×
లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను. ఒకవేళ ఈ పనిలో విజయం సాధించనట్లయితే, అతడి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి.

    బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

    లైలతుల్ ఖదర్ (1000 నెలల కంటే ఎక్కువ దివ్యమైన రాత్రి) ను ఎలా అన్వేషించాలి?

    లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను. ఒకవేళ ఈ పనిలో విజయం సాధించనట్లయితే, అతడి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి.

    (ఈ వ్యాసం - అల్ బాని రహమహుల్లా మరియు ఇతర ఇస్లామీయ పండితుల యొక్క “రాత్రి ప్రార్థనలు - ఖయామ్ మరియు తరావి” నుండి తీసుకొనబడినది, దీనిని ముహమ్మద్ అల్ జిబాలి సంకలనం చేశారు)

    ఖియామ్ ప్రార్థన (సుదీర్ఘమైన నమాజు)

    లైలతుల్ ఖదర్ రాత్రి కాగల అవకాశమున్న రాత్రులలో సుదీర్ఘమైన ప్రార్దన (నమాజు) చేయమని అనేక హదీథ్ లలో సిఫారసు చేయబడినది.

    ఉదాహరణ - అబుధర్ (రదిఅల్లాహు అన్హు) ఇలే ఉల్లేఖించారు - “మేము దైవప్రవక్త (శల్లల్లాహుఅలైహి వసల్లం) తో రమదాన్ నెలలో ఉపవాసాలు ఉన్నాము, వారు చివరి ఏడు రాత్రుల వరకు ఏనాడూ మాతో ఖియామ్ (నమాజు) చేయించలేదు. చివరి ఏడో రాత్రి (23వ రాత్రి), మూడవ ఝాము గడిచే వరకు మాతో (నమాజులో) నిలుచున్నారు (ఖియామ్ చేశారు). చివరి ఆరవ రాత్రి (24వ రాత్రి) ఖియామ్ చేయలేదు. చివరి అయిదవ రాత్రి (25వ రాత్రి), సగం వరకు మాతో కలసి నమాజు చేశారు. అప్పుడు మేము ‘ఓ ప్రవక్తా! మీరు మాతో కలిసి రాత్రాంతా ఖిమాయ్ (నమాజు) చేయరా?’ అని ప్రశ్నించాము. సమాధానంగా ఆయన ఇలా తెలిపారు - ‘ఎవరైతే ఇమాం నమాజు ముగించేవరకు, అతడితో నమాజులో నిలబడతారో, ఆ వ్యక్తి పూర్తి రాత్రి నమాజు చేసినట్లుగా రికార్డు చేయబడును’ ” (ఇబ్నె అబి షైబా - అబుదావూద్, అత్తిర్మిథి, అన్ నిసాయి,ఇబ్నెమాజ, అత్తహావీ (షర్హు మానిల్ అథర్ గ్రంథంలో), ఇబ్నె నశర్, అల్ ఫరైబీ మరియు అల్ బైహ్ ఖీ. వారి హదీథ్ పరంపర (ఇస్నద్) ప్రామాణికమైనది.

    ఒక లాభదాయకమైన విషయం - అబుదావూద్ ఇలా తెలిపారు - “అహ్మద్ ఇలా ప్రశ్నింపబడటం నేను విన్నాను - ‘రమదాన్ నెలలో ఎవరైనా వ్యక్తి ప్రజలతో కలిసి నమాజు చేయటాన్ని మీరు ఇష్టపడతారా లేక ఒంటరిగా నమాజు చేయటాన్నా?’ ఆయన ‘ప్రజలతో కలిసి నమాజు చదవటాన్ని’ అని జవాబిచ్చారు. ఇంకా వారిలా చెప్పటం నేను విన్నాను - “ఎవరైనా సరే ఏకాంతంలొ కంటే ఇమాంతో కలిసి నమాజు (ఖియాం) చేయటాన్ని మరియు ఇమాంతో పాటు విత్ర్ నమాజు కూడా పూర్తి చేయటం శ్రేష్ఠమైనదిగా నేను భావిస్తాను. ఎందుకంటే దైవప్రవక్త (శల్లల్లాహుఅలైహి వసల్లం) ఇలా ప్రకటించారు ‘ఎవరైతే ఇమాం నమాజు ముగించే వరకు, ఇమాం వెనుకే నమాజు చేస్తారో, ఆవ్యక్తి మిగిలిన రాత్రంతా కూడా నమాజు చేసినట్లుగా నమోదు చేయబడుతుంది’” (మసాయిల్)

