×
ఈద్ అల్ అధా దినమున చేసే ఉదియహ్ అంటే ఖుర్బానీ (బలిదానపు) యొక్క శుభాలు మరియు దాని నియమాలు ఈ వ్యాసంలో వివరంగా చర్చించబడెను.

    ఉదియహ్ (ఖుర్బానీ - బలిదానపు) ఆదేశం

    అల్ హమ్ దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (సకల ప్రశంసలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే చెందును), అస్సలాతు వస్సలాము అలా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలెహి, వ అస్ హాబిహి వసల్లం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి సహచరులపై శాంతి మరియు దీవెనలు కురుయుగాక).

    ఉదియహ్ (బలిదానం) అనేది ఇస్లాంలో ఒక గొప్ప ధర్మాచరణ. దీని ద్వారా అల్లాహ్ యొక్క ఏకదైవత్వం, మన పై ఆయన చూపుతున్న కరుణాకటాక్షాలు మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువైన అల్లాహ్ కు చూపిన అతి గొప్ప విధేయత మన స్మరణలోనికి వచ్చును. ఈ యొక్క ఉదియహ్ (బలిదానం) ఆచరణలో అనేక శుభాలు మరియు దీవెనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ముస్లిం దీని యొక్క ప్రాధాన్యతలను శ్రద్ధగా పరిశీలించవలెను. ఇక ఈ ఆచరణ యొక్క ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.

    ఉదియహ్ (బలిదానం) అనేది నహర్ దినం (ఈద్ అల్ అధా దినం) నుండి తష్రీఖ్ చివరి దినం (దిల్ హజ్జ్ నెల 13వ దినం) వరకు తాము నివసించే ప్రాంతంలో అల్లాహ్ ఆరాధన కోసమని సంకల్పం చేసుకుని, బలి చేసే పశువును (ఒంటె, ఆవు లేక గొర్రె మొదలైన వాటిని) సూచిస్తుంది. దివ్యఖుర్ఆన్ లో ఈ విషయమై అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

    “కాబట్టి అల్లాహ్ వైపునకే మరలండి మరియు (ఆయనకే) బలిదానాన్ని సమర్పించండి.” [సూరహ్ అల్ కౌథర్ 108:2]

    (ఓ ప్రవక్తా) ప్రకటించు! నిశ్చయంగా నా ఆరాధనలు, నా బలిదానం, నా జీవన్మరణం కేవలం సకల లోకాల రబ్ (ప్రభువు) అయిన అల్లాహ్ కోసమే.” [సూరహ్ అల్ అన్ఆమ్ 6:162]

    “మరియు భుజించటానికి ఇవ్వబడిన ఆవుల మందపై మా పేరును (అల్లాహ్ పేరును) స్మరించేటట్లుగా, ప్రతి జాతికి మేము ధర్మాచరణ విధానాలను నిర్దేశించాము. మరియు మీ ఆరాధ్యుడు ఒక్కడే, కాబట్టి మీరు కేవలం ఆయనకు మాత్రమే సమర్పించుకోవలెను.” [సూరహ్ అల్ హజ్జ్ 22:34]

