×
అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

    ఇస్లాంలో ప్రవక్తత్వం

    సర్వలోకాలను మరియు వాటిలోని ప్రతిదాన్నీ సృష్టించిన అల్లాహ్ మానవులను ఒక ఉత్తమ ఉద్దేశ్యంతో సృష్టించినాడు: అదేమిటంటే ‘కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయన యొక్క దివ్య బోధనలు మరియు మార్గదర్శకత్వాన్ని అనుసరించి సద్గుణాలతో కూడిన నైతిక జీవితం గడపాలి’. మరి, మానవులు ఆయన నుండి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందకుండా దీనిని పూర్తి చేయలేరు కదా! అంతేగాక, అత్యంత దయామయుడు మరియు న్యాయవంతుడైన అల్లాహ్ ఏ లక్ష్యం లేకుండా భూమిపై ఎలా పడితే అలా జీవించమని మనల్ని వదిలివేయలేదు. అందుకనే అల్లాహ్ మన జీవిత ఉద్దేశ్యాన్ని మనకు తెలిపేందుకు సమాజంలో నుండి కొందరు పుణ్యపురుషులను ఎంచకుని, వారిపై తన దైవవాణి అవతరింపజేసినాడు. దానిని స్వయంగా ఆచరించి మానవాళికి చూపమని వారిని ఆదేశించాడు. ఆ పుణ్యపురుషులనే ప్రవక్తలు అంటారు, వారిలో కొందరి పేర్లు – ఆదమ్, నూహ్, అబ్రహామ్, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

    ప్రవక్తల ప్రత్యేక లక్షణాలు

    ప్రవక్తలందరు కొన్ని కామన్ లక్షణాలు కలిగి ఉండేవారు. వాటి ద్వారా వారి కాలంలోని మానవులలో ప్రవక్తలు అసాధారణమైన వారిగా గుర్తించబడినారు.

    ప్రవక్తలు దివ్యవాణి అందుకునేవారు

    సామాన్య మానవుడికి మరియు ప్రవక్తకు మధ్య గల ముఖ్యమైన భేదం ఏమిటంటే ప్రవక్తపై అల్లాహ్ నుండి దివ్యసందేశం అవతరిస్తుంది.

    ప్రవక్తలు ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేవారు

    ప్రవక్తలు సంపద, హోదా, అధికారం మొదలైన వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఎంతమాత్రమూ ప్రయత్నించేవారు కాదు. కేవలం అల్లాహ్ ఆమోదం మరియు ప్రసన్నత పొందాలని మాత్రమే చూసేవారు.

    స్వభావం మరియు సద్గుణాలలో ప్రవక్తలను వారి ప్రజలు ఉత్తములుగా గుర్తించేవారు. వారు ఉత్తమ నైతిక ప్రవర్తన కలిగి ఉండి, ఎల్లప్పుడూ తమ పలుకులలో మరియు ఆచరణలలో సత్యవంతులుగా ఉండేవారు. అందువలన, ఇతర ధర్మాల కొన్ని ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నట్లుగా ప్రవక్తలు కూడా ఘోరపాపాలకు పాల్బడవచ్చనే అసత్య వాదనను ముస్లింలు పూర్తిగా తిరస్కరిస్తారు.

