, అంతే. పేదవారైనా, ధనవంతులైనా, పాలకులైనా, పాలితులైనా – అందరూ ఆ సమయంలో ధరించవలసినది - ఒకే ఒక రకం దుస్తులు. అందరూ పవిత్ర 'కాబా గృహం' చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు – ప్రార్థించేదీ, ఆరాధించేదీ ఆ ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ ను మాత్రమే.
    2. ధర్మశాసనాలు:- 'సర్వ మానవ సమానత్వానికి' ఇస్లాంలో మరో ఆచరణాత్మక నిదర్శనం ఏమిటంటే – అందరికీ సమానంగా వర్తించే ఇస్లామీయ చట్టాలు, ధర్మశాసనాలు. అంటే ఇస్లాంలో 'అనుమతించబడిన (హలాల్) విషయాలు' అందరికీ సమానంగా వర్తిస్తాయి; అలాగే 'నిషేధించబడిన (హరామ్ విషయాలు)' అందరికీ సమానంగా వర్తిస్తాయి. అంటే “అనుమతించబడిన విషయాలు కొందరికి మాత్రమే, లేదా కొన్ని వర్గాల వారికి మాత్రమే వర్తిస్తాయి - మిగతా వారికి అవి వర్తించవు" అని గానీ, అలాగే “నిషేధించబడిన విషయాలు కొన్ని వర్గాలవారికి లేదా కొందరికి వర్తించవు, మిగతా వారందరికీ వర్తిస్తాయి" – అనే భేదాలేమీ లేవు. అదే విధంగా విధిగా ఆచరించాల్సిన విషయాలన్నీ అందరికీ సమానంగానే వర్తిస్తాయి, అలాగే ఎవరినా తప్పు చేస్తే దానికి విధించబడే శిక్ష కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది.

      ఇస్లాంకు పూర్వం పరిస్థితి ఇలా ఉండేది – ఉన్నత వంశంలోని వారెవరైనా ఏదైనా తప్పు చేస్తే, వారికి విధించబడే శిక్షలు సులభమైనవిగానో, కొన్ని సందర్భాలలో అసలు ఏ శిక్షా విధించకుండా వదిలివేయడమో జరిగేది. అదే పేద, నిమ్న వర్గాల ప్రజలలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, వారి చిన్న చిన్న తప్పులకు కూడా కఠినాతి కఠినమైన శిక్షలు విధించటం జరిగేది. కానీ ఇస్లాం వచ్చిన తరువాత ఈ స్థితి పూర్తిగా మారి పోయింది. దీనికి ఉదాహరణగా ప్రవక్త ముహమ్మద్ జీవితకాలంలో జరిగిన ఈ సంఘటన గమనించండి.

      అరబ్బు తెగలలో అత్యున్నతమైనదిగా భావించబడే ఖురైష్ తెగలోని ఒక స్త్రీ దొంగతనం ఆరోపణలు ఋజువు కావటంతో శిక్షకు అర్హురాలైనది. ఆవిడ ఉన్నత వంశాన్ని పరిగణలోనికి తీసుకుని శిక్షను కొంచెం తగ్గించేలా సిఫారసు చేయమని ప్రవక్త సహచరులలోని కొందరు సహాబాలు, ప్రవక్త ఎక్కువగా ఇష్టపడే ఉసామా బిన్ జైద్ ను ప్రవక్త వద్దకు పంపినారు. ఈ విషయమై ఉసామా సిఫారసు చేయటానికి ప్రయత్నించగా, ప్రవక్త తీవ్రకోపంతో ఇలా అన్నారు – “మీ పూర్వీకులు ఇదే విధంగా విబేధం పాటించేవారు – ఉన్నత వంశీయులు దొంగతనం చేస్తే వారిని ముట్టుకునేవారు కాదు. అదే పేదవారు చేస్తే, వారిని శిక్షించేవారు. విను – ఈ ముహమ్మద్ కూతురు ఫాతిమా అయినా సరే - దొంగతనం చేస్తే, నిశ్చయంగా నేను ఆమె చేతులు ఖండించి ఉండే వాడినే."

