×
రమదాన్ నెల ఉపవాసం గురించిన సందేహాలు మరియు సమాధానాలు

    ఉపవాసం గురించిన సందేహాలు మరియు సమాధానాలు

    مـســأل و أحـكام في الصـيـام – اللـغـة الـتـلـغـو

    1. రమదాన్ మాసపు నెలవంక కనబడటం గాని లేదా షఅఁబాన్ నెల యొక్క మొత్తం 30 రోజులు పూర్తవటం గాని - ఈ రెండింటిలో ఏ ఒక్క సంఘటన జరిగినా సరే, అది మనం పవిత్ర రమదాన్ నెలలో ప్రవేశించామనే విషయాన్ని దృఢపరుస్తుంది. (ఫతావా ఫీ అహ్కామ్ అశ్శియామ్ 36వ పేజీ, షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)

    2. రమదాన్ మాసం ప్రారంభంలో (ఆ నెల మొత్తం ఉపవాసం ఉండటం కోసం) ఒకేసారి నిశ్చయం (నియ్యత్) చేసుకుంటే సరిపోతుంది. కాని, ప్రయాణం లేదా అనారోగ్యం కారణంగా ఒకవేళ ఉపవాసాలను పూర్తిగా కొనసాగించక మధ్యలో ఆపినట్లయితే, వారి (రమదాన్ నెల ప్రారంభంలో చేసుకున్న) నిశ్చయం భంగమై పోతుంది (అంతమైపోతుంది). కాబట్టి ఆ సమస్య పూర్తయిన తర్వాత మరల ఉపవాసాలు ఉండేటప్పుడు, మరోసారి క్రొత్తగా సంకల్పం (నియ్యత్) చేయడం తప్పని సరి. (ఫతావా అర్కాన్ అల్ ఇస్లాం - 466వ పేజీ - షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)

    3. ఎవరైనా ముసలితనం వలన ఉపవాసం ఉండలేకపోతున్నవారు లేదా కోలుకోవటానికి అవకాశం లేని దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నవారు తగిన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నట్లయితే తమ ప్రతి దినపు ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి భోజనం పెట్టవలెను. (మజ్ముఅ ఫతావా - సం-5, 233 వ పేజీ - ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్)

    4. నమాజు చేయకపోవటం వలన ఉపవాసం అసంపూర్తి అవుతుంది. ఇంకా వారి ఆచరణలు కూడా స్వీకరించబడవు. ఎందుకంటే నమాజు వదిలిన వాడు ఇస్లాం ధర్మానికి దూరమై (ముర్తద్)పోతాడనే విషయాన్ని ఖుర్ఆన్ అత్తౌబా-9:11లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

    فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآَتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ وَنُفَصِّلُ الآَيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ (11)

    “ఫఇన్ తాబూ, వ అఖాముస్స్ లాత, వఅతావుజ్జకాత, ఫఇఖ్వానుకుం ఫిద్దీన్.”- “కావున వారు పశ్ఛాత్తాప పడి, నమాజు స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు”.

    ఇంకా ప్రవక్త శల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “బైన అర్రజులి వ బైన అష్ షిర్కి వల్ కుఫ్రి తర్కుశ్శలాత్” - “నమాజ్ చేయకపోవడమే ముస్లిం, షిర్క్ మరియు కుఫ్ర్ ల మధ్య ఉన్న భేదం. (ముస్లిం అంటే ఏకైక సృష్టికర్తకు సమర్పించుకున్నవాడు, షిర్క్ అంటే బహుదైవారాధన మరియు కుఫ్ర్ సృష్టికర్తను తిరస్కరించటం) ముస్లిం హదీథ్ గ్రంథం, ఫతావా ఫీ అహ్కామ్ అశ్శియామ్-87వ పేజీ- షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)

    5. ఒక వేళ అక్కడి ముఅజ్జిన్ (నమాజు వైపునకు పిలిచేవాడు) ఫజర్ సమయం ఆరంభమైన కొంత సేపటి తర్వాతనే అజాన్ (నమాజు కోసం పిలుపు) ఇచ్చేవాడని తెలిస్తే, అతడి అజాన్ పలుకులు మొదలు కాగానే భోజనం తినటం, త్రాగటం, మరియు ఉపవాసాన్ని భగ్నం చేసే ఇతర పనులన్నింటినీ వెంటనే ఆపివేయాలి. కాని అజాన్ సమయాన్ని కేవలం అనుమానం (గుమాన్), ఉజ్జాయింపు (అందాజా), నమాజు వేళల పట్టిక(జంత్రీ) ఆధారంగా నిర్ణయిస్తున్నట్లయితే అజాన్ సమయంలో తినటం, త్రాగటం తప్పు కాదు. (మజ్ముఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 259 వ పేజీ).

