×
అత్తౌహీద్ అంటే ఏకైక దైవత్వం యొక్క నిర్వచనం మరియు దాని గురించిన అతి ముఖ్యవిషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినవి.

    తౌహీద్ – ( ఏకైక దైవత్వం)الـتَّـوْحِـيْــد -

    తౌహీద్ – ఇస్లామీయ ఏకైక దైవత్వం పై పూర్తి విశ్వాసం అంటే

    1. అల్లాహ్ పై విశ్వాసం.

    2. అల్లాహ్ యొక్క దైవదూతల పై విశ్వాసం.

    3. అల్లాహ్ యొక్క సందేశహరుల పై విశ్వాసం.

    4. అల్లాహ్ యొక్క దివ్యగ్రంథాల పై విశ్వాసం.

    5. పునరుత్థానదినం పై విశ్వాసం.

    6. అల్ ఖదర్ (అల్లాహ్ నిర్ణయించిన విధి) పై విశ్వాసం – అల్లాహ్ లిఖించిన మన జీవితంలో జరగబోయే మంచి చెడుల పై అంటే “మన జీవితంలో ఏదైతే జరగాలని అల్లాహ్ ముందుగానే నిర్ణయించినాడో, అది తప్పక జరుగుతుందని” మనస్పూర్తిగా విశ్వసించటం. అంతే కాక ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలను అర్థం చేసుకుని, స్వీకరించి, ఆచరించటం - i.e.

    1.“లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ – ఆరాధనలకు వేరెవ్వరూ అర్హులు కారు, ఒక్క ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క రసూల్ – సందేశాన్ని అందజేసిన వాడని” సాక్ష్యమివ్వటం.

    2.రోజువారి ఐదు సార్ల నమాజును స్థాపించటం.

    3.జకాత్ అనే తప్పనిసరి విధిదానం చెల్లించటం

    4.రమదాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండటం

    5.హజ్ యాత్ర చేయటం.

    అల్లాహ్ పై విశ్వాసం అంటే ఆకాశాలలో, భూమిలో మరియు మొత్తం ఉనికిలో “కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్య దైవం” అని ప్రకటించటం. దీనిని మూడు భాగాలలో సులభంగా అర్థం చేసుకో వచ్చును.

    (A) సార్వభౌమత్వం - తౌహీద్ అర్రుబూబియ్యాహ్: అల్లాహ్ యొక్క సార్వభౌమత్వంలో మరియు దైవత్వంలో ఏకైకత్వం; సర్వలోకాల అధిపతి, ప్రభువు, యజమాని కేవలం అల్లాహ్ ఒక్కడే అని హృదయపూర్వకంగా విశ్వసించటం. ఆయనే సర్వలోకాల సృష్టికర్త, ప్రణాళికకర్త, పాలకుడు, పోషకుడు, రక్షకుడు.

    (B) ఆరాధ్యత్వం- తౌహీద్ ఉలూహియ్యహ్: అల్లాహ్ యొక్క ఆరాధన లలో ఏకైకత్వం; “కేవలం ఒక్క అల్లాహ్ తప్ప, ఇంకెవ్వరూ ఆరాధనలకు అర్హులు కారు” అని విశ్వసించటం. ఇక్కడ ఆరాధనలు అంటే ప్రతి ఒక్క ప్రార్థన, వేడుకోలు, అర్థింపు, మొర, అదృశ్య శక్తుల సహాయం అర్థించటం, ప్రమాణం చేయటం, ఒట్టుపెట్టుకోవటం, పశుబలి, దానధర్మాలు చేయటం, ఉపవాసాలు ఉండటం, తీర్థయాత్రలు చేయటం మొదలైనవన్నీ.

    (C) ఘనమైన పేర్లు మరియు సర్వోన్నత గుణవిశేషాలు - తౌహీద్ అస్మా వశ్శిఫాత్: శుభమైన పేర్లలో మరియు సుగుణాలలో, శుభమైన లక్షణాలలో అల్లాహ్ యొక్క ఏకైకత్వం; దీనిని క్రింద ఉదహరించిన విధంగా విశ్వసించటం:

    (i) అల్లాహ్ స్వయంగా తెలిపిన లేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియ జేసిన తన శుభమైన పేర్లు మరియు విశిష్ఠ లక్షణాలు కాకుండా, మన ఇష్టానుసారం అల్లాహ్ కు ఎలాంటి పేర్లు లేక లక్షణాలు పెట్టకూడదు, ఆపాదించకూడదు;

    (ii) అల్లాహ్ యొక్క శుభమైన పేర్లుకు సరితూగే పేర్లను, దివ్యార్హతలను ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదు; e.g. అల్ కరీమ్;