      సన్మార్గగాములుగా పరిపాలన సాగించిన ఖలీఫాల కాలంలో 'మానవులంతా సమానమే' అని ఆచరణలో అమలు చేసి చూపించిన సంఘటనలు కోకొల్లలు. మచ్చుకు రెండు ఉదాహరణలు:

      1. 'జబలహ్ బిన్ అయ్ హామ్' ఘస్సాన్ తెగ యొక్క రాకుమారుడు. ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) వద్దకు ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి ఆ రాకుమారుడు తనను అన్యాయంగా చెంపదెబ్బ కొట్టినాడని ఫిర్యాదు చేస్తాడు. విచారణలో అది నిజమే అని తేలటంతో, ఖలీఫా ఆ రాకుమారుడిని పిలిపించి అందరి ముందూ తీర్పు వినిపిస్తారు – “ఈ రాకుమారుడు అన్యాయంగా ఈ పల్లెటూరి వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినాడని ఋజువైనందున, చెంపదెబ్బకు బదులు చెంపదెబ్బ. కాబట్టి ఈ పల్లెటూరి వ్యక్తి ఆ రాకుమారుడిని చెంపదెబ్బ కొట్టాలి. అయితే ఈ పల్లెటూరి వ్యక్తి రాకుమరుడిని క్షమించి వదిలివేస్తే అది అతని ఇష్టం." ఇది విని ఆ రాకుమారుడు ఆశ్చర్యంగా “ఇదేమిటి – నేను రాకుమారుణ్ణి, ఇతను ఒక సాధారణ వ్యక్తి, ఇతను నన్ను చెంపదెబ్బ కొట్టడమా?" అన్నాడు. దానికి ఖలీఫా “ఇస్లాంలో అల్లాహ్ శాసనం ముందు అందరూ సమానులే" అని జవాబిచ్చి, ఇస్లాంలోని సమానత్వాన్ని బహిరంగ పరచినారు.
      1. మరొక ఉదాహరణ: ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా ఉన్న కాలంలో, 'అమ్ర్ బిన్ ఆస్' (రదియల్లాహు అన్హు) ఈజిప్ట్ గవర్నర్ గా ఉండేవారు. గవర్నర్ గారి కుమారుడు ఒక క్రైస్తవుడిని అన్యాయంగా కొట్టి, పైగా “నేను ఫలానా ఉన్నత కుటుంబానికి చెందిన వాడిని" అన్నాడు. ఆ క్రైస్తవునికి తెలుసు – ఇస్లాంలో శాసనం, న్యాయం ఎంత గొప్పవో. తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని అతనికి పూర్తి నమ్మకం. అతను ఈజిప్ట్ నుండి మదీనాకు పయనమై వెళ్ళి, జరిగిన విషయాన్ని ఖలీఫాకు విన్నవించుకున్నాడు. ఖలీఫా గవర్నర్నీ,ఆయన కుమారుడినీ పిలిపించి, కేసు విచారించినారు. నేరం ఋజువైనది. అప్పుడు ఖలీఫా తీర్పు చెబుతూ ఆ క్రైస్తవునితో ఇలా అన్నారు “అతను నిన్ను ఎలా కొట్టినాడో, నీవు కూడా అతన్ని అలాగే కొట్టు". తరువాత గవర్నర్ వైపు తిరిగి “ప్రజలను వారి తల్లులు స్వతంత్రులుగా జన్మనిస్తే, నీవు ఎప్పటి నుండి వారిని బానిసలుగా చేసుకోవటం మొదలుపెట్టావు?" అని మందలించినారు.

      ఇదీ ఇస్లాం అంటే – మనిషికీ మనిషికీ మధ్య విపరీతమైన వ్యత్యాసాలు పాటించబడే, అంటరానితనం, పేదా -గొప్పా తారతమ్యం, ఉన్నత వంశస్తులు -నిమ్న వంశస్తులు అనే భేదభావాలూ, సవాలక్ష అవలక్షణాలతో కూడిన ఆనాటి సమాజంలో, దాదాపు 1400 సంవత్సరాల క్రితమే, 'మానవులంతా ఒక్కటే' అని సర్వ మానవ సమానత్వాన్ని ఎలుగెత్తి చాటి, ఆచరించి మరీ చూపినది.

      ఇదే ఇస్లాం ధర్మం యొక్క విజయ రహస్యం.