తండ్రి విగ్రహాలను పగలగొట్టిన తనయుడు
కూర్పులు
Full Description
తండ్రి విగ్రహాలను పగలగొట్టిన తనయుడు
ఇది అబ్దుర్రవూఫ్ షాకిర్ అనే సోదరుడు one minute message అనే విభాగంలో వ్రాసిన వ్యాసపు అనువాదం.
ఇది ఒక యువకుడి నిజమైన వృత్తాంతము. అతడి తండ్ర్రి విగ్రహాలను తయారుచేసేవాడు. ప్రజలలో అవి ఎంతో ప్రసిద్ధి చెందినవి. పూర్వీకులు అనుసరించిన ధర్మంగా భావించి ప్రజలలో చాలా మంది వాటినే ఆరాధించేవారు. కాని ఈ యువకుడు వారికి భిన్నంగా ఆలోచించేవాడు. అతడు తన తోటి ప్రజలతో వారి ప్రాచీన సంప్రదాయాన్ని గురించి ఇలా వాదించడం ఆరంభించాడు - వారు ఆ విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారు? ఆ విగ్రహాలు వారికి ఎలాంటి లాభాన్నైనా చేకూరుస్తాయా? ఒకవేళ తమ పై దాడి జరిగితే, ఆ విగ్రహాలు కనీసం తమను తాము స్వయంగా రక్షించుకోగలుగుతాయా? వీటన్నింటికంటే ముఖ్యంగా భూమ్యాకాశాల సృష్టికర్త అయిన అల్లాహ్ యే మానవ జాతిని కూడా సృష్టించాడనేది నిజం కాదా? మరియు మానవులే విగ్రహాలను తయారు చేస్తున్నారనేది నిజం కాదా? ఇంకా దీన్ని అనుసరిస్తూ ఇంకా ముందుకు పోతే మొత్తం విగ్రహాలన్నింటి కంటే సర్వలోక సృష్టికర్త అల్లాహ్ మహోన్నతుడనే విషయం తెలుస్తుంది. అంతే కాకుండా, ప్రజలు తమకు ఇష్టమైన విగ్రహానికి దూరంగా సముద్రపు తుఫానులో చిక్కుకున్నప్పుడు ప్రజలు ఏ విగ్రహాన్ని సహాయం కోసం పిలిచే వారు? వారు తమకు కనిపించని మరియు ప్రతి ఒక్కరి పిలుపును తప్పక వినగలిగే శక్తిసామర్ధ్యాలు గల ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ నే సహాయం కోసం అర్థించేవారు కారా? గొప్ప వివేకమున్న ఆ యువకుడి ప్రశ్నలకు ప్రజలు సమాధానం ఇవ్వలేక, ఉక్రోషంతో అతడిని అసహ్యించుకునే వారు.
కుమారుడి ఈ వాదనలు విని తండ్రి కూడా అతడి పై కోపగించుకునేవాడు. ఇక అతడికి మిగిలిన ఒకే ఒక దారి - మాటలను అర్థం చేసుకోలేని వారికి చేతలతో చూపించటం. ఏదైనా విషయాన్ని వేయి మాటల వివరణ కంటే ఒక స్పష్టమైన దృశ్యం తేలికగా గ్రహింపజేస్తుంది. ఇక మాటలతో కాక, వారికి అర్థమయ్యేటట్లు నాటకీయంగా అల్లాహ్ ఏకత్వ సందేశాన్ని అందజేయాలనుకున్నాడు. ఒక రోజు ప్రజలందరూ కలసి ఊరి బయట జాతరకు వెళ్ళగా, తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అతడికి మంచి అవకాశం దొరికినది. ప్రజలు తిరిగి రాగానే కలలో కూడా ఊహించని భయంకర దృశ్యం వాళ్ళకు కనబడినది. ఒక పెద్ద విగ్రహం తప్ప మిగిలినవన్నీ పగిలిపోయి ఉన్నాయి. ‘విగ్రహాల మధ్య భీకర యుద్ధం జరిగిందేమో!’ అనే ఆలోచనలు కలిగించేటట్లుగా ఉన్నది అక్కడి చిందర వందర వాతావరణం. కాని ఆ పెద్ద విగ్రహం మాత్రం చేతిలో గొడ్డలితో యుద్ధమైదానంలో విజయం పొందిన సైనికుడిలాగా చెల్లాచెదురుగా, అధ్వాన్నంగా పడి ఉన్న ఆ విగ్రహాల మధ్య గాంభీర్యంగా నిలుచుని ఉన్నది. ఇదంతా ఎలా జరిగినదో వారికి అర్థం కాలేదు.