    ప్రవక్తలు కొన్ని మహిమలు మరియు అద్భుతాలు ప్రదర్శించారు

    అనేక మంది ప్రవక్తలు వారి ప్రజలు నైపుణ్యం పొందిన రంగంలోనే మహిమలు, అద్భుతాలు ప్రదర్శించారు. ఉదాహరణకు, ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం కాలపు ప్రజలు మ్యాజిక్ అంటే ఇంద్రజాలంలో ప్రసిద్ధి చెందారు. కాబట్టి, అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం ప్రదర్శించిన ఇంద్రజాల అద్భుతాలను ఆ తాంత్రికులు చేయలేక పోయారు. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం మెడిసిన్ లో తన ప్రజలందరినీ మించి పోయారు. తద్వారా, తన ప్రజలలోని సుప్రసిద్ధ వైద్యులు చికిత్స చేయలేని వ్యాధులను కూడా ఆయన అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతంగా నయం చేయగలిగినారు. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు అరబీ కవిత్వంలో ప్రసిద్ధి చెందినారు. కాబట్టి ఏ కవీ పోటి పడలేనంత అత్యుత్తమ సాహిత్యంతో ఆయనపై ఖుర్ఆన్ దివ్యగ్రంథం అవతరించింది. ఇంకా, అనేక మంది ప్రవక్తలు జరగబోయే సంఘటనల గురించి సత్యమైన భవిష్యవాణులు వినిపించారు. ఈ మహిమలు, అద్భుతాలన్నీ అల్లాహ్ అనుజ్ఞతో మాత్రమే జరిగాయి. తద్వారా వారు కూడా మానవులే గానీ వారికి దైవత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేదని నిరూపించబడింది.

    ప్రవక్తలు దేవుళ్ళు కాదు అంటే ప్రవక్తలకు దైవత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు.

    ప్రవక్తలను వారి ప్రజలలో నుండి స్వయంగా అల్లాహ్ ఎంచుకున్నాడు. వారిలో ఎలాంటి దైవత్వమూ లేదు. వారిలో ఆరాధింపబడటానికి కావలసిన అర్హతలు, యోగ్యతలు లేవు. ఇలా ప్రకటించమని అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించబడింది, “నేను కూడా మీవంటి మానవుడిని మాత్రమే. మీ ప్రభువు ఏకైకుడని నాకు దివ్యవాణి ద్వారా తెలుపడింది.” ఖుర్ఆన్ 18:110

    ప్రవక్తలు దేవుళ్ళు కారని, వారు కూడా ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ నే ఆరాధించేవారని మరియు అల్లాహ్ కే సాష్టాంగపడేవారని పాతనిబంధనలు మరియు కొత్తనిబంధనలు రెండింటి ద్వారా బైబిల్ లో స్పష్టంగా పేర్కొనబడింది.

    “మరియు ఆయన (జీసస్) కొంచెం ముందుకు పోయి, సాగిలపడి, ప్రార్థించెను …” మత్తయి సువార్త 26:39

    “అపుడు వారు (మోసె, అహరోహనులు) సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి” సంఖ్యాకాండము 16:22

    “అబ్రాము సాగిలబడియుండగా, దేవుడతనితో మాట్లాడి .... …” ఆదికాండము 17:3

    ప్రవక్తలు ఆవశ్యకమైన అర్హతలు కలిగి ఉండేవారు

    వారికి అప్పజెప్పబడిన మిషన్ ను విజయవంతంగా పూర్తిచేసేందుకు అల్లాహ్ ప్రవక్తలందరికీ నిలకడ, ధైర్యసాహసాలు, నాయకత్వం, సహనం మరియు వివేకం మొదలైన కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రసాదించాడు.

    కొన్ని ఉదాహరణలు :

    · కేవలం కొద్దిమంది మాత్రమే తన పిలుపు స్వీకరించినా, అధైర్యపడకుండా నిరంతరం తన ప్రజలను అల్లాహ్ వైపు పిలిచిన నూహ్ అలైహిస్సలాం యొక్క చలించని నిలకడతనం.

    · అసత్య విశ్వాసాల విషయంలో పిన్నవయసులోనే ఒంటరిగా తన మొత్తం సమాజాన్ని ఎదుర్కొన్న ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క గొప్ప ధైర్యసాహసాలు.

    · తన కాలపు అత్యంత దౌర్జన్యపరుడు, క్రూరుడైన ఫిరౌను చక్రవర్తి బారి నుండి ప్రజలను కాపాడిన మూసా అలైహిస్సలాం యొక్క సాటిలేని నాయకత్వం.

    · తన ప్రజలు పెట్టిన కష్టాలను మరియు హింసలను ఎంతో ఓర్పుతో సహించిన జీసస్ అలైహిస్సలాం యొక్క గొప్ప సహనశక్తి.

