×
ఇస్లాం పై ద్వేషంతో, దానిలోని లోపాలను కనిపెట్టాలనే ఉద్ధేశ్యంతో ఖుర్ఆన్ చదవటం ప్రారంభించిన ఒక బ్రాహ్మణ యువకుడు, చివరకు తన ధర్మంలోనే లోపాలు ఉన్నట్లు మరియు ఇస్లాం ధర్మం మాత్రమే స్వచ్ఛమైనదనే వాస్తవాన్ని గుర్తించి, అంతిమ సన్మార్గాన్ని తన సోదరితో పాటు స్వీకరించాడు. ప్రస్తుతం సాఫ్ట్వేరు కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.

ఉమర్ రావ్ – ఒక మాజీ బ్రాహ్మణ యువకుడు

﴿ عمر راوْ ﴾

] తెలుగు – Telugu – التلغو [

Muhammad Umar Rao

అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

పునర్వమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్

2009 - 1430

﴿ عمر راوْ ﴾

« باللغة التلغو »

محمد عمر راوْ

ترجمة: محمد كريم الله

مراجعة: شيخ نذير أحمد

2009 - 1430

 ముహమ్మద్ ఉమర్ రావ్ – ఒక మాజీ బ్రాహ్మణ యువకుడు

వివరణ: ముస్లింలపై తనకు పీకల దాకా ఉండిన అసహ్యం వలన, వారితో వాదించటానికి సమాచారం కూడగట్టే ఉద్దేశ్యంతో ఉమర్ రావ్ ఖుర్ఆన్ చదవటం మొదలు పెట్టినాడు. కాని, తనకు తెలిసిన ప్రపంచం అభౌతికమైనదనే సత్యాన్ని అతడు వెంటనే గ్రహించాడు.

 ముహమ్మద్ ఉమర్ రావ్ స్వీయకథ

అల్లాహ్ అనుగ్రహం వలన నేను ఆయన అంగీకరించే ధర్మాన్ని స్వీకరించ గలిగాను. నా పేరు ముహమ్మద్ ఉమర్ రావు, భారతీయుడిని. దాదాపు 6 సంవత్సరాల క్రితం, 18 ఏళ్ళ వయస్సులో నేను ఇస్లాం స్వీకరించాను. బహుశా ఏది సత్యం అనే వాస్తవాన్ని గుర్తించటంలో ముస్లిమేతరులకిది బాగా ఉపయోగపడ వచ్చనే ఉద్దేశ్యంతో నా ఈ వాస్తవ కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందు నేను ఇద్దరు సోదరులతో చర్చించగా, అల్హందులిల్లాహ్ నా ఈ నిర్ణయాన్ని మరియు ఛాయిస్ ను వారు అభినందించారు. ఆ తర్వాత వారు కూడా ఖుర్ఆన్ చదవటం ప్రారంభించి, కొద్ది రోజులలోనే ఇస్లాం స్వీకరించారు.

 నా పుట్టుపూర్వోత్తరాలు

నేను మధ్యతరగతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను; నా తల్లితండ్రులు ప్రైవేటు సంస్థలలో పనిచేసేవారు (తల్లి: టీచరు, తండ్రి: టెక్స్ టైల్ ఇంజినీరు). నా ధర్మవిద్యాభ్యాసం మామయ్య ఊరిలో జరిగినది, దాని కారణంగా నేను ఆర్థోడాక్స్ గా మారాను. నా కుటుంబం మొత్తం ముస్లింలను బద్ధవిరుద్ధులుగా భావించేవారు, అటువంటి అభిప్రాయాలే నాలో కూడా క్రమంగా నాటుకుపోయాయి.