వారి మొదటి అనుమానం ఆ యువకుడి పై కే పోయినది. కాని ఆ యువకుడు ఈ క్రింది సలహా ద్వారా వారి ప్రశ్నలకు జవాబిచ్చాడు - “ఇదంతా ఎవరు చేసారు? అని ఆ పెద్ద విగ్రహాన్నే ఎందుకు అడగకూడదు? ప్రత్యక్షసాక్ష్యంగా విధ్వంసానికి వాడిన ఆయుధం కూడా దాని దగ్గరే ఉంది కదా!” వెంటనే వారు “నువ్వు చేప్పింది తెలివి తక్కువగా ఉన్నది” అని ఆక్షేపించారు. కాని లోలోపల ఆ యువకుడి మాటలు సూటీగా వారి అంతరాత్మలకు తగిలాయి. కదలలేని, మెదలలేని, తమను తామే రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ విగ్రహాల పై ఆధారపడటం, తమను కాపాడమని వేడుకోవటం ఎంతటి అవివేకమో, ఎంతటి అంధవిశ్వాసమో గ్రహించటం మొదలు పెట్టారు. ఇలా దివ్యసందేశం వారికి అందటం మొదలైనది. “మనం విగ్రహాన్ని ఎలా ప్రశ్నించగలం? మరియు స్వయంగా కదలలేని ఆ పెద్ద విగ్రహం, ఇతర విగ్రహాలను ఎలా ధ్వసం చేయగలదు?” అని పలికారు. వెంటనే ఆ యువకుడు వారిని మందలిస్తూ, అసలైన విషయాన్ని ఇలా ప్రశ్నించాడు “మరి మీకెలాంటి లాభనష్టాలు కలిగించలేని, నిర్జీవులైన ఈ మిధ్యాదైవలను (విగ్రహాలను) ఎందుకు పూజిస్తున్నారు?” సర్వలోక సృష్టకర్త, సర్వ శక్తిసామర్ధ్యుడు అయిన అల్లాహ్ ను వదిలి, అణువంత సహాయం కూడా చేయలేని ఈ విగ్రహాలను ఆరాధించటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనే అసలైన దివ్యసందేశాన్ని నాటకీయంగా వారికీ ఈ విధంగా స్పష్ట పరచబడినది. ఆయువకుడి పేరే అబ్రహాం (ఇబ్రాహీమ్ అలైహిస్సలాం). అతడే పెద్దవాడైన తర్వాత “భూమ్యాకాశాలను సృష్టించిన, కనిపించని, సత్యమైన ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ ను తప్ప ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు” అనే దివ్యసందేశాన్ని ప్రజలకు అందజేయటానికి పంపబడిన దైవప్రవక్త. అబ్రహం (ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం) గురించి మరింత వివరంగా మీరు దివ్యఖుర్ఆన్ లో చదవుకోగలరు. దివ్యఖుర్ఆన్ అబ్రహం (ఇబ్రాహీమ్ అలైహిస్సలాం) సంతతిలోని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన చిట్టచివరి దివ్యగ్రంధం.
అల్లాహ్ తన శాంతి మరియు దీవెనలను ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం లపై కురిపించుగాక.
తెలుగు అనువాదం
ఉమ్మె అహ్మద్ రియాజ్
www.islamhouse.com
దివ్యఖుర్ఆన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్
మూలాధారం - The Boy who Broke His Father's Idols! http://www.islamhouse.com/p/6015