దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత
కూర్పులు
మూలాలు
Full Description
దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత
మొత్తం సంవత్సరంలోని ఇతర దినాల కంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు ఎలా విభిన్నమైనవి?
కాలాన్ని సృష్టించిన అల్లాహ్ కే సకల ప్రశంసలు చెందును. ఆయనే కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాల కంటే శుభప్రదమైనవిగా మరియు కొన్ని ప్రత్యేక నెలలను, దినాలను, రాత్రులను ఇతర నెలల, దినాల, రాత్రుల కంటే శుభప్రదమైనవిగా చేసెను. ఈ శుభకాలములో తన దాసుల పై అల్లాహ్ చూపుతున్న ప్రత్యేక కారుణ్యం వలన వారి పుణ్యాలు అనేక రెట్లు గుణింపబడును. ఇది వారిని మరిన్ని పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించి, అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధించే ఆసక్తిని వారిలో కలిగించును. అలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి చేయవలసిన ప్రయత్నాలను ముస్లింలలో పునరుద్ధరించి, తన మరణాన్ని తద్వారా తీర్పుదినాన్ని ఎదుర్కొనటానికి తయారుగా ఉండేటట్లు చేయును.
ఈ ఆరాధనా కాలం అనేక శుభాలను తెచ్చుచున్నది. వాటిలో కొన్ని శుభాలు - తమ తప్పులను, పాపాలను సరిదిద్దుకుని ప్రాయశ్చతం చేసుకునే అవకాశాలు, తమ ఆరాధనలలోని మరియు ధర్మాచరణలలోని కొరతలను, లోపములను భర్తీ చేసుకునే అవకాశాలు. ఈ ప్రత్యేక సమయాలు కొన్ని ప్రత్యేక ఆరాధనలను కలిగి ఉంటాయి. వీటిని మనస్పూర్తిగా, చిత్తశుద్ధితో ఆచరించటం ద్వారా దాసులు తమ ప్రభువైన అల్లాహ్ కు దగ్గరయ్యే అవకాశాన్ని పొందుతారు. ఇంకా అల్లాహ్ తన ఇష్టానుసారం ప్రసాదించే ప్రత్యేక దీవెనలను, కరుణాకటాక్షాలను కూడా పొందుతారు. ఈ ప్రత్యేక నెలలలో, దినాలలో, ఘడియలలో వీలయినన్ని ఎక్కువ ఆరాధనలు చేస్తూ, అధిక పుణ్యాలు సంపాదించటానికి మరియు తన ప్రభువైన అల్లాహ్ సారూప్యాన్ని పొందటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న వ్యక్తులే ఇహపరలోకాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. అల్లాహ్ ప్రత్యేక దీవెనల ప్రసరణ వలన, తాము భయంకరమైన నరకాగ్ని జ్వాలల నుండి సురక్షితంగా ఉన్నానని ఆశిస్తూ, సంతోషంతో ఉంటారు. (ఇబ్నె రజబ్, అల్ లతాయిఫ్, p.8)
ప్రతి ముస్లిం తమ జీవితపు విలువను తప్పకుండా గ్రహించవలెను. చనిపోయేలోగా అల్లాహ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధిస్తూ, అనేక పుణ్యాలు సంపాదించటానికి తీవ్రంగా ప్రయత్నించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
"మరియు మీపై రూఢీ అయినది రానంత వరకు, మీ ప్రభువును ఆరాధించండి." [సూరహ్ అల్ హిజ్ర్ 15:99] ముఫస్సిరీన్ (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలు) ఇలా తెలిపినారు: "రూఢీ అయినది రానంత వరకు అంటే ఖచ్చితమైన, నిస్సందేహమైన మరణము సమీపించనంత వరకు."
