×
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

    1. ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు ?

    ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రీ.శ. 570వ సంవత్సరంలో మక్కా నగరంలో జన్మించారు. అప్పటికి యూరోపు ఖండంలో క్రైస్తవ మతం ఇంకా వ్రేళ్ళూను కోలేదు. తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చనిపోవటం మరియు బాల్యంలోనే తల్లి కూడా చనిపోవటం వలన, ఖురైష్ తెగలో ప్రముఖుడైన తన చిన్నాన్న పెంపకంలో ఆయన పెరిగారు. వయస్సులో పెరుగుతున్న కొద్దీ, ఆయన సత్యశీలత, నిజాయితీ, కనికరం, దయ, చిత్తశుద్ధిలలో ఎంతగా ప్రఖ్యాతి చెందారంటే, ప్రజలు తమ వివాదాలను వినిపించి, తీర్పు చెప్పమని ఆయన వద్దకు వచ్చేవారు. ఆయన ప్రశాంతంగా, దీర్ఘాలోచనలో ఉండేవారని చరిత్రకారులు వివరించారు.

    ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దృఢమైన ధర్మపరాయణత్వ స్వభావం మరియు దినదినాకి క్షీణిస్తున్న తన సమాజ అనైతికతపై తీవ్ర అసంతృప్తి కలిగి ఉండేవారు. మక్కా నగర పొలిమేరలలోని జబలె నూర్ కొండపై ఉన్న హీరా గుహలో తరచుగా ధ్యానంలో కూర్చోవటం ఆయన అలవాటుగా మారిపోయింది.

    2. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మరియు సందేశహరుడిగా ఎలా ఎంచుకోబడినారు ?

    40 ఏళ్ళ వయస్సులో, హీరా గుహలో ధ్యానంలో ఉండగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొట్ట మొదటిసారిగా సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నుండి జిబ్రయీల్ దైవదూత ద్వారా దివ్యవాణి అందుకున్నారు. ఆ రోజు నుండి 23 ఏళ్ళ పాటు ఆయన అందుకున్న దివ్యవాణియే ఖుర్ఆన్.

    జిబ్రయీల్ దైవదూత ద్వారా అందుకున్న దైవవాణిని ఆయన పఠించడం, సర్వలోక సృష్టికర్త తనపై అవతరింపజేసిన సత్యాన్ని బోధించడం ప్రారంభించగానే, ఆయనను విశ్వసించిన ఆ గుప్పెడు సహచరులపై తీవ్రమైన అత్యాచారాలు, దౌర్జన్యం, హింసలు మొదలయ్యాయి. అవి ఎక్కువగా తీవ్రమై పోయాయంటే, క్రీ.శ. 622లో మదీనా పట్టణానికి వలస వెళ్ళమని అల్లాహ్ ఆజ్ఞాపించినాడు. అలా మక్కా నుండి దాదాపు 260 మైళ్ళ దూరంలో ఉన్న మదీనాకు వలస వెళ్ళిన హిజ్రత్ సంఘటనతో ముస్లింల క్యాలెండరైన హిజ్రీ క్యాలెండరు ప్రారంభమైంది. (ఉదాహరణకు 2012 క్రీ.శ., ముస్లింల క్యాలండరు ప్రకారం 1433వ సంవత్సరానికి అంటే హిజ్రీ 1433 వ సంవత్సరానికి సమానం).

    కొన్ని సంవత్సరాలలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు దిగ్విజయంగా మక్కా నగరానికి తిరిగి వచ్చి, తమ శత్రువులను క్షమించారు మరియు ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. 63 ఏళ్ళ వయస్సులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేటప్పటికి, అరేబియా ద్వీపకల్పంలో అధిక భాగం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించింది. ఆ తర్వాత ఒక శతాబ్దంలోపే ఇస్లాం ధర్మం పశ్చిమంలో స్పెయిన్ వరకు మరియు తూర్పులో చైనా వరకు వ్యాపించింది.

    3. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త మరియు సందేశహరుడనేది నిజమేనా? ఒకవేళ నిజమే అయితే దానికి కారణం ఏమిటి? ఈనాడు మరింత ఎక్కువ మంది ప్రవక్తల అవసరం ఉందని మీరు భావించడం లేదా ?

    ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం మానవాళి కొరకు అల్లాహ్ పంపిన ప్రవక్తలలో మరియు సందేశహరులలో చిట్టచివరి వారని ముస్లింలు విశ్వసిస్తారు. క్రైస్తవులు, యూదులు, బౌద్దమతస్థులు, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు, నాస్తికులు ... మొదలైన ప్రతి ఒక్కరికీ ఆయన బోధనలు వర్తిస్తాయి.

