రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం
కూర్పులు
Full Description
రాజస రాబిన్స్ కథ
“వాటి యొక్క వ్యతిరేక భావనల ద్వారా విషయాలు మరింత స్పష్టమవుతాయి” అని అరబీ భాషలొ ఒక సామెత ఉన్నది. (Things are made clear through their opposites”).
సత్యాన్ని అసత్యం స్పష్టపర్చినంత గొప్పగా వేరే ఏదీ స్పష్టపర్చదు. అమెరికాలో అడుగు పెట్టిన 6 నెలలకు నేను ఇస్లాం ధర్మం స్వీకరించాను. ఇలా జరగడానికి అక్కడ నాకు క్రైస్తవ మతంతో పరిచయం కావడమే కారణం. క్రైస్తవమతమా! నీకెన్ని కృతఙతలు అర్పించినా తక్కువే.
నేను భారతదేశంలో పుట్టాను. అనేక దేవుళ్ళను, దేవతలను కొలిచే హిందువుల మధ్య పెరిగాను. అక్కడి ప్రతి వీధిలోనూ, ప్రతి కూడలిలోనూ శిలావిగ్రహాలు, చెక్కతోనో, ఏనుగు దంతాలతోనో చేసిన విగ్రహాలు లేదా ప్రత్యేకంగా బంగారం, వెండితో చేసిన విగ్రహాలున్న దేవాలయాలు కనబడతాయి.
నేను హిందూ కుటుంబంలో నుండి రాలేదు. నా తల్లిదండ్రులు దేవుడిని నమ్మరు. వారు నాస్తికులు. దేవుడి ఉనికే లేదని వారు నాకు బొధించారు. చిన్నతనం వలన ప్రతి విషయంలోనూ వారు పరిపూర్ణమైనవారుగా అనిపించేవారు. వారికి అన్ని విషయాలూ తెలుసు అని నాలో నమ్మకం ఏర్పడినది. వారు ఏమి చెప్పినా నమ్మేసేదానిని. కానీ ఎదుగుతున్నకొద్దీ – నా తల్లిదండ్రులకు మొత్తం విషయాలన్నీ తెలియవని, వారికి తెలియని విషయాలు కూడా ఉన్నాయని గ్రహించడం మొదలుపెట్టాను. వారు అన్ని విషయాల్లోనూ సంపూర్ణంగా పండితులు కారు – వాళ్ళుకూడా తప్పులు చేస్తుంటారు అనే విషయం అర్థమైనది.
త్వరలోనే జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలు నా మనస్సును తొలిచివేయడం మొదలైంది. ఇలాంటి ప్రశ్నలే అనేక మనస్సులలో కూడా ఏదో ఒక సమయంలో తప్పక వస్తాయనేది నా దృఢాభిప్రాయం. జీవితానికి అర్థం – పరమార్థం అంటూ ఎవైనా ఉన్నాయా? ఉంటే అవేమిటి? మానవుడు మంచి చెడులలో ఎదో ఒక దానిని తప్పక ఎన్నుకోవలసిన పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నాడు? జనం ఎందుకు చనిపోతున్నారు? చనిపొయిన తరువాత ఏమి జరుగును?
నా తల్లిదండ్రుల వద్ద ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. నేనిక స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టాను. చివరికి సుదీర్ఘమైన ఆలోచనలు, అంతర్మధనం తరువాత – దేవుడు ఉన్నాడనే అంతిమ నిర్ణయానికి చేరుకున్నాను. నిజానికి దేవుడు ఉన్నాడనేదే తిరుగులేని, ఎవ్వరూ తిరస్కరించలేని సత్యం.
ప్రకృతిలో ఒక క్రమం, ఒక పరిపూర్ణతా ఉన్నాయి. ఇవి యాదృచ్చికంగా సంభవించడం సాధ్యంకాని విషయం. ఎందుకంటే శిల్పి లేకుండా శిలలకు రూపం రావడం, సృష్ఠికర్త లేకుండా సృష్ఠి ఉనికిలోనికి రావడం అసంభవం. మనమంతా అంటే మానవులమంతా – ఆ సృష్ఠికర్త యొక్క సృఉజనాత్మక సృష్ఠి ఫలితమే గానీ – ప్రమాదవశాత్తుగానో, కాకతాళీయంగానో, పరిణామ సిధ్ధాంతం కారణంగానో ఉనికిలోకి వచ్చినవారం కాము.
ఈ సృష్ఠి మొత్తాన్ని సృష్ఠించిన సృష్ఠికర్త ఒక్కడే అయి ఉండాలి అనే విషయాన్ని కూడా నేను స్పష్ట పర్చుకున్నాను. ఒకరికంటే ఎక్కువమంది సృష్ఠికర్తలు ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సార్వభౌమత్వంలో విభేదాలు కలగడం, విభజనలకు దారి తీయడం, ఫలితంగా సృష్ఠి మొత్తంలో అస్తవ్యస్థత, గందరగోళం ఏర్పడడం జరుగుతుంది. ఒక్క వంటకం వండడంలో పదిమంది చేతులు పడితే ఆ వంటకానికి ఎలాంటి గతి పడుతుందో మనకు తెలుసు. ‘Too many cooks spoils the broth’ అనే ఆంగ్ల సామెత దీనిని ధృవీకరిస్తునది కూడా.
