×
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

    ఇస్లాంలోని బహుభార్యాత్వంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    ] తెలుగు – Telugu –تلغو [

    islamhouse.com

    2012 - 1433

    أسئلة وشبهات عن تعدد الزوجات في الإسلام

    « باللغة تلغو »

    موقع دار الإسلام

    2012 - 1433

    ఇస్లాంలోని బహుభార్యాత్వంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    1. ఎందుకు ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని అనుమతిస్తున్నది?

    1. బహుభార్యాత్వం మరియు బహుభర్తృత్వాల నిర్వచనం:

    ఏకకాలంలో భర్త ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండే వివాహ వ్యవస్థను బహుభార్యాత్వం (Polygamy) అంటారు. అలాగే ఏకకాలంలో భార్య ఒకరికంటే ఎక్కువ భర్తలను కలిగి ఉండే వివాహవ్యవస్థను బహుభర్తృత్వం (polyandry) అంటారు. అంటే బహుభార్యాత్వంలో ఒక భర్తకు ఏకకాలంలో అనేక మంది భార్యలు ఉంటారు మరియు బహభర్తృత్వంలో ఒక భార్యకు ఏకకాలంలో అనేకమంది భర్తలు ఉంటారు. ఇస్లాం ధర్మంలో పరిమిత బహుభార్యాత్వం అనుమతించబడింది; బహుభర్తృత్వం పూర్తిగా నిషేధించబడింది.

    ఇక ఇప్పుడు అసలు ప్రశ్నవైపు వద్దాం – ఎవరైనా వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువమంది భార్యలు కలిగి ఉండే అనుమతి ఎందుకు ఇవ్వబడింది?

    1. "కేవలం ఒక్క భార్యను మాత్రమే పెళ్ళి చేసుకోండి" అని ప్రపంచంలో స్పష్టంగా చెబుతున్న ఏకైక ధార్మిక గ్రంథం ఖుర్ఆన్ మాత్రమే:

    'కేవలం ఒక్క భార్యను మాత్రమే పెళ్ళి చేసుకోండి' అనే స్పష్టమైన ప్రకటనతో ఈ భూమిపై నేటికీ మిగిలి ఉన్న ఏకైక ధార్మిక గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం మాత్రమే. ఒక్క భార్యను మాత్రమే కలిగి ఉండండి అని పురుషులను ఆజ్ఞాపించే మరో ధార్మిక గ్రంథం ప్రపంచంలో ఏ ధర్మములోనూ లేదు. వేదాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, తల్మూద్, బైబిల్ మొదలైన ఇతర ధర్మాలకు చెందిన ఏ ధార్మిక గ్రంథంలోనూ భార్యల సంఖ్యను పరిమితం చేసే నిర్బంధం మీకు కనబడదు. ఈ దైవగ్రంథాల ప్రకారం, ఎవరైనా సరే తమకు ఇష్టమైనంత మంది భార్యలను పెళ్ళాడవచ్చు. ఈ మధ్యనే హిందూ పండితులు మరియు క్రైస్తవ చర్చీలు భార్యల సంఖ్యను ఒకటికి పరిమితం చేసారు.

    వారి గ్రంథాలలో పేర్కొన్నదాన్ని బట్టి అనేక మంది ధర్మనిష్ఠాపరులు ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండేవారు. ఉదాహరణకు శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజుకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. శ్రీ కృష్టుడికి లెక్కలేనన్ని భార్యలు ఉండేవారు.

    పూర్వకాలంలో, తమకు ఇష్టమొచ్చినంత మంది భార్యలను కలిగి ఉండే అనుమతి క్రైస్తవ పురుషులకు ఉండేది. ఎందుకంటే భార్యల సంఖ్యను పరిమితం చేసే ఎలాంటి నిర్భంధం బైబిల్ లో లేదు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే భార్యల సంఖ్య ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండరాదనే నిషేధాజ్ఞలను చర్చీ జారీ చేసింది.