    ఒకవేళ ఆయన అసలు బోధనలలో మార్పులు చేర్పులకు గురైనా లేదా వాటిని పోగొట్టుకున్నా మరో ప్రవక్త అవసరం కలిగేదు. అయితే ఖుర్ఆన్ యొక్క మౌలికత (originality) మరియు ప్రామాణికత (authenticity) చాలా జాగ్రత్తగా గ్రంథస్థం చేయబడింది. ఎప్పటి వరకైతే ఖుర్ఆన్ గ్రంథం యొక్క మౌలికత జ్ఞాపకంలో, ముద్రణలో, ఆడియో – వీడియోలలో, సిడీలలో మరియు ఇంటర్నెట్ లో భద్రంగా ఉందో, అప్పటి వరకు వేరే ప్రవక్త అవసరం లేదు. ఇస్లామీయ బోధనలు సమస్త మానవాళి కోసం ఉద్దేశించబడినవి. అయితే అంతకు ముందు పంపబడిన ప్రవక్తలు ప్రత్యేకంగా ఏదో ఒక తెగ కోసమో, జాతి కోసమో, ఒక ప్రత్యేక కాలానికో మరియు ప్రాంతానికో ఉద్దేశించి పంపబడటం వలన వారు సమస్త మానవాళి కొరకు పంపబడినారనడంలో నిజం లేదు.

    పూర్వ ప్రవక్తల బోధనల సారం మొత్తం ఖుర్ఆన్ లో ఉన్నది. ఒకవేళ చిత్తశుద్ధితో ప్రజలు ఖుర్ఆన్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే, తప్పకుండా వారికి అల్లాహ్ వైపు మరలే మార్గం కనబడుతుంది (ఇన్షా అల్లాహ్).

    4. ఎందుకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదకొండు మంది భార్యలను పెళ్ళాడారు? కేవలం నలుగురు భార్యలను పెళ్ళాడటానికి మాత్రమే ఒక ముస్లిం అనుమతించ బడినపుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదకొందు భార్యలను ఎలా పెళ్ళాడారు?

    ఖుర్ఆన్ లోని 4వ అధ్యాయమైన సూరతున్నిసా యొక్క 3వ వచనంలో, ఒక ముస్లిం నలుగురు భార్యలను మించి పెళ్ళాడకూడదని చెప్పబడింది. మరో వచనంలో ఈ నిబంధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వర్తించదని ఇలా చెప్పబడింది.

    "వీరు గాక ఇతర స్త్రీలు నీకు (వివాహమాడేందుకు) ధర్మసమ్మతం కాదు. వీరికి బదులుగా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు – వారు ఎంత అందంగా ఉన్నా సరే. నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు". [ఖుర్ఆన్ 33:52]

    అప్పటి వరకు పెళ్ళాడిన భార్యలందరినీ తన వద్దనే ఉంచుకునేందుకు ఈ వచనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అనుమతి ఇస్తున్నది మరియు ఆయన ఇక మరే స్త్రీను పెళ్ళి చేసుకోకూడదని నిషేధిస్తున్నది, తన అధీనంలోని స్త్రీలను అంటే బానిస స్త్రీలను మినహాయించి.

    ఆయన విడాలిచ్చిన తర్వాత లేక చనిపోయిన తర్వాత ఇంకెవ్వరినీ పెళ్ళి చేసుకునే అనుమతి వారికి ఇవ్వబడలేదు ఎందుకంటే వారికి ఉమ్ముల్ మోమినీన్ (విశ్వాసుల తల్లుల) స్థానం ఇవ్వబడింది.

    ఆయన పదకొండు మంది భార్యలను పెళ్ళాడటం వలన కొందరు ఆజ్ఞానులు అనవసరంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హైపర్ సెక్సువల్ అని నిందిస్తుంటారు. ఒకవేళ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే, ఆయన కేవలం రెండు పెళ్ళిళ్ళను మాత్రమే మామూలు పరిస్థితిలో చేసుకున్నారని తెలుసుకుంటారు. అవి ఒకటి ఖదీజా రదియల్లాహు అన్హాతో మరియు రెండోది ఆయెషా రదియల్లాహు అన్హాతో. మిగిలిన పెళ్ళిళ్ళన్నీ ఏదో ఒక సామాజిక సమస్యకు పరిష్కారంగా, వేర్వేరు పరిస్థితులలో చేసుకున్నవే.