నేను దేవుడ్ని నమ్మడం మొదలు పెట్టాను. నా ఆచరణలన్నింటికీ జవాబుదారీ నేనే అని కూడా నా నమ్మకం. మనం నియంత్రించగలిగే విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కేవలం మన ఆచరణలు మాత్రమే. అంతకు మించి మన అధీనంలో ఏదీ లేదు. దేవుడు మనల్ని మంచి-చెడుల మధ్య ఏదో ఒకదానిని ఎన్నుకునే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో సృష్ఠించాడు కనుక – నేను ఆ రెంటిలో దేనిని ఎన్నుకుంటాను అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే మనసు లోపలి పొరల్లో నా కర్మలన్నిటికీ నేనే జవాబు చెప్పుకోవాల్సి వస్తుందనే విషయం ఎల్లప్పుడూ నేను గ్రహిస్తూనే ఉంటాను. దేవుడు సర్వ శక్తిమంతుడు – మంచి పనులకు పుణ్యాలు ప్రసాదించే, చెడుపనులకు కఠిన శిక్షలు విధించే సామర్ధ్యం కలవాడు. ఈ ఆలోచన నన్ను దేవుని పట్ల మరింత భయపడేలా చేసినది.
నేను దేవుడినైతే నమ్ముతున్నాను కాని నాకంటూ ఒక మతంగానీ ఒక ధర్మంగానీ లేవే – మరెలా? కేవలం మంచి పనులు చేస్తూ మంచిగా జీవించి నంత కాలం మనిషి ఏ మతాన్ని అనుసరించినా ఏమీ తేడా ఉండదు – అని నేననుకుంటూ ఉండే దానిని. కానీ ఈ ఆలోచనలో తీవ్రమైన లోపం ఉంది. ఏమైనా అప్పట్లో నాకు (ఈ విషయాల పట్ల) అంత అవగాహన లేకపోయినది. దేవుడంటే భయభక్తులు గల ఒక మనిషి నాకు భర్తగా లభిస్తే చాలు అనుకుంటూ ఉండే దాన్ని. ఒకే దేవుడిని విశ్వసించేవారు కనుక, ముస్లింను గానీ, క్రిస్టియన్ ను గానీ లేదా ఒక బహాయీని గాని వివాహం చేసుకోవడం నాకు ఇష్టంగానే ఉండేది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను నా భర్తను తొలిసారిగా కలవడం జరిగింది. ఆయన క్రిస్టియన్. అమెరికా నుండి వచ్చారు. అప్పటికి ఆయనతో నా పరిచయం కేవలం మూడు రోజులే అయినా, ఆయన నన్ను పెళ్ళిచేసుకునే ఉద్దేశ్యాని వ్యక్తపరిచారు. ఆయనను చూస్తే చాలా నిజాయితీ పరుడని, హృదయం నిండా దైవభక్తి గలవారని అనిపించింది నాకు. మా పెళ్ళి జరిగిపోయింది. రెండు వారాల తరువాత ఆయన అమెరికా తిరిగి వెళ్ళాపోవాల్సి వచ్చినది. ఆయన తనవెంట నన్ను తీసుకువెళ్ళే అవకాశం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తరువాత నాకు వీసా రావడం నేను అమెరికా వెళ్ళడం జరిగింది.
అమెరికా, భారతదేశం కంటే చాలా భిన్నమైన దేశం. అక్కడి జీవన విధానానికి అలవాటు పడ్డానికి కొంత కాలం పట్టింది నాకు. నాభర్త అంకితభావంతో క్రైస్తవ మతాన్ని పూర్తిగా ఆచరించే ఒక నిజమైన క్రిస్టియన్. ఆయన “Worldwide Church of God” అనే సంస్థ సభ్యుడు కూడా. ఆయన ప్రతి రోజూ బైబిల్ చదివే వారు. తరచుగా మతావేశంతో చదువుతున్నారా అనిపించేలా చదివేవారు. సబ్బాత్ ఆచారాన్ని కూడా పాటించేవారు. Seventh Day Adventist Church కు హాజరయ్యారు కూడా. ఆయనతో పాటు చాలాసార్లు నేను చర్చ్ కు వెళ్ళాను. బైబిల్ కూడా చదివాను. దేవుడి గురించి నా ఆలోచనలు ఏ విధంగా ఉండేవో, వాటిని సమర్థించే విషయాలు అందులో చాలా కనిపించాయి. “దేవుని పట్ల భయమనేది వివేచనకు ఆరంభం” అనే వచనం అందులో నాకెంతో నచ్చింది. చర్చ్ లో అనేకమంది మంచి వ్యక్తులతో నాకు పరిచయం అయ్యింది. వారిలో చాలామంది నాకు మంచి స్నేహితులు కూడా. ప్రత్యేకించి ఒక వృధ్ధ దంపతులతో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ‘జీవితం సజావుగా సాగిపోతున్నది – నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అనుకుంటున్నప్పుడు జరిగింది ఆ సంఘటన - కాలిఫొర్నియాలోని మా అత్తామామలను చూడ్డానికి వెళ్తున్నపుడు – రైల్లో.
కాలొఫొర్నియా వెళ్ళడానికి మెట్రో రైల్లో లాస్ఆంజెల్స్ కు వెళ్తున్నాను. అప్పుడు కొంతమంది రైల్లోకి ఎక్కి ప్రయాణీకులందరికీ ఏవో పత్రాలు పంచడం మొదలు పెట్టారు. నా చేతిలో పెట్టిన కాగితం వైపు చూసాను. అందులో వ్రాసి ఉన్నదాన్ని విపరీతమైన అపనమ్మకంతో అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ కాగితాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాను. అందులో ఇలా వ్రాసి ఉంది.
