×
ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

    ప్రవక్తలను, సందేశహరులనుعليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?

    ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

    “వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో 'ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను'అని అన్నాడు"(7:59)

    “మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:'ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా?" (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

    “మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది" (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా పంపబడ్డారు. మద్యన్ యొక్క మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

    ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు"(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

    మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి" (16:36)

    అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:“మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను"

    “మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే!" (51:56)

    ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు, అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.