    ఉదియహ్ అనేది అనేక మంది ఇస్లామీయ పండితులచే ధృవీకరించబడిన ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక ఆచారం (కొందరు ఇస్లామీయ పండితులు దీనిని వాజిబ్ అంటే తప్పని సరి అని అభిప్రాయపడినారు. ఈ విషయాన్ని వివరంగా రాబోయే పేజీలలో చర్చించుకుందాము). ఉదియహ్ (బలిదానానికి) కు అసలు ప్రధాన నియమం ఏమిటంటే నిర్ణీత సమయంలో ప్రాణంతో సజీవంగా ఉన్న వ్యక్తి నుండి స్వయంగా తన తరఫున మరియు తన కుటుంబ సభ్యుల తరఫున మరియు దీని పుణ్యంలో భాగం పంచుకోవాలని తను తలచిన ఇతరుల తరఫున (వారు సజీవంగా ఉన్నా లేక మరణించిన వారైనా సరే) అల్లాహ్ కు సమర్పిస్తున్నదై ఉండవలెను. మృతుల తరఫున సమర్పించే ఉదియహ్ (బలిదానం) విషయంలో ఒకవేళ మరణించినతను వీలునామా ద్వారా తన ఆస్తిలో మూడవ వంతు వరకు దీని కోసం కేటాయించటం, లేక ఎవరైనా వ్యక్తికి లేక సంస్థకు తన అనంతరం సంక్రమింపజేసిన ఆస్తిలో షరతు విధించటం జరిగినట్లయితేనే ఆ ఆశయాలను కొనసాగించవలెను. అలాకాకుండా, ఒకవేళ ఎవరైనా మృతుని తరఫున ఉదియహ్ (బలిదానం) సమర్పించాలని కోరుకుంటున్నట్లయితే, అది ఒక మంచి ఆచరణగా మరియు మృతుని తరఫున ఇస్తున్న ఒక దానంగా పరిగణింపబడును. కాని సున్నహ్ ప్రకారం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ ప్రకారం, తన ఉదియహ్ (బలిదానం) లో ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులను (సజీవంగా ఉన్నవారినీ మరియు మరణించినవారినీ) కూడా చేర్చటం ఉత్తమం. బలి చేస్తున్నప్పుడు అతను “అల్లాహుమ్మ హాదా అన్ని వ ఆలి బైతి (ఓ అల్లాహ్ ఇది నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున) అని సంకల్పం చేసుకోవలెను – ప్రతి మృతుని తరఫున అతను వేర్వేరుగా బలిదానం చేయవలసిన అవసరం లేదు.

    బలిపశువు ధరకు సమానమైన ధనాన్ని దానం చేయటం కంటే ఆ పశువును బలి చేసి, దాని మాంసాన్ని దానం చేయటం ఉత్తమమని ఇస్లామీయ పండితులందరూ ఏకీభవించినారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పశుబలి చేసేవారే గాని దానికి సమానమైన ధనాన్ని దానం చేయలేదు. ఆయన ఏ ఆచరణలైనా సరే కేవలం అత్యున్నత మరియు అత్యుత్తమ ప్రయోజనం కలిగే విధంగా మాత్రమే నెరవేర్చేవారు కదా. ఇది ప్రఖ్యాత ఇస్లామీయ ధర్మపండితులైన ఇమాం అబూ హనీఫా, ఇమాం అష్షాఫయీ మరియు ఇమాం అహ్మద్ ల యొక్క అభిప్రాయం.

    ఉదియహ్ (బలిదానం) - శుభాలు మరియు ఉత్తమ ఆచరణా విధానం

    అబూ అయ్యూబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన క్రింది హదీథ్ ఆధారంగా ఒక వ్యక్తికోసం మరియు మొత్తం అతని కుటుంబ సభ్యుల కోసం ఒక గొర్రె బలిదానం సరిపోవును. హదీథ్: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో తన తరఫున మరియు తన కుటుంబ సభ్యుల తరఫున ఒక వ్యక్తి ఒక గొర్రెను మాత్రమే బలిదానం ఇచ్చేవాడు మరియు దానిలో నుండి వారు భుజించేవారు మరియు కొంత ఇతరులకు ఇచ్చేవారు.” (ఇబ్నె మాజా మరియు అత్తిర్మిథీ – సహీహ్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)