రక్షింపబడాలంటే (మోక్షం పొందాలంటే) నేనేం చేయాలి?
ఈ ప్రశ్నకు సమాధానంగా మీరేం చేయనవసరం లేదు – చేయవలసిందల్లా దేవుడు తన వాక్కులో చెప్పినదానిని విశ్వసించడం. అంతే. దేవుడు ఇలా అన్నాడు – “ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించండి. ఆ విధంగా మీరు రక్షించబడతారు.”
కేవలం విశ్వసిస్తే చాలా? అవును అంతే (కేవలం విశ్వసిస్తే చాలు). విశసించడం అంటే – మోక్షం పొందడాన్ని గురించి దేవుడు (ఆ వాక్యంలో) చెప్పినదాన్ని విశ్వసించడం. అంటే మనం ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడని, ఆయన సమాధి చేయబడినాడని, మళ్ళీ మూడో రోజున సమాధినుండి తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు. మనకు పరలోక శాశ్వత జీవితాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు చనిపోయాడు. మీరుగానీ శాశ్వత పరలోక జీవితాన్ని పొందాలనుకుంటే ఈ విధంగా ప్రార్థించండి.
“స్వర్గలోకపు తండ్రీ! నాకు తెలుసు నేను పాపాత్ముడినని, మరియు క్షమించబడవలసిన అవసరమున్న వాడినని కూడా నాకు తెలుసును. ఇప్పుడు నేను జీసస్ క్రీస్తును నా ప్రభువుగా మరియు నా సంరక్షకుడిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలను క్షమించినందుకు నా కృతఙ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున – ఆమీన్. (జాన్ 1:12) తనను అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.”
ఈ చిన్న కాగితం ముక్క నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నా హృదయం ఘోషిస్తున్నది – ఇది ముమ్మాటికీ నిజం కాదు. ఇది ఎంత నిఖార్సైన అబధ్ధమంటే – దీనిని విశ్వసించేవారు కూడా ఉంటారా ఎవరైనా? అని నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఆధునిక క్రైస్తవమతంతో నా పరిచయానికి అది నాంది.
ఆధునిక క్రైస్తవుల ఈ అసంబధ్ధమైన విశ్వాసాలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తినాయి. వాటిలో ఈ క్రింద పేర్కొన్న కొన్ని విశ్వాసాలు నాకు అస్సలు మ్రింగుడు పడలేదు.
- జీసస్ కూడా దేవుడే.
- జీససే ప్రభువు మరియు సంరక్షకుడు. మన పాపాల కోసం మరణించడానికి ఆయన మానవరూపంలో భూమ్మీదకు దిగివచ్చాడు.
- దేవుడు ఒక్కడే – కానీ ఒక్కరిలోనే ముగ్గురున్నారు (దీనినే ‘త్రిత్వం’ (ట్రినిటీ) అంటారు.
పైవాటిలో ఏ ఒక్క దానికీ బైబిల్ లో ఆధారం లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తాను దేవుడినని అనలేదు. తాను మన పాపాల ప్రక్షాళన కోసం బలికావడానికి ఈ భూమ్మీదకు వచ్చానని కూడా ఆయన ఎక్కడా అనలేదు. ఇంకా బైబిల్ ను మీరు మొదటి పేజీ నుండి చివరి వరకు, ఒక్కో పేజీ వెతకండి – మీకెక్కడా ట్రినిటీ (‘త్రిత్వం’) అనే పదం కనపడదు.
పైన పేర్కొన్న విశ్వాసాలకు సంబంధించి నా మనసులో అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవసాగాయి. దేవుడు సర్వ శక్తిమంతుడు కదా – మరి ఆయనే స్వయంగా భూమ్మీదకు రావల్సిన అవసరం ఏమిటి? ఏదైన పని జరగాలని ఆయన కోరుకుంటే ఆ మాట అంటే చాలు ఆ పని జరిగిపోతుంది కదా! యేసుక్రీస్తు కూడా (మనలాగా) ఒక మనిషే. ఒకవేళ ఆయన దేవుడే అయితే ఆయ ఎలా చనిపోగలడు? దేవుడు కూడా మరణిస్తాడా? అంతేగాక, నిజంగానే యేసుక్రీస్తు మానవరూపంలో ఉన్న దేవుడే అయితే (ఆయన కూడా ప్రార్థించినట్లు బైబిల్ లో ఉంది కదా?) మరి ఆయన ఎవరిని ప్రార్థించినట్లు? తనను తానే ప్రార్థించుకున్నాడా? యేసుక్రీస్తు నిజంగా దేవుడే అయితే, మరి దేవుడిగా ఆయనా సాతాను ప్రేరణలకు ఎలా గురి అవగలడు? భూమ్యాకాశాలలో ఉన్నదంతా దేవునిదే అయినపుడు, భూలోక రాజ్యాన్ని నీకు ఇస్తానని దేవునికి సాతాను ఎలా ఆశ చూపగలడు? అదలా ఉండనిస్తే – సాతానును సృష్ఠించింది ఎవరు? దేవుడే కదా!