ఆరాధనల కోసం ప్రత్యేకింపబడిన అటువంటి శుభసమయాలలో దిల్ హజ్జ్ మాసంలోని మొదటి పది దినాలు కూడా వస్తాయి. అల్లాహ్ వీటిని సంవత్సరంలోని మిగతా దినాల కంటే ఉత్తమమైనవిగా, ఉన్నతమైనవిగా ఎన్నుకొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఉపదేశించిన ఈ హదీథ్ ను వారి సహచరుడైన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు: "మంచి పనుల (పుణ్యకార్యాల) ను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా వేరే దినాలేమీ లేవు." అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు, "అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కంటేనా?" వారు ఇలా సమాధానమిచ్చినారు, "అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కూడా కాదు, అయితే తనను మరియు తన సంపదను అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధంలో పూర్తిగా సమర్పించుకుని, ఖాళీ చేతులతో మరలి వచ్చినతను తప్ప" (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం, 2/457).
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: "బలిదానపు (ఖుర్బానీ) పది దినాలలో చేసే పుణ్యకార్యాల కంటే ఎక్కువ విలువైనదీ, ఉత్తమమైనదీ అల్లాహ్ దృష్టిలో మరేదీ లేదు." అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించినారు, "అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధం కంటేనా?" (దారిమి గ్రంథం, 1/357; అల్ ఇర్వాలో తెలుపబడినట్లు దీని ఉల్లేఖకుల పరంపర హసన్ వర్గీకరణలోనికి వచ్చును, 3/398).
ఈ పవిత్ర ఉపదేశాలు మరియు ఇటువంటివే ఇతర ఉపదేశాలు సూచిస్తున్న దానిని బట్టి, ‘సంవత్సరంలోని మిగిలిన అన్ని దినాల కంటే ఈ పది దినాలు ఎంతో ఉత్తమమైనవి’ అనటానికి ఎటువంటి సందేహామూ లేదు. ఇవి రమదాన్ నెలలోని చివరి పది దినాల కంటే కూడా ఉత్తమమైనవి. కాని రమదాన్ నెలలోని చివరి పది రాత్రులు తమలో వెయ్యి నెలల కంటే ఉన్నతమమైన లైలతుల్ ఖదర్ అనే రాత్రిని కలిగి ఉండటం వలన ఎంతో ఉత్తమమైనవి. అంటే సంవత్సరం మొత్తం దినాలలో దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు మిగిలిన అన్ని దినాల కంటే ఎంతో ఉత్తమమైనవి మరియు సంవత్సరం మొత్తం రాత్రులలో రమదాన్ మాసపు చివరి పది రాత్రులు మిగిలిన అన్ని రాత్రుల కంటే. ఈ విధంగా వేర్వేరు వ్యాఖ్యానాల, ఉల్లేఖనల మధ్య సమతుల్యాన్ని, పరిష్కారాన్ని సాధించవచ్చును. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 5/412).
ఈ పది దినాలు ప్రత్యేకమైనవి అనటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి:
- అల్లాహ్ ఖుర్ఆన్ లో కొన్నిచోట్ల ఆ ప్రత్యేక పది దినాలపై ప్రమాణం చేసియున్నాడు. వేటిపైనైనా ప్రమాణం చేయటమంటే అది వాటి ప్రత్యేకతను, గొప్పతనాన్ని, ప్రయోజనాల్ని సూచిస్తుంది. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "ఉషోదయాల ప్రమాణంగా; పది రాత్రుల ప్రమాణంగా" [సూరహ్ అల్ ఫజర్ 89:1-2]. ఇక్కడ ఉషోదయాలంటే దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలని ఇబ్నె అబ్బాస్, ఇబ్నె అజ్జుబేర్, ముజాహిద్, ఇంకా ముందు తరం మరియు తర్వాత తరం వారు అభిప్రాయపడినారు. "ఇదే సరైన అభిప్రాయం." అని ఇబ్నె కథీర్ తెలిపినారు (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 8/413)
- పైన తెలిపిన సహీహ్ హదీథ్ లలో ఈ పది దినాలను ఇహపరలోకాలలో అత్యుత్తమమైన దినాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించినట్లు తెలుసుకున్నాం.
- ప్రపంచ వ్యాప్తంగా ఈ పది దినాల ప్రత్యేకతల మరియు హజ్ యాత్రికులు ఈ సమయంలో పవిత్ర కాబాగృహం దగ్గర చేస్తున్న ప్రత్యేక ఆరాధనల కారణంగా ఈ ఉత్తమ సమయంలో మంచి పనులు, పుణ్యకార్యాలు సాధ్యమైనంత ఎక్కువగా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ప్రోత్సహించినారు.