    పశువులలో ఒంటెలు, ఆవులు మరియు గొర్రెలు బలిదానం కోసం నిర్దేశింపబడినవి. కొందరు ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఒంటె బలి ఉత్తమమైన బలిదానం, ఆ తర్వాత ఆవు బలి, ఆ తర్వాత గొర్రె బలి, ఆ తర్వాత ఆడ ఒంటె లేదా ఆవు బలిలో భాగస్వామ్యం. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారపు జుమా సలాహ్ (నమాజు) గురించి ఉపదేశించిన ఈ హదీథ్: “ఎవరైతే అందరి కంటే ముందుగా వెళ్ళారో (జుమా నమాజు కోసం), వారికి ఒక ఒంటె బలిదానం చేసినంత పుణ్యం లభించును.” ఇమాం అబూ హనీఫా, ఇమాం అష్షాఫయీ, ఇమాం అహ్మద్ ల అభిప్రాయం కూడా ఇదే. కాబట్టి ఒంటె లేక ఆవులోని ఏడవ భాగం కంటే ఒక గొర్రె బలి ఉత్తమమైనది. ఇమాం మాలిక్ అభిప్రాయం ప్రకారం అత్యుత్తమమైన పశుబలి వరుసక్రమంగా యవ్వనదశలో ఉన్న గొర్రె, ఆ తర్వాత ఆవు, ఆ తర్వాత ఒంటె. దీనికి ఆధారం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు గొర్రె పోతులను స్వయంగా బలిదానం చేశారు – వారు ఎల్లప్పుడూ ఏదైతే అత్యుత్తమమైనదో, దానినే ఆచరించేవారు. ప్రజలు తననే అనుసరిస్తారు, కాబట్టి వారికి ఏ ఆచరణ అయినా సరే కష్టం కాకుండా ఉండటానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలపై తనకున్న ప్రేమవాత్సల్యాల కారణంగా వారికి ఏది అనుకూలంగా, సులభంగా ఉంటుందో ఎల్లప్పుడూ దానినే ఎన్నుకునేవారని వారి ఈ ఆచరణకు బదులుగా వచ్చే ఒక ప్రత్యుత్తరము. (షేఖ్ అబ్దుల్ అజీజ్ ఇబ్నె బాజ్ ఫత్వా).

    జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన క్రింది హదీథ్ ఆధారంగా ఒక ఒంటె లేక ఆవు బలిదానంలో ఏడుగురు భాగస్వాములు కావచ్చును. హదీథ్: “మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్ హుదైబియా ప్రాంతంలో ఒక ఒంటె ఏడుగురి కోసం మరియు ఒక ఆవు ఏడుగురి కోసం బలిదానం చేసినాము.” ఇంకో ఉల్లేఖనలో: “ఒంటెల మరియు ఆవులను పంచుకోమని, ప్రతి ఒక్క పశువులో ఏడుగురు భాగస్వాములు అవ్వమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఆదేశించినారు.” మరొక ఉల్లేఖనలో: “కాబట్టి ఏడుగురి తరఫున ఒక ఆవు బలిదానం సరిపోతుందని మరియు వారు దానిని పంచుకునే వారని” తెలుస్తున్నది (ముస్లిం హదీథ్ గ్రంథం)

    ఉదియహ్ (బలిదానపు) ఆదేశం:

    ఉదియహ్ (బలిదానం) అనేది ఇస్లామీయ ధర్మంలోని ఒక కర్మాచరణ. జవాహర్ అల్ అక్లీల్ షరహ్ ముక్తసర్ ఖలీల్ అనే గ్రంథంలో వివరించినట్లుగా, ఒకవేళ ఒక దేశపు లేక పట్టణపు ప్రజలు ఉదియహ్ ను (బలిదానాన్ని) నిర్లక్ష్యం చేసినట్లయితే, వారితో యుద్ధం చేయ వలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇస్లామీయ ధర్మంలోని ఒక కర్మాచారణగా ఆదేశింపబడినది. (రిసాయిల్ ఫిఖియ్యాహ్ – షేఖ్ ఉథైమిన్. 46వ పేజీ). ఉదియహ్ (బలిదానం) గురించి రెండు రకాలైన ధర్మాభిప్రాయాలు ఉన్నాయి:

    (A). ఇది వాజిబ్ అంటే తప్పనిసరి. ఈ అభిప్రాయం వెలిబుచ్చినవారిలో ప్రముఖులు – అల్ ఔజాయీ, అల్ లైథ్, ఇమాం అబూ హనీఫా మరియు ఇమాం అహ్మద్ వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలలో ఒకటి. ఇంకా షేఖ్ అల్ ఇస్లాం ఇబ్నె తైమియాహ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినారు. అంతేకాక ఇది ఇమాం మాలిక్ (మజ్హబ్) సిద్ధాంతపు రెండు అభిప్రాయాలలో ఒక అభిప్రాయం కూడా. వారి ఈ అభిప్రాయానికి సాక్ష్యాధారాలు -:

    దివ్యఖుర్ఆన్ లోని సూరహ్ అల్ కౌథర్ 108:2 లోని ఈ రెండవ ఆయహ్ (వచనం): “కాబట్టి అల్లాహ్ వైపునకే మరలండి మరియు (ఆయనకే) బలిదానం సమర్పించండి.” ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అనేది తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది.