అలాగే ‘ట్రినిటీ’ అనేది (క్రైస్తవమతపు) అంత ముఖ్యాతి-ముఖ్యమైన విశ్వాసమే అయినట్లయితే, దానిని గురించి యేసుక్రీస్తు ఎందుకు బోధించలేదు?
సృష్ఠికర్తే స్వయంగా తన సృష్ఠిగా మారాల్సిన అవసరం, లేదా తన సృష్ఠిలోనే ఒక భాగంగా మారాల్సిన అవసరం సృష్ఠికర్తకు ఎంతమాత్రమూ లేదని అర్థం చేసుకోవడానికి ఎక్కువ తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. పోనీ దేవుడు తన సృష్ఠిలో ఒకటిగా మారినాడే అనుకుందాం, ఆయన అలా చేయాలని ఎందుకు అనుకుంటాడు? సరే దేవుడు నిజంగానే జీసస్ గా మారి నిజంగానే మన పాపాల కోసం చనిపోయాడే అనుకుందాం, అలాంటపుడు, మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఒక్క పాపం కూడా మిగలకుండా పాపరహితమైన ప్రపంచంగా ఉండాలి కదా? మరలా ఎందుకు జరగ లేదు? ప్రపంచం పాపరహితంగా లేనపుడు అందరి పాపాల కోసం ఆయన చనిపోవడంలో అర్థం ఏముంది? అలా చనిపోయి ఆయన ఏం సాధించినట్లు? (సాధించింది ఏముంది?)
అత్యంత ఉత్తమ స్థాయి అబధ్ధం వైపు విస్మయంతో రెప్పలార్పడం కూడా మరచిపోయి చూస్తుండి పోయాన్నేను. దాని మూలంతో సహా (ఏ కోణం లో నుంచి చూసినా, నూటికి నూరుపాళ్ళు) అది పచ్చి అబధ్ధమని నాకు తెలుస్తూనే ఉన్నది.
దేవుని సృష్ఠిలో ఎంత వెతికినా ఒక చిన్న లొసుగు కూడా కనపడదు మనకు. అది అన్ని విధాలా సంపూర్ణమైనది, సమగ్రమైనది. విశ్లేషణా శక్తినీ, సమగ్ర విఙ్ఞానాన్ని, ఇంగిత ఙ్ఞానాన్ని మనకు ప్రసాదించింది దేవుడే. అటువంటిది, అసంబధ్ధమైన, అవాస్తవమైన విషయాలను గుడ్డిగా విశ్వసించమని దేవుడు అనగలడా? సత్యం అన్ని వేళలా వాస్తవమైనదై ఉండాలి. ఎవరైనా గూఢచారి నిజాన్ని కనుక్కోవాలంటే, అతడు ఆధారాల కోసం వెతుకుతాడు, దొరికిన సాక్ష్యాలను పరిక్షిస్తాడు, తన వివేచనా శక్తిని, విశ్లేషణా శక్తిని ఉపయోగిస్తాడు. అలాగే ప్రజలు కూడా ఈ విధానాన్ని తమకు అవసరమైన అన్ని విషయాలలోనూ వాడతారు – ఒక్క మతం (ధర్మం) విషయంలో తప్ప. ధర్మం విషయంలో వారు ఇవన్నీ గాలికి వదిలి – వారికి తెలిపిన దానిని గుడ్డిగా నమ్మేస్తున్నారు.
ఒక్కోసారి నాకు ఆశ్చర్యమేస్తుంది – తమ పాపాలకోసం యేసుక్రీస్తు చనిపోయాడని అసలు వీళ్ళెలా నమ్మగలుగుతున్నారు? మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి – ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన పరీక్ష వ్రాయడానికి కూర్చున్నారనుకొండి. ఎవరైనా వచ్చి మీతో “పరీక్ష పాస్ కావడానికి నువ్వేం చేయనవసరం లేదు – ‘మీ టీచరే స్వయంగా కష్టపడి చదివి, పరీక్ష కూడా ఆయనే రాస్తాడని’ నువ్వు నమ్మితే (విశ్వసిస్తే) చాలు. అవును, నువ్వేం చేయనవసరంలేదు – కేవలం అలా అని నువ్వు నమ్మితే చాలు, పరీక్ష పాసైపోతావు” అని అన్నారనుకొండి. మీరతన్ని గుడ్డిగా నమ్మేస్తారా? (అతిని పిచ్చి వాడిని చూసినట్లు చూడరూ?)
“దానికే ముంది, అలా కూడా జరుగుతుందేమో అని నమ్మవచ్చు కదా” అంటున్నారా? సరే నమ్మండి – మీకిష్టమైన విధంగా మీరు నమ్మండి. కానీ పరీక్షా ఫలితాలు వెల్లడైన తరువాత మీకు సున్నా మార్కులు రావడాన్ని మీరే చూసుకుంటారు. అంతే కాక, మీకు బదులుగా టీచరే కష్టపడి చదివి, ఆయనే పరీక్షలు వ్రాయబోతున్నారనే చిత్రమైన అంధవిశ్వాసంలో మీరు పడి కొట్టుకుంటున్నారని తెలిస్తే, మీ టీచర్ మిమ్మల్ని స్కూల్లోనుంచి తరిమేసినా తరిమేయవచ్చు లేదా మిమ్మల్ని పిచ్చాసుపత్రికి పంపినా పంపవచ్చు.