    6. ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ అభిప్రాయం ప్రకారం ఉపవాసం ఉన్నవారు నోటిలో ఊరే లాలాజలాన్ని మింగడంలో తప్పులేదు. నా జ్ఞానం ప్రకారం మరియు ఇతర పండితుల జ్ఞానం ప్రకారం కూడా ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని ఒకవేళ చిక్కగా (పసుపు రంగులో) ఉండే ఉమ్ము (తెమ్డా) మరియు బల్గం నోటిలో వచ్చినట్లయితే వెంటనే బయటకు ఉమ్మేయడం అత్యవసరం. ఉపవాసకులకు దీన్ని మింగడానికి అనుమతివ్వబడలేదు. ఎందుకంటే దీనిని ఉమ్మేయడం తేలికగా సాధ్యమయ్యే పని. (వివరణ - నోటిలో మాటిమాటికి ఉరే లాలాజలాన్ని ఉమ్మేయడం కష్టమైన పని అందుకని అటువంటి చిన్న మోతాదులో ఉండే లాలాజలాన్ని మింగేయడానికి అనుమతివ్వబడినది మరియు పెద్దగా ఉమ్ము నోటిలో చేరినా లేక బల్గం నోటిలోకి వచ్చినా దానిని ఉమ్మేయడం అంత కష్టమైన పని కాదు, మరియు మాటిమాటికి రాదు కూడా - అందుకని దీన్ని మింగటానికి అనుమతివ్వబడలేదు, కాబట్టి దీనిని వెంటనే ఉమ్మేయ వలెను) (మజ్మూఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 251 వ పేజీ)

    7. ఉపవాసకుల గాయాల నుండి రక్తం కారటం లేక కొన్ని సందర్భాలలో రక్తం స్వయంగా (పంటిలో నుండి, ముక్కులో నుండి...) బయటికి రావడం వలన (అంటే తక్సీర్, ఇస్తేహాఙ అనేది లేక వేరే ఏదైన రక్తం) ఉపవాసం భగ్నం (ఫాసిద్) కాదు. కాని స్త్రీల నెలవారి ఋతుస్రావం అంటే మడి (హైజ్), జన్మనిచ్చిన తర్వాత బాలింతల నుండి బయటకు వచ్చే రక్తస్రావం (నిఫాస్), మరియు కావాలని ఎక్కువ మోతాదులో రక్తం బయటకు తీయడం (రక్తదానం, కప్పింగ్) మొదలైన పరిస్థితులలో ఉపవాసం భగ్నం (ఫాసిద్) అవుతుంది. అవసరమైనప్పుడు రక్తపరీక్షల కోసం ఉపవాసకుల నుండి తక్కువ మోతాదులో రక్తం తీయడంలో తప్పు లేదు.(మజ్ముఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 253 వ పేజీ)

    8. ఒకవేళ ఎవరైనా కావాలని స్వయంగా వాంతి చేసుకున్నట్లయితే వారి ఉపవాసం భగ్నమైపోతుంది. కాని వాంతి దానికదే వచ్చినట్లయితే ఉపవాసం భగ్నం కాదు.(ఫతావా అల్ షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం -1, 500 వ పేజీ)

    9. పుక్కిలించటం కోసం ఉపయోగించే (గర్ గరా) మందు (మౌత్ వాష్ లాంటిది) వాడటంతో ఉపవాసం భగ్నం కాదు. కాని అది ఎట్టిపరిస్థితిలోను కడుపులోనికి వెళ్ళకూడదు. కాబట్టి అనవసరంగా పుక్కిలించటం (గర్ గరా) చేయకూడదు. (ఫతావా అల్ షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 514 వ పేజీ)

    10. కంటిలో లేదా ముక్కులో మందు వేయడం, అలాగే కళ్ళలో కాటుక (సుర్మా) పెట్టడం వలన ఉపవాసం భగ్నం కాదు.(ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 520వ పేజీ)