    1. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడిన జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “ఎవరైతే సలాహ్ (ఈద్ అల్ అధా నమాజు) కంటే ముందు తమ బలిదానాన్ని సమర్పించినారో వారు దాని స్థానంలో ఇంకో బలిపశువును మరల బలిదానం చెయ్యండి. మరియు ఎవరైతే బలిదానం (ఇంకా) సమర్పించలేదో, అతను అల్లాహ్ పేరు మీద సమర్పించవలెను.” (Muslim, 3621)
    2. హదీథ్: “బలిదానం సమర్పించే స్థితిలో ఉండి కూడా అలా సమర్పించని వారెవరైనా సరే, అతను మా దగ్గరకు లేదా మా ప్రార్థనల దగ్గరకు రాకూడదు.” (అహ్మద్ మరియు ఇబ్నె మాజా హదీథ్ గ్రంథాలు; అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేనను సహీహ్ హదీథ్ గా అల్ హాకిమ్ వర్గీకరించెను. ఫతహ్ అల్ బారీలో అటువంటి వారిని థిఖాత్ అనే పేరు ఇవ్వబడెను.)

    (B) ఇది ఒక ధృవీకరించబడిన సున్నహ్ (సున్నహ్ అల్ మువక్కదహ్) అంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలలోనిది. మెజారిటీ ఇస్లామీయ పండితుల అభిప్రాయం కూడా ఇదే. ఇమాం అష్షాఫయీ ధర్మం కూడా ఇదే. ఇంకా ఇమాం మాలిక్ మరియు ఇమాం అహ్మద్ యొక్క ప్రసిద్ది చెందిన అభిప్రాయం కూడా ఇదే. అయితే బలిదానం సమర్పించగలిగిన స్థితిలో ఉండికూడా దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే అది మక్రూహ్ (అయిష్టమైన చర్య) అవుతుందని ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచిన వారు ప్రకటించినారు. క్రింది సాక్ష్యాధారాలపై వారి ఈ వాదన ఆధారపడి ఉన్నది:

    1. సునన్ అబూ దావుద్ హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథ్ లో జాబిర్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు నేను ఈద్ అల్ అధా నమాజును పూర్తి చేసాను. ఆయన (నమాజును) పూర్తి చేసిన తర్వాత, ‘బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యే అత్తున్నతుడు’ అని ఉచ్ఛరిస్తూ, రెండు గొర్రె పోతులను బలిదానం చేసినారు. ఆ తర్వాత ఆయన ఇలా పలికినారు – ఇది స్వయంగా నా తరఫున మరియు నా సమాజంలో బలిదానం చెయ్యని ప్రతి ఒక్క సభ్యుడి తరఫున” (సునన్ అబి దావూద్ బి షరహ్ ముహమ్మద్ షమ్సుల్ హఖ్ ఆబాదీ, 7/486)

    2. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడిన ప్రసిద్ధ హదీథ్ వేత్తలందరూ ఉల్లేఖించిన ఈ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “మీలో ఎవరైనా బలిదానం చేయాలని కోరుకున్నట్లయితే, వారు తమ వెంట్రుకలలోనుండి లేదా గోళ్ళలో నుండి దేనినీ తీసుకోకూడదు (అంటే కత్తిరించకూడదు).” బలిదానం తప్పని సరి అని అభిప్రాయపడేవారి గురించి మరియు అది ఒక అధిక ప్రాధాన్యత గల సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ అని అభిప్రాయపడే వారి గురించి షేఖ్ ఇబ్నె ఉథైమిన్ ఇలా పలికారు - “ఇరువైపులా వెలిబుచ్చిన అభిప్రాయలకు వాటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ముందు జాగ్రత్త కోసం, ఎవరైతే బలిదానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారో, వారు దానిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే, దీనిలో అల్లాహ్ పై భక్తిభావాన్ని వెల్లడించే ఆచరణ ఉన్నది, అల్లాహ్ యొక్క స్మరణ ఉన్నది. మరియు దీనిలో విమర్శలకు అవకాశం ఇచ్చేదేదీ లేదు.