    (iii) ఖుర్ఆన్ లో అల్లాహ్ స్వయంగా తెలిపిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన తన యొక్క విశిష్ఠ లక్షణాలన్నింటినీ, పూర్తిగా విశ్వసించవలెను. మన ఇష్టానుసారం వాటి అర్థాన్ని మార్చటం, లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, విస్మరించటం, ఉపేక్షించటం లేదా అర్థాన్ని తారుమారు చేయటం లాంటివి చేయకూడదు. ఇంకా వాటిని మన పరిమిత జ్ఞానదృష్టి ద్వారా ఏవైనా సృష్టితాలతో పోల్చటానికి, సారూప్యం చూపటానికి ప్రయత్నించకూడదు. ఉదాహరణ కు ఖుర్ఆన్ (V.20:5) లో తెలిపిన “అల్లాహ్ తన సింహాసనం పై అధివేష్టించి ఉన్నాడు” అనే విషయాన్ని మనకు తెలిసిన ప్రాపంచిక సింహాసనంతో పోల్చటం గాని, కూర్చోవటం అనే పనిని భూలోక జీవరాసులు కూర్చునే విధంగా ఊహించటం గాని చేయకూడదు.

    “అమిత దయాళువు అయిన అల్లాహ్ సప్తాకాశాలపైన ఉన్న తన సింహాసనం పై తనకు శోభనిచ్చే విధంగా అధివేష్టించినాడు.” దిల్ హజ్ నెల 9వ తేదీన వచ్చే అరఫాత్ దినమున మరియు ప్రతి రాత్రి మూడవ ఝాములో ఆయన భూలోకానికి అతి దగ్గరలోని మొదటి ఆకాశానికి వస్తాడు. కాని ఆయన అపరిమితమైన దివ్యజ్ఞానం సర్వలోకాలలో వ్యాపించి యున్నది, అనంత విశ్వాన్ని పరివేష్టించి ఉన్నది. అంతేకాని భౌతికంగా ఆయనే స్వయంగా లోకమంతా వ్యాపించిలేడు. (బై-ధాతిహి)

    అల్లాహ్ ఇక్కడ, అక్కడ, ప్రతి చోటా, ఇంకా మనుషుల హృదయాలలో వ్యాపించియున్నాడనే భావన ఎంత మాత్రమూ వాస్తవం కాదు. ఖుర్ఆన్ (V.42:11)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూచేవాడూను

    సృష్టితాలతో అస్సలు పోల్చలేని అల్లాహ్ దివ్యస్వరూపం, అల్లాహ్ దివ్యవినికిడి శక్తి మరియు అల్లాహ్ దివ్యదృష్టి యొక్క ప్రత్యేకతలను పై పవిత్ర ఆయత్ ధృవీకరిస్తున్నది. అంతే కాక ఖుర్ఆన్ (V.38:75) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఎవరినైతే నా రెండు చేతులతో సృష్టించానో, ఇది వారి కోసం”

    మరియు ఖుర్ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “అల్లాహ్ చేయి, వారి చేతుల పై ఉన్నది.” (V.48:10).

    అల్లాహ్ కు రెండు చేతులు ఉన్నాయని ఈ పవిత్ర ఆయత్ లు ధృవీకరిస్తున్నాయి. కాని, ఆ దివ్యచేతులను పోలిన చేతులను మానవుడి పరిమిత జ్ఞానం ఊహించలేదు. ఇదే మొత్తం దైవవిశ్వాసుల స్వచ్ఛమైన విశ్వాసం, ఇంకా నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహీస్సలాం, మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం నుండి చిట్టచివరి దైవప్రక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరి సత్యమైన, స్వచ్ఛమైన దైవవిశ్వాసం.

    పైన వివరించిన తౌహీద్ యొక్క మూడు భాగాలు “లా ఇలాహ ఇల్లల్లాహ్ – ఆరాధనలకు అర్హులైన వారు ఎవ్వరూ లేరు, ఒక్క ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ తప్ప” అనే పవిత్ర ధృవీకరణ సాక్ష్యపు మొదటి భాగం యొక్క భావంలో, అర్థంలో ఇమిడి ఉన్నాయి.

    అంతేకాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తప్పక అనుసరించ వలసి ఉన్నది: వాజిబుత్తిబాఅఁ అనేది తౌహీద్ ఉలూహియ్యహ్ - దైవారాధనలలో ఏకైకత్వపు ముఖ్యభాగం.

    ఇది “అష్హదు అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్ – నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అనే పవిత్ర ధృవీకరణ సాక్ష్యపు రెండవ భాగం యొక్క భావంలో ఇమిడి ఉన్నది. దీని పూర్తి అర్థం “అల్లాహ్ యొక్క దివ్యగ్రంథం (ఖుర్ఆన్) తర్వాత, ఇతరులు తమను అనుసరించేటంతటి అర్హతలు, యోగ్యతలు ఇంకెవ్వరికీ లేవు, కాని ఒక్క అల్లాహ్ యొక్క సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు తప్ప.”

    ఖుర్ఆన్ (V.59:7) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.”

    ఖుర్ఆన్ (V.3:31) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు, ‘మీకు అల్లాహ్ పట్ల (నిజంగా) ప్రేమ ఉంటే, మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్ముల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.’”