    25 ఏళ్ళు వయస్సులో ఆయన మొట్టమొదటి వివాహం అప్పటికే రెండు సార్లు విధవరాలై, 40 ఏళ్ళ వయస్సుకు చేరిన ఖదీజా రదియల్లాహు అన్హాతో జరిగింది. (అల్లాహ్ క్షమించుగాక) ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హైపర్ సెక్సువలే అయితే వయస్సులో తన కంటే 15 ఏళ్ళు పెద్దదైన మరియు రెండు సార్లు విధవరాలైన స్త్రీని ఎందుకు పెళ్ళాడతారు ?

    తన మొదటి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా జీవించి ఉన్నంత కాలం ఆయన రెండో పెళ్ళి చేసుకోలేదు. ఖదీజా రదియల్లాహు అన్హా చనిపోయేనాటికి ఆయన వయస్సు 50 సంవత్సరాలు. ఆ తర్వాతే ఆయన ఇతర భార్యలను పెళ్ళి చేసుకున్నారు. ఒకవేళ ఆయన తన పదకొండు భార్యలను వ్యామోహం లేదా కామం తీర్చుకోవడం కోసం వివాహం చేసుకున్నారనుకుంటే, యవ్వనంలోనే ఆయన అలా పెళ్ళిళ్ళు చేసుకుని ఉండేవారు కదా! దీనికి విరుద్ధంగా, మిగిలిన పది మంది భార్యలతో ఆయన వివాహం 53 నుండి 59 ఏళ్ళ వయస్సు మధ్యలో జరిగిందనే వాస్తవాన్ని చరిత్ర మనకు తెలుపుతున్నది.

    ఇద్దరు భార్యలు తప్ప మిగిలి వారందరి వయస్సు వివాహం సమయంలో 36 నుండి 50 ఏళ్ళ మధ్యలో ఉండింది. ఆయన పేరుప్రఖ్యాతులు దూరదూర ప్రాంతాలకు – అరేబియా ద్వీపకల్పం సరిహద్దులు దాటి చుట్టుప్రక్కల దేశాల వరకు - వ్యాపించాయి. అంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఆయనకు మంచి యుక్తవయస్సులోని అందగత్తెలు లభించలేదా? ఒకటి రెండు తప్ప, దాదాపు ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ రాజకీయ లబ్ది కోసం మరియు ఇస్లాం వ్యాప్తి కోసం చేసుకున్న పెళ్ళిళ్ళు మాత్రమే అనేది అందరు గుర్తించిన వాస్తవం.

    ఏదైనా ఒక విశిష్ఠమైన మరియు ఉన్నతమైన తెగకు చెందని వారెవ్వరూ అరేబియా ప్రాంతంలో సమాజ సంస్కరణ మరియు ఉద్ధరణ పనులు చేపట్టలేరు. కాబట్టి, అంతిమ సందేశాన్ని ప్రజలకు అందజేసే కార్యంలో ఆయనకు వివిధ తెగలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవలసిన అవసరం తప్పనిసరైంది. చిన్న చిన్న కారణాలకు కూడా యుద్ధాలు చేసుకుంటూ, పరస్పరం పోట్లాటలలో మునిగి ఉన్న అరబ్బు తెగలను ఏకం చేసి, ఐకమత్యంతో మెలిగే ఒక ముస్లిం సమాజంగా, దైవవిశ్వాస ఆధారితమైన సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి జీవించేలా చేయాలని ఆయన కోరుకున్నారు.

    ఉదాహరణకు, ఆయన భార్యలలోని ఒక భార్య జవైరియా రదియల్లాహు అన్హా, బనూ ముస్తలిఖ్ తెగకు చెందిన మహిళ. ఆ కాలంలో ఆమె తెగ చాలా శక్తివంతమైన తెగగా గుర్తించబడింది. ప్రారంభం నుండే మొత్తం తెగ ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువుగా ప్రవర్తించేది. దాని దౌర్జన్యాన్ని ఆపటానికి చివరికి దాడి చేయవలసి వచ్చింది. యుద్ధంలో ఓడిపోయి వారందరూ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తెగకు చెందిన జువైరియా (రదియల్లాహు అన్హా) ను వివాహం చేసుకున్నారో, క్రొత్త భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా బంధువులైన ఆ తెగ ప్రజలను తమ ఖైదీలుగా ఉంచుకోలేమంటూ ముస్లిం సైనికులు తమ చేతికి చిక్కిన ఆ ఖైదీలందరినీ విడుదల చేసివేసారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న బనూ ముస్తలిఖ్ తెగ మొత్తం ఇస్లాం శత్రుత్వాన్ని విడిచి పెట్టి, వెంటనే ఇస్లాం స్వీకరించింది. నూతన ఇస్లామీయ రాజ్య ధర్మాజ్ఞలను శాంతియుతంగా మరియు విధేయతగా పాటించారు.

