జీసస్ (అలైహిస్సలాం) : అల్లాహ్ యొక్క ప్రవక్త
వ్యాసం యొక్క అనువాదాలు
కూర్పులు
మూలాలు
Full Description
జీసస్ (అలైహిస్సలాం) : అల్లాహ్ యొక్క ప్రవక్త
జీసస్ (అలైహిస్సలాం)ను ముస్లింలు ఎంతో ప్రేమిస్తారు
జీసస్ (అలైహిస్సలా) ఒక సుప్రసిద్ధ మహాప్రవక్త. ప్రపంచ వ్యాప్తంగా అనేక బిలియన్ల ప్రజలు ఆయనను ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు. అయినా ఈ బ్రహ్మాండమైన వ్యక్తిత్వం యొక్క స్థితి చుట్టూ ఎంతో అస్పష్టత వ్యాపించి ఉన్నది. ముస్లింలు మరియు క్రైస్తవులు ఆయనను చాలా ఎక్కువగా గౌరవిస్తారు, కానీ వారుభయులు ఆయన గురించి పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
ఈ వ్యాసం యొక్క ముఖ్య లక్ష్యం – జీసస్ (అలైహిస్సలాం) చుట్టూ ప్రజలలో వ్యాపించి ఉన్న వేర్వేరు అభిప్రాయాలలోని సత్యాసత్యాలను స్పష్టం చేయడం: జీసస్ స్వయంగా దేవుడా లేక దేవుడు పంపినవాడా? అసలు చారిత్రక వాస్తవ జీసస్ (అలైహిస్సలాం) ఎవరు?
“జీసస్ యే దేవుడు"
“జీసస్ యే దేవుడని" లేక త్రైత్వంలో ఒకడని కొందరు క్రైస్తవులు వాదిస్తున్నారు – అంటే ఆయన భూమిపై దిగివచ్చిన దేవుడి అవతారం మరియు దేవుడు స్వయంగా మానవుడి రూపంలో అవతరించాడని వాదిస్తున్నారు. కానీ, బైబిల్ బోధనల ప్రకారం, జీసస్ ఈ భూమిపై జన్మించారు, భుజించారు, నిద్రించారు, ప్రార్థించారు మరియు పరిమిత జ్ఞానం మాత్రమే కలిగి ఉండినారు – ఈ గుణగణాలు, లక్షణాలన్నీ దేవుడి మహోన్నత స్థాయికి తగినవి కావు. సర్వలోక సృష్టకర్త పరిపూర్ణత్వ దివ్యలక్షణాలను కలిగి ఉండగా మానవుడు దానికి విరుద్ధంగా పరిమిత లక్షణాలు కలిగి ఉన్నాడు. మరి, ఏకకాలం పూర్తి విరుద్ధమైన ఈ రెండు స్థితులలో ఏదైనా ఉండగలదా?
సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ సంపూర్ణుడిగానే ఉంటాడని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. దేవుడు మానవుడిగా మారాడని విశ్వసించడమంటే (కొంతకాలం) ఆయన అసంపూర్ణుడిగా ఉంటాడని లేదా ఉన్నాడని వాదించడమే! ఏ క్రైస్తవుడైనా ఒక్కసారి స్వయంగా ఇలా ప్రశ్నించుకోవాలి – ఒకప్పుడు బలహీనమైన నిస్సహాయ స్థితిలోని ఒక పసిబిడ్డగా, అన్నపానీయాలు, నిద్రాహారాలు లేకుండా బ్రతకలేని స్థితిలో జీవించిన మానవుడు మరియు పాతనిబంధనలలో పేర్కొనబడిన అద్వితీయుడైన దేవుడూ ఒక్కడేనా? అస్సలు కాదు.
“ఒకవేళ దేవుడు ఏదైనా చేయగల ఘనుడైతే, ఒక మానవుడిగా ఎందుకు మారలేడు?" అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అసలు నిర్వచనం ప్రకారం, దేవుడు తన అద్వితీయ స్థాయికి తగని పనులు చేయడు. తనను దేవుడి స్థానం నుండి క్రిందికి దిగజార్చే ఏ పనీ ఆయన చేయడు. ఒకవేళ దేవుడే మానవుడిగా మారి మానవ లక్షణాలు అలవర్చుకున్నాడని అంటే, ఆయన ఎంత మాత్రమూ దేవుడు కాజాలడు.