    ఉదియహ్ (బలిదానం) యొక్క షరతులు

    1. బలిపశువు సరైన వయస్సుకు చేరినదై ఉండవలెను. అంటే గొర్రె వయస్సు కనీసం ఆరు నెలలు, మేక వయస్సు కనీసం ఒక సంవత్సరం, ఆవు వయస్సు కనీసం రెండు సంవత్సరాలు మరియు ఒంటె వయస్సు కనీసం ఐదు సంవత్సరాలు ఉండవలెను.

    2. దానిలో ఎటువంటి లోపాలూ ఉండకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించినారు: “నాలుగు విషయాలు ఉన్నదానిని బలిదానం చేయవద్దు: ఒకే కన్ను ఉన్న పశువు (దీని అసంపూర్ణత స్పష్టంగా కనబడేదే), అనారోగ్యంతో ఉన్న పశువు (దీని అనారోగ్యం కూడా స్పష్టంగా గుర్తింపబడేదే), కుంటుతున్న పశువు (దీని కుంటటం కూడా స్పష్టంగా కనిపెట్టగలిగేదే) మరియు తన ఎముకలలో మూలగ (మజ్జ) లేని కృశించిన పశువు” (సహీహ్, సహీహ్ అల్ జామి’, no. 886). చిన్న చిన్న లోపాల వలన పశువు బలిదానపు యోగ్యతను కోల్పోదు. కాని అటువంటి లోపాలతో ఉన్న పశువును బలివ్వటం అయిష్టకరమైనది (మక్రూహ్). ఉదాహరణకు – ఒక కొమ్ము లేదా చెవి లేని పశువు, చెవులు చీల్చబడి ఉన్న పశువు మొదలైనవి. ఉదియహ్ (బలిదానం) అనేది అల్లాహ్ కు సమర్పింపబడుతున్న ఒక ఆరాధన. అల్లాహ్ ఉత్తమమైనవాడు మరియు ఉత్తమమైన వాటినే స్వీకరించును. కాబట్టి ఎవరైనా సరే అల్లాహ్ యొక్క హక్కులను గౌరవిస్తున్నట్లయితే, ఈ యొక్క ఆచరణను భయభక్తులతో (తఖ్వాతో) నిండిన మనస్సుతో పూర్తిచేయవలెను.

    3. బలిదానపు పశువు అమ్మకం నిషేదించబడినది. ఒకవేళ ఏదైనా పశువు బలిదానం కోసం ఎన్నుకోబడినట్లయితే, ఇక అది అమ్మబడటానికి లేదా ఇతరులకు ఇవ్వబడటానికి అనుమతి లేదు. కాని అంతకంటే మంచి పశువుకు పొందటానికి బదులుగా ఇవ్వవచ్చును. ఒకవేళ బలిదానపు పశువు అప్పుడే జన్మనిచ్చినదైతే, దాని బిడ్డను కూడా దానితో పాటు బలి ఇవ్వవలసి ఉంటుంది. అవసరమైతే బలిదానపు పశువుపై సవారీ అంటే ప్రయాణం చేయవచ్చును. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథ్ –తన ఒంటెను తీసుకుని పోతున్నతనిని చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతనితో ‘దానిపై సవారీ చేయమని’ పలికినారు. దానికి అతను ‘అది బలిదానం కోసం ప్రత్యేకించబడినదని’ సమాధానమివ్వగా, మరల వారు ‘దానిపై సవారీ చేయి’ అని రెండు లేక మూడు సార్లు పలికినారు.

    4. నిర్ణీత సమయంలోనే దానిని బలి ఇవ్వవలెను. అంటే ఈద్ అల్ అధా యొక్క నమాజు మరియు ఇమాం ప్రసంగం (ఖుత్బా) అయిన తర్వాతనే. అంతే కాని, నమాజు సమయం మరియు ప్రసంగ సమయంలో ప్రారంభమైనప్పుడు కాదు. తష్రీఖ్ చివరి దినపు అంటే దుల్ హజ్జ్ నెల 13వ దినపు సూర్యాస్తమయం లోగా బలిదానం ఇవ్వవలసి ఉంటుంది. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన ఈ హదీథ్: “నమాజు కంటే ముందు ఎవరైతే బలిదానం ఇచ్చినారో, వారు దానిని మళ్ళీ చెయ్యండి.” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు). అలీ రదియల్లాహు అన్హు ఇలా పలికినారు: “ఈద్ అల్ అధా దినం మరియు దాని తర్వాత వచ్చే మూడు దినాలు నహర్ (బలిదానపు) దినాలు.” హసన్ అల్ బస్రీ, అతాఇబ్నె రబాహ్, అల్ ఔజాయీ, అష్షాఫయీ మరియు ఇబ్నె అల్ మున్దిర్ రహిమహుల్లాహ్ ల అభిప్రాయం కూడా ఇదే.

    బలిదానం ఇచ్చిన దానిని ఏమి చేయవలెను?

    1. బలిదానం ఇచ్చే అతను, ఆ దినమున వీలయితే బలి ఇచ్చిన దానిలో నుండి తినే కంటే ముందు ఏమీ తినకుండా ఉండటం ఉత్తమం (ముస్తహబ్). దీనికి ఆధారం “ప్రతి ఒక్కరూ తాము బలిచ్చిన దానిలో నుండి తినవలెను” (సహీహ్ గా వర్గీకరించబడిన సహీహ్ అల్ జామీ, 5349 హదీథ్). ఈ తినటమనేది ఈద్ అల్ అధా నమాజు మరియు ఇమాం ప్రసంగం (ఖుత్బా) పూర్తయిన తర్వాతనే. దీనిని అలీ, ఇబ్నె అబ్బాస్, మాలిక్, అష్షాఫయీ మరియు ఇతరులు ధృవీకరించినారు. దీనికి ఆధారం బురైదాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథ్: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్ ఫిత్ర్ నాడు ఏమీ తినకుండా బయటకు వెళ్ళేవారు కాదు మరియు ఈద్ అల్ అధా నాడు బలిదానం సమర్పించే వరకు ఏమీ తినేవారు కాదు.” (ఈ హదీథ్ ఉల్లేఖకుల పరంపర సరైనదేనని అల్ బానీ తెలిపినారు. అల్ మిష్కాత్, 1/452).

    2. స్వయంగా తన బలిదానపు పశువును బలివ్వటం ఉత్తమం. కాని ఒకవేళ చేయలేక పోతే, బలి ఇచ్చే సమయంలో అక్కడ ఉండటం ఉత్తమం (ముస్తహబ్).

    3. ఇబ్నె మస్ఊద్ మరియు ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుల అభిప్రాయం ప్రకారం బలిపశువు మాంసాన్ని మూడు సమాన వంతులు చేయటం ఉత్తమం (ముస్తహబ్): ఒక వంతు తినటానికి, రెండో వంతు బహుమతిగా ఇవ్వటానికి మరియు మూడో వంతు దానం చేయటానికి. బలిపశువు మాంసం నుండి, చర్మం నుండి, కొవ్వు నుండి ఏ చిన్నభాగాన్నైనానైనా సరే అమ్మటాన్ని పండితులు అనుమతివ్వలేదు. ఒక సహీహ్ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “ఎవరైతే తన బలిదానపు పశువు చర్మాన్ని అమ్ముతారో, ఆ బలిదానంలో నుండి వారికి ఎటువంటి ఉదియహ్ (పుణ్యం) లభించదు. (i.e., అంటే అది ఉదియహ్ (బలిదానం) గా పరిగణింపబడదు).” (సహీహ్ అల్ జామీ లో హసన్ గా వర్గీకరింపబడిన హదీథ్, 6118). కసాయివానికి ప్రతిఫలంగా లేక వేతనంగా బలిపశువులో నుండి ఏమీ ఇవ్వకూడదు. దీనికి ఆధారం అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథ్: “బలిపశువును (బలిచ్చిన తర్వాత) జాగ్రత్తగా చూడమని, దాని మాంసాన్ని, చర్మాన్ని, రక్షణ కవచాన్ని దానం చేయమని మరియు ప్రతిఫలంగా కసాయివానికి దానిలో నుండి ఏమీ ఇవ్వవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఆజ్ఞాపించినారు. ఇంకా వారు ఇలా పలికినారు, ‘మన వద్ద ఉన్న దానిలో నుండి ఏదో కొంత అతనికి ఇద్దాము’” (అంగీకరింపబడిన హదీథ్). కసాయివానికి దానిలో నుండి అంటే బలిపశువు నుండి బహుమతిగా ఇచ్చేందుకు మరియు బీదవాడైన, బంధువైన, పొరుగువాడైన ముస్లిమైతరునికి కూడా అతని హృదయాన్ని ఇస్లాం వైపు మళ్ళించటానికి దానిలో నుండి ఇచ్చేందుకు అనుమతివ్వబడినది. (షేఖ్ అబ్దుల్ అజీజ్ ఇబ్నె బాజ్ యొక్క ఫత్వా).