అనేక దేవాలయాలతో భారతదేశంలో ప్రజలు (దేవుడి) ఆరాధన పేరు మీద చేసేదంతా అబధ్ధమని నాకు తెలుసు. అనేకమంది దేవుళ్ళూ, దేవతలతో హిందూమతం నాకెప్పుడూ మింగుడుపడని విషయంగానే ఉండిపోయింది. నాకెప్పుడూ ఆశ్చర్యమే – వాళ్ళ దేవుళ్ళూ, దేవతల ఆకారాలూ, రూపాలూ వాళ్ళకు ఎలా తెలిసాయా అని. అమెరికా పరిస్థితి కూడా దాదాపు భారతదేశపు పరిస్థితికి సమానంగానే అనిపించింది. ఒకే ఒక్క భేదం ఏమిటంటే అక్కడ వీధి-వీధికీ గుళ్ళూ-గోపురాలూ ఉంటే, ఇక్కడ వీధి-వీధికీ చర్చీలున్నాయి. అమెరికాలో క్రైస్తవులు ఆచరించే క్రైస్తవమత విధానాలు కూడా నాకు చాలా అసమంజసంగా అనిపించేవి. ఆయన ఆకారం తమకు తెలుసన్నట్లుగా, ప్రజలు జీసస్ చిత్రాలను గీస్తారు. వాస్తవానికి ఆయన అసలు రూపం అలా ఉండకపోవచ్చును.
క్రైస్తవ మత విశ్వాసాలపై నాలో ఉద్భవించిన ప్రశ్నలన్నింటినీ నా భర్త ముందుంచాను. ఆయన వద్ద వాటిలో దేనికీ సమాధానం లేదు. వాటిని గురించి నా క్రైస్తవ మిత్రులను కూడా అడిగాను. వారు నాకు కొన్ని సమాధానాలిచ్చారు. కానీ వారి సమాధానాలు తర్కానికి దూరంగా, లోకఙ్ఞానానికి విరుధ్ధంగా ఉండడం వల్ల ఇక వాళ్ళను అడగడం మానేశాను. వారిచ్చిన జవాబులేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఇదీ వారిచ్చిన సమాధానం: “పరిపూర్ణమైన దేవుడి ముందు ఎటువంటి చెడు లేక పాపం నిలువలేదు. ఏదైనా తప్పు మన దృష్ఠిలో అణువంతే అనిపించవచ్చు. అయినా అణువంత తప్పును కూడా దేవుని పరిపూర్ణత సహించదు. చేసిన మంచికార్యాలన్నింటినీ దేవుని దగ్గర తుడిచిపెట్టడానికి ఒక్క పాపపు పని చాలు. ఉదాహరణకు ఆదం మరియు ఈవ్ లను చూడండి. వారు ఒకే ఒక దైవతిరస్కారపు పని చేశారు. అది కూడా చాలా చిన్నది. కానీ ఆ పని వారిలో పాపాన్ని అనుమతించి, వారిని ఈ ప్రపంచంలోకి నెట్టింది.
తాము చేసిన ఆ చిన్న పనికి పర్యవసానం మరణమేనని వారికి తెలుసు. కానీ ఆ పర్యవసానాల నుంచి విముక్తి పొందే మార్గం ఉన్నదని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ప్రవక్తలందరూ వ్రాసింది ఆ వాగ్దానాన్ని గురించే. బైబిల్ మొత్తం ఇదే వాగ్దానం గురించి మరియు దానిని పూర్తి చేయడం గురించే చర్చించబడింది. బైబిల్ లో మనకు దొరికే సందేశం ఏమిటంటే, జీసస్ ను శిలువ పైకి ఎక్కించిన యూదులు మాత్రమే దుష్ఠులు కారు, వారితో పాటు, డేవిడ్, లూత్ ఇంకా ఇతరులు కూడా. అంటే మీరూ, నేనూ కూడా. ఎంత చిన్న తప్పైనా సరే, మనల్ని మరణ శిక్షకు అర్హులుగా చేస్తుంది. ఆదం మరియు ఈవ్ తాము చేసిన తప్పును దిద్దుకోవడానికి ఏమీ చేయలేకపోయినట్లే, మనం కూడా మన పాపాల నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏమీ చేయలేము. కానీ దేవుడు ఏ వాగ్దానాన్నైతే ఆదం మరియు ఈవ్ లకు చేశాడో, అదే వాగ్దానాన్ని మనకు కూడా చేస్తున్నాడు. కేవలం దానిని స్వీకరించమని మాత్రమే ఆయన అడుగుతున్నాడు.”
తర్కానికి, లోకఙ్ఞానానికి అందని అటువంటి సిధ్ధాంతాన్ని ఎవరైనా ఎలా విశ్వసించగలరు? కానీ నా యొక్క ఆ మంచి క్రైస్తవ మితృలు పొల్లుపోకుండా విశ్వసిస్తున్నది అదే. వారి అభిప్రాయం ప్రకారం – ‘అన్ని రకాల దుష్ఠత్వం, అన్ని రకాల పాపం దేవుని దృష్ఠిలో సమానమే. అంటే ఒక చిన్న రొట్టె ముక్క దొంగిలించిన వానికీ, బయటకు పోయి పది మందిని హత్య చేసిన వానికీ వేసే శిక్ష ఒక్కటే.’ ఏం న్యాయమిది? ఇంకా నయం అమెరికాలో చట్టం అన్ని నేరాలకు మరణ శిక్ష విధించడంలేదు – అందుకు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి. ఈ భూలోకపు న్యాయం దేవుడి న్యాయం కంటే గొప్పది కాగలదా?