    ఆయన మరో భార్య మైమునా రదియల్లాహు అన్హా కూడా నజ్ద్ ప్రాంతపు ఒక శక్తివంతమైన తిరుగుబాటు తెగకు చెందిన స్త్రీ. ఆమె ఆ తెగ నాయకుడి స్వంత సోదరి. ఇస్లామీయ ధర్మాన్ని బోధించేందుకు వారి విజ్ఞప్తిపై అక్కడికి పంపబడిన బృందంలోని డెబ్బై మంది ముస్లింలను ఈ తెగ ప్రజలే క్రూరంగా హత్య చేసారు. మైమునా రదియల్లాహ్ అన్హాతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం చేసుకున్న వివాహం మొత్తం వాతావరణాన్నే మార్చి వేసింది. తత్ఫలితంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వంలోని మదీనా ఆధిపత్యానికి నజ్ద్ తెగ అంగీకరించింది.

    ఖురైషీయుల సర్దారు అబూ సుఫ్యాన్ కుమార్తె ఆయన వివాహమాడిన మరో భార్య ఉమ్మె హబీబహ్ రదియల్లాహు అన్హా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో జరిగిన తన కుమార్తె ఉమ్మె హబీబహ్ రదియల్లాహు అన్హా తర్వాత, మరెన్నడూ అబూ సుఫ్యాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేయలేదు. మక్కా విజయానికి కూడా ఈ వివాహం ఒక ముఖ్యకారణం అయింది. అంతేగాక, ఉమ్మె హబీబహ్ రదియల్లాహు అన్హా ముందుగా ఉబైదుల్లాహ్ అనే ఒక ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుని అబిసీనియాకు వలస వెళ్ళింది. అక్కడ ఉబైదుల్లాహ్ ధర్మభ్రష్టుడై క్రైస్తవమతం స్వీకరించి, త్రాగుబోతుగా మారిపోయినాడు. మితిమీరి త్రాగటం వలన త్వరలోనే అతడు మరణించాడు. భర్త ముందుగా క్రైస్తవ ధర్మం స్వీకరించటం, తర్వాత హద్దుమీరి మద్యపానం సేవిస్తూ చనిపోవటం – ఇవి రెండూ ఆమెను ఎంతో దుఃఖానికి గురి చేసాయి. ఆమెకు ధైర్యాన్నిచ్చే మరియు సేద తీర్చే అభయ హస్తం తప్పని సరైంది.

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరో భార్య సఫియ్యహ్ రదియల్లాహు అన్హా యూదుల ముఖ్య నాయకుడైన ప్రఖ్యాత హువై ఇబ్నె అక్తబ్ కుమార్తె. ఖైబర్ యుద్ధంలో యూదులపై గెలిచిన ముస్లిం సైన్యంలోని ఒక సామాన్య సైనికుడి భాగంలో ఆమె వచ్చింది. ఆమె స్థాయికి అది సముచితం కాకపోవటం వలన ఆ సైనికుడు స్వచ్ఛందంగా ఆమెను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాస్యంలో ఇచ్చి వేసాడు. అపుడు ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను వివాహమాడినారు. ఈ వివాహం తర్వాత యూదులు ఇస్లాంపై తమ శత్రుత్వాన్ని ప్రక్కన పెట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్య ధర్మప్రచారాన్ని అడ్డుకోవడం మానివేసారు.

    ఇక ఆయన యొక్క మరో భార్య హఫ్సా రదియల్లాహు అన్హా విషయానికి వస్తే, భవిష్య నాయకత్వం కోసం సుక్షితులవుతున్న తన గొప్ప సహచరులతో దృఢమైన సంబంధాలు నెలకొల్పేందుకు గాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖ్య సహచరులు మరియు ఆంతరంగిక సలహాదారులలో ఒకరైన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కుమార్తె హఫ్సా రదియల్లాహు అన్హా ను వివాహమాడినారు. అలాగే మరో అత్యంత సన్నిహితుడైన అబూబకర్ రదియల్లాహు అన్హు కుమార్తె ఆయెషా రదియల్లాహు అన్హాను కూడా వివాహమాడినారు. తన ఇద్దరు కుమార్తెలకు ఉథ్మాన్ రదియల్లాహు అన్హుతో వివాహం జరిపించారు. మరో కుమార్తెకు అలీ రదియల్లాహు అన్హుతో వివాహం చేసినారు. ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క స్థానం ఇలాంటి ఆప్త బంధుత్వానికి బయట ఉంచబడే స్థానం కాదు. అతని కుమార్తె హఫ్సా రదియల్లాహు అన్హాను వివాహం చేసుకుని, ఇస్లామీయ ఉద్యమం లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దృఢమైన సంబంధాలు ఏర్పరచ గలిగారు. తద్వారా ముస్లిం సమాజ పునాదులను దృఢపరిచారు.