    ప్రశ్న: బలిదానం ఇవ్వాలని సంకల్పం చేసుకున్న ముస్లిం దుల్ హజ్జ్ నెల మొదటి పది దినాలలో ఏ ఏ విషయాల నుండి దూరంగా ఉండవలెను.?

    సమాధానం – సున్నహ్ ప్రకారం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారం, బలిదానం ఇవ్వదలచిన వ్యక్తి దుల్ హజ్జ్ నెల మొదటి పది దినాలలో అంటే బలిదానం ఇచ్చే వరకు తన వెంట్రుకల నుండి, తన గోళ్ళ నుండి లేదా తన చర్మం నుండి దేనినీ తీయకుండా అంటే కత్తిరించకుండా ఉండవలెను. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథ్: “ఎప్పుడైతే మీరు దుల్ హజ్జ్ మాసం యొక్క నెలవంకను చూసారో, ఒకవేళ మీరు బలిదానం ఇవ్వదలచితే అప్పటి నుండి తన వెంట్రుకల నుండి లేక గోళ్ళ నుండి, బలిదానం సమర్పించే వరకు ఏమీ తీయకుండా ఉండవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం: “తన వెంట్రుకల లేక గోళ్ళ యొక్క ఏ భాగాన్ని స్పర్శించ కూడదు.” అని ఉన్నది. (సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథం – నలుగురు ఉల్లేఖకుల పరంపరతో నమోదు చేయబడినది. 13/146). ఈ ఉపదేశంలో ఆజ్ఞ ఉన్నది. ఇక్కడ నిరోధింపబడినది అంటే పూర్తిగా నిషేధింపబడినదని, దానిలో ఇంకో అవకాశమేదీ ఉండదని మెజారిటీ పండితుల అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా కావాలని అలా చేసినట్లయితే అంటే వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం చేసినట్లయితే, వారు ప్రాయశ్చిత పడి, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవలెను. అంతే కాని ఆ తప్పుకు ఎటువంటి పరిహారం చెల్లించనవసరం లేదు. ఇంకా అతని ఉదియహ్ అంటే బలిదానం యోగ్యమైనదే. ఎవరికైనా తన వెంట్రుకలను లేక గోళ్ళను తీయవలసిన అవసరం ఏర్పడితే, అలా తీయకుండా వదిలి వేయటం వలన హాని కలిగేటట్లయితే (ఉదాహరణకు గోరు చీలటం లేక వెంట్రుకల భాగంలో గాయమవటం) ఆ వెంట్రుకలను లేక గోరును తొలగించ వచ్చును. అలా చేయటంలో అతను ఏ పాపమూ చేసినట్లు కాదు. ఇది హజ్జ్ లేక ఉమ్రా యాత్ర చేస్తున్న ఇహ్రాం లో ఉన్న వ్యక్తికి ఒకవేళ అలా చేయకపోతే హాని కలిగే పరిస్థితి ఏర్పడినట్లయితే నిర్ణీత సమయానికి ముందే వెంట్రుకలు తీయటానికి ఇవ్వబడిన అనుమతి వంటిది. మగవారైనా లేక స్త్రీలైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి పాపమూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం వెంట్రుకలు తీయటాన్ని మాత్రమే నిషేధించినారు గాని వాటిని శుభ్రంగా కడుక్కోవటాన్ని కాదు. మరియు ఇహ్రాం లోని వ్యక్తికి తన తల వెంట్రుకలు కడుక్కోవటానికి అనుమతి ఇవ్వబడినది.

    వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ. అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.

    ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.

    కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై ఈ నిషేధము వర్తించదు.

    ఇంకా, ఈ నిబంధన బలిదానం చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.

    ఎవరైనా బలిదానం సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.

    పైన తెలిపిన హదీథ్ లో బలిదానం ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.