    హజ్రత్ అబు హూరైరా రదిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇంకో హదీథ్ ప్రకారం దైవప్రవక్త (శల్లల్లాహుఅలైహి వ సల్లం) ఇలా ప్రకటించారు - ‘ఎవరైతే లైలతుల్ ఖదర్ (మరియు అతడికి ఆ ఘనమైన రాత్రి గురించి సూచన లివ్వబడును) లో విశ్వాసంతో మరియు (అల్లాహ్ పుణ్యాలు ప్రసాదిస్తాడనే) ఆశతో నమాజులో నిలబడతారో (ఖియాం చేస్తారో) అటువంటివారి గడిచిన జీవితం లోని పాపాలన్నీ క్షమించి వేయబడును’ (బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)

    (మరియు అతడికి ఆ ఘనమైన రాత్రి గురించి సూచనలివ్వబడతాయి)’ అనేది ఉబైదా బిన్ అస్శమిత్ వాంగ్మూలం ఆధారంగా అహ్మద్ నమోదు చేశారు - అంటే ‘అతడికి చిత్తశుద్ధి గల ఇతర ఆరాధకులలో ఒకడిగా చేరి, ఆ దివ్యమైన రాత్రి ఆరాధనలు చేసే అవకాశం ఇవ్వబడుతుంది’ అని అర్థం)

    ప్రార్థనలు (దువాలు) చేయటం

    ఆ రాత్రి వీలయినంత ఎక్కువగా ప్రార్థనలు చేయటం మంచిది. ఒక హదీథ్ ఉల్లేఖన ప్రకారం ఆయిషా రదిఅల్లాహు అన్హా ఒకసారి దైవప్రవక్తను ఇలా ప్రశ్నించారు - ‘ఓ దైవ ప్రవక్తా! ఒక వేళ నాకు లైలతుల్ ఖదర్ రాత్రి గురించి (ముందుగా) తెలిసి పోయినట్లయితే, ఆ రాత్రి నేను ఏమని ప్రార్థించాలి?’ సమాధానంగా ఇలా దువా చేయమని వారు ఆదేశించారు - ‘అల్లాహూమ్మ ఇన్నక అఫువ్వున్ ,తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని (ఓఅల్లాహ్!నీవే నిశ్చయంగా క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడేవాడివి కావున నన్ను క్షమించు).’ (అహ్మద్, ఇబ్నేమాజా, మరియు అత్తిర్మిథి - అల్ బానీ దీనిని ప్రామాణికమైనదిగా దృఢపరిచారు).

    :

    ఆరాధనలకై జీవితంలోని సుఖాలను త్యజించుట

    ‘ఈ రాత్రి లైలతుల్ ఖదర్ రాత్రి కావచ్చు’ అని భావించిన రాత్రుళ్ళలో వీలయినంత ఎక్కువ సేపు ప్రార్థనలలో గడపటం ఉత్తమం. దీనికి అవసరమైన సమయాన్ని కేటాయించటం కోసం మరియు పూర్తి ఏకాగ్రతతో అల్లాహ్ ను ఆరాధించటానికి గాను మాటిమాటికి వచ్చే అనవసరపు ఆలోచనలను నియంత్రించటం కోసం, అనేక ప్రాపంచిక సుఖాలను త్యాగం చేయవలసిన ఉంటుంది. ఆయిషా(రదిఅల్లాహుఅన్హా) ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించారు - ‘రమదాన్ చివరి దశకం మొదలవగానే అంతిమ దైవప్రవక్త (శల్లల్లాహుఅలైహివసల్లం) దైవారాధనకోసం నడుం బిగించేవారు (అంటే ఆరాధనలకు ఎక్కువ సమయం వెచ్చించటం కోసం, తన భార్యలకు కూడా దూరంగా ఉండేవారు), రాత్రిళ్ళు పూర్తిగా (దైవారాధనలలో) జాగారం చేసేవారు మరియు తన కుటుంబాన్ని కూడా మేల్కొలిపేవారు.’ (బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు).

    ఇంకో హదీథ్ లో ఆమె ఇలా ఉల్లేఖించారు - ‘దైవప్రవక్త (శల్లల్లాహు అలైహివసల్లం) చివరి పది రోజులను మిగిలిన రాత్రుల కంటే ఎక్కువగా (దైవారాధన కోసం) వినియోగించేవారు.’ (ముస్లిమ్ హదీథ్ గ్రంథం)

    అనువాదం

    ఉమ్మె అహ్మద్ రియాజ్.

    telugu@islamhouse.com