    11. అవసరమైతే వంటకాల రుచి పరీక్షించడం లో తప్పు లేదు. అలాంటి పరిస్థితి లో నాలుక కొనభాగం (ముందున్న అంచు) ద్వారా మాత్రమే రుచి చూడవలెను మరియు కొంచం కూడా గొంతు లోపలికి పోనివ్వకూడదు. (షేఖ్ ఇబ్నె జిబ్రీన్ హఫిజహుల్లాహ్ - ఫతావా ఇస్లామీయ సం-2, 128 వ పేజీ)

    12. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ రమదాన్ మాసపు ఉపవాస స్థితిలో ఉండి, భర్త బలవంతంగా భార్యతో సంభోగం చేస్తే, భార్య ఉపవాసం భగ్నం కాదు మరియు ముఖ్యంగా ఆవిడ పై ఏ విధమైన ప్రాయశ్చితం ఉండదు. ఇక ఆ భర్త విషయాని కొస్తే, ఇటువంటి ఘోరమైన పాపపు పని చేయటం వలన అతడు మహా పాపిష్టి అవుతాడు. ఆ ఘోరమైన తప్పు నుండి బయటపడటానికి, అతడు బదులు ఉపవాసం అంటే ఆ రోజుకు మారుగా రమదాన్ నెల తర్వాత మరొక రోజు ఉపవాసం ఉండాలి (ఖదా రోజా) మరియు తప్పని సరిగా ధర్మ పద్ధతి ప్రకారం ప్రాయశ్చితం చేయాలి. అటువంటి పాపిష్టుల కోసం ఇస్లాం నిర్దేశించిన ప్రాయశ్చిత విధానం - అతడు తప్పని సరిగా ఒక దాసుడిని (గులాంను) విడుదల చేయ్యాలి లేదా ఎడతెగకుండా 2 నెలల పాటు ఉపవాసాలు ఉండాలి లేదా 60 మంది పేదలకు భోజనం పెట్టాలి. (ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్, ఫతావా ఇస్లామీయ సం-2, 136 వ పేజీ)

    13. కామావేశం వలన వీర్యస్ఖలనం జరిగినా లేదా పగటి కలలో వీర్యస్ఖలనం జరిగినా అతడి ఉపవాసం (ఫాసిద్)భగ్నం కాదు.(మజ్మూహ్ ఫతావీ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5,243 పేజీ)

    14. భావోద్రేకం వలన బయటకు వచ్చే (వీర్యస్ఖలనం కాకుండా) చిక్కటి ద్రవం వలన ఉపవాసకుల ఉపవాసం భగ్నం కాదు.(మజ్మూహ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 245పేజీ)

    15. అన్నపానీయాలకు బదులు కానిదీ మరియు కేవలం చికిత్స కోసమే ప్రత్యేకింపబడినదీ అయిన ఏ ఇంజెక్షనైనా సరే, దానిని పొట్ట పై ఇచ్చినా లేక నరాలలో ఇచ్చినా మరియు దాని రుచి (పుల్లదనం) గొంతు లోనికి వచ్చినా సరే ఉపవాసం భగ్నమవ్వదు.(మజాలిస్ షహర్ రమదాన్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 100వ పేజీ)

    16. ఎవరైనా మతిమరుపు (పరధ్యానం) వలన ఏదైనా తిన్నా లేక త్రాగినా వారి ఉపవాసం భగ్నం కాదు. కాని వారికి ఉపవాసంలో ఉన్నామనే విషయం జ్ఞాపకం వచ్చిన వెంటనే తినటం, త్రాగటం ఆపేయాలి. అంతే కాకుండా వారి నోటిలో ఉన్న అన్నపు ముద్దను లేదా నీటి గుటకను కూడా వెంటనే ఉమ్మేయ వలెను. (ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 527 వ పేజీ)

    17. గర్భవతుల, పాలిస్తున్న మహిళల ఉపవాస ఆదేశాలు మరియు అనారోగ్యుల ఉపవాస ఆదేశాలు దాదాపుగా ఒకటే. ఒకవేళ ఉపవాసం ఉండటం వీరికి కష్టమైనట్లయితే, దానిని వాయిదా వేయటానికి షరియత్ (ఇస్లామీయ ధర్మాదేశాలు) అనుమతిస్తున్నది. అయితే ఆరోగ్యం కుదుటపడగానే వదిలేసిన ఆ ఉపవాసాలను తప్పక పూర్తి చేయవలెను. (మజ్మూఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 207 వ పేజీ)

