×
ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.

    నాస్తికత్వం: ఇస్లాం దృష్టిలో

    “ఇదే సత్యమని స్పష్టమయ్యే వరకు, మేము వారికి మా సంకేతాలను వారి చుట్టూ ఉన్న ఖగోళంలోమరియు స్వయంగా వారిలోనూ చూపుతాము.” ఖుర్ఆన్ 41:53

    ఇస్లామీయ దృష్టిలో ఎందుకు సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ ను విశ్వసించాలనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. తన ఉనికిని నిరూపించే చిహ్నాలను ఆయన ఎలా మనకు అందుబాటులో ఉంచినాడో వివరిస్తున్నది – తన సహజ సృష్టిలోని చిహ్నాలు మరియు తన దైవవాణి లోని చిహ్నాలు. ఇంకా నాస్తికులు తరుచుగా అడిగే సాధారణ ప్రశ్నలకు జవాబిస్తున్నది.

    తన అద్భుత చిహ్నాల ద్వారా తనను గుర్తించమని సృష్టికర్త మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అలా తన ఉనికిని కనుగొనేందుకు ఆ యా చిహ్నాలపై దృష్టి సారించే మరియు నిశితంగా పరిశీలించే బాధ్యతను ఆయన మనపైనే ఉంచినాడు. కొందరు ప్రజలు వాటిని సులభంగా గ్రహిస్తారు మరియు తమ చుట్టుప్రక్కల ఉన్న ఆ అద్భుత చిహ్నాలన్నింటిలో ఆయన ఉనికిని గుర్తిస్తారు. మరికొందరు వాటిని ఏదో యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనలని మరియు అర్థం పర్థం లేనివని తేలిగ్గా కొట్టిపారేస్తారు. విశ్వాసం వైపు మరలే భావాన్ని అల్లాహ్ ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా పుట్టుకతోనే ఉంచినాడు. అయితే కొందరు దానిని అనుసరించి ముస్లింలుగా జీవిస్తారు మరికొందరు దానిని అణచివేసి, అవిశ్వాసంలో తమ జీవితాన్ని కొనసాగిస్తారు.

    ముఖ్యంగా, ఎవరైతే నిష్కపటంగా ఉంటారో మరియు తన మార్గదర్శకత్వాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతారో, అలాంటి వారికి అల్లాహ్ ఇస్లాం మార్గాన్ని చూపుతాడు. మరోమాటలో చెప్పాలంటే, ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసం చూపటానికి తయారుగా ఉండరో, అలాంటి వారికి అల్లాహ్ మార్గదర్శతక్వం వహించడు. ఖుర్ఆన్ లోని అల్లాహ్ వచనాలు, “తన వైపు మరలే వారికి మాత్రమే అల్లాహ్ మార్గదర్శకత్వం వహిస్తాడు.” ఖుర్ఆన్ 13:27

    దీని కోసం సదుద్దేశపూర్వకమైన మరియు నిష్పాక్షికమైన దృక్పథం అవసరం. ఇది కొందరిని ప్రతిఘటించేలా చేస్తున్నది మరియు మరికొందరిని అణుకువతో, నమ్రతతో విధేయులుగా చేస్తున్నది. కానీ, అతడి అసలైన నిష్కాపట్యత మరియు సంసిద్ధత లేకుండే ఎంత మంచి సందేశమైనా అతడిని విశ్వాసిగా మార్చలేదు. వాస్తవానికి, అహంకారంతో మరియు గర్వంతో అల్లాహ్ యొక్క చిహ్నాలపై దృష్టి సారిస్తారో, అలాంటి వారు తమ అవిశ్వాసాన్ని సమర్దించుకునే సాకులు మాత్రమే కనుగొంటారని అల్లాహ్ హెచ్చరించాడు.

    కాబట్టి, ఎవరైతే నిష్కపటంగా, నిష్పక్షపాతంగా మరియు నిజంగా సత్యాన్వేషణ చేస్తారో, వారు దీని నుండి లాభం పొందుతారు మరియు సృష్టికర్త గురించి అతడు సరిగ్గా అర్థం చేసుకునేలా ఈ సరికొత్త దృక్పథం సహాయపడుతుంది.

    ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య కొన్ని స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. కాబట్టి, క్రైస్తవ మతం పై ప్రచారంలో ఉన్న అనేక విమర్శలను సింపుల్ గా ఇస్లాంపై అప్లయి చేయవద్దు.

    ఎందుకు విశ్వాసించాలి

    సృష్టికర్తను ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్నకు క్రింద మూడు హేతుబద్ధమైన కారణాలు పేర్కొనబడినాయి.

    1. విశ్వం యొక్క ఆరంభం

    సృష్టికర్త ఉనికిని స్పష్టంగా తెలిపే సృష్టి ఆరంభం గురించి అర్థం చేసుకోవడంపై దృష్టి సారించడం వైపు మొదటి సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది.

    ఉదాహరణకు ఎడారిలో నడుస్తుండగా, ఒక చేతి గడియారం అక్కడ పడి ఉండటాన్ని మీరు గుర్తించారని భావించుదాం. చేతి గడియారంలో గాజు కవరు, ప్లాస్టిక్ మరియు ఇనుము ఉంటాయనేది మనకు తెలుసు. సన్నటి ఇసుక నుండి గాజు తయారు అవుతుంది, ఆయిల్ నుండి ప్లాస్టిక్ తయారవుతుంది మరియు భూమి నుండి ఇనుము సంగ్రహించబడుతుంది – ఈ భాగాలన్నీ ఎడారిలో లభిస్తాయి. మరి, అలాంటప్పుడు, గడియారం తనకు తానుగా తయారై పోతుందా? సూర్యుడు ప్రకాశించుట, గాలి వీచుట, పిడుగులు పడుట, ఆయిల్ భూమి ఉపరితలం పైకి వచ్చి, సన్నటి ఇసుక మరియు ఇనుముతో కలిసి అనేక మిలియన్ల సంవత్సరాల వరకు ఉండిపోగా, యాధృచ్ఛికంగా లేక సహజసిద్ధంగా అది గడియారంలా తయారు కావడమనేది సంభవమేనా ?

    “వారు శూన్యం నుండి సృష్టించబడినారా లేక స్వయంగా తమను తాము సృష్టించుకున్నారా?” ఖుర్ఆన్ 52:35-6

    ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ విశ్వం పరిమితమైనది మరియు దానికి ఒక ఆరంభం ఉన్నది. అసలు ఈ విశ్వం ఎక్కడి నుండి వచ్చింది? మానవజాతి అనుభవం మరియు సింపుల్ లాజిక్ మనకు చెబుతున్నదేమిటంటే ఆరంభం ఉన్నదేదైనా సరే, అది శూన్యం నుండి సృష్టించబడదు. అంతేగాక, ఏదీ తనను తానుగా సృష్టించుకోజాలదు. కాబట్టి, అత్యంత హేతుబద్ధమైన వివరణ ఏమిటంటే, మహోన్నతుడైన ఒక సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఆయన ఎంతో శక్తిమంతుడు మరియు వివేకవంతుడూను. ఎందుకంటే ఆయన మొత్తం విశ్వాన్ని ఏ చిన్న లోపమూ లేకుండా చాలా అద్భుతంగా సృష్టించాడు మరియు విశ్వం అనుసరించవలసిన వైజ్ఞానిక చట్టాల్ని కూడా. ఆ సృష్టికర్త కాలాతీతుడు మరియు స్థలాతీతుడు. ఎందుకంటే, కాలం, స్థలం మరియు పదార్థం అనేవి విశ్వ సృష్టి సమయంలో సృష్టిచబడినాయి. సృష్టికర్త ఈ సృష్టి లక్షణాలకు అతీతుడు. అవి సర్వలోక సృష్టికర్త యొక్క ప్రాథమిక దైవభావన ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయి. ఈ విశ్వం పరిమితమైనది మరియు దానికొక ఆరంభం ఉన్నదని తెలిపే నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో ఇది పూర్తిగా ఏకీభవిస్తున్నది. ఈ లక్షణాలన్నీ సర్వలోక సృష్టికర్త యొక్క ప్రాథమిక దైవభావన అవగాహనను తెలుపుతున్నాయి.