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మేనత్త కూతురైన జైనబ్ రదియల్లాహు అన్హా వివాహం తను స్వేచ్ఛను ప్రసాదించిన జైద్ ఇబ్నె హరిథ రదియల్లాహు అన్హు అనే బానిసతో జరిపించారు. ఒకప్పుడు అతడిని తన పెంపుడు కుమారుడని ఆయన ప్రకటించి ఉన్నారు. జైద్ రదియల్లాహు అన్హుతో జరిగిన జైనబ్ రదియల్లాహు అన్హా వివాహం యొక్క ముఖ్యోద్దేశం కులాల మరియు జాతుల మధ్య ఏర్పడి ఉన్న అడ్డుగోడలను తునాతునకుల చేయడం. అయితే ఆ పెళ్ళి కొన్నాళ్ళకే విడాకులతో ముగిసింది. జైనబ్ రదియల్లాహు అన్హా ఒంటరిదై పోవటం చూసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు పరిష్కారం చూపటం తన కర్తవ్యంగా భావించారు. అంతేగాక ఆనాటి ప్రజలలో ఉన్న పెంపుడు కుమారుడు అసలు కుమారుడై పోతాడనే మరో మూఢాచారాన్ని నిర్మూలించమనే అల్లాహ్ ఆదేశం కూడా అప్పుడే వచ్చింది. అజ్ఞానకాలపు ఈ మూఢాచారాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఇస్లామీయ చట్టాన్ని అమలు చేయటమనే ఒక గంభీరమైన క్లిష్టసమస్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం (ఖుర్ఆన్ లోని సూరహ్ అల్ అహజాబ్ లోని 37వ వచనంలో తెలిపినట్లుగా) జైనబ్ రదియల్లాహు అన్హాతో జరగటం ద్వారా ఆచరించబడింది. ఆ విధంగా ప్రజల అపోహలు దూరం అయ్యాయి.

    ఆయన యొక్క మరో భార్య ఉమ్ముల్ మసాకీన్ (దిక్కులేని స్థితిలో ఉన్న నిరుపేదల తల్లి) అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన జైనబ్ రదియల్లాహు అన్హా, ఆమె హవాజిన్ తెగకు చెందిన ఖుజైమా ఇబ్నె హరిథ్ కుమార్తె. ఆమె భర్త ఉహద్ యుద్ధంలో వీరమరణం పొందారు (షహీదు అయ్యారు). వితంతుత్వం నుండి ఆమెను కాపాడటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను తన భార్యగా చేసుకున్నారు.

    ఖుర్ఆన్ లోని 33వ అధ్యాయమైన సూరతుల్ అహజాబ్ లోని 52వ వచనం అవతరించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం మారియా కిబ్తియా అనే బానిస యువతిని మాత్రమే వివాహం చేసుకున్నారు. ఈజిప్టు యొక్క మఖైఖస్ అనే క్రైస్తవ రాజు ఆమెను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కానుకగా పంపటం వలన ఆయన తిరస్కరించ లేక పోయారు. ఎందుకంటే పొరుగు రాజు పంపిన కానుకను తిరస్కరించటమనేది ఆ రాజుతో సత్సంబంధాన్ని తిరస్కరించటంగా భావించబడి, రాజకీయ సంబంధాలు చెడిపోవటానకి అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఆమెను తన బానిసగా ఉంచుకునే అవకాశం కూడా లేకపోయింది ఎందకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా బానిసలకు విముక్తి చేయమని బోధించేవారు. ఇక చివరికి ఆయన వద్ద మిగిలిన ఒకే ఒక దారి ఏదంటే, ఆమెను పెళ్ళాడటం. ఎందుకంటే ఖుర్ఆన్ ఆయనకు అలా చేసే అనుమతి ఇచ్చి ఉన్నది. కొన్నాళ్ళ తర్వాత ఆమె ఇబ్రాహీంకు జన్మనిచ్చింది. అయితే ఇబ్రాహీం బాల్యంలోనే చనిపోయినారు.