    యూదమతంలో కూడా బహుభార్యాత్వం అనుమతించబడింది. తల్ముడిక్ చట్టం ప్రకారం, అబ్రహాం ముగ్గురు భార్యలను, సోలోమాన్ వంద మంది భార్యలను కలిగి ఉండేవారు. రబ్బీ గెర్షోమ్ బెన్ యహూదహ్ (Rabbi Gershom ben Yehudah 955 C.E to 1030 C.E) నిషేధాజ్ఞలు జారీ చేసేవరకు వారి ధర్మంలో బహుభార్యాత్వం కొనసాగింది. ముస్లిం దేశాలలో నివసిస్తున్న సెఫార్డిక్ యూద తెగలలో 1950వ సంవత్సరం వరకు బహుభార్యాత్వం కొనసాగింది. చివరికి బహుభార్యాత్వాన్ని నిషేధించేందుకు ఇస్రాయీల్ యొక్క ప్రధాన రబ్బినేట్ ఒక చట్టం తీసుకు రావలసి వచ్చింది.

    1. ముస్లింల కంటే ఎక్కువగా హిందువులలో బహుభార్యాత్వం ఉంది:

    1975లో ప్రచురించబడిన 'ఇస్లాంలో మహిళల స్థానం యొక్క కమిటీ' ('Committee of The Status of Woman in Islam'), రిపోర్టులోని 66 మరియు 67వ పేజీలలో ప్రచురించబడిన దానిని బట్టి, 1951 మరియు 1961 సంవత్సరాల మధ్య హిందువులలో జరిగిన బహుభార్యాత్వ వివాహాలు 5.06% కాగా ముస్లింలలో జరిగిన బహుభార్యాత్వ వివాహాలు కేవలం 4.31% మాత్రమే. భారతీయ చట్టం ప్రకారం, కేవలం ముస్లింలకు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ భార్యలను పెళ్ళి చేసుకునే అనుమతి ఉంది. భారతదేశంలో ఏ ముస్లిమేతరుడు కూడా ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటమనేది చట్టవిరుద్ధం. చట్టపరంగా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్న ముస్లింల సంఖ్య కంటే చట్టవ్యతిరేకంగా బహుభార్యాత్వాన్ని పాటిస్తున్న హిందువుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంది. పూర్వం భార్యల సంఖ్యను పరిమితం చేసే నిర్భంధమేదీ హిందువులపై ఉండేది కాదు. కేవలం 1954వ సంవత్సరంలో హిందూ వివాహ చట్టం పాసైన తర్వాత మాత్రమే, హిందువులు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం చట్టవిరుద్ధమైంది. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను పెళ్ళి చేసుకోకుండా ప్రస్తుతం ఆపుతున్నది భారత దేశ చట్టమే గానీ, హిందూ ధర్మ గ్రంథాలు కాదు.

    ఇక మనం ఇప్పుడు ఎందుకు ఇస్లాం ధర్మం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను పెళ్ళి చేసుకునే అనుమతి పురుషులకు ఇస్తున్నదో పరిశోధన చేద్దాం.

    1. పరిమిత బహభార్యాత్వాన్ని ఖుర్ఆన్ అనుమతిస్తున్నది :

    ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా, 'కేవలం ఒక్క భార్యను మాత్రమే పెళ్ళి చేసుకోండి' అనే స్పష్టమైన ప్రకటనతో ఈ భూమిపై నేటికీ మిగిలి ఉన్న ఏకైక ధార్మిక గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం మాత్రమే. ఈ పలుకు ఖుర్ఆన్ గ్రంథంలోని నాలుగవ అధ్యాయమైన సూరతున్నిసాలోని క్రింది వచనంలో ఉన్నాయి:

    "మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే, లేదా మీ స్వాధీనంలో నున్న వారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి." [దివ్యఖుర్ఆన్ 4:3]