    కొందరు ఇలా ప్రశ్నించవచ్చు, “అల్లాహ్ ను ఎవరు సృష్టించారు?” సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్, తన సృష్టి కంటే భిన్నమైన వాడు. సృష్టిని సృష్టికర్తతో అస్సలు పోల్చలేము. ఆయన నిత్యుడు, ఆద్యంత రహితుడు. ఆయనకు ఆరంభం లేదు – అంతం లేదు. ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి, అల్లాహ్ ను సృష్టించింది ఎవరు అనేది ఒక అవివేకమైన, అసంబద్ధమైన మరియు బుద్ధిహీనమైన ప్రశ్నే తప్ప మరేమీ కాదు.

    2. విశ్వం యొక్క పరిపూర్ణత

    ఎంతో వివేకవంతుడైన సృష్టికర్త ఉనికిని చాటే మన క్లిష్టతరమైన విశ్వం యొక్క పరిపూర్ణ సంతులనం మరియు క్రమం పై దృష్టి సారించడం వైపు రెండో సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది. ఇంత బ్రహ్మాండమైన క్లిష్టతరమైన విశాల విశ్వం యాధృచ్ఛికంగా, ఎలాంటి పర్యవేక్షణ లేకుండా తనకు తానుగా ఏర్పడిందా ?

    సూర్యుడికి నిర్ణీత దూరంలో ఉంచబడిన భూమండం, భూమి పై పొర మందం, భూమి తన చుట్టూ తాను పరిభ్రమించే వేగం, వాతావరణంలోని ఆక్సిజన్ శాతం, భూమి ఒక నిర్ణీత కోణంలో ఒరిగి ఉండటం మొదలైన విశ్వంలోని అనేక ప్రత్యేకతలు సమస్త జీవరాశుల మనుగడకు అనుకూలంగా ఈ విశ్వం మొత్తం ఒక అద్భుత పథకం ద్వారా డిజైన్ చేయబడిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణీత కొలతలలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా, భూమండలంపై జీవరాశుల ఉనికి కనబడేది కాదు.

    ఖచ్చితమైన సమయాన్ని చూపేలా గడియారాన్ని తయారు చేసే ఒక వివేకవంతుడైన తయారీదారుడు ఉన్నట్లే, ఖచ్చితంగా నిర్ణీత సమయం ప్రకారం సూర్యుడి చుట్టూ తిరిగే నియంత్రణతో, భూమిని తయారు చేసిన మహావివేకవంతుడైన ఒక తయారీదారుడూ తప్పక ఉన్నాడు. దీనికి భిన్నంగా ఈ భూమి తనకు తానుగా ఉనికిలోనికి రావడమనేది సంభవమేనా?

    విశ్వం పాటిస్తున్న క్రమశిక్షణ, ఖచ్చితమైన విశ్వచట్టాలు, మనలోని మరియు మొత్తం విశ్వంలోని వ్యవస్థ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించి, దానికి ఒక అద్భుత ఆర్గనైజర్ అంటే నిర్వహణకర్త తప్పకుండా ఉంటాడని భావించడం వివేకవంతంగా లేదా ? ఇలాంటి లోపరహితమైన సృష్టి క్రమశిక్షణను రూపొందించి, నియంత్రిస్తున్న సర్వలోక సృష్టికర్త ఉనికిని ఈ ‘నిర్వహణకర్త’ పాత్ర స్పష్టంగా ఋజువు చేస్తున్నది.

    శాస్త్రీయ పరిశోధన మరియు పర్యాలోచనలను ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తుందనే వాస్తవాన్ని ఇక్కడ మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. తన సృష్టిలో సృష్టికర్త సృష్టించిన అనేక అద్భుత విషయాలను అర్థం చేసుకునేందుకు, ఆయన అసమాన శక్తిసామర్ధ్యాలను మరియు వివేకాన్ని మెచ్చుకునేందుకు విజ్ఞానశాస్త్రం ఎంతో సహాయపడుతుంది. విజ్ఞానశాస్త్రం కొత్త విషయాలు కనిపెడుతూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ఇతర ప్రక్రియల వలే సహజ ప్రపంచంలోని వాటర్ సైకిల్ లేక గ్రావిటీ వంటి విషయాలు సృష్టికర్త మరియు అద్భుత నిర్వాహణకర్త యొక్క చిహ్నాలని మనం గుర్తిస్తున్నాము. అంటే అవి సృష్టికర్త ఉనికిని బలపరుస్తున్నాయే గానీ ఆయన ఉనికిని ఖండించడం లేదు.

