×
ఈ వ్యాసంలో మన జీవిత అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే అంశం గురించి ఇస్లామీయ బోధనలు మరియు లాజికల్ విషయాల ఆధారంగా చర్చించబడింది. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులు చాలా సులభంగా తమ జీవన ఉద్దేశ్యం గురించి గ్రహించి, ఇస్లాం ధర్మం స్వీకరించే అవకాశం ఉన్నది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

    మన జీవిత ఉద్దేశ్యం ఏమిటి ?

    నేనెక్కడి నుండి వచ్చాను? నేనిక్కడ ఎందుకున్నాను? నేనెక్కడికి వెళ్ళుచున్నాను?

    మన జీవిత ఉద్దేశ్యం ఏమిటి అనే దానిపై దృష్టి సారించినప్పుడు, మన మెదడులో మొట్ట మొదట “అసలు మనం ఎక్కడి నుండి వచ్చాము?” అనే ప్రశ్న ఉదయిస్తుంది. యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా జరిగే ప్రకృతి సహజ పరిణామాల వలన మనం ఇక్కడ ఉన్నామా లేక దీని వెనుక అత్యంత వివేకవంతుడైన ఒక మహోన్నత సృష్టికర్త ఉన్నాడా? మన జీవితం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించడంలో మొదటి మెట్టు సృష్టికర్త ఉనికిని గుర్తించడం. సృష్టికర్తను ఎందుకు విశ్వసించాలనే దానికి విచక్షణతో కూడిన ఎన్నో వివేకవంతమైన హేతువాద కారణాలు ఉన్నాయి. అయితే వాటిలో నుండి మూడు కారణాలను ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిస్తున్నాము.

    1. విశ్వం యొక్క ఆరంభం

    సృష్టికర్త ఉనికిని స్పష్టంగా తెలిపే సృష్టి ఆరంభం గురించి అర్థం చేసుకోవడంపై దృష్టి సారించడం వైపు మొదటి సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది.

    ఉదాహరణకు ఎడారిలో నడుస్తుండగా, ఒక చేతి గడియారం అక్కడ పడి ఉండటాన్ని మీరు గుర్తించారని భావించుదాం. చేతి గడియారంలో గాజు కవరు, ప్లాస్టిక్ మరియు ఇనుము ఉంటాయనేది మనకు తెలుసు. సన్నటి ఇసుక నుండి గాజు తయారు అవుతుంది, ఆయిల్ నుండి ప్లాస్టిక్ తయారవుతుంది మరియు భూమి నుండి ఇనుము సంగ్రహించబడుతుంది – ఈ భాగాలన్నీ ఎడారిలో లభిస్తాయి. మరి, అలాంటప్పుడు, గడియారం తనకు తానుగా తయారై పోతుందా? సూర్యుడు ప్రకాశించుట, గాలి వీచుట, పిడుగులు పడుట, ఆయిల్ భూమి ఉపరితలం పైకి వచ్చి, సన్నటి ఇసుక మరియు ఇనుముతో కలిసి అనేక మిలియన్ల సంవత్సరాల వరకు ఉండిపోగా, యాధృచ్ఛికంగా లేక సహజసిద్ధంగా అది గడియారంలా తయారు కావడమనేది సంభవమేనా ?

    కొందరు ఇలా ప్రశ్నించవచ్చు, “అల్లాహ్ ను ఎవరు సృష్టించారు?”. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్, తన సృష్టి కంటే భిన్నమైన వాడు. ఆయన నిత్యుడు, ఆద్యంత రహితుడు. ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయనకు ఆరంభం లేదు – అంతం లేదు. కాబట్టి, అల్లాహ్ ను సృష్టించింది ఎవరు అనేది ఒక అవివేకమైన, అసంబద్ధమైన మరియు బుద్ధిహీనమైన ప్రశ్నే తప్ప మరేమీ కాదు.