ఇంకా, ఆలోచించడానికి కూడా చెత్తగా అనిపించే విషయమేమిటంటే – చేసిన పాపం ఎంత చిన్నదైనా సరే మనమంతా మరణశిక్షకు అర్హులమవుతాము – కానీ దేవుడు మన పాపాల కోసం మరణించాడు అని విశ్వసిస్తే చాలు మనం రక్షించబడతాము. (పిచ్చిగా అనిపించడం లేదూ?)
మనం విశ్వసించినా, విశ్వసించక పోయినా అది మనల్ని మరణం నుండి కాపాడలేదు. కాపాడుతుందా?
మనం ఒకవేళ ఏదైనా పాపం చేస్తే దానిక్కారణం ఆదం మరియు ఈవ్ లు కాదు –మనం చేయాలని అనుకుని దానిని ఎంచుకోబట్టే దానిని చేస్తున్నాము లేదా మనలోని స్వేచ్ఛాస్వాతంత్ర్యాల దుష్ఠత్వం వలన మనం ఆ పాపం చేస్తున్నాము. మనం చేస్తున్న పనులకు (ఆచరణలకు) కేవలం మనం మాత్రమే బాధ్యులం. ఒకరి ఆచరణలకు మరొకరు ఎట్టిపరిస్థితిలోనూ బాధ్యులు కారు. ఆ విధంగా చేయడం న్యాయం కాదు. ఒకవేళ ఎవరైనా నా దగ్గరకు వచ్చి, నేను చేసిన పాపాల భారాన్ని తాను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నానని అంటే నేను దానిని ఎంత మాత్రమూ అంగీకరించను. ఎందుకంటే పాపం చేసింది నేను గనుక, దాని పర్యవసానాన్ని కూడా నేనే ఎదుర్కోవాలి. ఉద్దేశ్యపూర్వకంగా, తెలిసీ పాపాలు చేసి, నేరాలకు ఒడికట్టి, ఆ భారాన్నంతా ఒక అమాయకుడిపై మోపడం అర్థం-పర్ధం లేని పని. టామ్ చేసిన హత్యకు అతని బదులుగా డిక్ ను ఉరితీసే న్యాయ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకవేళ ఆవిధంగానే గనుక జరిగేట్లైతే – ఈ ప్రపంచం మొత్తం తలక్రిందులుగా మారి ఉండేది.
నేను గ్రంథాలయానికి వెళ్ళి నా ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అందులో భాగంగానే ఏక దైవారాధనను అనుసరించే ధర్మాలలో ఒకటైన ఇస్లాం యొక్క అధ్యయనం ప్రారంభించాను. నేను ఖుర్ఆన్ చదివాను. ఇక నాకు వేరే ఏదీ చూడవలసిన అవసరం కలుగలేదు. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించింది అందులో.
ఖుర్ ఆన్ యొక్క సందేశం చాలా స్పష్టంగా ఉన్నది.
- దేవుడు (అల్లాహ్) ఒక్కడే.
- ఆయన శాశ్వతమైన వాడు – మరణంలేని వాడు.
- ఆయనకు సంతానం లేదు మరియు ఆయన ఎవరి సంతానమూ కాడు.
- ఆయనను పోలినదేదీ లేదు.
- తీర్పుదినమున ప్రతి ఆత్మా తాను చేసిన కార్యాలకు లెక్క ఇవ్వవలసి (బాధ్యత వహించవలసి) ఉంటుంది.
- ఎవరూ తమ (స్వంత కర్మల) భారం తప్ప, ఇతరుల (కర్మల) భారం వహించరు.
- జీసస్ అల్లాహ్ యొక్క సందేశహరులలో ఒకరు.
- ఎవరైతే సత్యాన్ని విశ్వసించారో మరియు మంచికార్యాలు చేశారో, అటువంటి వారు స్వర్గంతో సత్కరింపబడతారు.
- ఎవరైతే విశ్వసించకుండా, సత్యాన్ని తిరస్కరించారో, అటువంటివారు నరకంలోకి విసిరివేయబడతారు.
- అల్లాహ్ తప్పవేరే ఆరాధుడు ఎవ్వరూ లేరు. ఆయనే సర్వలోకాల ప్రభువు, సృష్ఠికర్త, అన్నీ తెలిసినవాడూ, అన్నీ వినేవాడూ.
క్రైస్తవధర్మం గురించి నాలో ఉన్న ప్రశ్నలన్నింటికీ నాకు సమాధానం లభించింది. ఖుర్ ఆన్ నుండి నేను ఈ క్రింది విషయాలు నేర్చుకున్నాను.
- జీసస్ దేవుడు కాదు. దేవుని కుమారుడు కూడా కాదు.
- ఆయన శిలువ పై మరణించలేదు.
- ఆయన మన పాపాల కోసం మరణించలేదు.
- ‘ట్రినిటీ’ (త్రైత్వం) అనే భావనే లేదు.
- పైన తెలిపిన వాటికి వ్యతిరేకంగా విశ్వసించడం కేవలం దైవధూషణ మాత్రమే.