    ఖుర్ఆన్ అవతరించక పూర్వం, బహుభార్యాత్వంపై ఎలాంటి హద్దు నిర్దేశించబడలేదు. అనేక మంది పురుషులు లెక్కలేనంత మంది భార్యలను కలిగి ఉండేవారు, కొందరైతే వందల సంఖ్యలో. అయితే ఇస్లాం ధర్మం దానికి ఒక హద్దు నిర్దేశించింది – ఏకకాలంలో ఎవరైనా పురుషుడు నలుగురిని మించి భార్యలను కలిగి ఉండరాదు. భార్యల మధ్య న్యాయం చేయటం తప్పనిసరి అనే ఒక షరతుతో ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు భార్యలను ఏకకాలంలో కలిగి ఉండే అనుమతి ఇస్లాం ధర్మం పురుషుడికి ఇచ్చింది.

    ఖుర్ఆన్ లోని 4వ అధ్యాయమైన సూరతున్నిసాలోని 129వ వచనం ఇలా చెబుతున్నది:

    "మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని...." [దివ్యఖుర్ఆన్ 4:129]

    కాబట్టి బహుభార్యాత్వమనేది ఒక తప్పనిసరి నియమం కాదు, కానీ ఒక మినహాయింపు మాత్రమే. ముస్లింలు తప్పనిసరిగా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండాలనే అపోహ అనేక మందిలో ఉంది.

    ఇస్లాం ధర్మంలో 'ఏమి చేయాలి ఏమి చేయకూడదో' నిర్ణయించే కేటగిరీలు ఉన్నాయి:

    i. 'ఫర్ద్' i.e. తప్పనిసరిగా లేదా విధిగా చేయవలసినవి

    ii. 'ముస్తహబ్' i.e. ప్రోత్సహించబడినవి

    iii. 'ముబహ్' i.e. అనుమతించబడినవి

    iv. 'మక్రూహ్' i.e. నిరుత్సాహపరచబడినవి

    v. 'హరామ్' i.e. నిషేధించడినవి లేదా నివారించబడినవి

    బహుభార్యాత్వం మధ్యలో ఉన్న 'అనుమతించబడిన' విషయాల కేటగిరీకి చెందింది. ఎవరైనా ముస్లిం ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు భార్యలు కలిగి ఉంటే అతడు ఒక భార్య కలిగి ఉన్న ముస్లిం కంటే ఉత్తముడని చెప్పటానికి ఆస్కారం లేదు.

    1. మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువ :

    ప్రకృతి సహజంగా, స్త్రీపురుషులు ఒకే నిష్పత్తిలో జన్మించారు. వ్యాధినిరోధక శక్తి మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంది. రోగాణువులతో మరియు వ్యాధులతో మగశిశువు కంటే ఆడశిశువు ఎక్కువ వీరోచితంగా పోరాడగలదు. ఈ కారణంగా, బాల్యంలోనే మరణించే శిశువులను గమనిస్తే, ఆడశిశువుల కంటే మగశిశువులు ఎక్కువగా మరణిస్తున్నారు.

    యుద్ధరంగంలో స్త్రీల కంటే ఎక్కువగా పురుషులే చంపబడుతూ ఉంటారు. ప్రమాదాలలో మరియు రోగాలలో ఎక్కువగా పురుషులే చనిపోతూ ఉంటారు. స్త్రీల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఏ కాలంలోనైనా సరే, ప్రపంచంలో భార్యను కోల్పోయిన భర్తల కంటే, భర్తను కోల్పోయిన వింతువులు, విధవరాళ్ళే ఎక్కువగా కనబడతారు.

    1. భ్రూణహత్యలు మరియు ఆడశిశుహత్యల కారణంగా భారతదేశంలో స్త్రీల కంటే పురుషుల జనాభా ఎక్కువగా ఉంది.