    మానవజాతి అనుభవం మరియు సింపుల్ లాజిక్ మనకు చెబుతున్నదేమిటంటే ఆరంభం ఉన్నదేదైనా సరే, అది శూన్యం నుండి సృష్టించబడదు. అంతేగాక, ఏదీ తనను తానుగా సృష్టించుకోజాలదు. కాబట్టి, అత్యంత హేతుబద్ధమైన వివరణ ఏమిటంటే, మహోన్నతుడైన ఒక సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఆయన ఎంతో శక్తిమంతుడు మరియు వివేకవంతుడూను. ఎందుకంటే ఆయన మొత్తం విశ్వాన్ని ఏ చిన్న లోపమూ లేకుండా చాలా అద్భుతంగా సృష్టించాడు మరియు విశ్వం అనుసరించవలసిన వైజ్ఞానిక చట్టాల్ని కూడా. ఆ సృష్టికర్త కాలాతీతుడు మరియు స్థలాతీతుడు. ఎందుకంటే, కాలం, స్థలం మరియు పదార్థం అనేవి విశ్వ సృష్టి సమయంలో సృష్టిచబడినాయి. సృష్టికర్త ఈ లక్షణాలకు అతీతుడు. అవి సర్వలోక సృష్టికర్త యొక్క ప్రాథమిక దైవభావన ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయి. ఈ విశ్వం పరిమితమైనది మరియు దానికొక ఆరంభం ఉన్నదని తెలిపే నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో ఇది పూర్తిగా ఏకీభవిస్తున్నది.

    2. విశ్వం యొక్క పరిపూర్ణత

    ఎంతో వివేకవంతుడైన సృష్టికర్త ఉనికిని చాటే మన క్లిష్టతరమైన విశ్వం యొక్క పరిపూర్ణ సంతులనం మరియు క్రమం పై దృష్టి సారించడం వైపు రెండో సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది.

    సూర్యుడికి నిర్ణీత దూరంలో ఉంచబడిన భూమండం, భూమి పై పొర మందం, భూమి తన చుట్టూ తాను పరిభ్రమించే వేగం, వాతావరణంలోని ఆక్సిజన్ శాతం, భూమి ఒక కోణంలో వంగి ఉండటం మొదలైన విశ్వంలోని అనేక విశేషతలు సమస్త జీవరాశుల మనుగడకు అనుకూలంగా విశ్వమంతా ఒక అద్భుత పథకం ద్వారా యోచించబడిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణీత కొలతలలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా, భూమండలంపై జీవరాశుల ఉనికి కనబడేది కాదు.

    ఖచ్చితమైన సమయాన్ని చూపేలా గడియారాన్ని తయారు చేసే ఒక వివేకవంతుడైన తయారీదారుడు ఉన్నట్లే, ఖచ్చితంగా నిర్ణీత సమయం ప్రకారం సూర్యుడి చుట్టూ తిరిగేలా నియంత్రించి, భూమిని తయారు చేసిన మహావివేకవంతుడైన ఒక తయారీదారుడూ తప్పక ఉన్నాడు. దీనికి భిన్నంగా ఈ భూమి తనకు తానుగా ఉనికిలోనికి రావడమనేది సంభవమేనా?

    విశ్వం పాటిస్తున్న క్రమశిక్షణ, ఖచ్చితమైన విశ్వచట్టాలు, మనలోని మరియు మొత్తం విశ్వంలోని వ్యవస్థ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించి, దానికి ఒక నిర్వహణకర్త తప్పకుండా ఉంటాడని భావించడం వివేకవంతంగా లేదా ? ఇలాంటి లోపరహితమైన సృష్టి క్రమశిక్షణను రూపొందించి, నియంత్రిస్తున్న సర్వలోక సృష్టికర్త అల్లాహ్ యొక్క ఉనికిని ఈ ‘నిర్వహణకర్త’ పాత్ర స్పష్టంగా ఋజువు చేస్తున్నది.