కొందరు ఏదో విధంగా జీసస్ దేవుడు అనే అభిప్రాయం వచ్చేలా కనబడే బైబిల్ లోని కొన్ని అస్పష్టమైన వచనాలను పొరపాటుగా వాడుతున్నారు. కానీ ఒకవేళ మనం బైబిల్ లోని కొన్ని స్పష్టమైన డైరక్టు వచనాలు పరిశీలిస్తే, జీసస్ (అలైహిస్సలాం) ఒక అద్భుతమైన మహాప్రవక్తే తప్ప మరేమీ కాదని తెలిపే వచనాలు మాటిమాటికీ కనబడతాయి. సర్వలోక సృష్టికర్త అయిన ప్రభువు వేరు, తను వేరు అని జీసస్ పలికిన పలుకులు మరియు ఆయన ప్రవర్తనలు బైబిల్ లో ఎన్నో చోట్ల ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు :
· జీసస్ “నేలపై సాగిలపడినాడు మరియు ప్రార్థించినాడు." (మత్తయి సువార్త 26:39) ఒకవేళ జీసస్ యే గనుక దేవుడు అయినట్లయితే, దేవుడు నేలపై సాగిలపడతాడా మరియు ప్రార్థిస్తాడా? ఆయన ఎవరిని ప్రార్థించాడు?
· జీసస్ ఒక ప్రవక్త అని బైబిల్ పేర్కొంటున్నది (మత్తయి సువార్త 21:10-11), కాబట్టి జీసస్ ఎలా ఏకకాలంలో దేవుడు మరియు దేవుడి ప్రవక్త అవగలడు?
· జీసస్ ఇలా పలికినాడు, “నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చెదనని చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నా కంటే గొప్పవాడు." (యోహాను సువార్త 14:28)
· జీసస్ ఇలా పలికినాడు “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మరియు మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను."(యోహాను సువార్త 20:17) ఒకవేళ జీసస్ యే గనుక దేవుడు అయితే, ఆయన ఎందుకు ఇలా పలికినాడు, “నా దేవుడును మరియు మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కి పోవుచున్నాను," మరియు ఆయన ఎవరి వద్దకు ఎక్కి పోయినది?
ఒకవేళ జీసస్ యే గనుక దేవుడు అయితే, తననే ఆరాధించమని ఆయన ప్రజలకు ఆదేశించేవాడు, మరియు ఈ ఆదేశం తెలిపే స్పష్టమైన వచనాలు బైబిల్ లో ఉండేవి; కానీ, ఆయన దీనికి విరుద్ధంగా పలికినాడు మరియు తనను అస్సలు ఆరాధించకూడదని నివారించినాడు: “వారు నన్ను ఆరాధించడం వ్యర్థం." (మత్తయి 15:9)
“దేవుడి కుమారుడు"
జీసస్ దేవుడి కుమారుడు అని కొందరు క్రైస్తవులు వాదిస్తుంటారు. దీని అసలు అర్థం ఏమిటి? నిశ్చయంగా శారీరక మరియు శాబ్దిక కుమారుడిని కలిగి ఉన్నాడని చెప్పటం దేవుడి విషయంలో అస్సలు తగదు. మానవులకు మానవ సంతానం కలుగుతుంది. పిల్లులకు పిల్లికూనలు పుడతారు. మరియు దేవుడికి కుమారుడు ఉండటమంటే అర్థం ఏమిటి?
ఆరంభపు బైబిల్ భాషలలో “దేవుడి కుమారుడు" అనే పదాలు శబ్దపరమైన అర్థంలో కాకుండా, “ధర్మపరాయణుడని" సూచించేందుకు లాంఛనప్రాయంగా వాడబడినాయనే అసలు విషయాన్ని మనం గుర్తిస్తాము. బైబిల్ లో కేవలం జీసస్ కొరకు మాత్రమే కాకుండా డేవిడు, సోలోమాను మరియు ఇజ్రాయీలు మొదలైన ప్రవక్తల కొరకు కూడా దేవుడి కుమారుడు అనే పదాలు వాడబడినాయి: “…ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు," (నిర్గమకాండము 4:22). వాస్తవానికి ఎవరైనా ధర్మపరాయణుడైతే, అతడు దేవుని కుమారుడని పిలవబడేవాడు : “దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, వారందరు దేవుని కుమారులై యుందురు." (రోమా 8:14)
“ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగిన పని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన ఏదైనా చేయదల్చుకుంటే, దానిని కేవలం: “అయిపో!" అంటాడు, అంతే అది అయిపోతుంది." ఖుర్ఆన్ 19:35
“తండ్రి మరియు ప్రభువు"
అదే విధంగా, 'తండ్రి' అనే పదం సర్వలోక సృష్టికర్త అయిన దేవుడిని సూచించేందుకు వాడబడినప్పుడల్లా, దానిని శబ్దపరమైన అర్థంలో తీసుకోకూడదు. ఎందుకంటే, దేవుడు సృష్టికర్త, పోషకుడు మరియు మానవులందరి మహోన్నత ప్రభువు అనే అర్థంలోనే తీసుకోవాలి. 'తండ్రి' అనే పదం యొక్క అర్థం లాంఛనప్రాయంగా ఇలాగే వాడబడటాన్ని నిరూపించే అనేక వచనాలు బైబిల్ లో ఉన్నాయి. ఉదాహరణకు: “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే." (ఎఫెసీయులకు 4:6)
అంతేగాక, కొన్నిసార్లు, జీసస్ ను ఆయన సహచరులు 'ప్రభువు' అని సంబోధించిన సందర్భాలు బైబిల్ లో ఉన్నాయి. అసలు బైబిల్ భాషలలో ఈ పదం దేవుడి కోసమే కాకుండా ఉత్తమ పురుషుల కోసం కూడా వాడబడింది. ఉదాహరణకు, గ్రీకు భాషలోని పాతనిబంధనలో, కైరియోస్ అనే పదం 'ప్రభువు' కోసమే కాకుండా ద్రాక్షతోట యజమాని కోసం కూడా వాడబడింది (మత్తయి సువార్త 20:8), మరియు అవిధేయుడైన సేవకుడిని కొట్టిన యజమాని (లూకా సువార్త 20.42-47).
బైబిల్ లో మరికొన్ని చోట్ల, జీసస్ ను దేవుడి దాసుడని ఆయన సహచరులు పేర్కొన్నారు: “దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరచియున్నాడు." (అపోస్తలుల కార్యములు 3:13). మరి దీని ద్వారా 'జీసస్ ను సంబోధిస్తూ ప్రభువు అనే పదం పలకబడినప్పుడల్లా, అది గౌరవసూచకంగా మాత్రమే వాడబడింది. అంతేగాని ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తూ కాదు' అనే విషయం స్పష్టం అవుతున్నది.
అస్పష్టంగా మరియు అసంతృప్తిగా ఉన్న దేవుడి స్వభావం మరియు జీసస్ స్వభావాలలోని చిక్కులను, సంక్లిష్టతలను వివరించే ప్రయత్నం ఇక్కడ చేయబడింది. ఏదేమైనా, ఆలోచించవలసిన అసలు విషయం ఏమిటంటే: వాటిని మనం అర్థం చేసుకోలేనంత కష్టతరంగా దేవుడు ఎందుకు చేస్తాడు? ఈ క్లిష్టతరమైన చిక్కులతో నిండిన అప్రామాణిక బోధనలను దైవభావన గురించి ఇస్లాం ధర్మంలో తెలుబడిన సులభమైన, స్పష్టమైన మరియు ఎలాంటి కల్పితాలు లేని స్పచ్ఛమైన ప్రామాణిక బోధనలతో ఎలా పోల్చగలం?
జీసస్ : అల్లాహ్ యొక్క ప్రవక్త
యూదులు జీసస్ అలైహిస్సలాంను మెస్సయ్యహ్ గా అంగీకరించరు. కానీ క్రైస్తవంలో దీనికి పూర్తి భిన్నంగా జీసస్ ను దేవుడిగా లేక దేవుడి కుమారుడిగా పూజిస్తున్నారు. ఇస్లాం ధర్మం మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నది మరియు అల్లాహ్ యొక్క ఒక మహాప్రవక్తగా మరియు సందేశహరుడిగా, మెస్సయ్యగా జీసస్ అలైహిస్సలాంను గుర్తిస్తున్నది. ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే, ముస్లింలు ఆయనను ఆరాధించరు. ఎందుకంటే సకల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందును. అల్లాహ్ యే జీసస్ ను మరియు సృష్టిలోని ప్రతిదాన్నీ సృష్టించినాడు.