    · ఎల్లప్పుడూ పరస్పర యుద్ధాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండిన అరేబియా ద్వీపకల్పంలోని అనేక ప్రత్యర్థి తెగలను విజయవంతంగా ఒకే త్రాటిపై తీసుకు వచ్చి, ఒక ప్రశాంత సమాజాన్ని స్థాపించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప వివేకం.

    ప్రవక్తల సందేశం

    “వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము (ఆయన ఇలా ప్రకటించాడు): ‘మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల ఆరాధనను త్యజించండి.’ ఖుర్ఆన్ 16:36

    మొత్తం ప్రవక్తలందరినీ ఏకైక నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యే పంపడం వలన, వారందరూ ఒకే సందేశాన్ని అందజేసారు. ఇంకా, జీవిత ఉద్దేశ్యాన్ని తమ ప్రజలకు జ్ఞాపకం చేసే ఒకే మిషన్ కొరకు పనిచేసినారు.

    వారి ఆ దివ్యసందేశం మరియు మిషన్ ఏమిటంటే :

    · నిజమైన దైవభావన గురించి స్పష్టం చేయడం మరియు అసత్య విశ్వాసాలను తిరస్కరించడం.

    · నిజమైన జీవిత ఉద్దేశ్యాన్ని బోధించడం.

    · అల్లాహ్ ను ఎలా ఆరాధించాలో స్వయంగా ఆచరించి చూపడం.

    · ప్రజలకు సుద్గుణ మరియు దుర్గుణ అంటే మంచి - చెడు స్వభావం గురించి అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అందజేయడం మరియు దాని గురించి ప్రజలకు ఉత్తమ సలహాలు ఇవ్వడం.

    · అల్లాహ్ కు విధేయత చూపడం వలన లభించే మంచి ప్రతిఫలం (స్వర్గం) గురించి వివరించడం మరియు అల్లాహ్ కు అవిధేయత చూపడం వలన ఎదుర్కోబోయే కఠిన శిక్షల (నరకం) గురించి హెచ్చరించడం.

    · ఆత్మ, దైవదూతలు మరియు దయ్యాలు, పరలోక జీవితం మరియు విధివ్రాత మొదలైన విషయాలలోని అపార్థాలను దూరం చేయడం.

    “మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతి వారి భాషలోనే పంపాము. అతను వారికి స్పష్టంగా బోధించటానికి …”ఖుర్ఆన్ 14:4

    మొత్తం ప్రవక్తలందరు అసలు దైవభావన గురించి స్పష్టం చేయడంపైనే ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించేవారు: ఎవ్వరూ ఆయనకు సాటి లేరు, భాగస్వాములు లేరు, సమానులు లేరు. అరాధనలన్నీ కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయి. ప్రవక్తలు ఈ సందేశాన్ని అందజేసారనే ఉపమానాలు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి:

    ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు,

    “ఓ నా ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి! ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు.” [ఖుర్ఆన్ 7:59]

    ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు,

    “మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం గానీ నష్టం గానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?” [ఖుర్ఆన్ 21:66]

    ప్రవక్త మూసా అలైహిస్సలాం ఇలా పిలిచారు,

    “ఏమీ! నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా ? వాస్తవానికి ఆయనే సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు” [ఖుర్ఆన్ 7:140]

    ప్రవక్త జీసస్ అలైహిస్సలాం ఇలా పిలిచారు,

    “నిశ్చయంగా అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావును మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం.” [ఖుర్ఆన్ 3:51]

    అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు,

    “నిశ్చయంగా మీ ఆరాధ్యుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే నని నాపై దివ్యవాణి అవతరింపజేయబడింది. కాబట్టి తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా కల్పించుకోరాదు.” [ఖుర్ఆన్ 18:110]

    ఇదే సందేశం తరతరాలుగా ఇవ్వబడింది. మరియు సృష్టికర్త పై సరైన దైవవిశ్వాసం కలిగి ఉండవలసిన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పబడింది.