నేను కొన్ని సంవత్సరాలు ఆర్.యస్.యస్ లో కూడా పనిచేసాను; ఆ కాలంలో నేను ముస్లింలను విపరీతంగా అసహ్యించుకునే వాడిని. నమాజుకు రమ్మని పిలిచే అదాన్ పలుకులు అస్సలు వినబడకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతో మా బహిరంగ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, అక్కడ మ్యూజిక్ శబ్దాన్ని వీలయినంత ఎక్కువగా పెట్టేవాడిని. పట్టణంలో ఉన్న దేవాలయాలన్నింటినీ ప్రతిరోజూ దర్శించి, పూజలు చేసేవాడిని. సాంప్రదాయక జీవితం గడుపుతున్న నన్ను ఇంట్లో ఎంతో ఇష్టపడేవారు, మెచ్చుకునేవారు, మరింతగా ప్రోత్సహించేవారు.

 ఇస్లాంతో నా తొలిపరిచయం

వేసవికాలంలో, ఒక ముస్లిం నడుపుతున్న వ్యాపారసంస్థలో పనిచేయమని నా తల్లి నాతో చెప్పినది. దానికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే బాల్యం నుండీ నేను ముస్లింలను అసహ్యించుకునే వాడిని. ఈ విషయంలో నా తల్లి నన్ను బలవంతం చేయడం మానివేసింది; అయితే నేను కొన్ని వేసవికాలాలలో ఒక ముస్లిమేతరునితో పనిచేసాను. అలా నేను నా తల్లిదండ్రులను సంతోషపెట్టాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు, ఆ పార్ట్ టైము జాబు అంతగా నచ్చక పోవటం వలన దానిని వదిలి వేసి, మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో దృష్టంతా చదువుపైనే కేంద్రీకరించసాగాను. అయితే, ఆ సమయంలో నా తల్లి మరియు సోదరి ఆ ముస్లిం వ్యక్తి దగ్గర దాదాపు రెండు నెలల పాటు పార్ట్ టైమ్ పనిచేసేవారు. అతని మంచి ప్రవర్తన వారిని మరీ ఎక్కువగా ప్రభావితం చేసింది.

కాని నేనెప్పుడూ ఆ వ్యక్తిని అసహ్యించుకునేవాడిని. నేను అసహ్యించుకునే ఆ వ్యక్తినే నా కుటుంబసభ్యులు పొగడటం నాకస్సలు ఇష్టం ఉండేది కాదు. ‘కుటుంబానికి ఏమీ ఉపయోగపడని ఒక పనికి రాని వెధవగా’ నన్ను అవమానించటం మొదలు పెట్టారు. ఆ పరిస్థితి నుండి బయట పడటం కోసం అయిష్టంగానే నేను ఆ ముస్లిం వ్యక్తి షాపులో పనిచేయటానికి ఒప్పుకున్నాను. కాని, ఆ షాపుకు వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత అతని మీద నాకు ఇంకా ఎక్కువగా అసహ్యం కలగసాగింది. ఎందుకంటే, అతని వద్ద పనిచేసే కొందరు ముస్లిమేతరులు అప్పుడే ఇస్లాం స్వీకరించారు. నా హిందూ ధర్మమే నిజమైనదని ఎలాగైనా అతనితో ఒప్పించాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక అప్పటి నుండి దేవుడు ప్రసాదించిన వివేకంతో ధర్మవిషయాలను పోల్చి చూడటం (comparative study) మొదలు పెట్టాను.

ఇస్లాం ధర్మంలోని లోపాలు వెదికి తీయాలనే పట్టుదలతో దివ్యఖుర్ఆన్ భావం యొక్క ఇంగ్లీషు అనువాదం చదవటం మొదలుపెట్టాను. కాని, ఇది నా మొత్తం విద్యార్థి జీవితాన్నే మార్చివేసినది; నన్ను భయంతో పాటు అనేక సందేహాలు చుట్టుముట్టాయి. ‘నేను చేస్తున్నదంతా తప్పే’ అనే వాస్తవాన్ని నేను గ్రహించసాగాను. నా ధర్మమంతా కేవలం ఊహలతో/కల్పిత-అసత్య గాథలతోనే నిండియున్నది. నేను ఎటుపోతున్నాను, ఇక ముందు నేను ఏమి చేయాలి, నా బాధ్యత ఏమిటి, మనందరికీ సత్యసందేశం ఇంత వరకు ఎందుకు చేరలేదు? అనే విషయాల గురించి నాలో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉద్భవించసాగాయి. నా విద్యార్థి జీవితమంతా ఈ సత్యాన్వేషణలోనే గడిచిపోయినది.

తల్లిదండ్రులతో, చుట్టుప్రక్కల ప్రజలతో ‘చిత్రపటాలు గీయటానికి లేక ప్రతిమలు తయారు చేయటానికి దేవుడిని అసలు ఎవరు చూసారు?’ అనే నా ప్రశ్నకు వారందరూ దేవుడిని ఎవరూ చూడలేదు అని జవాబిచ్చారు. ఈ సత్యమైన విషయమే ఖుర్ఆన్ లో అనేక చోట్ల తెలుపబడినది. చివరిగా హిందూ ధర్మపు కొన్ని కల్పిత గాథలు నా విశ్వాసాన్ని పూర్తిగా విరిచేసాయి. గణేష్, ఛాముండేశ్వరీ, రాముడు, సీత మొదలైన గాథలలో నాకు ప్రత్యేత ఏమీ కనిపించలేదు. ఇక ఏమాత్రం వారిని నేను దేవుళ్ళుగా భావించలేక పోయాను.

విగ్రహాహాధనను వేదాలే వ్యతిరేస్తున్నప్పుడు మనం ఇంకా విగ్రహారాధన ఎందుకు చేస్తున్నామని నా తల్లిదండ్రులను ప్రశ్నించగా, నా తల్లి నన్ను బాగా కోప్పడి, మన తాతముత్తాతలు చేసినట్లే మనమూ చేయాలని చెప్పినది. ఆ తర్వాతి రోజునే ఖుర్ఆన్ లోని అల్ బఖరహ్ అనే రెండో అధ్యాయంలో ఉన్న క్రింది విషయాన్ని నేను చదివాను:

“అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశాలను అనుసరించండి” అని వారితో అన్నప్పుడు, వారు “మా పూర్వీకులు అనుసరించిన పద్ధతినే మేము అనుసరిస్తాము” అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానం లేని వారైనప్పటికీ, సన్మార్గం పొందనివారైనప్పటికీ, వీరు వారినే అనుసరిస్తూ పోతారా?”..... (ఖుర్ఆన్ 2:170)

…మరోచోట:

“వారంతా గతించిన ఒక సంఘం, వారు సంపాదించింది వారిది. మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు.” (ఖుర్ఆన్ 2:134)

నేను క్రితం రాత్రే నా తల్లిని అడిగిన ప్రశ్నకు జవాబు ఈ విధంగా ఖుర్ఆన్ ద్వారా నా ముందుకు రావటంతో నేను ఆశ్చర్యపోయాను. ఈ ఆయహ్ (వచనం) తిన్నగా నా హృదయపు లోతుల్ని తాకినది. నేను నిదానంగా విగ్రహారాధన, పూజలు వంటి హిందూ ధర్మపు ఆరాధనా పద్ధతులు ఆచరించటం ఆపివేశాను. ఎందుకంటే షిర్క్ చేయటం (బహుదైవారాధన) అంటే అల్లాహ్ కు సాటి కల్పించటం అనేది అస్సలు క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం అని తెలిసిపోయినది. ఆరంభంలో ఇస్లామీయ ఉపదేశాలను నేను రహస్యంగా ఆచరించటం మొదలు పెట్టాను. కొన్ని చోట్ల ఖుర్ఆన్ లో ‘తమకు కలిగే ప్రాపంచిక లాభాన్ని చూసి కొందరు ఇస్లాం ధర్మం స్వీకరిస్తారు, అంతే కాని హృదయపూర్వకంగా కాదు.’ అని కపటుల గురించి స్పష్టం చేయబడినది.