    3. అల్లాహ్ తరుఫు నుండి పంపబడే దివ్యసందేశం (వహీ)

    తన ఉనికిని సూచించే నిదర్శనంగా మానవజాతి వద్దకు అల్లాహ్ పంపిన అసలు దివ్యసందేశంపై దృష్టి సారించడం వైపు మూడో సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది.

    ఇస్లాం ధర్మం యొక్క మూలగ్రంథమైన ఖుర్ఆన్ యొక్క ఒక ముఖ్యోద్దేశం – ప్రజలను సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సృష్టిపై దృష్టి సారించడం మరియు ఆయనను విశ్వసించడంలో భాగంగా దానిని ప్రశంసించడం. విశ్వంలోని మరియు మనలోని అపూర్వ డిజైన్ ను మరియు సంక్లిష్టతలను సావధానంగా పరిశీంచమనీ మొత్తం ఖుర్ఆన్ లో అనేకచోట్ల సృష్టికర్త ఆహ్వానిస్తున్నాడు. మంచి డిజైన్, ఉద్దేశం మరియు వివేకంతో తయారు చేయబడిన ఉత్పత్తి అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఆ నిశిత పరిశీలన చాలు. ఉదాహరణకు, ఖుర్ఆన్ లోని వచనం:

    “నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని మోస్తూ సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి అందులో వివిధ రకాల జీవరాశులు వర్ధిల్లేలా జేయటంలోనూ, గాలులు మరియు మేఘాలు భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలున్నాయి”. ఖుర్ఆన్ 2:164

    ఇస్లాం మూలాధారమైన దివ్య ఖుర్ఆన్ గ్రంథం, అల్లాహ్ యొక్క దివ్యవచనమని నిరూపించే అనేక స్పష్టమైన సూచనలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఈ వాదనను బలపరిచే కొన్ని సాక్ష్యాధారాలు క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావించబడినాయి. ఖుర్ఆన్ :

    · లోపాలకు, పొరపాట్లకు, పరస్పర విరుద్ధ వాదనలకు అతీతం.

    · ప్రజలపై లోతైన ప్రభావం చూపుతుంది మరియు వారిలోని అసలు చైతన్యాన్ని మేల్కొపుతుంది.

    · తరతరాలుగా లక్షల కొద్దీ ప్రజలు దానిని పూర్తిగా కంఠస్థం చేస్తున్నారు.

    · ఖుర్ఆన్ అవతరించి 1400 సంవత్సరాలు దాటిపోయాయి. ఆ కాలంలోని ప్రజలకు అస్సలు తెలియని మరియు ఈ మధ్యనే సైన్సు ద్వారా కనిపెట్టబడిన అనేక వైజ్ఞానిక అంశాలు ఇందులో పేర్కొనబడినాయి. ఉదాహరణకు: జీవరాశులన్నింటి మూలం నీరు (ఖుర్ఆన్ 21:30); వ్యాపిస్తున్న విశ్వం (ఖుర్ఆన్ 51:47); సూర్యుడు మరియు చంద్రుడి స్వంత కక్ష్యలు (ఖుర్ఆన్ 21:33).

    · ఖుర్ఆన్ లో అనేక చారిత్రక వాస్తవ సంఘటనలు పేర్కొనబడినాయి. ఆనాటి కాలంలోని ప్రజలకు వాటి గురించి తెలియదు. అంతేగాక అనేక భవిష్యవాణులు కూడా ప్రస్తావించబడినాయి. వాటిలో కొన్ని నిజంగా జరిగిపోయాయి, మరికొన్ని జరగబోతున్నాయి.

    · వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, క్రమక్రమంగా 23 సంవత్సరాల సుదీర్ఖ కాలంలో అవతరించినా, ఎలాంటి లోపాలు మరియు పరస్పర విరుద్ధ వచనాలు లేకుండా ఖుర్ఆన్ దోషరహితంగా ఉన్నది.

    · కాలక్రమంలో కనుమరుగు అయి పోయిన ఇతర ధర్మాల అసలు మూలగ్రంథాలకు భిన్నంగా, అవతరించిన అరబీ భాషలో అసలు ఖుర్ఆన్ లోని ప్రతి పదం సురక్షితంగా భద్రపరచబడింది.

    · ఖుర్ఆన్ లో మానవుడి వివేకాన్ని మరియు స్వాభావిక అంతర్గత దైవవిశ్వాసాన్ని మేలుకొల్పే సరళమైన మరియు స్వచ్ఛమైన సార్వజనిక దివ్యసందేశం ఉన్నది.

    · ఖుర్ఆన్ గ్రంథం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. ఆయన నిరక్షరాస్యులైనా, దాని భాష అత్యుత్తమమైన వాగ్ధాటి, వక్తృత్వం మరియు భాషాపరమైన సాహిత్య సౌందర్యాలతో అరబీ భాషలో సాటిలేని తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినది.

    ఖుర్ఆన్ యొక్క అనేక అపూర్వ మరియు అద్భుత అంశాలలో అత్యంత హేతువాద విషయం ఏమిటంటే అది మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ నుండి తిన్నగా పంపబడింది.

    సృష్టికర్తకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు

    “సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు ?”

    మన అవయవాలైన కళ్ళు, చెవులు, మెదడు మరియు గుండె మొదలైన వాటన్నింటికీ ఒక్కో ఉద్దేశ్యం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. మరి అలాంటప్పుడు మొత్తం అవయవాలతో కూడిన మన శరీరానికీ ఏదైనా ఉద్దేశ్యం, ప్రయోజనం ఉందా ? అత్యంత వివేకవంతుడైన అల్లాహ్ మనల్ని ఎలాంటి లక్ష్యం లేకుండా అటూ ఇటూ తిరగటానికి లేదా మన సహజ అవసరాలు మరియు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటానికి సృష్టించలేదు. ఈ ప్రాపంచిక జీవితం ఒక పరీక్ష అని సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ స్పష్టంగా తెలిపినాడు. ఎవరు సృష్టికర్తను గుర్తించి, ఆయనకు విధేయతాపూర్వకంగా సమర్పించుకుని, ఆయన మార్గదర్శకత్వాన్నే అనుసరించడాన్ని ఎంచుకుంటారో బహిర్గతమయ్యేలా ప్రతి వ్యక్తీ ఇక్కడ పరీక్షించబడతాడు. ఖుర్ఆన్ లోని అల్లాహ్ వచనాలు:

    నిశ్చయంగా మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము. నిశ్చయంగా మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడు కావచ్చు. ఖుర్ఆన్ 76:2-3

    చాలామంది అసలు ఇబ్బంది ఏమిటంటే, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించడంలో వాస్తవానికి వారికే సమస్యా లేదు కానీ, దానిని ఆచరణలో పెట్టడంలో వెనకాడుతున్నారు. అంటే ‘చేసే ప్రతి పనికీ స్వయంగా బాధ్యత వహించవలసి ఉన్నది, జవాబు ఇవ్వవలసి ఉన్నది’ అనే కఠోర సత్యం తమ కోరికలను అనుసరించి విచ్ఛలవిడి జీవితం గడపకుండా నివారిస్తున్నది. కాబట్టి, అల్లాహ్ కు విధేయత చూపుతూ, ఆయన ఇష్టానుసారం అణుకువతో జీవించాలే గానీ మన స్వంత కోరికలు, అహంకారం, గర్వం మొదలైన వాటితో కాదనేది ఈ ప్రాపంచిక జీవిత పరీక్షలోని ముఖ్యాంశం.

    “దేవుడికి మనల్ని పరీక్షించే అవసరం ఏముంది?”

