×
మాజీ క్రైస్తవ పాదిరీ ఇస్లాం స్వీకరించి, ఈ సంత్సరం హజ్ యాత్రలో పాల్గొన్న అనుభవాన్ని తెలుపుతున్న ఒక వాస్తవ గాథ యొక్క అనువాదం. ఇందులో ఆయన ఇస్లాం స్వీకరించటానికి గల కారణాలు మరియు ఆతర్వాత కుటుంబం నుండి ఎదురైన పరిస్థితులను వివరించారు.

    మాజీ పాదిరి తన 'అధ్యాత్మిక యాత్ర' గురించి తెలిపిన వివరములు
    P.K. అబ్దుల్ గఫూర్, అరబ్ న్యూస్ దినపత్రిక

    జెద్దాహ్, 29 డిసెంబర్ 2007 — ఈ సంవత్సరం చాలా మంది నూతన ముస్లింలు అధ్యాత్మిక ప్రయాణం ద్వారా తమ విశ్వాసాన్ని దృఢపరచుకోవటానికి పవిత్ర హజ్ యాత్ర చేస్తున్నారు.


    అలీ గాటెమాలా

    వారిలో కొందరు మక్కా,మదీనా పవిత్ర మస్జిద్ ల దాసుడైన మహారాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ యొక్క అతిథులుగా వచ్చారు. మరికొందరు ధర్మదాతల మరియు ధర్మసంస్థల ఆర్థిక సహాయంతో, మిగిలినవారు స్వంత ఖర్చులతో మక్కా నగరం చేరుకున్నారు.

    ఇతర 17,000 అమెరికన్ ముస్లింలతో పాటు అలీ గాటెమాలా అనే మాజీ క్రైస్తవ మతాధికారి కూడా హజ్ చేస్తున్నారు. ‘అష్షర్క్ అల్ ఔసత్’ అనే అరబీ వార్తాపత్రికలో ప్రచురితమైన నివేదిక ప్రకారం - Severedoo Royes, (అలీ గాటిమాలా యొక్క గత క్రైస్తవ మతపు పేరు) దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖరాహ్ (ఆవు) అనే 2వ అధ్యాయంలోని తొలి వచనాల్ని చదివి, ఇస్లాం ధర్మం స్వీకరించాడు.

    ఇస్లాం ధర్మ స్వీకరణ, తన మొత్తం జీవితాన్నే మార్చివేసినదని ఆయన తెలిపారు. “క్రైస్తవ ధర్మవిద్యాలయం నుండి పట్టభద్రుడయిన తర్వాత నేను క్వీన్ సిటీ, దక్షిణ అమెరికాలో పాదిరిగా పనిచేసేవాడిని మరియు నేను అక్కడి జైళ్ళ లోపల మతప్రచారం చేసేవాడిని.” అని అలీ గాటెమాలా అన్నారు.

    క్రైస్తవ మత ప్రచార నైపుణ్యాన్ని పెంచుకోవటానికి రోయీస్ (Royes) దివ్యఖుర్ఆన్ తో సహా, ఇతర మతగ్రంథాలను కూడా చదవటం ప్రారంభించారు. “అలా చదవటమే నా జీవితాన్ని మలుపు త్రిప్పివేసినది” అని ఆయన చెప్పారు.

    “ఎప్పుడైతే నేను అల్ బఖరాహ్ (ఆవు) అధ్యాయములోని మొదటి వచనం: ‘ఈ గ్రంథం, దీనిలో ఎటువంటి సందేహమూ లేదు, ఇది దైవభక్తిపరులకు మార్గదర్శకత్వం.’ చదివానో, అది నా అంతరంగాన్ని తట్టి లేపినది. ఈ వచనం గురించి దీర్ఘాలోచనలో పడిపోయాను. దీని రచయిత స్పష్టంగా మరియు ఖచ్చితంగా ఎటువంటి సందేహాలకూ తావివ్వకుండా ఆదేశిస్తున్నట్లు నాలో దృఢాభిప్రాయం ఏర్పడినది.”

    ఆయన క్రైస్తవ విద్యాలయం (సెమినరి)లో అభ్యసిస్తున్నప్పుడు, క్రైస్తవబోధన (బైబిల్) లలో అనేక వ్యత్యాసాలు, వైరుధ్యాలు (contradictions) ఉన్నట్లు కనుగొన్నారు. దానికి తోడు పై తరగతి విద్యార్థులు కూడా ఆయనకు సంతృప్తిపరచే సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు.

    “ఖుర్ఆన్ అనేది షైతాన్ పని అనీ, దానిని అస్సలు చదవ వద్దని వారు సలహా ఇచ్చారు. కాని వారి ఆ సలహా యే నాలో మరింత ఆసక్తిని కలిగించినది. దివ్యఖుర్ చదువు తున్నప్పుడు, అంత మహాద్భుతమైన దివ్య గ్రంథపు రచన మానవులకు సాధ్యమయ్యే పని కాదనే వాస్తవం తెలుసుకున్నాను.” అని వారు తెలిపారు.