    అల్లాహ్ ప్రతి జాతి కొరకు ఒక ప్రవక్తను పంపినాడు

    “మరియు ప్రతి సమాజానికి ఒక ప్రవక్త (పంపబడ్డాడు).”ఖుర్ఆన్ 10:47

    అల్లాహ్ మానవజాతిపై దయజూపుతూ వారి మార్గదర్శకత్వం కోసం నియమిత కాలములలో వేల కొలది ప్రవక్తలను, అంటే ప్రతి జాతి కొరకు కనీసం ఒక ప్రవక్తను పంపినాడని ముస్లింలు నమ్ముతారు. కాలక్రమంలో ప్రజలు ప్రవక్తల సందేశాన్ని పోగొట్టుకున్నారు, కలుషితం చేసినారు, మర్చిపోయారు, నిర్లక్ష్యం చేసారు, తిరస్కరించారు. ఇలాంటి కొన్ని కారణాల వలన అల్లాహ్ యొక్క సందేశాన్ని మరలా అందజేయడానికి మరో కొత్త ప్రవక్తను పంపవలసి వచ్చేది.

    అల్లాహ్ పంపిన ప్రతి ప్రవక్తను ముస్లింలు విశ్వసిస్తారు మరియు గౌరవిస్తారు. అలాగే, ప్రవక్తలపై అవతరింపజేయబడిన అసలు దివ్యగ్రంథాలన్నింటినీ ముస్లింలు విశ్వసిస్తారు. కానీ, నేడు ఖుర్ఆన్ తప్ప, ఈ దివ్యగ్రంథాలేవీ వాటి అసలు అవతరించిన రూపంలో మార్పులు చేర్పులు లేకుండా స్వచ్ఛంగా మిగిలి లేవు.

    “ఆయన సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని నీపై అవతరింపజేసాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలోని (మిగిలి ఉన్న) సత్యాన్ని ధృవీకరిస్తుంది. మరియు ఆయనే తౌరాత్ మరియు ఇంజీలును అవతరింపజేసాడు.” ఖుర్ఆన్ 3:3

    ఎందుకు మనలోని ప్రతి ఒక్కరూ తిన్నగా సృష్టికర్త నుండి దివ్యవాణి అందుకోలేరు?

    అల్లాహ్ మనల్ని సృష్టించాడు. మనస్ఫూర్తిగా ఆయన చూపిన సన్మార్గాన్ని ఎవరు అనుసరిస్తారో మరియు ఎవరు తిరస్కరిస్తారో పరీక్షించేందుకు మానవులకు తగినంత స్వేచ్ఛను మరియు వివేకాన్ని ప్రసాదించాడు. ఒకవేళ ప్రతి ఒక్కరూ తిన్నగా దివ్యసందేశం అందుకుంటే, జీవితం ఒక నిజమైన విశ్వాస పరీక్షగా మారదు. ఒకరి విశ్వాసం యొక్క నిజమైన పరీక్ష ఏమిటంటే, తమ వివేకాన్ని మరియు హేతువాదాన్ని (లాజిక్) ఉపయోగించి, అల్లాహ్ యొక్క చిహ్నాల గురించి ఆలోచించడం మరియు వాటిని గుర్తించడం. అంతేగానీ తిన్నగా అల్లాహ్ తో మాట్లాడటం కాదు. అలా అల్లాహ్ తో మాట్లాడి, విశ్వసించడంలో ఎలాంటి శ్రమ ఉండదు మరియు అది దైవవిశ్వాసాన్ని అర్థం పర్థం లేకుండా చేస్తుంది.

    ప్రవక్తలు తిన్నగా అల్లాహ్ నుండే దివ్యసందేశాన్ని అందుకున్నా, ప్రాపంచిక జీవిత పరీక్షల నుండి వారికి మినహాయింపు లభించలేదు. ఎందుకంటే ప్రవక్తత్వం తనతో పాటు ఎన్నో కష్టాలను మరియు తీవ్ర విమర్శలను తెచ్చి, వారి జీవితాల్ని కఠిన పరీక్షలకు గురి చేసింది.

