×
ఈ వ్యాసంలో రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ కు ఇవ్వవలసిన ప్రాముఖ్యత మరియు అల్లాహ్ ఈ గొప్ప అనుగ్రహం నుండి ఏ విధంగా లాభం పొందవలెనో క్లుప్తంగా వివరించబడింది.

‘పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమదాన్ నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం చేసే, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి, కనుక ఇక నుండి రమదాన్ నేలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. ………అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి గాను మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడడానికీ, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది. ఖుర్ఆన్ వచన భావం అనువాదం. (అల్ బఖరా: 185)

పై ఆయతు భావం క్లుప్తంగా ఇలా ఉన్నది - రమదాన్ నెలలో ఖుర్ఆన్ అవతరించింది కాబట్టి ఈ నెలను పొందిన ప్రతి వ్యక్తీ కృతజ్ఞతా భావంతో ఉపవాసాలు ఉండాల్సిందేననీ, ఈ ఖుర్ఆన్ గ్రంథం సామాన్యమైనది కాదని, ఇది సర్వ మానవాళి కొరకు సకల సంక్షేమ సమృద్ధి పథకాలతో నిండిన ఉద్గ్రంథమని తెలుస్తుంది. మరైతే ఖుర్ఆన్ అంటే ఏమిటో, ఇది అవతరించిన ఆ మాసానికే అంత ప్రాధాన్యత ఎందుకివ్వబడిందో తెలుసుకుందాం. ఖుర్ఆన్ అనే పదం ‘ఖిరాత్’ నుండి వచ్చింది. ఖిరాత్ అంటే చదవడం అని అర్థం. దీని అర్థానికి తగ్గట్టు ఇది ప్రపంచమంతటా అత్యధికంగా పఠించబడే గ్రంథమే కాక అత్యధికంగా కంఠస్థం చేయబడే ఏకైక గ్రంథరాజం కూడా.

సృష్టికర్త ద్వారా తన సృష్టికి ఇవ్వబడిన అమూల్య వరం ఈ ఉద్గ్రంథం. దీనిని ఫుర్ఖాన్, హుడా, రహ్మహ్, బుష్రా, దిక్రా, అల్ కితాబ్ మరియు షిఫా అనే పేర్లు కూడా ఉన్నాయి, (విద్వాంసులు దీని గుణాలకనుగుణంగా దాదాపు నూరు పేర్లు సూచించారు). ఇందులో శుచీ శుభ్రతల పాఠాలు, దైవారాధనల విధానాలు ఆర్ధిక వాణిజ్య వ్యవహారాలు, వివాహ విడాకుల నియమాలే కాక ఆది మానవుడైన ఆదం (అలైహిస్సలాం) నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు వచ్చిన ఒక లక్షా ఇరవైనాలుగు వేల మంది ప్రవక్తల్లోని 25 ప్రవక్తల జీవిత గాథలూ ఉన్నాయి. అహంకారంతో తిరస్కార వైఖరిని అవలంబించి పుట్టగతులు లేకుండా రూపుమాపబడ్డ ఆద్ మరియు సమూద్ జాతుల ఇతిహాసాలూ ఉన్నాయి. మనిషి వ్యక్తిగత జీవితం నుండి సామూహిక జీవితం వరకు కావలసిన సంవిధానమూ ఉంది. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిని దండించే న్యాయ శాసనమూ ఉంది. మనిషి మరణానంతర సాఫల్యానికి కావలసిన స్వర్ణ సూత్రాలూ ఉన్నాయి. దీన్ని మనస్పూర్తిగా అనుసరించిన వారి శారీరక, మానసిక, అధ్యాత్మిక రోగాలను నయం చేసే ఒక వనమూలిక ఇది. మనిషిని మహామనీషిగా మలిచే ఒక మహత్తర గ్రంథం.

ఖుర్ఆన్ న్యాయాన్యాయాలను, మంచీ చెడులను, సత్యాసత్యాలను తేల్చే ఒక విచక్షణా రేఖ (ఫుర్ఖాన్). ధర్మ శాసనాలు తెలియక మంచీ చెడుల మధ్య అయోమయ స్థితిలో సతమతమయ్యే మానవులకు ఋజుమార్గం చూపించి గమ్యానికి చేర్చే మార్గదర్శి(హుదా).

ఇది మూఢనమ్మకాల, మూఢాచారాల చీకటి పొరల్లో చిక్కుకుని వెలుగుకై పెనుగులాడే వారిని కాంతివంతమైన బాట వైపు చేర్చే ఒక ప్రకాశవంతమైన జ్యోతి (నూర్) .

పాపకార్యాలకు పాల్పడి నిరాశానిస్ప్రుహలతో కృంగి పోయే జీవులకు క్షమా జ్యోతిని సూచించే కారుణ్య ప్రదాయిని. (రహ్మహ్)

మంచిననుసరించి, సత్కార్యాలు చేసే విశ్వాసులకు ఒక శుభవార్త (బుష్రా), మంచిని వీడి చెడుల ఊబిలో చిక్కుకున్న వారికి ఇదొక జ్ఞాపిక (జిక్రా).

ఆర్ధిక, అధ్యాత్మిక, సామాజిక, మానసిక ఒత్తిడికి తట్టుకోలేక పతనాంచులకు చేరుకున్న వారికి ఇది ఒక దివ్య ఔషధం (షిఫా).