    3. అల్లాహ్ తరుఫు నుండి పంపబడే దివ్యసందేశం (వహీ)

    తన ఉనికిని సూచించే నిదర్శనంగా మానవజాతి వద్దకు అల్లాహ్ పంపిన అసలు దివ్యసందేశంపై దృష్టి సారించడం వైపు మూడో సాక్ష్యాధారం మార్గదర్శకత్వం వహిస్తున్నది. ఇస్లాం మూలాధారమైన దివ్య ఖుర్ఆన్ గ్రంథం, అల్లాహ్ యొక్క దివ్యవచనమని నిరూపించే అనేక స్పష్టమైన సూచనలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఈ వాదనను బలపరిచే కొన్ని సాక్ష్యాధారాలు క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావించబడినాయి. ఖుర్ఆన్ :

    · ఖుర్ఆన్ అవతరించి 1400 సంవత్సరాలు దాటిపోయాయి. ఆ కాలంలోని ప్రజలకు అస్సలు తెలియని మరియు ఈ మధ్యనే సైన్సు ద్వారా కనిపెట్టబడిన అనేక వైజ్ఞానిక అంశాలు ఇందులో పేర్కొనబడినాయి. ఉదాహరణకు: జీవరాశులన్నింటి మూలం నీరు (ఖుర్ఆన్ 21:30); వ్యాపిస్తున్న విశ్వం (ఖుర్ఆన్ 51:47); సూర్యుడు మరియు చంద్రుడి స్వంత కక్ష్యలు (ఖుర్ఆన్ 21:33).

    · ఖుర్ఆన్ లో అనేక చారిత్రక వాస్తవ సంఘటనలు పేర్కొనబడినాయి. ఆనాటి కాలంలోని ప్రజలకు వాటి గురించి తెలియదు. అంతేగాక అనేక భవిష్యవాణులు కూడా ప్రస్తావించబడినాయి. వాటిలో కొన్ని నిజంగా జరిగిపోయాయి, మరికొన్ని జరగబోతున్నాయి.

    · వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, క్రమక్రమంగా 23 సంవత్సరాల సుదీర్ఖ కాలంలో అవతరించినా, ఎలాంటి లోపాలు మరియు పరస్పర విరుద్ధ వచనాలు లేకుండా ఖుర్ఆన్ దోషరహితంగా ఉన్నది.

    · కాలక్రమంలో కనుమరుగు అయి పోయిన ఇతర ధర్మాల అసలు మూలగ్రంథాలకు భిన్నంగా, అవతరించిన అరబీ భాషలో అసలు ఖుర్ఆన్ లోని ప్రతి పదం సురక్షితంగా భద్రపరచబడింది.

    · ఖుర్ఆన్ లో మానవుడి వివేకాన్ని మరియు సృష్టికర్త గురించిన స్వాభావిక విశ్వాసాన్ని మేలుకొల్పే సరళమైన మరియు స్వచ్ఛమైన సార్వజనిక సందేశం ఉన్నది.

    · ఖుర్ఆన్ లో ప్రజలపై గాఢమైన ప్రభావం చూపే మరియు వారిని కదిలించే సందేశం ఉన్నది.

    · ఖుర్ఆన్ గ్రంథం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. ఆయన నిరక్షరాస్యులైనా, దాని భాష అత్యుత్తమమైన వాగ్ధాటి, వక్తృత్వం మరియు భాషాపరమైన సాహిత్య సౌందర్యాలతో అరబీ భాషలో సాటిలేని తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినది.

    ఖుర్ఆన్ యొక్క అనేక అపూర్వ మరియు అద్భుత అంశాలలో అత్యంత హేతువాద విషయం ఏమిటంటే అది మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ నుండి తిన్నగా పంపబడింది.

    అల్లాహ్ దివ్యసందేశాన్ని పంపినాడు

    అత్యంత వివేకవంతుడైన అల్లాహ్ చే మనం సృష్టించబడినాము అనే విషయం గుర్తించిన తర్వాత, అసలు మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుపబడాలని మనం ఆశిస్తాము. మన నుండి అల్లాహ్ ఏమి ఆశిస్తున్నాడో మనం ఎలా తెలుసుకోగలము? మనం ఏదో విధంగా జీవించాలా లేక స్వంతంగా ఏదైనా జీవిత లక్ష్యం పెట్టుకోవాలా? ఇతరులను అనుసరిస్తూ జీవన ప్రవాహంలో కొట్టుకుపోవాలా? లేదు. మన జీవిత లక్ష్యం మనకు తెలుపుట కొరకు అల్లాహ్ ప్రవక్తలను మరియు దివ్యసందేశాలను పంపినాడు.