    సృష్టికర్త ఏ అక్కరా లేనివాడు – తన అవసరాల కోసం దేనినైనా సృష్టించే ఆవశ్యకత ఆయనకు లేదు మరియు ఎవరినీ పరీక్షించవలసిన అవసరం ఆయనకు లేదు. మనం ఆయనను విశ్వసిస్తే ఆయనకేమీ ప్రయోజనం కలుగదు మరియు మనం విశ్వసించక పోవటం వలన ఆయనకేమీ నష్టం జరుగదు. అంటే మన విశ్వాసావిశ్వాసాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే, తన అపరిమితమైన వివేకంలోని చిన్న భాగంగా ఆయన ఈ సర్వలోకాలను సృష్టించాడు మరియు ఆయనను గుర్తించే అవకాశాన్ని ప్రసాదించినాడు. నిశ్చయంగా ఆయనకు భవిష్యత్తులో జరగబోయే ప్రతిదీ తెలుసు – అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రాపంచిక జీవితాన్ని గడపడంలో, జీవితాన్ని అనుభవించటంలో మన స్వంత ఇష్టాన్ని అనుసరిస్తూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని.

    “మన కోసం అసలు ఛాయిస్ అంటూ ఉందా?”

    సృష్టికర్తకు మన ఛాయిస్ తెలుసు అనే వాస్తవం మన స్వేచ్ఛను ఏమాత్రం తగ్గించదు. ప్రజలను తనను విశ్వసించాలని సృష్టికర్త కోరుకుంటున్నా, ఆయన ఎవరినీ బలవంతం చేయడు. సృష్టంతటిపై తిరుగులేని ఆధిపత్యం కలిగి ఉండటం వలన ఒకవేళ ఆయన తలుచుకుంటే, మొత్తం మానవజాతిని సన్మార్గంపై నడిపించేవాడు. కానీ, తన అద్భుత వివేకానికి నిదర్శనంగా మనల్ని మంచి చెడులలో ఒక దారిని స్వయంగా ఎంచుకునే సమర్ధతతో సృష్టించి, అలా మనం ఎంచుకున్న ఛాయిస్ కు మనల్నే బాధ్యులుగా చేసినాడు. సృష్టిలో సంభవించేందుకు తను అనుమతించిన ఘటనలన్నింటికీ ఆయన సంతోష పడవలసిన అవసరం లేదు.

    “ఎందుకు సృష్టికర్త స్వయంగా అంటే తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు?”

    సృష్టికర్త యొక్క అపరిమితమైన వివేకానికి ఒక సూచనగా, తన అద్భుత చిహ్నాల ద్వారా తన ఉనికిని ప్రజలకు తెలియజేయాలనే మార్గాన్ని ఆయన స్వయంగా ఎంచుకున్నాడు. ఇది ఈ ప్రాపంచిక జీవితపు పరీక్షలోని ఒక భాగం. మనకు ప్రసాదించబడిన తెలివితేటలు మరియు శక్తియుక్తులు వినియోగించి ఆయనను గుర్తించాలనే బాధ్యతను ఆయన మనపైనే ఉంచినాడు. అంటే ఎవరైతే చిత్తశుద్ధితో, అణుకువతో మరియు దీర్ఘాలోచనతో ప్రయత్నిస్తారో, వారు ఆయనను తప్పకుండా గుర్తిస్తారు మరియు ఆయనపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు.

    “ప్రపంచంలో బాధలు ఎందుకు ఉన్నాయి?”

    వాస్తవం ఏమిటంటే వేర్వేరు ప్రజలు వేర్వేరు పద్ధతులలో రకరకాల పరీక్షల ద్వారా పరీక్షించబడటం అనేది సృష్టికర్త ఉనికిని కొట్టి పారేయనూ లేదు, అత్యంత శక్తిమంతుడైన ప్రభువును నిరాకరించడమూ లేదు. కానీ, సృష్టికర్త అనుమతించిన మంచి – చెడులు ఈ భూమండలంపై మన కొరకు పరీక్షలు. ఏమి మనకు జరిగే దానిని మనం నియంత్రించలేము కానీ, దానికి మన యొక్క ప్రతిస్పందనపై ఆయన తీర్పునిస్తాడు. ఈ ప్రపంచం అనిశ్చితమైనది, అస్థిరమైనది మరియు తాత్కాలికమైనది. ఈ తాత్కాలిక జీవితంలో మనకు జరిగే అన్యాయం మరియు దురదృష్టానికి ప్రతిగా శాశ్వత పరలోకంలో మనకు పూర్తి న్యాయం జరగబోతున్నది.