    గాటెమాలా సరైన, సత్యమైన దారిని చూపించమని మాటిమాటికీ సర్వలోక సృష్టికర్తను వేడుకోవటం మొదలు పెట్టాడు. “ఒకరోజు నేను ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు, ఒక మనిషి పొడుగాటి గౌనులో నమాజు కోసం మస్జిద్ కు వెళ్ళటం చూసాను. అతడి పేరు సలీం బాఖీల్. నేను అతడితో పాటు మస్జిద్ కు వెళ్ళాను. క్రైస్తవంలో ఉన్నట్లుగా, ముస్లింల ఆరాధనలలో ఎలాంటి కర్మసంబంధమైన ప్రాయశ్చిత ఆచారములు కనబడలేదు. ..... . ఆ తర్వాత వారం రోజుల వరకు ప్రతి దినం ఆ మస్జిద్ కు వెళ్ళేవాడిని.” ఆయన వివరించారు.

    “ఒకసారి నేను మస్జిద్ లో కూర్చుని ఉండగా, ఒకతను దగ్గరకు వచ్చి, నాకు ‘వదూ’ అంటే ఇస్లామీయ పద్ధతిలో కాలకృత్యాలు తీర్చుకోవటం నేర్పుతానని తెలిపాడు. అది ఒక కనికట్టు (ఇంద్రజాలం) గా నేను భావించాను. కాని దానిని నమాజు చేయటానికి ఉపక్రమించే ముందు మాలిన్యాల నుండి శుభ్రపరచుకునే పవిత్ర విధానంగా అతడు నాకు వివరించాడు. అదే రోజున నా యొక్క ఇస్లాం స్వీకరించాలనుకునే నిర్ణయాన్ని ఆ మస్జిద్ వారి ముందు ప్రకటించాను.” అని ఆయన తెలిపినాడు.

    ఇస్లాం స్వీకరించినప్పటి నుండి, గాటెమాలా తన కుటుంబం నుండి, ముఖ్యంగా యూదుమతస్థురాలైన తన సోదరి నుండి ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నాడు. “ముస్లింలు నిన్ను చంపేస్తారని ఆవిడ నన్ను భయపెట్టేది. అయితే నా జీవితంలో వస్తున్న మంచి మార్పులను చూచి ఆవిడ తన అభిప్రాయాలను మార్చుకున్నది. నేను హజ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆవిడకు చెప్పగానే, తన కోసం మక్కా నగరం నుండి ఒక స్మృతి చిహ్నాన్ని జ్ఞాపకార్థంగా తీసుకురమ్మని కోరినది ” అని ఆయన తెలిపారు.

    గాటెమాలాకు హజ్ యాత్ర ఒక మహాద్భుతమైన అనుభవంగా మిగిలినది. “నా జీవితంలోని అత్యుత్తమమైన దినాలుగా ఈ ఆధ్యాత్మిక యాత్రను పరిగణిస్తాను. నేను హజ్ సమయంలో గడిపిన పవిత్ర ప్రదేశాలలో ఒకప్పుడు అంతిమ ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క పాదముద్రలు పడినాయని తెలిసి, నాకు చాలా సంతోషం కలిగినది. నా నగ్ననయనాలతో మొట్టమొదటి సారి పవిత్ర కాబా గృహాన్ని దర్శించినప్పటి ప్రగాఢమైన అనుభూతిని మాటలలో మీకు వర్ణించలేను.”

    అబ్దుల్ ఖాదర్, అబ్దుర్రహ్మాన్ మరియు అబ్దుర్రహీం అనే ముగ్గురు మాజీ ఆఫ్రికన్ పాదరీలు కూడా ఈ సంవత్సరపు హజ్ యాత్రలో పాల్గొన్నారు. ఖమర్ హుస్సేన్ అనే ఇస్లాం ప్రచారకుడితో జరిగిన చర్చలలో వారికి ఇస్లాం యొక్క సత్యశీలత తెలిసివచ్చినప్పుడు, వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అల్ జజీరా అరబీ వార్తాపత్రిక అనుసారం - ఈ చర్చలలో దాదాపుగా 5,000 ప్రజలు పాల్గొన్నారు. అందులో 147 మంది ప్రజలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.

    హజ్ యాత్రా సందర్భంలో ముస్లిం ల మధ్య కనబడిన అత్యద్భుతమైన ఐకమత్యం, భిన్నత్వంలో ఏకత్వం మరియు సమానత్వపు దృశ్యాలు వారిని ఆశ్చర్యచకితులను చేసిందని ఆ మాజీ పాదరీలు తెలిపినారు. ఇస్లాం ను పరిచయం చేసే రియాధ్ లోని ఒక అంతర్జాతీయ సంస్థ సహాయసహకారాలతో ఈ హజ్ యాత్ర పూర్తిచేయటానికి వారు మక్కా నగరానికి విచ్చేశారు.

    “మా ధర్మప్రచారకుల ప్రయత్నాల ద్వారా అల్లాహ్ దయతో ఈ ముగ్గురు క్రైస్తవ పాదరీలు ఇస్లాం స్వీకరించటమనేది చాలా మంచి వార్త” అని ఆ సంస్థ యొక్క ఎగ్జుక్యూటివ్ డైరక్టరు సాలెహ్ అబ్దుల్ వహీద్ తెలిపినారు.


    http://www.arabnews.com/?page=1&section=0&article=105068&d=29&m=12&y=2007