    అల్లాహ్ వేలాది ప్రవక్తలను పంపినాడు, దాదాపు ప్రతి జాతి కోసం కనీసం ఒక ప్రవక్తను పంపినాడు. ఏ జాతిలో, ఏ భాషలో, ఏ కాలంలో పంపబడినా, వారందరిదీ ఒకే సందేశం: కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని మాత్రమే అనుసరించండి. ఆ ప్రవక్తలలో కొందరు – ఆదమ్, నూహ్, అబ్రహామ్, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

    ప్రవక్తల పరంపరలో చిట్టచివరి వారైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ, న్యాయం, కారుణ్యం మరియు ధైర్యసాహసాలు నిండిన ఒక పరిపూర్ణ ఆదర్శవంతుడు. ఆయనపై అల్లాహ్ తన అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ ను అవతరింపజేసినాడు. ఈ ప్రాపంచిక జీవితంలో ఖుర్ఆన్ లోని దివ్యసందేశాలను ఎలా ఆచరించాలో ప్రయోగాత్మకంగా చూపెట్టినారు.

    అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ ఒక గొప్ప మార్గదర్శక గ్రంథం. అది మన ఉనికి ఉద్దేశ్యం, అసలు ఆరాధ్యుడు ఎవరు, అల్లాహ్ కు ఇష్టమైన మరియు అయిష్టమైన పనులు ఏవి, ప్రవక్తల వృత్తాంతాలు మరియు వాటి గుణపాఠాలు, స్వర్గనరకాలు మరియు అంతిమ తీర్పుదినం వంటి అనేక భావనలను వివరిస్తున్నది. సర్వలోక సృష్టికర్త గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలు, భ్రమలు దూరం చేయడం కూడా దాని లక్ష్యాలలో ఒక ప్రధాన లక్ష్యం, ఉదాహరణకు సృష్టికర్త స్వభావానికి మరియు జీసస్ యొక్క స్వభావం & పాత్రకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేయడం.

    ఇతర ప్రవక్తల వలే జీసస్ అలైహిస్సలాం కూడా అనేక మహిమలు ప్రదర్శించి చూపారు మరియు ఏకైక నిజ దైవాన్ని మాత్రమే ఆరాధించమని ఆహ్వానించారు. (ఖుర్ఆన్ 19:36).

    జీసస్ (అలైహిస్సలాం) స్వభావం

    ఇస్లాం ధర్మంలోని దైవభావన గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు జీసస్ అలైహిస్సలాం హోదా, ఆయన స్వభావం గురించి విస్తృతంగా వ్యాపించి ఉన్న అపోహలు, అస్పష్టత, గందరగోళం మరియు ఆయన స్వభావంపై వినిపిస్తున్న విభిన్న దావాల గురించి చర్చించడం చాలా ముఖ్యం.

    కొందరు క్రైస్తవులు “జీసస్ దేవుడు” లేక త్రైత్వంలో ఒకడని దావా చేస్తున్నారు – అంటే భూమండలంపై దేవుడి అవతారమనీ మరియు దేవుడు మానవుడిగా మారాడనీ దావా చేస్తున్నారు. అయితే, బైబిల్ ప్రకారం జీసస్ జన్మించినాడు, భుజించాడు, నిద్రించాడు, ప్రార్థించాడు మరియు పరిమితమైన జ్ఞానం కలిగి ఉండినాడు – ఈ లక్షణాలన్నీ సృష్టికర్త స్థాయికి ఎంతమాత్రం తగినవి కావు. మానవుడి లక్షణాలకు భిన్నంగా, సృష్టికర్త దివ్యలక్షణాలలో పరిపూర్ణత్వం ఉంటుంది. మరి అలాంటప్పుడు, పూర్తిగా రెండు భిన్నమైన అంశాలు ఏకకాలంలో ఎలా సంభవించగలవు? ఇది ఎంతమాత్రం హేతుబద్ధమైన విషయం కాదు.

    అయితే, కొందరు ఇలా ప్రశ్నించవచ్చు, “ఒకవేళ దేవుడు ఏదైనా చేయగలిగే శక్తిసామర్ధ్యాలు కలిగి ఉంటే, మానవుడిగా ఎందుకు మారలేడు?” నిర్వచనం ప్రకారం, సర్వలోక సృష్టికర్త తన స్థాయికి తగని పనులు చేయడు. కాబట్టి, ఒకవేళ దేవుడు మానవుడిగా మారి, మానవుడి లక్షణాలు అలవర్చుకుంటే, ఇక ఆయన ఎంత మాత్రమూ దేవుడిగా మిగిలి ఉండడు.