    “దేవుడు ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు?”

    న్యాయ స్థాపనకు అవసరమైన శిక్షా విధానాన్ని ఎవ్వరూ తిరస్కరించరు. మన జీవిత విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛను సృష్టికర్త మనకు ఇచ్చినాడు మరియు దానికి మనల్నే బాధ్యుల్ని చేసినాడు. చిత్తశుద్ధితో సృష్టికర్తకు విధేయత చూపడంలో శ్రమించేవారికి ఆయన కరుణాకటాక్షాలు లభిస్తాయి మరియు స్వర్గంలో ప్రవేశిస్తారు. కానీ, తమ అసలు జీవిత ఉద్దేశ్యాన్ని నిర్లక్ష్యం చేసి జీవిస్తూ, సృష్టికర్తను తిరస్కరించి, తమ జీవన విధానాన్ని ఎంచుకున్న వారి కొరకు ఆయన వారినే బాధ్యులుగా చేసినాడు. సృష్టికర్తను ఎవ్వరూ నిందించలేరు. ప్రజలను శిక్షించేందుకు ఆయన సృష్టించలేదు. అయితే, ఆయన వారి కోసం సులభతరం చేయాలని, వారిపై దయ కురిపించాలని సంకల్పించాడు. మన యొక్క ఛాయిస్ సృష్టికర్తకు ముందుగానే తెలుసు అనే విషయం మన ఆచరణలలోని స్వేచ్ఛను ఏమాత్రం తగ్గించదు మరియు మన బాధ్యత నుండి మనల్ని తప్పించలేదు.

    ఇస్లాం ధర్మం ఒక ఆచరణాత్మక, ప్రయోగాత్మక ధర్మం. అల్లాహ్ యొక్క కరుణపై ఆశ పడటం మరియు అల్లాహ్ యొక్క శిక్షలకు భయపడటం – ఈ రెండింటి మధ్య సంతులనంతో జీవించాలని ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది. సకారాత్మకమైన మరియు అణుకువ, వినయవిధేయతలతో కూడిన జీవితం గడిపేందుకు ఈ రెండింటి అవసరం ఎంతో ఉన్నది. అల్లాహ్ అనంత కరుణామయుడు. కానీ, ఆయన అత్యంత న్యాయవంతుడు కూడాను. ఒకవేళ అంతిమ తీర్పుదినమే లేకపోతే, అది అల్లాహ్ యొక్క సంపూర్ణ న్యాయానికి విరుద్ధం అవుతుంది మరియు జీవితం న్యాయవిరుద్ధం అవుపోతుంది.

    చివరి మాట

    80 ఏళ్ళు లేదా దానికి దరిదాపుల వయస్సు వచ్చే వరకు మాత్రమే మనం ఇక్కడ ఉన్నామా? లేక ఇంకో జీవితం అంటూ ఉందా? మనం చివరికి ఏ జీవిత లక్ష్యమూ లేకుండా జీవించే కోతుల అడ్వాన్సుడు రూపాంతరాలా? మనం కేవలం భౌతిక అవసరాలున్న జీవపదార్థాలేనా లేక మనకు ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఉన్నాయా?

    దేవుడు గురించి ఏ నిర్ణయానికీ రాని అసలు సిసలైన, శుద్ధమైన, నిష్కళంకమైన మరియు స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారి కొరకు మా సలహా ఏమిటంటే సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకోండి: “ఓ అల్లాహ్! ఒకవేళ నీ ఉనికి నిజమైతే, దయచేసి నాకు మార్గదర్శకత్వం వహించు.” దాని అద్భుత ఫలితాలు మిమ్ముల్ని ఆశ్చర్య పరుస్తాయి !

    http://islamicpamphlets.com/atheism-an-islamic-perspective/