“(జీసస్) ఇలా అన్నాడు, 'నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడిని. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు'"ఖుర్ఆన్ 19:30
మహాద్భుత జననం
ఖుర్ఆన్ ప్రకారం, దైవదూత జిబ్రయీల్ మానవుడి రూపంలో పవిత్ర కన్య మర్యమ్ వద్దకు వచ్చి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా తండ్రి అవసరం లేకుండానే అంటే స్త్రీపురుష కలయిక లేకుండానే అద్భుతంగా ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడనే శుభవార్తను ఇచ్చినాడు.
“(దేవదూత) ఇలా జవాబిచ్చాడు, 'నిశ్చయంగా నేను నీ ప్రభువు యొక్క సందేశహరుడను మాత్రమే. నీకు ఒక సుశీలుడైన కుమారుని (సందేశాన్ని)ని ఇవ్వటానికి పంపబడ్డాను. ఆమె ఇలా ప్రశ్నించింది, 'నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నన్ను ఏ మానవుడూ ముట్టుకోలేదే! మరియు నేను చెడు నడవడిక గలదానిని కూడా కాను!' అతను అన్నాడు, 'అలాగే అవుతుంది! నీ ప్రభువు అంటున్నాడు: “అది నాకు చాలా సులభం! మేము అతనిని మా నుండి ప్రజలకు మరియు కారుణ్యంగా పంపుతున్నాము. మరియు (నీ ప్రభువు) ఆజ్ఞ నెరవేరి తీరుతుంది." ఖుర్ఆన్ 19:19-21
స్త్రీపురుష కలయిక లేకుండానే జన్మించడాన్ని సాక్ష్యంగా చూపుతూ కొందరు జీసస్ కూడా దేవుడని వాదిస్తున్నారు. అయితే, తండ్రి అవసరం లేకుండా అంటే స్త్రీపురుష కలయిక లేకుండా ఉనికిలోనికి వచ్చినవారిలో జీసస్ మొదటివారు కాదు. జీసస్ కంటే ముందు ఉనికి లోనికి వచ్చిన ఆదిమానవుడు ఆదం అలైహిస్సలాంకు తల్లీ, తండ్రీ ఇద్దరూ లేరు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉన్నది:
“నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో 'ఈసా ఉపమానం, ఆదం ఉపమానం వంటిదే. ఆయన (ఆదంను) మట్టితో సృజించి: 'అయిపో' అని అన్నాడు, అంతే అతను అయిపోయాడు. ఈ సత్యం నీ ప్రభువు తరుఫు నుండి వచ్చింది. కావున నీవు శంకించే వారిలో చేరిన వాడవు కావద్దు."ఖుర్ఆన్ 3:59-60
ఒకవేళ తండ్రి లేకుండా జన్మించారని జీసస్ ను ఆరాధించాలనుకుంటే, అలా ఆరాధింపబడే హక్కును ఆయన కంటే ఎక్కువగా ఆదము కలిగి ఉన్నారు ఎందుకంటే ఆదము తల్లీ, తండ్రీ లేకుండా సృష్టించబడినారు.
జీసస్ (అలైహిస్సలాం) మహిమలు
స్త్రీపురుష కలయిక అవసరం లేకుండానే జన్మించిన జీసస్ అలైహిస్సలాం జననం ఒక గొప్ప మహిమ. అంతేగాక ఆయన తన జీవిత కాలంలో అల్లాహ్ అనుజ్ఞతో అనేక గొప్ప మహిమలు చేసి చూపారు. తన తల్లి శీలాన్ని శంకించిన ప్రజలకు ఉయ్యాలలో దినాల పసిబిడ్డగా ఉన్నప్పుడే, అల్లాహ్ అనుజ్ఞతో స్వయంగా జవాబిచ్చారు. ఇంకా, జీసస్ అలైహిస్సలాం మృతులను సజీవులుగా చేసారు, కుష్ఠురోగుల రోగాన్ని దూరం చేసారు, అంధులకు కంటిచూపు ప్రసాదించారు – ఇదంతా ఆయన కేవలం అల్లాహ్ అనుజ్ఞతోనే చేసేవారు.