- ఈ మంచి సమయంలో తస్బీహ్ ("సుభహానల్లాహ్"), తహ్మీద్ ("అల్ హమ్దులిల్లాహ్") మరియు తక్బీర్ ("అల్లాహ్ అక్బర్") ఎక్కువగా ఉచ్ఛరించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఈ హదీథ్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: "తను పుణ్యకార్యాలను అమితంగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా అల్లాహ్ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహ్ అక్బర్), తహ్మీద్ (అల్ హమ్దులిల్లాహ్) ఉచ్ఛరించవలెను" (అహ్మద్ హదీథ్ గ్రంథం, 7/224; అహ్మద్ షాకిర్ దీనిని సహీహ్ గా వర్గీకరించెను).
- ఈ పది విశిష్ట దినాలలో యౌమ్ అరఫాహ్ అంటే అరఫాహ్ దినం కూడా ఉన్నది. అల్లాహ్ ఇదే దినమున తన ధర్మాన్ని సంపూర్ణం చేసినాడు. ఈ ఉత్తమ దినమున ఉండే ఉపవాసము రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేయును. ఈ ఉత్తమ దినాలలో యౌమ్ అన్నహర్ (బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం) కూడా ఉన్నది. ఇది సంవత్సరం మొత్తం దినాలలో అత్యుత్తమమైన దినం మరియు హజ్జ్ దినాలలో అత్యుత్తమమైన దినం. ఈ దినము ఇతర అన్ని దినాల మాదిరిగా కాకుండా ఆరాధనలను ప్రత్యేక పద్ధతిలో ఒక చోటికి చేర్చును.
- ఈ పది దినాలలో బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం మరియు హజ్జ్ దినాలు కూడా ఉన్నాయి.
ప్రశ్న: ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?
సున్నహ్ ప్రకారం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాల ప్రకారం) బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ దిల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించి ఉన్నారు: "దిల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను." ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: "అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు." (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని బలిదానం(ఖుర్బానీ) స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు బలిదానం (ఖుర్బానీ) సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు. ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.
వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ. అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.
ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.
కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై ఈ నిషేధము వర్తించదు.
ఇంకా, ఈ నిబంధన బలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.
ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.
పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.
ఈ పది దినాలలో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది దినాలు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికి విలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది దినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనను తాను అంకితం చేసుకోవలెను. మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి. ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.
దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు:
- ఉపవాసం. దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఒక హదీథ్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: "అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను.’"
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: " ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు." (అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)
- తక్బీర్. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో తక్బీర్ ("అల్లాహు అక్బర్"), తహ్మీద్ ("అల్హమ్దులిల్లాహ్"), తహ్లీల్ ("లా ఇలాహ ఇల్లల్లాహ్") మరియు తస్బీహ్ ("సుభహానల్లాహ్") అని బిగ్గరగా ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్ఛరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్ఛరించలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్ఛరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
"వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి..." [సూరహ్ అల్ హజ్జ్ 22:28]
నిర్ణీత దినాలంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లోని పదాలలో "(దిల్ హజ్జ్ మాసపు) మొదటి పది దినాలు నిర్ణీత దినాలని" ఉన్నది.
తక్బీర్ లో "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)" మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.
తక్బీర్ పలకటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్ఛరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా మరియు అబు హురైరా రదియల్లాహు అన్హు లు దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్ఛరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్ఛరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్ఛరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్ఛరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్ఛరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్ఛరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.
పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నహ్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి ఈ హదీథ్: "ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నహ్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నహ్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు." (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)
- హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ ఇలా ప్రకటించినారు: "స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు."
- మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును. ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను.
- ఖుర్బానీ – బలిదానం సమర్పించటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేలి కూడా ఉన్నాయి.
- చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని అన్ని తప్పుడు పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.
ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.
ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు." [సూరహ్ అల్ ఖశశ్ 28:67]
సమయం త్వరత్వరగా గడిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు." [సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]
కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.
గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.