    పురుషుల జనాభా కంటే స్త్రీల జనాభా తక్కువగా ఉన్న ప్రపంచంలోని అతి కొద్ది దేశాల లిష్టులో, దాని ఇరుగు పొరుగు దేశాలతో పాటు భారతదేశం పేరు కూడా ఉన్నది. దీనికి ముఖ్యకారణం అత్యధిక సంఖ్యలోని ఆడశిశుహత్యలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం మాతృగర్భంలో ఆడశిశువుగా గుర్తించబడిన వెంటనే ఒక మిలియన్ కంటే ఎక్కువ అబార్షన్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ శిశుహత్యలను ఆపగలిగితే, భారతదేశంలో కూడా స్త్రీల జనాభా పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది.

    1. ప్రపంచ మహిళా జనాభా పురుషుల జనాభా కంటే అధికంగా ఉంది.

    అమెరికాలో పురుషుల కంటే స్త్రీల జనాభా దాదాపు 7.8 మిలియన్ల ఎక్కువగా ఉంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే స్త్రీల జనాభా పురుషుల కంటే ఒక మినియన్ ఎక్కువగా ఉంది. అంతేగాక అక్కడి పురుష జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజలు స్వలింగ సంపర్కులు. అమెరికాలో మొత్తంగా 25 మిలియన్ల కంటే ఎక్కువగా స్వలింగ సంపర్కులు ఉన్నారు. ఈ పురుషులకు స్త్రీలను పెళ్ళి చేసుకోవటం ఇష్టం ఉండదు. గ్రేట్ బ్రిటన్ లో పురుషుల కంటే స్త్రీల జనాభా నాలుగు మిలియన్లు ఎక్కువగా ఉంది. జర్మనీలో పురుషుల సంఖ్య స్త్రీల కంటే 5 మిలియన్లు ఎక్కువగా ఉంది. రష్యాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య 9 మిలియన్లు ఎక్కువగా ఉంది. ప్రపంచంలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎన్ని మిలియన్లు ఎక్కువగా ఉందో ఆ దేవుడికే తెలుసు.

    1. ప్రతి ఒక్క వ్యక్తిని కేవలం ఒకే ఒక భార్యతో సరిపెట్టుకునేలా నిర్భంధించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.

    ఒకవేళ ప్రతి పురుషుడు కేవలం ఒక స్త్రీనే పెళ్ళి చేసుకున్నా, అమెరికాలో భర్తలు లభించని స్త్రీల సంఖ్య దాదాపు 30 మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది (అమెరికాలో ఉన్న 25 మిలియన్ల స్వలింగ సంపర్కులను లెక్కలోనికి తీసుకున్న తర్వాత). అలాగే గ్రేట్ బ్రిటన్ లో 4 మిలియన్ల స్త్రీలకు, జర్మనీలో 5 మిలియన్ల స్త్రీలకు మరియు రష్యాలో 9 మిలియన్ల స్త్రీలకు భర్తలు దొరకరు.

    అమెరికాలో భర్తలు దొరకని 30 మిలియన్ల అవివాహిత స్త్రీలలో నా సోదరి మరియు మీ సోదరి కూడా ఉన్నారని భావిద్దాం. ఇక వారి కొరకు మిగిలిన దారులు రెండే – అవి అంతకు ముందు నుండే పెళ్ళి చేసుకుని భార్యతో ఉన్న పురుషునికి రెండో భార్యగా మారటం లేదా పబ్లిక్ ప్రాపర్టీగా మారటం. మరో దారి లేదు. సచ్ఛీల యువతులు స్వతహాగా మొదటి దారినే ఎంచుకుంటారు.

    పాశ్చాత్య సమాజంలో, పురుషులు ఉంపుడు గత్తెలను కలిగి ఉండటం, వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులలో ఆ స్త్రీలు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ, భద్రతలేని జీవితాన్ని గడుప వలసి వస్తుంది. ఒకవేళ ఆ స్త్రీలు ఎవరైనా వివాహిత పురుషుడిని పెళ్ళి చేసుకుని, అతనికి మరో భార్యగా మారితే రోజువారి అవమానాలకు బదులు ఆమెకు మానమర్యాదలు, సమాజంలో గౌరవ స్థానం మరియు జీవితంలో భద్రత లభిస్తాయి కదా! కానీ వారి పాశ్చాత్య సమాజం వివాహిత పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండటాన్ని ఆమోదించదు.