    అంతేగాక, దేవుడు మరియు తాను వేర్వేరు అని స్పష్టం చేస్తున్న జీసస్ అలైహిస్సలాం పలుకులు మరియు ప్రవర్తనలను తెలిపే అనేక వచనాలు బైబిల్ లో ఉన్నాయి. ఉదాహరణకు, జీసస్ “సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.” [మత్తయి 26:39]. ఒకవేళ జీసస్ యే గనుక దేవుడు అయినట్లయితే, దేవుడు అలా సాగిలపడి, ప్రార్థిస్తాడా? మరియు ఆయన ఇక్కడ ప్రార్థించింది ఎవరిని?

    కొందరు క్రైస్తవులు “జీసస్ దేవుడి కుమారుడు” అని దావా చేస్తున్నారు. అసలు దీని అర్థం ఏమిటి? అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసి వస్తున్నది. నిస్సందేహంగా సర్వలోక సృష్టకర్త శారీరక మరియు శాబ్దిక కొడుకు కలిగి ఉన్నాడనే భావనలకు అతీతుడు. అయితే, “దేవుని కుమారుడు” అనే పదం తొలితరం బైబిల్ భాషలలో లాంఛనపరంగా “ధర్మపరాయణుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, సదాచారి అయిన వ్యక్తి” ని సూచిస్తూ వాడబడింది. మొత్తం పాతనిబంధనలో అనేక చోట్ల డేవిడ్, సోలోమాన్ మరియు ఇజ్రాయీలు మొదలైన సదాచార ప్రవక్తలను సూచిస్తూ వాడబడింది – అంతేగాని కేవలం జీసస్ అలైహిస్సలాంకు మాత్రమే పరిమితం చేయబడలేదు, ఉదాహరణకు “…ఇశ్రాయేలు నాకు మొదట పుట్టిన కుమారుడు,” (నిర్గమ కాండము 4:22).

    “కుమారుడిని కలిగి ఉన్నాడనటం అల్లాహ్ ఔన్నత్యానికి తగిన మాట కాదు; ఆయన పరిపూర్ణుడు మరియు ఎలాంటి లోపాలూ లేనివాడు!”ఖుర్ఆన్ 19:35

    అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే అంశాన్ని జీసస్ అలైహిస్సలాం గురించిన ఇస్లామీయ విశ్వాసం స్పష్టం చేస్తూ, సర్వలోక సృష్టికర్త యొక్క పరిపూర్ణ ఘనత, ఏకత్వం మరియు సంపూర్ణత్వం గురించిన స్వచ్ఛమైన విశ్వాసాన్ని వివరిస్తున్నది. దాని ప్రకారం జీసస్ అలైహిస్సలాం ఒక గౌరవనీయుడైన మహా ప్రవక్త. కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించేందుకు పంపబడినారు.

    మరి…నేనిక్కడ ఎందుకు ఉన్నాను?

    మన అవయవాలైన కళ్ళు, చెవులు, మెదడు మరియు గుండె మొదలైన వాటన్నింటికీ ఒక్కో ఉద్దేశ్యం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. మరి అలాంటప్పుడు మొత్తం అవయవాలతో కూడిన మన శరీరానికీ ఏదైనా ఉద్దేశ్యం, ప్రయోజనం ఉందా ?