    18. ముక్కులో మందు వేసుకుంటున్నప్పుడు ఒకవేళ అది గొంతులోనికి లేదా కడుపు లోనికి వెళ్ళినట్లయితే, ఉపవాసం భగ్నమైపోతుంది. (ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 560 వ పేజీ)

    19. శరీరానికి శక్తినిచ్చే విటమిన్ల ఇంజెక్షన్లు అంటే అన్నపానీయాల అవసరాన్ని తీర్చగలిగే ఇంజెక్షన్లు చేయించుకుంటే వారి ఉపవాసం భగ్నమైపోతుంది. (మజాలిస్ షహర్ రమదాన్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 100 వ పేజీ)

    20. ఒకవేళ ఎవరైనా ముస్లిం రమదాన్ నెలలో ఉపవాసం ఉండ లేనంతటి అనారోగ్యంతో బాధపడుతూ, దాన్నుండి కోలుకోకుండానే రమదాన్ నెల దాటిన తర్వాత అదే అనారోగ్యంతో చనిపోతే, వారి పై ఉపవాసాలు పూర్తి చేయవలసిన నియమం వర్తించదు. ఇంకా ఆ తప్పిపోయిన ఉపవాసాలకు బదులుగా పేదలకు భోజనం పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే షరియత్ ప్రకారం అతడు బలహీనుడిగా (మాజూర్) పరిగణింపబడతాడు. (ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 239వ పేజీ)

    21. ప్రయాణికులు ఉపవాసం ఉండకపోవటం మంచిది. మరియు ప్రయాణికులు ఉపవాసం ఉండగలిగితే ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఒకోసారి ఉపవాసాలు ఉండేవారు, ఇంకోసారి వదిలి పెట్టేసేవారు. కాని ఎండలు మరీ వేడిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండవద్దని హెచ్చరించబడినది. మరియు ప్రయాణికుల ఉపవాసం మక్రూ అంటే అల్లాహ్ కు అయిష్టమైనది. (ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 187 వ పేజీ)

    22. రమదాన్ నెల ఉపవాసాలలో మరియు వేరే ఇతర నెలల ఉపవాసాలలో ఉపవాసకులు, మిస్వాక్ పుల్లతో పళ్ళు తోముకోవడానికి వెనుకాడడంలో ఎటువంటి అర్థం పర్థం లేదు. ఎందుకంటే మిస్వాక్ చేయడం సున్నత్ అంటే ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ఆచారం. (షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఫతావా ఇస్లామీయ సం-2, 126 వ పేజీ)

    23. ఉపవాసకులు సుగంధపరిమళాలు (ఇత్తర్లు) రాసుకోవడం లేక సువాసన పీల్చడంలో ఏమీ తప్పులేదు. కాని సాంబ్రాణి(బఖూర్) పీల్చడం తగదు. ఎందుకంటే అందులో పొగరూపంలో ఉండే తేమ కడుపు లోనికి చేరుతుంది. (షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఫతావా ఇస్లామీయ సం -2, 128 వ పేజీ)

    24. ఉపవాసకుల దంతాల నుండి వచ్చే రక్తం వలన వారి ఉపవాసం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాని ఆ రక్తం గొంతు లోపలికి పోకుండా (మింగకుండా) జాగ్రత్త పడాలి. అలాగే ముక్కు నుండి వచ్చే రక్తం వలన వారి ఉపవాసం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాని ఆ రక్తం గొంతు లోపలికి పోకుండా (మింగకుండా) జాగ్రత్త పడాలి. అటువంటి వారిపై ఏ విధమైన ప్రాయశ్చితం ఉండదు మరియు వేరే దినాలలో బదులు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు. (ఫతావా అర్కాన్ అల్ ఇస్లాం షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 476 వ పేజీ).

    తెలుగు అనువాదం

    బిన్తె ఖాదర్ అలీ ఖాన్ లోధి

    www.islamhouse.com

    telugu@islamhouse.com

    దివ్యఖుర్ఆన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్

    మూలాధారం - ఉర్దూ ప్రచురణ పత్రం, రబువా ప్రచారకేంద్రం, రియాధ్, సౌదీ అరేబియా.