సకల విషయాల వివరణలు, ఎనలేని శుభాలు మేళ్ళతో కూడిన ఈ గ్రంథం ఎంత మహోన్నతమైనదంటే అల్లాహ్ ఈ మహోపదేశాన్ని ప్రసాదించినందుకు గాను, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడటానికి, కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, పూర్తి రమదాన్ నెల ఉపవాసాలను తన దాసులపై విధిగా నియమించాడు.

కాస్త ఆలోచించండి! ఈ వరాన్ని పొందిన మనమంతా ఎంత భాగ్యవంతులమో! ఒకవేళ అల్లాహ్ ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రసాదించి ఉండకపోతే మనమెలాంటి అంధకారాల్లో పడి ఉండేవారమో! ఎన్ని ఘోర విషయాలను ఎదుర్కొనే వాళ్ళమో!

ఖుర్ఆన్ గ్రంథమే లేకపోతే మనం విగ్రహారాధన నుండి బయట పడలేక పోయేవారం. సారాయి, జూదం, మృత జంతువుల మాంసాహార భక్షణం, వ్యభిచారం లాంటి చెడుగులకు బానిసలయ్యే వారం.

ఇంకాస్త ఆలోచించండి, వడ్డీలు - చక్రవడ్డీల ఊబిలో చిక్కుకుని దివాలా తీసేవారము. పంది మాంసానికి అలవడి, దానిని తినేవాళ్ళం, స్వైన్ ఫ్లూ లాంటి ఎపిడమిక్లకు గురయ్యే వారము. విశృంఖల జీవనానికి అలవడి ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక రోగాలకు గురిఆయ్యేవారము. మరైతే వీటన్నింటి నుండి కాపాడుకోవటానికి మహోపదేశాన్నిప్రసాదించిన ఆ అల్లాహ్ కు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి? ఇంత చక్కటి జీవిత నియమావళి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? అయితే, ఖుర్ఆన్ పట్ల మన వైఖరి ఎలా ఉంది?

రమదాన్ మాసం వస్తుందంటే మన భక్తీ విశ్వాసాలు పాల పొంగులా పైకోచ్చేస్తాయి. సాధ్యమైనంత వరకు శుభాల ప్రాప్తికై తాపత్రయ పడతాం. కానీ, ఏ ఖుర్ఆన్ అయితే మన జీవితాలను తీర్చి దిద్దుతుందో, సరిచేస్తుందో, దానికి ఇవ్వవలసిన హక్కును ఇస్తున్నామా?

పొట్లాటల్లో, వారసత్వ వాటాలు పంచుకునేటప్పుడు, ప్రమాణాలు చేయడానికి మాత్రం ఖుర్ఆన్ ఉపయోగిస్తాం లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రత్యేక ఆయతును వంద నుండి లక్ష సార్లు చదవడం లాంటి కల్పిత పనులు చేస్తూ ఉంటాం. అదొక అపురూప దివ్య పుస్తకమని తలంచి అందమైన కవర్లలో పెట్టి కళ్ళకద్దుకుంటూ ఉంటాం.

మహా అయితే రమదాను రాగానే అటక మీద పెట్టిన దుమ్ము పట్టిన పుస్తకాన్ని తీసి దానిపైనున్న ధూళిని తొలగించి ఒకసారి చదవడానికి ప్రయత్నిస్తాం. నిస్సందేహంగా ఖుర్ఆన్ పారాయణం కూడా ఒక ఆరాధనయే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని ఒక్కొక్క అక్షర పఠనానికి బదులుగా పది పుణ్యాలు లభిస్తాయన్నారు. దీన్ని చదవడం తప్పనిసరి, కాని ఒక మాట గుర్తుంచుకోవాలి. అదేమంటే, ఇది అవతరింప జేయబడింది కేవలం చదవడానికి మాత్రమే కాదు. దీని అనుసరణకు అవగాహన అవసరం, అవగాహనకు విచక్షణా వివేచనమవసరం. అప్పుడే దానిలోని ఆజ్ఞలను, కట్టుబాట్లను, విధులను అర్థం చేసుకుని అలవరచుకోవడానికి ప్రయత్నిస్తాం.

అదీ కాక అర్థాన్ని తెలుసుకోకుండా కేవలం పఠించడం వల్ల దీని నుండి పొంద వలసిన లబ్ధిని పొందలేము. మన మానసిక రోగాలు పోవు, మన జీవితంలో రావలసిన మార్పూ రాదు. దానిని కేవలం చదివే వారి ఉదాహరణ ఎటువంటిదంటే తలనొప్పో కడుపు నొప్పోనని డాక్టరు వద్దకు వెళ్లి అతడిచ్చిన మందుల చీటిని తెచ్చుకుని, పదే పదే ఆ మందుల చీటిని చదివితే చాలు, రోగం నయమై పోతుందని అనుకోవడం లాంటిది. అలా చేస్తే రోగం నయమవ్వదు. నయమవ్వాలి అంటే ఆ మందులు తెచ్చి వాటిని సమయానికి వాడాలి, వైద్యుడు చెప్పిన పత్యం చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతులముతాము. అలాగే ఖుర్ఆన్ ను కూడా పఠించాలి, అర్థం చేసుకోవాలి, దానిపై ఆలోచించాలి. ఆ తరువాత అల్లాహ్ కు భయపడుతూ దానిని మనస్పూర్తిగా అనుసరించాలి. అప్పుడే మనలో అల్లాహ్ కోరే పరివర్తన వస్తుంది. ఇహపరలోకాలలో సాఫల్యం చేకూర్చుతుంది.