    అత్యంత వివేకవంతుడైన అల్లాహ్ మనల్ని ఎలాంటి లక్ష్యం లేకుండా అటూ ఇటూ తిరగటానికి లేదా మన సహజ అవసరాలు మరియు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటానికి సృష్టించలేదు. మన జీవితానికి ఒక గొప్ప ఉద్దేశ్యం ఉన్నది – అదేమిటంటే, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ను గుర్తించుట మరియు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించుట, తద్వారా సృష్టికర్త మార్గదర్శకత్వంలో జీవితం గడుపుట. అన్ని కోణాలలో సాఫల్యవంతమైన మరియు శుభప్రదమైన జీవితాన్ని గడిపేలా ఈ మార్గదర్శకత్వం దారి చూపుతుంది. ఉదాహరణకు – వ్యక్తిగత ఆరాధనలైన నమాజు, దుఆలతో పాటు సమాజానికి ప్రయోజనం కలిగించే ఇరుగు పొరుగు వారితో మంచిగా మెలగడం, కుటుంబ పోషణ బాధ్యతలు, నిజాయితీ మరియు పశుపక్ష్యాదుల మంచిచెడులు చూడుట మొదలైన పనులు.

    తనను వదిలి లేదా తనతో పాటు ఇతరులను ఆరాధించుట, సాటి కల్పించుట మొదలైన అవిధేయతలను, అవిశ్వాసాల్నీ అల్లాహ్ పూర్తిగా నిషేధించినాడు. (ఉదాహరణకు, విగ్రహారాధన, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల పూజ, బాబాలు, గురువులు లేక ప్రవక్తల పూజ మొదలైనవి ఇస్లాంలో పూర్తిగా నిషేధించబడినాయి.). ఆయనకు ఎవ్వరి భాగస్వామ్యం లేక మధ్యవర్తిత్వం యొక్క అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఎల్ల వేళలా అల్లాహ్ ను డైరక్టుగా ఆరాధించవచ్చు, వేడుకోవచ్చు.

    ఈ మానవజీవితం ఒక పరీక్షా కాలమని అల్లాహ్ స్పష్టంగా తెలిపినాడు. ఇక్కడ వేర్వేరు పద్ధతులలో ప్రజలు పరీక్షించబడతారు. జరుగుతున్న దానిని మనం నియంత్రించలేము. కానీ, దానికి మనమెలా స్పందించాలో నియంత్రించుకోగలం. కష్టకాలంలో సహనం, ఓర్పు మరియు శుభకాలంలో అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవడం మొదలైనవి మనల్ని అల్లాహ్ దగ్గరికి చేర్చే మరియు శాశ్వత స్వర్గంలో మంచి స్థానం సంపాదించి పెట్టే కొన్ని మాధ్యమాలు. అలాగే ఒకవేళ అవిశ్వాస మార్గాన్ని ఎంచుకుంటే మరియు ఆయన దివ్యాజ్ఞలను పెడచెవిన పెడితే, నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందని హెచ్చరించబడింది.

    మరి… ఇప్పుడు నేనేం చేయాలి?

    అసలు విశ్వాస పరీక్ష ఏమిటంటే మనకు ప్రసాదించిబడిన తెలివితేటలను ఉపయోగించి అల్లాహ్ యొక్క సూచనలు మరియు చిహ్నాల గురించి లోతుగా ఆలోచించి, యోచించి మరియు గుర్తించి, ఆయన దివ్యమార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ జీవించుట. ఇలా చేయాలంటే మనం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క దైవాజ్ఞలకు పూర్తిగా సమర్పించుకోవాలి, అలా సమర్పించుకున్న వారినే అరబీ భాషలో “ముస్లిం” లు అంటారు. అరబీ భాషలో ఏకైక సృష్టికర్త పేరు అల్లాహ్. ఆయన ఇస్లాం ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆచరించేలా సార్వజనిక ధర్మంగా చేసినాడు. ప్రపంచంలో ఏ మారుమూల నివసించేవారైనా సరే తమ చారిత్రక, భూత, వర్తమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా అల్లాహ్ యొక్క సత్యధర్మాన్ని స్వీకరించవచ్చు మరియు క్రింది షహాదా అంటే సాక్ష్యప్రకటన పలుకుతూ ముస్లింగా మారవచ్చు:

    “నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడెవ్వడూ లేడని, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను – ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడనీ.”

    మరి, జీవిత ఉద్దేశ్యాన్ని మరియు లక్ష్యాన్ని సాధించే దిశలో పయనించే, సత్యానికి సమర్పించుకునే మరియు మీ సృష్టికర్త అయిన అల్లాహ్ ను గుర్తించే సమయం ఇంకా ఆసన్నం కాలేదా ?

    http://islamicpamphlets.com/purpose-of-life/