    కాబట్టి ఏ యువతికైతే భర్త దొరకలేదో, ఆమె ముందు కేవలం రెండే దారులున్నాయి – వివాహిత పురుషుడిగి మరో భార్యగా మారటం లేదా పబ్లిక్ ప్రాపర్టీగా మారటం. రెండో మార్గం ద్వారా స్త్రీల పవిత్ర స్థానాన్ని నీచస్థితికి దిగజార్చకుండా, మొదటి మార్గం ద్వారా స్త్రీలకు గౌరవస్థానం ప్రసాదించటానికే ఇస్లాం ధర్మం ప్రాధాన్యత నిస్తుంది.

    ఇస్లాం ధర్మం ఎందుకు బహుభార్యాత్వానికి అనుమతించిందనే ప్రశ్నకు ఇంకా అనేక ఇతర కారణాలున్నాయి. అయితే ఆచరణాత్మక పద్ధతిలో స్త్రీలకు మానమర్యాదలు ప్రసాదించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నది.

    2. ఒకవేళ ఎవరైనా పురుషుడికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండే అనుమతి ఇస్తున్నప్పుడు, భార్యలకు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను పెళ్ళాడే అనుమతి ఇస్లాం ధర్మం ఎందుకు ఇవ్వటం లేదు?

    కొందరు ముస్లింలతో సహా అనేక మంది ప్రజలు ముస్లిం పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండే అనుమతి ఉన్నప్పుడు, అదే హక్కు భార్యలకు ఎందుకు లేదనే లాజికల్ ప్రశ్న అడుగుతూ ఉంటారు.

    ముందుగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే న్యాయం మరియు సమనత్వాలే ఇస్లామీయ సమాజం యొక్క పునాది. అల్లాహ్ స్త్రీపురుషులను సమమైన జోడీగా సృష్టించాడు, అయితే విభిన్న సామర్ధ్యాలతో మరియు విభిన్న బాధ్యతలతో. స్త్రీపురుషులు శారీరకంగా మరియు మానసికంగా విభిన్నమైన వారు. వారి పాత్రలు మరియు బాధ్యతలు వేర్వేరు. ఇస్లాం ధర్మంలో స్త్రీ పురుషులు సమానులే కానీ ఐడెంటికల్ కాదు.

    దివ్యఖుర్ఆన్ లోని 4వ అధ్యాయం అయిన సూరతున్నిసాలోని 22 నుండి 24వ వచనాలలో ఏ మహిళలనైతే మీరు పెళ్ళి చేసుకోలేరో ఆ మహిళల లిష్టు పేర్కొనబడింది. ఇంకా, అదే అధ్యాయంలోని 24వ వచనంలో వివాహిత స్త్రీలు (ఒకరికి భార్యగా ఉంటూ) మరో పెళ్ళి చేసుకోవటం నిషేధించబడింది.

    ఇస్లాంలో బహుభర్తృత్వం నిషేధించబడటానికి కొన్ని కారణాలు:

    1. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువ భార్యలుంటే, అలాంటి పెళ్ళళ్ళ ద్వారా కలిగే సంతానం యొక్క తల్లిదండ్రులను సులభంగా గుర్తించవచ్చు.ఆ పిల్లల తండ్రి మరియు తల్లి – ఇద్దరినీ తేలిగ్గా గుర్తించవచ్చు. ఒకవేళ ఎవరైనా స్త్రీ, ఒకరి కంటే ఎక్కువ భర్తలను ఏకకాలంలో పెళ్ళాడితే, అలాంటి పెళ్ళళ్ళ వలన కలిగే సంతానం యొక్క తల్లిని మాత్రమే గుర్తించగలం గానీ తండ్రిని గుర్తించలేము. పిల్లల తల్లి మరియు తండ్రి ఇద్దరి గుర్తింపుకు ఇస్లాం ధర్మం చాలా ప్రాధాన్యతను ఇస్తున్నది. తల్లిదండ్రులు ఎవరో తెలియని, ముఖ్యంగా తండ్రి ఎవరో తెలియని చిన్నపిల్లలు తీవ్రమైన మానసిక గాయాలకు మరియు అలజడికి ఒత్తిడికి గురవుతారని మానసిక శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. తరుచుగా వారు దుఃఖమయమైన బాల్యం గడుపుతారు. అందువలననే వేశ్యల పిల్లలు ఆరోగ్యవంతమైన బాల్యం కలిగి ఉండరు. అలాంటి పెళ్ళి ద్వారా పుట్టిన బిడ్డను ఒకవేళ పాఠశాలలో చేర్చటానికి తీసుకవెళ్ళితే, అక్కడ బిడ్డ తండ్రి పేరు అడిగినపుడు ఆమె ఒకరి కంటే ఎక్కువ పేర్లు చెప్పవలసి వస్తుంది! జెనెటిక్ పరీక్షల ద్వారా ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో బిడ్డ తల్లినీ, తండ్రిని తేలిగ్గా కనిపెట్టవచ్చనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి, పూర్వకాలానికి వర్తించే ఈ కారణం ప్రస్తుత కాలానికి వర్తించక పోవచ్చు.
    1. స్త్రీతో పోలిస్తే పురుషుడే ప్రకృతి సహజంగా బహుభార్యాత్వానికి ఎక్కువగా యోగ్యుడు.
    1. బయోలాజికల్ గా, అనేక మంది భార్యలున్నా వారందరి భర్తగా తన బాధ్యతలను పూర్తి చేయడం ఒక పురుషుడి తేలిక. అనేక మంది భర్తలను కలిగి ఉన్న అలాంటి స్థానంలోని ఒక మహిళకు వారందరి భార్యగా తన బాధ్యతలను పూర్తి చేయటం అసాధ్యం. బహిష్టు కాలచక్రంలోని వివిధ దశల కారణంగా ఒక మహిళ అనేక మానసిక మరియు స్వాభావిక మార్పులకు గురవుతుంది.
    1. ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు గల స్త్రీతో అనేక మంది పురుషులు సంభోగం జరుపుతారు. దీని కారణంగా ఆమెకు సుఖవ్యాధులు మరియు లైంగిక వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే, ఒక భర్త ద్వారా సోకిన వ్యాధి ఆమె తన మరో భర్తకు చేర్చే అవకాశమూ ఉంది. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా వివాహేతర సంబంధం కలిగి ఉంటే, అతడికి ఆ వివాహేతర సంబంధం ద్వారా సోకే రోగం, తన భార్యకు చేర్చే అవకాశం, తద్వారా ఆమె తన ఇతర భర్తలకు చేర్చే అవకాశం ఎలాగూ ఉంది. ఒకవేళ ఆమె ఇతర భర్తలు వివాహేతర సంబంధం కలిగి ఉండకపోయినా, తమ భార్య ద్వారా వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్న పురుషుడి విషయంలో ఇలా జరిగేందుకు అవకాశం లేదు, ఎందుకంటే తన భార్యలలో ఎవ్వరూ వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశం లేదు.

    పైకారణాలను ఎవరైనా తేలిగ్గా గుర్తించవచ్చు. తన అనంత వివేకం వలన అల్లాహ్ బహుభర్తృత్వాన్ని నిషేధించినాడు. పైన తెలిపిన కారణాలే కాకుండా అల్లాహ్ బహుభర్తృత్వాన్ని ఎందుకు నిషేధించాడనే దానికి బహుశా ఇంకా అనేక కారణాలు ఉండి ఉండవచ్చు.