జీసస్ అలైహిస్సలాం మహిమలు చూపినంత మాత్రాన ఆయన స్థానం అల్లాహ్ యొక్క విధేయుడైన దాసుడి కంటే మరెంత మాత్రమూ ఎక్కువ కాలేదు. ఇది ఒక వాస్తవమైన విషయం. నిజానికి, అనేకమంది సందేశహరులు మహిమలు చేసి చూపారు, ఉదాహరణకు, నూహ్, మోసెస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మహిమలన్నీ సందేశహరుడి ప్రామాణికతను ప్రజలు గుర్తించేందుకు కేవలం అల్లాహ్ యొక్క అనుజ్ఞతో సంభవించేవి.
జీసస్ అలైహిస్సలాం యొక్క అసలు సందేశం
పాతనిబంధనలలోని అబ్రహాం, నూహ్ మరియు జోనాహ్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలు ఎన్నడూ దేవుడు త్రైత్వంలో భాగమని బోధించలేదు మరియు జీసస్ అలైహిస్సలాం తమ సంరక్షకుడని నమ్మలేదు. వారి సందేశం చాలా సింపుల్ గా ఉండేది: దేవుడు ఏకైకుడు మరియు కేవలం ఆయన మాత్రమే మీ సకల ఆరాధనలు పొందేందుకు అర్హడు మరియు యోగ్యుడు. అనేక వేల సంవత్సరాల పాటు తను ఏకైకుడని, కేవలం తనను మాత్రమే ఆరాధించాలనే దివ్యసందేశంతో ప్రవక్తలను పంపి, తర్వాత హఠాత్తుగా జీసస్ కూడా దేవుడనే విశ్వాసాన్ని నాటేందుకు తన ఏకత్వ స్థాయి నుండి క్రిందికి దిగి, తాను త్రైత్వంలో భాగమంటూ సర్వలోక సృష్టికర్త తన దివ్యసందేశాన్ని మార్చాడనటం హేతుబద్దంగా ఉన్నదా?
అసలు వాస్తవం ఏమిటంటే, జీసస్ అలైహిస్సలాం కూడా పాతనిబంధనలలోని అసలు దివ్యసందేశాన్నే బోధించారు. బైబిల్ లోని ఈ భాగం నిజంగా ఆ మూలసందేశాన్నే ధృవీకరిస్తున్నది. “శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తమిచ్చెదనని గ్రహించి - “ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేది?" అని ఆయన నడిగెను. అందుకు యేసు – 'ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ'" (మార్కు సువార్త 12:28-29) కాబట్టి, దేవుడు అద్వితీయుడు అనేది జీసస్ అలైహిస్సలాం బోధనల ప్రకారం అత్యంత ప్రధానమైన మరియు ముఖ్యమైన కమాండ్మెంటు. ఒకవేళ జీసస్ యే స్వయంగా దేవుడైతే, ఆయనిలా పలికి ఉండేవారు, 'నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి.' మరి ఆయన అలా చెప్పకుండా, పాతనిబంధనలలోని దివ్యసందేశాన్నే మరలా రిపీట్ చేస్తూ, 'దేవుడు ఏకైకుడని' ఎందుకు పునః నిర్ధారించారు?
ఇది అద్వితీయ ప్రభువును మాత్రమే విశ్వసించాలని బోధించిన ఇతర ప్రవక్తల దివ్యసందేశాన్ని మరలా నిర్ధారించేందుకు జీసస్ అలైహిస్సలాం ఇశ్రాయేలు సంతతి వైపుకు పంపబడినారనే ఇస్లాంలో బోధించబడిన జీసస్ అలైహిస్సలాం యొక్క మిషన్ తో ఏకీభవిస్తున్నది.
“మరియు, ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకుని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: 'వాస్తవంగా నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకువచ్చాను. మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ట భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి. నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం.' ఖుర్ఆన్ 43:63-64
అల్లాహ్ యొక్క ఒక విధేయుడైన, గౌరవనీయుడైన సందేశహరుడిగా జీసస్ అలైహిస్సాం, అల్లాహ్ ఆజ్ఞలకు మనస్ఫూర్తిగా సమర్పించుకున్నారు. కాబట్టి, ఆయన కూడా ముస్లిం యే. ఎందుకంటే, ఎవరైతే సర్వలోక సృష్టికర్త, ప్రభువైన అల్లాహ్ అభీష్టానికి మరియు ఆజ్ఞలకు మనస్పూర్తిగా సమర్పించుకుంటారో, వారిని ముస్లింలు అంటారు.
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం 'కేవలం అద్వితీయుడైన ప్రభువును మాత్రమే ఆరాధించమని' ఇశ్రాయేలు సంతతివారిని ఆహ్వానించేందుకు పంపబడిన ఒక గొప్ప ప్రవక్త. ఇది బైబిల్ లో నిరూపించబడింది మరియు ఖుర్ఆన్ లో నిర్ధారించబడింది. అసలు జీసస్ ఎవరు అనే సత్యాన్ని జీసస్ అలైహిస్సలాం గురించిన ఇస్లామీయ విశ్వాసం స్పష్టంగా వివరిస్తూ, అదే సమయంలో సర్వలోక సృష్టికర్త, ఆయన యొక్క సంపూర్ణమైన ఘనత, ఏకైకత మరియు పరిపూర్ణతల గురించిన స్వచ్ఛమైన విశ్వాసాన్ని కూడా పునరుద్ధరిస్తున్నది.
మీరొక అడుగు ముందుకు వేసి, ఇస్లాం గురించి మరింత పరిశోధించాలని మేము ఆహ్వానిస్తున్నాము. ఇస్లాం ధర్మం అంటే కేవలం మరో ధర్మం కాదు. అది నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ అలైహిస్సలాంలు బోధించిన అదే దివ్యసందేశం. ఇస్లాం అనే అరబీ పదానికి అర్థం 'సర్వలోక సృష్టికర్తకు సమర్పించుకొనుట'. ఇదొక ప్రకృతి సహజమైన మరియు సంపూర్ణమైన జీవన విధానం. తమ ప్రభువుతో మరియు ఆయన యొక్క సృష్టితో మానవుడు కలిగి ఉండవలసిన గట్టి సంబంధంపై తగిన శ్రద్ధ చూపాలని ప్రోత్సహిస్తున్నది. సర్వలోక సృష్టికర్త అత్యంత న్యాయం చేసేవాడు మరియు అత్యంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాపవిమోచన కోసం స్వయంగా బలిచ్చుకోవలసిన అవసరం ఆయనకు ఎంత మాత్రమూ లేదు మరియు ఎవ్వరూ ఆదిపాపంతో జన్మించరని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఇంకా ప్రతి ఒక్కరినీ వారి వారి స్వంత ఆచరణల ఆధారంగా మాత్రమే సృష్టికర్త విచారిస్తాడు మరియు ప్రతి ఒక్కరూ తమ తమ స్వంత ఆచరణలకు మాత్రమే బాధ్యులని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది.
సృష్టికర్త పంపిన ప్రవక్తలందరినీ ప్రేమించాలని మరియు గౌరవించాలని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. కానీ, ప్రేమించుట మరియు గౌరవించుట అంటే వారిని ఆరాధించమని కాదు. ఎందుకంటే, ఆరాధింపబడే అర్హత, యోగ్యత కేవలం సృష్టికర్తకు మాత్రమే ఉన్నది, సృష్టించబడిన వాటికి కాదు. జీసస్ ను అల్లాహ్ యొక్క ప్రవక్తగా గుర్తించుట మరియు ముస్లింగా మారుట అనేది మీ క్రైస్తవ ధర్మాన్ని వదిలిపెట్టడం లేదా త్యజించడంగా భావించవద్దు. వాస్తవానికి అది జీసస్ అలైహిస్సలాం యొక్క అసలు స్వచ్ఛమైన బోధనల వైపుకు మరలటంగా భావించాలి.
http://islamicpamphlets.com/jesus-a-prophet-of-god/