ఇంకా:

“ఈనాడు, నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను.” (Quran 5:3)

నా మనస్సులో వస్తున్న ప్రశ్నలన్నింటికీ ఖుర్ఆన్ లో సమాధానం లభిస్తున్నదనే విషయాన్ని నేను త్వరలోనే గ్రహించాను.

అల్లాహ్ దయ వలన, నేను అర్థం చేసుకున్న కొద్ది జ్ఞానాన్నే నేను నా ఇంట్లో వారికి తెలియజేయటం ప్రారంభించాను. అదే సమయంలో నేను నా ఇంజనీరింగు కూడా పూర్తి చేయదలిచాను. తొందర పడకుండా, నిదానంగా ఇంట్లో సత్యాన్ని తెలియజేయటమనేది నాకూ మరియు నా కుటుంబానికి మంచిదని, సులభంగా ఉంటుందని భావించాను. కాని, డిప్లోమా చివరి సంవత్సరంలో పరిస్థితి విషమించినది. ఆఖరికి నా జీవితంలో ఆ రోజు రానే వచ్చినది. నా కుటుంబాన్ని వదిలివేయటం కంటే నాకు వేరే మార్గం లేకపోయినది. నా సోదరి కూడా ఇస్లాం స్వీకరించి, నాతో చేరిపోయినది. అలా మేము సరైన ఆదాయం లేకుండా, ఎటువంటి ఉద్యోగమూ లేకుండా దాదాపు సంవత్సరం పైగా ఇంటి బయట గడపవలసి వచ్చినది. అల్హందులిల్లాహ్ (సకల స్తోత్రములు అల్లాహ్ కే) - సత్యమార్గం పై నిలకడగా ముందుకు సాగటాన్ని అల్లాహ్ మా కోసం సులభం చేసినాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ తెలిపినట్లు:

“‘కేవలం మేము విశ్వసించాము’ అని అన్నంత మాత్రాన్నే వారిని వదిలివేయటం జరుగుతుందనీ, వారిని పరీక్షించటం జరగదనీ ప్రజలు భావిస్తున్నారా?” (Quran 29:2)

కొంత కాలం తర్వాత, అల్హందులిల్లాహ్, అవకాశాల ద్వారాలను అల్లాహ్ మా కోసం తెరచాడు. ప్రతి రోజూ ఐదు సార్లు నమాజు చేయటానికి ఆటంకమవటం వలన నేను నా పాత ఉద్యోగాన్ని వదిలి పెట్టేశాను. నా కొచ్చిన అవకాశాలన్నీ నా యొక్క మెకాలికల్ విభాగం నుండే, అయితే ఆ ఉద్యోగాలలో నేను షిప్టులలో పనిచేయవలసి వచ్చేది లేదా నా నమాజులను త్యాగం చేయవలసి వచ్చేది. ఒక సంవత్సరంపైగా నేను నా మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తిని, ఆ ఉద్యోగాలను వదిలి పెట్టినా కూడా నాకు ఎక్కడా ఐదు పూట్ల నమాజు చేసుకోవటానికి అవకాశం కల్పించే ఉద్యోగం లభించలేదు. అల్హందులిల్లాహ్ – దాదాపు ఒక సంవత్సరం వరకు నేను కేవలం 2000 రూపాయల జీతానికే ఫాకల్టీగా పనిచేసాను. అయితే, ఆ కష్టాలన్నీ తొలగపోయి, ప్రస్తుతం నేను ఏనాడూ కలలో కూడా ఊహించలేనంత ఉన్నత స్థితిలో సాఫ్ట్వేర్ కన్సల్టెంటుగా జీవితంలో స్థిరపడ్డాను. అల్హందులిల్లాహ్, అల్లాహ్ మమ్మల్ని ఎన్నుకున్నాడు. మాకు ఇంకేమీ అవసరం లేదు.