ఖుర్ఆన్ లో అర్థవంతం కాని ఒక్క వాక్యం కూడా కనపడదు. నిజానికి చావు-బ్రతుకుల కు సంబంధించిన ఇతర ప్రశ్నలకు కూడా ఖుర్ఆన్ లో నాకు సమాధానాలు లభించాయి. ఖుర్ఆన్ నిస్సందేహంగా దేవుని వాక్కు. అందులో ఎటువంటి అనుమానానికి తావులేదు. నేను ఖుర్ ఆన్ యొక్క మూలాన్ని గురించి పరిశోధించాను. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర చదివాను. అది నన్నేంతగా కదిలించిందీ అంటే, అది చదువుతూ నేను కన్నీళ్ళను ఆపుకోలేక పోయాను.
అంధవిశ్వాసాలకు ఇస్లాంలో ఎంతమాత్రమూ స్థానం లేదు. సత్యాన్ని చేరుకోవడానికి మనలోని ఆలోచనా శక్తిని, విశ్లేషణా శక్తిని, వివేచనా ఙ్ఞానాన్ని, ఉపయోగించమని అల్లాహ్ మాటిమాటికీ ఆదేశిస్తున్నాడు.
నేను సత్యాన్ని కనుగొన్నాను. ఇక నేను చేయాల్సిందల్లా – లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనలకు అర్హులు కారు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని మస్పూర్తిగా సాక్ష్యమిచ్చి ఇస్లాం ధర్మం స్వీకరించడమే.
నాకింక వేరే ఆలోచనే లేదు. నేను నా భర్తతో ఇస్లాం ను గిరించి మాట్లాడాను. దాదాపు ప్రతిరోజూ మేము వాదించుకునేవారము. నాభర్త బైబిల్ కు మరీ దగ్గరవుతూ – “నేను యేసుక్రీస్తును ఖండించలేను” అనేవారు. నా ఆలోచనల్లోని గాంభీర్యతను ఆయన అసలు గమనించలేదు. చివరికి “నీకిష్టమైన విషయాన్ని నువ్వు విశ్వసించు – నాకభ్యంతరం లేదు. నువ్వు ఇస్లాం స్వీకరించినా కూడా నాకు అభ్యంతరం లేదు” అన్నారు నాతో.
అయితే ఇక్కడొక సమస్య ఉంది. నేనుగానీ షహాదా వచనాలు (ఇస్లాం స్వీకరించడానికి తప్పనిసరిగా ఉఛ్ఛరించవలసిన సాక్ష్యపు ప్రకటన వచనాలు) ఉఛ్ఛరించి ఇస్లాం స్వీకరించినట్లైతే, నా భర్తతో నా వివాహం ఆటొమేటిగ్గా రద్దై పోతుంది. ఒక ముస్లిం మహిళ ముస్లిమేతరుడి, లేదా అవిశ్వాసి వివాహంలో ఉండటానికి వీలులేదు. ఇస్లాం ధర్మంలో భార్య తప్పనిసరిగా భర్తకు విధేయత చూపాలి. భర్తే ఇంటికి యజమాని మరియు నాయకుడు. మరి భర్త క్రైస్తవుడైతే, ముస్లిం భార్య అతనికి విధేయత ఎలా చూపగలదు? గృహవ్యవస్థలో స్వచ్ఛమైన, సత్యమైన ఇస్లాం ధర్మానికి రెండో స్థానమనేది సరైనది కాదు. ఏదైతే సత్యమో అది మాత్రమే పైచేయిగా ఉండాలిగానీ అసత్యం కాదుగదా!
నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇస్లాం ను స్వీకరించడమైనా జరగాలి, లేదా నా భర్తతో ఒక క్రిస్టియన్ గా దాంపత్య జీవితం కొనసాగించాలి. నా భర్త అంటే నాకు చాలా ప్రేమ. ఆయనతో కలిసి జీవించడానికి నేను నా దేశాన్ని వదిలివచ్చాను. నాకు ఈ మొత్తం ప్రపంచంలో ఆయన కంటే ప్రియమైనదేదీ లేదు. నిజమే! కానీ అసత్యంతో కలిసి నేనెలా జీవించాలి? ఇటువంటి పరిస్థితులలో ఇస్లాం ధర్మంలో కొనసాగడం చాలా కష్టమని నాకు తెలుసు. దైవానుగ్రహం వలన, అంతిమంగా సత్యధర్మానిదే పై చేయి అయినది. నేను నా భర్తను వదిలివేసేందుకు నిర్ణయించుకున్నాను.
‘ఆయనను విడిచి పెట్టవలసి వస్తున్నదే’ అనే ఆలోచన నా హృదయాన్ని ముక్కలు-ముక్కలు చేయటం మొదలైనది. ఆ ఆలోచనతో ఎడతెగ లేకుండా దు:ఖించాను. కానీ నా నిర్ణయంలో మాత్రం మార్పు రాలేదు. ఆయనను వదిలివేసిన తరువాత ఏం జరుగును – అనే విషయమై నాలో అసలు ఏ ఆలోచనా లేదు. అంతా అల్లాహ్ పైనే వదిలేసాను. ఇక - నేను ఏం చేయబోతున్నానో నా భర్తకు తెలియజేసాను. నా మాటలు విన్న తరువాత – మొట్టమొదటిసారి ఆయన నా ఆలోచనల్లోని తీవ్రతను, గాంభీర్యాన్ని గమనించారు. ఆయన ఇస్లాంను గురించి పరిశోధించడానికి ఒప్పుకున్నారు. ఈ కొత్త ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వమని అడిగారు.
