×
క్లుప్తంగా జకాత్ దానం (తప్పనిసరిగా చేయవలసిన దానం) గురించిన వివరములు

    ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం - జకాత్ ׃-

    ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే తప్పని సరి దానం. (పేదవారి ఆర్థిక హక్కు). ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఇస్లాం ధర్మం నిర్ణయించిన కనీస సంపద కంటే ఎక్కవ సంపద కలిగిఉన్న ప్రతి ముస్లిం, ప్రతి సంవత్సరం తన సంపద నుండి కొంతభాగం తీసి నిరుపేదలకు, ఇస్లాం ధర్మసంస్థాపనా కార్యకలాపాలకు విధిగా దానం చేయాలి.

    [وَ أَقِيمُوا الصَّلَاةَ وَآَتُوا الزَّكَاةَ وَ أَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ] {النور56 : 24}

    అన్నూర్ 24׃56 “వ అఖీముస్సలాత వ ఆతూజ్జకాత వ అతీఉర్రసూల ల అల్లకుమ్ తుర్హమూన్”- “నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా ఉండండి, అప్పుడు మీరు కరుణించబడతారు”

    జకాతు నిర్వచనం ׃ నిర్ణీత కాలమందు, నిర్ణీత వర్గం వారికి, నిర్ణీత నియమాలకు అనుగుణంగా తన సంపద నుండి చేయు ఓ విద్యుక్త దానం (త్యాగం).

    జకాతు చెల్లించడంలో గల లాభాలు ׃

    1. అల్లాహ్ ఆదేశపాలన - ప్రతి కోణం నుంచి ప్రతిస్ఫుటింపజేయాలి.
    2. పేదల-నిరుపేదల ఉద్ధారణ జరుగుతుంది.
    3. దీనిలో మానవుడు, దయా, కరుణ, కనికరం వంటి ఉదార గుణాలను పెంపొందించుకుని, పిసినిగొట్టు వంటి హీనగుణం నుంచి బయటపడతాడు.

    జకాతు విధిగా గల సంపద ( సొమ్ము) మరియు దాని రకాలు ׃

    1. బంగారము, వెండి, నగదు - పూర్తి సంవత్సరకాలం మోతాదుకు మించి నిల్వ ఉన్న ఎడల - ప్రతి సంవత్సరం

    2. వర్తక-వాణిజ్య వస్తువులు - ప్రతి సంవత్సరం

    3. పశు సంపద - మోతాదుకు మించి ఉన్న పశువులు - ప్రతి సంవత్సరం

    4. వ్యవసాయం - భూమి నుండి పండించే అన్నిరకాల పంటలు - ప్రతి పంటకు

    జకాతు పొందు హక్కుదారులు ׃

    [ إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالمَسَاكِينِ وَالعَامِلِينَ عَلَيْهَا وَالمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَ فِي الرِّقَابِ وَ الغَارِمِينَ وَ فِي سَبِيلِ اللهِ وَ اِبْنِ السَّبِيلِ فَرِيضَةً مِنَ اللهِ وَ اللهُ عَلِيمٌ حَكِيمٌ ] {التوبة:60}

    “ఇన్న మస్సదఖాతు లిల్ ఫుఖరాఇ, వల్ మసాకీని, వల్ ఆమిలీన అలైహా వల్ ము అల్లఫతి ఖులూబుహుం వ ఫిర్రిఖాబి వల్ గారిమీన వ ఫీ సబీలిల్లాహి వబ్నిస్సబీలి. ఫరీజతమ్ మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం..” - “ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అవసరాలు తీరని వారికి, జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికీ, రుణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలోనూ, బాటసారుల (ఆతిథ్యానికీ వినియోగించడం) కొరకు, ఇది అల్లాహ్ తరపు నుండి విధించబడిన ఒకవిధి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను” దివ్యఖుర్ఆన్ అత్తౌబ 9׃60