    అంతిమ ప్రవక్త

    నిర్ణీత సమాజాల కొరకు ప్రవక్తలు పంపబడినారు. ప్రజలు కాలక్రమంలో ఆ ప్రవక్తలు అందజేసిన దివ్యసందేశాన్ని పోగొట్టుకున్నారు లేదా కలుషితం చేసివేసారు. కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణీత సమాజాల కోసం పంపబడలేదు. ఆయన మొత్తం మానవజాతి కోసం పంపబడినారు. ఆయన అందజేసిన దివ్యసందేశం ఖుర్ఆన్ మరియు సున్నతుల రూపంలో పదిలంగా భద్రం పరచబడింది మరియు సులభంగా అందరికీ అందుబాటులో ఉన్నది. అందువలన మరో ప్రవక్త పంపబడవలసిన అవసరం లేదు.

    · ఖుర్ఆన్ అంటే అల్లాహ్ వాక్కు. ఎలాంటి మార్పులు చేర్పులకు, లోపాలకు, పరస్పర వైరుధ్యాలకు అతీతంగా ఉన్నది. అది “మానవుల కొరకు మార్గదర్శకత్వం వహించే … (తప్పు ఒప్పులను) వేరు చేసే” దివ్యగ్రంథం. ఖుర్ఆన్ 2:185

    · సున్నతులు అంటే ఆయన సహచరులు మరియు వారి శిష్యులు ప్రామాణికంగా నమోదు చేసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు మరియు ఆచరణలు. ప్రామాణికంగా నమోదు చేయబడిన ఈ వేల కొలది సున్నతుల వలన ప్రతి ఒక్కరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సరిగ్గా అనుసరించడం సులభమైంది.

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన దివ్యసందేశం పూర్వ ప్రవక్తల దివ్యసందేశాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నది మరియు వాటిని పునః ధృవీకరిస్తున్నది.

    వర్తమాన మరియు భవిష్య తరాలతో సహా ఆయన కాలం నుండి చిట్టచివరి దినం వరకు మొత్తం మానవాళి కొరకు పంపబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిజాయితీ, న్యాయం, కరుణ, దయ, సత్యత మరియు ధైర్యసాహసాలకు ఆయన సాటిలేని పరిపూర్ణ ఉపమానం. పూర్వ ప్రవక్తల వలే, ఆయనలో కూడా ఎలాంటి చెడు స్వభావం లేదు మరియు కేవలం అల్లాహ్ కోసమే ఆయన చిత్తశుద్ధితో శ్రమించినారు.

    చివరి మాట

    “వాస్తవానికి అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది. వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమదినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో.” ఖుర్ఆన్ 33:21

    అల్లాహ్ యొక్క దివ్యసందేశాన్ని ప్రజలకు అందజేసేందుకు మరియు వారెలా సన్మార్గంపై జీవించాలో బోధించేందుకు తన కారుణ్యానికి ఒక మచ్చుతునకగా అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు. ప్రవక్తలు వారి ప్రజలలో ఉత్తమ గుణగణాలు కలిగి ఉండేవారు. ప్రజలు వారిని అనుసరించేవారు మరియు వారికి విధేయత చూపేవారు. ప్రవక్తను అనుసరించడం అంటే అల్లాహ్ కు విధేయత చూపినట్లే. అలాగే తిరస్కరించడమంటే అల్లాహ్ కు అవిధేయత చూపినట్లవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త మరియు సందేశహరుడు. ఆయనను పంపడంతో అల్లాహ్ మార్గదర్శకత్వం పరిపూర్ణమై పోయింది, అల్లాహ్ కు మరియు ఆయన అంతిమ ప్రవక్తకు విధేయత చూపడం ద్వారా నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది.