ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం
కూర్పులు
మూలాలు
Full Description
ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం
]తెలుగు – Telugu –تلغو[
షేఖ్ ముహమ్మద్ ఇబ్నె ఇబ్రాహీమ్ అల్ తువైజ్రీ
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 - 1433
نبذة عن إبراهيم عليه السلام
« باللغة تلغو »
فضيلة الشيخ محمد بن إبراهيم التويجري
ترجمة:محمد كريم الله
مراجعة:شيخ نذير أحمد
2012 - 1433
ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి వివరించండి ?
అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే.
“మరి మేము అతనికి (ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు) ఇస్హాఖ్, యూఖూబులను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని, దివ్యగ్రంథాన్ని ఉంచాము".(29:27 - ఖుర్ఆన్ ఆయతులతెలుగు భావానువాదం)
“ఈ గ్రంథంలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త".[19:41 – ఖుర్ఆన్ ఆయతులతెలుగు భావానువాదం]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని ప్రసాదించినాడు.అంతేగాక ప్రశంసార్హమైన సుగుణాలు మరియు ఉన్నత స్వభావాలు ఆయనలో నింపినాడు:
“నిశ్చయంగా, ఇబ్రాహీమ్ ఒక అనుసరించదగిన నాయకుడు. నికార్సయిన దైవ విధేయుడు. అల్లాహ్ యందే మనస్సు నిలిపినవాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతా భావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు. అతనికి ఋజుమార్గం చూపించాడు. మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము. పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు."[16:120-122 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ప్రవక్తల పితామహుడు; ఆయన తర్వాత పంపిన ప్రవక్తలందరినీఅల్లాహ్ ఆయన సంతతి నుండే ఎంచుకున్నాడు. అది ఎలాగంటే, ముందుగా ఆయన ఇద్దరు కుమారులనూ అల్లాహ్ ప్రవక్తలుగా ఎంచుకున్నాడు. వారిద్దరి పేర్లు – ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం మరియు ప్రవక్త ఇస్హాఖ్ అలైహిస్సలాం. అరబ్బుల పితామహులైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి అల్లాహ్ అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను ఎంచుకున్నాడు. ఇంకా ప్రవక్త ఇస్హాఖ్ అలైహిస్సలాంకు అల్లాహ్ యూఖూబ్ అనే ప్రవక్తను కుమారునిగా ప్రసాదించినాడు. యూఖూబ్ అలైహిస్సలాం యొక్క మరో పేరు ఇస్రాయీల్. ఆయన యొక్క ఈ మారుపేరును అనుసరించే ఆయన సంతతి మరియు అందులోని ప్రవక్తలు 'బనీ ఇస్రాయీల్' పేరుతో ప్రసిద్ధి చెందారు.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం, ప్రవక్తల పితామహులనే వాస్తవాన్ని పేర్కొంటూ, ఖుర్ఆన్ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి ఇలా తెలుపుతున్నది:
“మరియు అతనికి మేము ఇస్హాఖ్ మరియు యాఖూబులను ప్రసాదించినాము. వీరందరినీ సన్మార్గగాములుగా చేసినాము. అంతకు పూర్వం నూహ్కు కూడా హితబోధ చేసినాము – ఇంకా అతని సంతతిలో దావూద్, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు కూడా. ఈవిధంగా మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
అలాగే జకరియ్యా, యహ్యా, ఈసా మరియు ఇల్యాస్ – వీరందరు కూడా సత్పురుషులలోని వారే.
అలాగే ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ – అందరికీ ప్రపంచాలన్నింటిపై ప్రాధాన్యతనిచ్చాము."[6:84-86 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఏకైక దైవమైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని మరియు ఎలాంటి లాభనష్టాలూ కలుగజేయలేని విగ్రహారాధనలను విడిచి పెట్టమని ఇబ్రాహీమ్ అలైహిస్సలాం మెసపుటోమియాలోని జనులను పిలిచారు:
“మరి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కూడా తన జాతి వారి నుద్దేశించి ఇలా అన్నాడు: “అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. మీరు అల్లాహ్ ను వదలి ఈ విగ్రహాలను పూజిస్తున్నారే! మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి! అల్లాహ్ ను కాదని మీరు వేటినయితే పూజిస్తున్నారో, మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవసమక్షంలోనే అర్థించండి. ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు తెలుపండి. ఎట్టకేలకు మీరు ఆయన వద్దకే మరలించబడతారు."[29:16-17: ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ప్రజలను విగ్రహారాధన నుండి, కల్పిత పౌరాణిక గాథల మరియు ఇతిహాసాల నుండి విముక్తి చేయదలిచినారు. ఈ విగ్రహాల గురించి ఆయన తన ప్రజలను ఇలా ప్రశ్నించారని ఖుర్ఆన్ లో అల్లాహ్ మనకు తెలిపినాడు:
“వారికి ఇబ్రాహీమ్ సమాచారాన్ని కూడా చదివి వినిపించు. “మీరెవరిని పూజిస్తున్నారు?" అని అతను తన తండ్రిని, తన జాతి వారిని అడిగినపుడు, “మేము విగ్రహాలను పూజిస్తున్నాము. వాటి సేవకే అంకితమై ఉన్నాము." అని వారు సమాధానమిచ్చారు. అపుడు ఆయన వారినిలా అడిగారు, “మీరు వాటిని పిలిచినపుడు అవి మీ పిలుపును వింటాయా? లేదా మీకు లాభం గానీ, నష్టం గానీ కలిగిస్తాయా?". దానికి వారు “(అదంతా మాకు అనవసరం) తాతముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చూశాము" అని బదులిచ్చారు.[26:69-74: ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఆ తర్వాత 'మూగజంతువుల వలే వారు మూర్ఖంగా ఇతరులను అనుసరించకూడదని' ఆయన వారికి వివరించి, 'సర్వలోకాల సార్వభౌముడైన అల్లాహ్ ను మాత్రమే వారు ఆరాధించాలనే' అసలు వాస్తవాన్ని ఇలా స్పష్టం చేసినారు:
“అతను (ఇబ్రాహీమ్) ఇలా పలికాడు: 'మీరు పూజిస్తున్న వాటిని (కొంచెమైనా) గమనించారు? మీరు గానీ, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ. వారంతా నా శత్రువులు – ఒక్క సకలలోక ప్రభువు తప్ప. ఆయనే నన్ను సృష్టించాడు, మరియు ఆయనే నాకు సన్మార్గం చూపుతున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడినపుడు, ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. ఆయనే నన్ను చంపుతాడు, మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది."[ 26:75-82: ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం ]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తండ్రి కూడా విగ్రహారాధకుడే. అతడు ఒక మంచి శిల్పి. దేవతా విగ్రహాలు చెక్కి, బజారులో అమ్మేవాడు. తన తండ్రి అవిశ్వాసం ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఇబ్బంది పెట్టేది. తన తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసుకుని, ఆయన తన తండ్రికి ఇలా హితోపదేశం చేసినారు:
“అతను తన తండ్రితో, ఓ నా తండ్రీ !వినలేని, చూడలేని, మీకు ఏ మాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తున్నారు? ఓ పితామహా! చూడండి! మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది. కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను."[19:42-43 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
కానీ అతని తండ్రి ఆయన హితోపదేశాన్ని పెడచెవిన పెట్టడమే కాకుండా రాళ్ళతో కొట్టి చంపుతానని మరియు అతడిని ఇంటి నుండి వెళ్ళగొడతానని బెదిరిస్తూ, ఆయనతో అతని తండ్రి ఇలా పలికినాడు:
“ఓ ఇబ్రాహీమ్, నువ్వు నా దైవాలనే తిరస్కరిస్తున్నావా?విను! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్ళతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదిలిపెట్టు" అని అతని తండ్రి అతనితో అన్నాడు. [19:46 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇక ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వద్ద తన తండ్రిని విడిచి పెట్టే మార్గం తప్ప మరేమీ మిగలలేదు. అతనితో ఆయన ఇలా పలికినారు:
“సరే, మీకు సలాం! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను, నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి చూపుతాడు".[19:47 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
తన తండ్రి మోక్షం కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ప్రార్థించసాగారు మరియు అతడికి సన్మార్గం చూపమని తన ప్రభువును వేడుకునేవారు. కానీ, అతడు (ఆయన తండ్రి) అల్లాహ్ కు బద్దశత్రువుగా మారిపోయాడనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఆయన తన తండ్రితో సంబంధం త్రెంచుకున్నారు మరియు అతని మోక్షం కొరకు ప్రార్థించడం ఆపివేశారు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి:
“మరి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే, అతను తండ్రికిచ్చిన మాట ప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్ యొక్క విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మృదు మనస్కుడు, సహనశీలి"[9:114 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఆయనను కూడా విగ్రహారాధనలో పాల్గొనమని ప్రజలు మూర్ఖంగా పట్టుబట్టగా, ఏకదైవారాధన వైపు పిలిచే తన బోధనలు మరియు ఉపదేశాలు తన ప్రజలను ప్రభావితం చేయలేకపోవటాన్ని చూసి, ఆ విగ్రహాలకు ఎలాంటి లాభమూ మరియు నష్టమూ కలుగజేసే శక్తి లేదని వారికి ప్రయోగాత్మకంగా ఋజువు చేసి చూపాలని ఆయన నిశ్చయించుకున్నారు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి:
“తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టి సారించి, “నేను రోగగ్రస్తుణ్ణి అయ్యాను" అన్నాడు. అందువల్ల వారంతా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోయారు. అపుడతను వారి దేవతా విగ్రహాల వద్దకు వెళ్ళి, 'మీరు తినరేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు కనీసం మాట్లాడను కూడా మాట్లాడటం లేదే?!" అన్నాడు. ఆ తరువాత కుడిచేత్తో వాటిని ఎడాపెడా వాయించాడు."[37:88-93 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గుడిలోని అతి పెద్ద విగ్రహాన్ని అలాగే వదిలి పెట్టి, మిగిలిన విగ్రహాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆ పని ఎవరు చేసారో చెప్పమని అడిగేందుకు ప్రజలు తన వద్దకు వచ్చినపుడు, ఆ పెద్ద విగ్రహాన్నే ఎందుకు అడిగి తెలుసుకోకూడదు అని వారిని ప్రశ్నించాలని ఆయన దానిని అలా వదిలి వేశారు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి:
“ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి పెట్టాడు. వారంతా దాని వైపు మరలటానికే (అతను అలా చేశాడు)"[21:58 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఉత్సవం జరుపుకునేందుకు ఊరి బయటికి వెళ్ళి మరలి వచ్చిన ప్రజలకు, తమ దేవతా విగ్రహాలు ముక్కలు ముక్కలుగా పగలగొట్ట బడి ఉండటం కనబడింది. తప్పకుండా అది ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పనే అయి ఉంటుందని వారు ఆరోపించారు. అపుడు ఆయన వారితో ఇలా అన్నారు:
“ఆహా! ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళనే అడిగి తెలుసుకోండి!"[21:63 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
నిర్జీవమైన ఈ విగ్రహాలు మాట్లాడలేవనే విషయం వారు ఎరిగి ఉండటం వలన, ఇబ్రాహీమ్ అలైహిస్సలాంతో వారిలా అన్నారు:
“ఇవి మాట్లాడలేవన్న సంగతి నీకూ తెలుసు కదా!"[ 21:65 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఈ విగ్రహాలు తమను తామే కాపాడుకోలేవని వారు ఒప్పుకున్న తర్వాత, ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వారిలో ఇలా పలికారు:
“(మీ పరిస్థితి గడ్డుశోచనీయం) మీరు అల్లాహ్ ను వదలి మీకు ఏమాత్రం లాభం గానీ, నష్టం గానీ కలిగించలేని వాటిని పూజిస్తున్నారా? ధూత్కారం, మీపైనా మరియు అల్లాహ్ ను కాదని మీరు పూజించే మీ దేవుళ్ళపైనా. మీకు ఈ పాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా"[21:67 – : ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
తమ వాదనలో పూర్తిగా ఓడి పోయిన తర్వాత, ఇక వారు ఆయనపై బలాన్ని ఉపయోగించాలని తీర్మానించుకుని, ఇలా ప్రకటించారు:
“(దానికి వారి అహం దెబ్బతిన్నది) 'మీరేదైనా చేయాలనే అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి. మీ దేవుళ్ళకు సహాయంగా నిలబడండి'"[21:68 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
వారు పెద్ద దుంగలను జమ చేసి, భయంకరమైన మంటను రాజేశారు. దాని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించేటంత ఎత్తుకు ఎగిసినాయి. మంటలు బాగా అంటుకున్న తర్వాత, వారు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను అందులో పడవేశారు. అపుడు ఆయన ఇలా పలికారు, “హస్బి అల్లాహు వ నేమల్ వకీల్ (నా కొరకు అల్లాహ్ చాలు మరియు ఆయన విషయాలను చక్కబెట్టడంలో సాటి లేనివాడు)." అపుడు అల్లాహ్ ఆయనను కాపాడినాడు మరియు ఆ అగ్నిని ఆయన కొరకు చల్లగా, నష్టం కలిగించనదిగా చేసి, అవిశ్వాసుల పన్నాగాన్ని నిర్వీర్యం చేసినాడు:
“అపుడు మేము ఇలా ఆదేశించాము (అల్లాహ్ ఇలా ఆదేశించాడు): 'ఓ అగ్నీ! నువ్వు ఇబ్రాహీం కొరకు చల్లగానూ, సురక్షితంగానూ మారిపో!' వారు ఇబ్రాహీముకు కీడు చేయాలని అనుకున్నారు. కానీ మేము వాళ్ళనే ఎక్కువ నష్ట పోయేలా చేశాము."[ 21:69-70 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
అగ్ని నుండి ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను కాపాడిన తర్వాత, మెసపుటోమియాను విడిచి పెట్టి, ఫలస్తీనా లోని పవిత్ర స్థలం వైపుకు వలస వెళ్ళమని ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను అల్లాహ్ ఆజ్ఞాపించినాడు. ఆయన తన పినతండ్రి కుమార్తె అయిన 'సారహ్' ను పెళ్ళాడినారు.ఆమెను మరియు తన సోదరుని కుమారుడైన లూత్ అలైహిస్సలాంను వెంటబెట్టుకుని, షామ్ (సిరియా, జొర్డాన్, ఫలస్తీన్, లెబనాన్ .. మొ) వైపు ప్రయాణించారు:
“మేము అతనినీ, లూతునూ కాపాడి, లోకవాసుల కోసం శుభాలను పొందు పరిచిన భూభాగం వైపుకు తీసుకు వెళ్ళాము"[ 21:71 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
అపుడు షామ్ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండటం వలన, ఆయన తన భార్యతో ఈజిప్టుకు చేరుకున్నారు. కొన్నాళ్ళకు ఆయన తన భార్యతో మరియు తన భార్యకు బానిసగా లభించిన 'హాజరా' అనే బానిసతో ఫలస్తీనా మరలి వచ్చారు. సంతానం కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో కృషి చేసారు. కానీ భార్య గొడ్డుతనం మరియు ముసలితనం వలన ఆయనకు పిల్లలు కలుగలేదు. సంతానం కొరకు తన భర్త చూపుతున్న ఆసక్తిని గమనించిన తర్వాత, తన బానిస హాజరాను ఆమె తన భర్తకు ఇచ్చివేసింది. ఆమెను పెళ్ళాడిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఆమె ద్వారా ఇస్మాయీల్ అనే బాలుడిని ప్రసాదించాడు :
“ 'ఓ నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు' (అని ప్రార్థించాడు). అందువలన మేమతనికి సహనశీలుడైన ఒక పసిబిడ్డ గురించిన శుభవార్తను అందజేశాము"[37:100-101 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం ]
హాజరాకు ఇస్మాయీల్ జన్మించిన తర్వాత, సారహ్ లో అసూయాగ్ని రగులుకోవటం మొదలైంది. ఆమెను తన నుండి దూరంగా పంపించి వేయమని ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను కోరింది. అపుడు హాజరాను మరియు పసిబిడ్డ ఇస్మాయీల్ ను తీసుకుని, మక్కాలో వదిలి పెట్టమని అల్లాహ్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఆదేశించాడు. ఆ కాలంలో మక్కా ప్రాంతం నీళ్ళు కూడా దొరకని, జనసంచారం లేని ఒక నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. ఇబ్రాహీమ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి, హాజరాను మరియు ఇస్మాయీల్ ను తీసుకుని మక్కా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారిని వదిలి పెట్టి, ఫలస్తీనా వైపుకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అపుడు హాజరా ఆయనతో, “ఎవరి కోసం మమ్ముల్ని ఈ నిర్మానుష్య లోయలో ఒంటరిగా వదిలి వెళ్ళుతున్నారు?" అని ప్రశ్నించసాగింది. కానీ ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఏమీ జవాబివ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అపుడు ఆమె “ఇలా చేయమని అల్లాహ్ మిమ్ముల్ని ఆజ్ఞాపించాడా?" అని అడుగగా, “అవును." అని ఆయన జవాబిచ్చారు. అపుడు ఆమె, “అలా అయితే మాకేమీ హాని కలుగకుండా అల్లాహ్ యే చూసుకుంటాడు" అని పలికింది.
తన ప్రభువు ఆజ్ఞకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం సమర్పించుకున్నారు. తన భార్య మరియు లేక లేక కలిగిన పసిబిడ్డ దూరమవటాన్ని ఎంతో సహనంతో ఓర్చుకున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత, ఆయన వారిని వదిలి పెట్టిన లోయ వైపు తిరిగి (నేటి కాబా గృహం వైపు తిరిగి), అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు:
“ఓ మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని బంజరు లోయలో, నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేసాను. మా ప్రభూ! వారు నమాజును స్థాపించేందుకే (అక్కడ వదిలి పెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారు తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు – వారు కృతజ్ఞతలుగా మెలిగేందుకు."[14:37 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తమ కొరకు వదిలి పెట్టి వెళ్ళిన అన్నపానీయాలు సేవిస్తూ, హాజరా మక్కా లోయలో నివసించ సాగింది. కొన్నాళ్ళకు ఆ నీళ్ళు అయిపోయాయి. దాహంతో ఆమె మరియు ఆమె పసిబిడ్డ తపించసాగారు. అపుడు ఆమె నీటి కోసం వెదకటం మొదలు పెట్టింది. ఇస్మాయీల్ ను లోయలో పరుండబెట్టి, ఇరువైపులా ఉన్న సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి, కనుచూపు మేర నీటి కోసం చూసింది. అయితే, ఆమెకు నీటి ఆనవాళ్ళేమీ ఆ దరిదాపులలో కనబడలేదు. అలా ఆమె ఏడు సార్లు సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి నీటి కోసం అన్వేషించింది. నిస్పృహతో ఇస్మాయీల్ వైపు తిరిగి చూడగా, ఆయన పాదాల క్రింద వేగంతో పారుతున్న నీటి ఊట ఆమె కళ్ళబడింది. ఎంతో సంతోషంతో తను కొంత నీరు త్రాగి, తన పసిబిడ్డకు కూడా త్రావించింది. ఆ తర్వాత నీటి ఆనవాళ్ళ కనిబెట్టి జుర్హుమ్ అనే తెగ అక్కడకు చేరుకుని, తాము కూడా ఆ నీటి ప్రవాహం ప్రక్కనే నివసించేందుకు ఆమె అనుమతి కోరింది.ఆమె అనుమతితో వారు కూడా అక్కడ నివసించసాగారు. యుక్తవయస్కుడైన తర్వాత ఇస్మాయీల్ ఆ తెగలోని ఒకామెతో పెళ్ళి చేసుకున్నారు మరియు వారి నుండి అరబీ భాష నేర్చుకున్నారు.
అపుడపుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం అక్కడికి వచ్చి, తన కుమారుడిని చూసుకునేవారు. ఒకసారి అలా వచ్చినపుడు, ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు ఒక కల వచ్చింది. దానిలో ఆయన తన కుమారుడైన ఇస్మాయీల్ ను బలివ్వమని అల్లాహ్ తనను ఆజ్ఞాపించినట్లుగా ఆయన చూసారు.ప్రవక్తల స్వప్నాలు నిజస్వప్నాలై ఉంటాయి. కాబట్టి, అప్పటికే తను ముసలివాడై చావుకు దగ్గరలో ఉన్నా మరియు ఇస్మాయీల్ తన ఏకైక సంతానమై ఉండినా కూడా, ఆయన అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి:
“అందువల్ల మేమతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము. మరి ఆ బాబు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నపుడు, “ఓ బాబూ! నేను నిన్ను 'జిబహ్' చేస్తున్నట్లు కలగన్నాను. మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు" అని అతను అన్నాడు. “తండ్రీ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు." అని ఆ బాలుడు బదులిచ్చాడు.
మరి వారిరువురూ (అల్లాహ్ ఆజ్ఞను) శిరసావహిస్తూ, అతను తన కుమారుడిని ఒక ప్రక్కకు త్రిప్పి పడుకో బెట్టాడు. అపుడు మేమతన్ని ఇలా పిలిచాము –“ఓ ఇబ్రాహీమ్! నువ్వు కలను నిజం చేసి చూపావు. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము." యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష. మేము ఒక పెద్ద బలిపశువును పరిహారంగా ఇచ్చి, ఆ బాలుణ్ణి విడిపించాము."[37:101-107 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
అపుడు అల్లాహ్ ఆయనకు 'ఇస్హాఖ్' అనే మరొక కుమారుడు కలగనున్నాడనే శుభవార్తను ఇచ్చాడు. తర్వాత ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఫలస్తీనాకు తిరిగి వచ్చారు:
“మరి మేమతనికి సద్వర్తనులలో ఒకడైన ఇస్హాఖ్ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము"[37:112 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
తన భార్య సారహ్ ద్వారా ఆయనకు ఇస్హాఖ్ జన్మించారు:
“అక్కడే నిలబడి ఉన్న అతని భార్య (సారహ్) నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్హాఖ్ గురించి, ఇస్హాఖ్ తరువాత యాఖూబు గురించిన శుభవార్తను వినిపించాము."[11:71 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఆ తర్వాత ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కొంత కాలం వరకు ఫలస్తీనాలో ఉండి, ఒక ముఖ్యమైన పని మీద మక్కా లోయకు తిరిగి వచ్చారు. కేవలం అల్లాహ్ ఆరాధన కొరకు మాత్రమే ప్రత్యేకించబడిన “కాబాగృహం" అనే మొట్టమొదటి ఆరాధనాలయాన్ని మక్కా లోయలో నిర్మించమని అల్లాహ్ ఆయనను ఆజ్ఞాపించినాడు. కాబట్టి, ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఈ బృహత్తర కార్యాన్ని మొదలు పెట్టారు. ఆయన కుమారుడు ఇస్మాయీల్ రాళ్ళ ఎత్తి, ఆయనకు అందించేవారు. గోడలు బాగా ఎత్తుకు చేరుకున్న తర్వాత, ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఒక రాతిపై నిలుచొని నిర్మాణాన్ని కొనసాగించారు. నేటికీ ఆ రాయి కాబాగృహం దగ్గరలోని మఖామె ఇబ్రాహీమ్ వద్ద పదిలంగా ఉంది. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి:
“మరియు ఇబ్రాహీము, ఇస్మాయిలుతో కలిసి కాబాగృహపు పునాదులు లేపుతున్నప్పుడు (ఇలా వేడుకున్నారు) "మా ప్రభూ! మా నుండి (ఈ సేవను) స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే అన్నీ వినేవాడవు, సర్వమూ తెలిసినవాడవు.'"[2:127 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
తవాఫ్ చేసే వారి కొరకు మరియు నమాజు చేసే వారి కొరకు పవిత్రంగా ఉంచడం కొరకు విగ్రహారాధనల నుండి మరియు ఇతర కల్పితాచారాల నుండి అల్లాహ్ యొక్క కాబాగృహాన్ని పరిశుద్ధంగా ఉంచమని అల్లాహ్ ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ అలైహిస్సలాంలను ఆదేశించినాడు. కాబాగృహ నిర్మాణం పూర్తయిన తర్వాత, ప్రజలను హజ్ యాత్ర కొరకు పిలవమని అల్లాహ్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించాడు:
“హజ్ యాత్ర ను ప్రకటించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర పర్వత కనుమలలో నుంచి కాలినడకనా, బక్కచిక్కిన ఒంటెలపైన స్వారీ చేస్తూ వస్తారు"[22:27 - : ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
అపుడు మక్కా కొరకు మరియు మక్కాలో నివసించే ప్రజల కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా దుఆ చేసినారు:
“మరియు ఇబ్రాహీము ఇలా అన్నప్పుడు “ఓ ప్రభూ! దీనిని ఒక సురక్షిత నగరంగా చేయుము. ఇంకా దీని నివాసులలో అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారికి పళ్ళుఫలాలను ఉపాధిగా ప్రసాదించు."
అందుకు ఆయన (అల్లాహ్) ఇలా అన్నాడు “మరియు ఎవరైతే తిరస్కరిస్తారో - వారికి (ఇహలోక) స్వల్ప సుఖాలను ప్రసాదిస్తాను. ఆ తరువాత నిర్బంధంగా వారిని నరకాగ్నిలోనికి నెట్టివేస్తాను మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం."[ 2:126 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఆ తర్వాత ఆయన తన కొరకు మరియు తన సంతతి కొరకు ఇలా ప్రార్థించారు:
మరియు ఇబ్రాహీము, ఇస్మాయిలుతో కలిసి కాబాగృహపు పునాదులు లేపుతున్నప్పుడు (ఇలా వేడుకున్నారు) "మా ప్రభూ! మా నుండి (ఈ సేవను) స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే అన్నీ వినేవాడవు, సర్వమూ తెలిసినవాడవు. మా ప్రభూ! మమ్మల్ని ముస్లిములుగా (మా అభీష్టాన్ని నీకు సమర్పించుకునే వారిగా) చేయి, అలాగే మా సంతతి నుండి ముస్లిములైన సమాజాన్ని ప్రభవింపజేయి. ఇంకా ఆరాధనారీతులను ('మనాసిక్ లను') మాకు చూపు మరియు మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపార కృపాశీలుడవు. "[2:127-128 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఆ తర్వాత ఆయన ఆ పవిత్ర సరిహద్దులలో నివాసితుల కొరకు,వారిలో నుండి 'కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని' పిలిచే ఒక సందేశహరుడిని పంపమని ఇలా దుఆ చేసారు:
“మా ప్రభూ!వారిలో నుండి వారి కొరకు ఒక రసూలును (సందేశహరుడిని) ప్రభవింపజేయి - నీ ఆయతులను పఠించి, వారికి దివ్యగ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించి, వారిని పరిశుద్ధులను చేయుటకు. నిశ్చయంగా, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు."[2:129 – ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం ]
తన ప్రవక్త యొక్క దుఆకు అల్లాహ్ స్పందించి, మక్కా ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా చేసినాడు. అక్కడి ప్రజలకు పళ్ళుఫలాలు ప్రసాదించాడు. వారి కొరకు వారిలో నుండి అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపినాడు. ఆయన ప్రవక్తలలో చిట్టచివరి వారు. ఆయన తర్వాత ఇక ఏ ప్రవక్తా పంపబడరు. అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, ప్రశంసలు అల్లాహ్ కే.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తర్వాత చాలా కాలం వరకు ప్రవక్తత్వం ఇజ్రాయీల్ సంతతిలోనే ఉండిపోయింది. చివరికి అల్లాహ్, ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సర్వమానవాళి కొరకు మార్గదర్శకుడిగా, తన చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపినాడు మరియు ఇలా ప్రకటించమని ఆయనకు ఆదేశించాడు:
“ (ఓ ముహమ్మద్) వారికి చెపు: 'ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను.'"[7:158 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరించమని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ఆదేశించినాడు:
“తరువాత మేము, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీమ్ ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు అల్లాహ్ కు సాటి కల్పించిన వారిలో చేరినవాడు కాడు"[16:123-ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
చావు వచ్చే వరకు ఇస్లాం ధర్మాన్ని వదిలి పెట్టవద్దని మరియు దాని ఆదేశాలనే అనుసరించాలని ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన సంతతికి ఇలా బోధించినారు:
“మరియు ఇబ్రాహీము తన కుమారులకు ఇలా ఉపదేశించినాడు, అలాగే యూఖూబు కూడా (ఉపదేశించినాడు) –“నా కుమారులారా!నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకుసత్యధర్మాన్ని (ఇస్లాంను) ఎన్నుకున్నాడు.కనుక, మీరు ముస్లిములుగా తప్ప మరణించకండి."" [2:132 - ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం]
ఓ అల్లాహ్! ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాంపై మరియు ఆయన కుటుంబంపై దీవెనలు కురిపించుగాక! ఎందుకంటే నీవే అత్యంత ప్రశంసనీయుడివి, అత్యంత ఘనమైన వాడివి.
ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం జీవిత కాలంలో నివసించి ఉన్న ఇతర ప్రవక్త ల పేర్లు – లూత్ అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్హాఖ్ అలైహిస్సలాం మరియు యాఖూబ్ అలైహిస్సలాం. ఆ తర్వాత పంపబడిన ప్రవక్తలు - యూసుఫ్ అలైహిస్సలాం, షుఅయిబ్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం మొదలైనవారు. ఆ తర్వాత అల్లాహ్ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంలను, ఈసా అలైహిస్సలాంలను పంపినాడు. ఇక చిట్టచివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపినాడు.
ఉసూల్అద్దీన్అల్ఇస్లామీ, షేఖ్ముహమ్మద్ఇబ్నెఇబ్రాహీమ్అల్తువైజ్రీ