ఆ సమయంలో నా భర్త మనసులో మెదిలిన మొట్టమొదటి ఆలోచన నన్ను వదులుకో కూడదని. బహుశ: నేను మతిచలించిన దానిలా అనిపించి ఉండవచ్చుఆయనకు. ఏదేమైనా, ఆయన ఇస్లాం ను గురించి చదవడం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుంచీ క్రిస్టియన్ గా పెరిగిన ఆయనకు ఇస్లాం బోధనలు కొత్తగా కనబడుతున్నాయి.
అక్టోబర్ 6, 2000 తేదీన నేను నా భర్త ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాము. అప్పటికింకా ఇస్లాంకు సంబంధించిన చాలా విషయాల అవగాహన నా భర్తకు లేదు. తన జీవితంలో ఏమి జరుగుతున్నదో ఆయనకు అర్థం కావడం లేదు. బహుశ: తన జీవితమంతా తల్లక్రిందులై పోయింది అని కూడా అనుకుంటున్నారేమో. ఆయన ఇస్లాం స్వీకరించింది కేవలం నన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనే. ఆయన అప్పుడప్పుడు ఖుర్ఆన్ చదివేవారు. కానీ బైబిల్ ను ఎక్కువగా చదివేవారు. నేను దానిని పట్టించుకో దల్చుకోలేదు. నా భర్తను వదులుకోవలసిన పరిస్థితి ఎదురవ లేదు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అల్లాహ్ నా భర్తకు తప్పకుండా సత్యమార్గం చూపుతాడనే దృఢవిశ్వాసం నాలో ఏర్పడినది.
అల్ హందులిల్లాహ్ (ఇవి అల్లాహ్ ను స్తుతించే పలుకులు – సకల స్తోత్రములు, కృతఙ్ఞలు అల్లాహ్ కే చెందును – అని వీటికి అర్థం) – నా భర్త ఉద్యోగం నౌకాదళం. విధి నిర్వహణలో భాగంగా ఆయన 6 నెలల పాటు సముద్రంపై గడప వలసి ఉంటుంది. ఆ విధంగా ఆయన 6 నెలల పాటు సముద్రం పైకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ 6 నెలల కాలంలో ఆయనకు ఖుర్ఆన్ ను ప్రశాంతంగా మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివే అవకాశం లభించింది. ఒకరోజు ఆయన నాకు e-mail చేసారు – ఖుర్ఆన్ పఠనం తప్ప తనకు వేరే పనేం లేదని – అసలు ఖుర్ఆన్ పఠనాన్ని తాను వదలలేక పోతున్నానని. చివరికి ఆయన అన్నారు – ఖుర్ఆన్ నిశ్చయంగా దేవుని వాక్కే.
తరువాత – ఆయనలో షహాదా (సాక్ష్యప్రకటన) మళ్ళీ ఉఛ్ఛరించి ఇస్లాంలోకి మళ్ళీ కొత్తగా ప్రవేశించాలనే కోరిక ఎంత బలంగా కలిగిందీ అంటే – ఆయన నౌక ఆస్ట్రేలియా చేరుతూనే దగ్గరలో ఉన్న మస్జిద్ కు వెళ్ళి అక్కడి సోదరులకు తన వృత్తాంతాన్ని తెలిపి, తాను మరల షహాదా (సాక్ష్యప్రకటన) పలకాలని నిర్ణయించు కున్నట్లు వారికి తెలియజేసారు. అయితే ఆ సోదరులు “మీరు ఇంతకు ముందు మీభార్యతో కలిసి సాక్ష్యప్రకటన పలికి ఉన్నందువల్ల మరల పలుక వలసిన అవసరం లేదు” అని తెలియజేసారు. అయితే అంతకు ముందు సాక్ష్యప్రకటన పలికినపుడు తనకు ఇస్లాం ధర్మం గురించి సరైన అవగాహన లేదని, కేవలం తన భార్య కోసమే దానిని పలికానని, ఇప్పుడు స్వయంగా తన ఇష్టప్రకారం షహాదా ప్రకటన పలకాలని నిర్ణయించుకున్నానని ఆయన వారికి వివరించారు.
ఆస్ట్రేలియాలోని ఆ మస్జిద్ లో తాను మళ్ళీ షహాదా ప్రకటన పలికానని ఆయన వ్రాసిన వాక్యాలు చదువుతున్నపుడు – నా కళ్ళు వర్షిస్తున్న ఆనందభాష్పాలను ఆపుకోలేక పోయాను.
బిలియన్లకొద్దీ ప్రజలున్న ఈ ప్రపంచంలో అల్లాహ్ మమ్మల్ని ఎన్నుకుని సత్యమార్గాన్ని చూపాడు. ఈ మహోపకారానికి గాను అల్లాహ్ కు ఎంతగా కృతఙ్ఞుతలు తెలుపుకున్నా తక్కువే. ఎవరికైనా ఇంతకంటె గౌరవప్రదమైన మహోన్నత విషయం ఇంకా ఏమైనా ఉంటుందా?
అల్-హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (సకల స్తోత్రాలూ సకల లోకాల ప్రభువైన అల్లహ్ కే చెందును.)
రాజస రాబిన్స్,
అమెరికా.
-:)****(:-