×
ఈ వ్యాసంలో క్లుప్తంగా ఫాతిమా రదియల్లాహు అన్హా జీవితం గురించి వివరించబడింది.

    ఫాతిమా రదియల్లాహు అన్హా

    ﴿ فاطمة رضي الله عنها ﴾

    ] తెలుగు – Telugu – تلغو [

    http://ipcblogger.net/tahera/?p=303

    రచన : తాహిరా తన్వీర్

    పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

    2010 - 1431

    ﴿ فاطمة رضي الله عنها ﴾

    « باللغة التلغو »

    http://ipcblogger.net/tahera/?p=303

    مؤلف : طاهرة تنوير

    مراجعة: محمد كريم الله

    2010 - 1431

    బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం

    ఫాతిమా రదియల్లాహు అన్హా

    ఫాతిమా (రదియల్లాహు అన్హా) రూపు రేఖలు:

    ఫాతిమా (రదియల్లాహు అన్హా) సవతి తల్లియైన ఆయిషా(రదియల్లాహు అన్హా) దృష్టిలో కూతురి ప్రతి కదలికలో ఒక ప్రత్యేకత ఉండేది. ఆమెను గూర్చి ఆయిషా(రదిల్లాహు అన్హా) ఇలా అన్నారు. “ఫాతిమా మాట తీరు, ఉచ్చారణ, ఆమె నవ్వు, చిరునవ్వు, తినటం, త్రాగటం, నడక, పడక మరియు ముఖకవళికలు – అన్నింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోలికలే తొణికిసలాడేవి.”. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) ఇస్లామీయ ఉద్యమంలో అసాధారణ త్యాగాలు చేసిన గొప్ప వనితగా కీర్తి గడించారు. ఇక హజ్రత్ ఆసియా ఫిర్ఔన్ లాంటి తలబిరుసు అవిశ్వాసుని భార్య అయి ఉండి కూడా అల్లాహ్ ను విశ్వసించి, భర్త హింసలను భరించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నసహనశీలిగా చరిత్రలో నిలిచిపోయింది. కాగా హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసరణకు సంపూర్ణ నిదర్శనం. ప్రాపంచిక ఆడంబరాలకు, ఆర్భాటాలకు భిన్నమైనది ఆమె జీవితం. సహనం, సేవాభావం, కృతజ్ఞత, దాతృత్వం, స్వాభిమానాలకు నిదర్శనం. తను నిలువెల్లా గొప్ప తండ్రి గొప్ప కూతురు.

    బాల్యం – శిక్షణ:

    ఫాతిమా (రదియల్లాహు అన్హు) బాల్యం హజ్రత్ ఖదీజా గారి పర్యవేక్షణలో జరిగింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రవక్త పదవి ఇవ్వబడిన తొలి రోజుల్లో వారికి ఇంటి పట్టున ఉండి పిల్లల బాధ్యతలను పట్టించుకునేందుకు తీరిక చిక్కేది కాదు. మక్కా సర్దారులు ఇస్లామీయ ఉద్యమాన్ని శాయశక్తులా వ్యతిరేకిస్తున్న సమయమది. ఇలాంటి కఠిన సమయంలో ఖదీజా(రదియల్లాహు అన్హా)గారు తన సర్వస్వాన్ని ఇస్లాం కోసం అర్పించారు. అటు భర్తకు చేదోడువాదోడుగా ఇటు పిల్లలను ఇస్లామీయ కార్యకర్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం అతి కష్టమైనదే.

    ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా ప్రాంగణంలో నమాజు చేస్తుండగా అబూ జహల్ తన ముష్కర మూకను సంబోధిస్తూ ఇలా అన్నాడు: ‘మీలో ఎవరన్నా ఒంటె ప్రేగులు తెచ్చి ముహమ్మద్ వీపుపై వేస్తే ఎంత బాగుండేది?” ఉఖ్బా బిన్ అబీ ముయీత్ పరుగున వెళ్లి ఒంటె ప్రేగులు తెచ్చి సజ్దాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీపుపై వేశాడు. ఫాతిమా (రదియల్లాహు అన్హా) వయస్సు అప్పటికి ఆరు సంవత్సరాలు. ఈ వార్త తెలియగానే ఫాతిమా (రదియల్లాహు అన్హా) పరుగెత్తుకుని వెళ్లి తండ్రి పై నుండి ఆ ప్రేగులను తొలగించి, నిర్భయంగా వారందర్నీ హెచ్చరిస్తూ ఉఖ్బా వినాశనానికి శాపనార్థం పెట్టారు. ఖదీజ (రదియల్లాహు అన్హా) పిల్లల శిక్షణ ప్రవక్త ఇచ్చానుసారంగా ఇస్లామీయ విద్య వివేకం, సిద్ధాంతాలు వారిలో జీర్ణించుకునేలా స్వచ్చమైన రీతిలో చేశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఇద్దరు కుమార్తెల (రుఖయ్య, ఉమ్మె కుల్సూం) నిశ్చితార్థం అప్పటికే అబూ లహబ్ ఇద్దరు కొడుకులైన ఉత్బా, ఉతైబాలతో జరిగి ఉండింది. అతడు ప్రవక్త కుటుంబాన్ని వారి నడవడికనూ నిశితంగా గమనిస్తూ ఆలోచించసాగాడు. ముహమ్మద్ ఇద్దరు అమ్మాయిలూ తన ఇంటి కోడళ్ళుగా వచ్చినచో, వారు తన ఇంటి వారిని కూడా ఇస్లాంలోనికి లాగేస్తారని ఆలోచన కలిగి, ఈ బంధుత్వాన్నే తెంచుకోవటం మేలనుకొని అబూ లహబ్ ఆ నిశ్చితార్థాలను తెంచి వేశాడు.

    ఒక వైపు అవిశ్వాసులు ప్రవక్తతో బంధు మిత్ర సంబంధాలను తెంచుకునే యత్నాల్లో ఉండగా, మరోవైపు విశ్వాసులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బంధుత్వాన్ని పెంచు కోవటం వారి భాగ్యంగా భావించినారు. ఈ కారణంగానే ఫాతిమా (రదియల్లాహు అన్హా) యుక్తవయస్సుకు చేరుకోగానే ఎందరో గొప్ప సహాబీలు వివాహ సందేశమిచ్చారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండవ హిజ్రీ సంవత్సరంలో ఫాతిమా (రదియల్లాహు అన్హా) నిఖాహ్ అలీ (రదియల్లాహు అన్హు) తో జరిపించారు.

    ఒక గృహిణిగా ఫాతిమా (రదియల్లాహు అన్హా) జీవితం:

    హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) గృహజీవితం ఎంతో నిరాడంబరమైనది. సమస్త స్త్రీ జాతికే ఆదర్శప్రాయమైనది. ఒక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరచారు. “కఫాకి మినన్నిసాయిల్ ఆలమీన్ మర్యం బింత్ ఇమ్రాన్, ఖదీజా బింత్ ఖువైలద్, ఫాతిమా బిత్ ముహమ్మద్ వ ఆసియా అల్ మర్అతు ఫిర్ఔన్”. (అనుసరణకై మీకొరకు సమస్త సతీ జాతిలో మర్యం బింత్ ఇమ్రాన్, ఖదీజా బిన్ ఖువైలద్, ఫాతిమా బింత్ ముహమ్మద్, ఫిర్ఔన్ భార్య ఆసియా చాలు”. (తిర్మిజీ-కితాబుల్ మనాఖిబ్)
    హజ్రత్ మర్యం (అలైహిస్సలాం) ను అల్లాహ్ కఠిన పరీక్షకు గురి చేసినప్పుడు ఆమె ఆ పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణురాలైనారు. ఆ విధంగా ఆ స్త్రీమూర్తి సహనస్థైర్యాలలో మహిళావనికే ఉదాహరణ ప్రాయంగా నిలిచిరి. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) ఇస్లామీయ ఉద్యమంలో అసాధారణ త్యాగాలు చేసిన గొప్ప వనితగా కీర్తి గడించారు. ఇక హజ్రత్ ఆసియా ఫిర్ఔన్ లాంటి తలబిరుసు అవిశ్వాసుని భార్య అయి ఉండి కూడా అల్లాహ్ ను మాత్రమే విశ్వసించి, భర్త హింసలను భరించి, తన విశ్వాసాన్ని కాపాడుకున్న సహనశీలిగా చరిత్రలో నిలిచి పోయింది. కాగా హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసరణకు సంపూర్ణ నిదర్శనం. ప్రాపంచిక ఆడంబరాలకు, ఆర్భాటాలకు భిన్నమైనది ఆమె జీవితం. సహనం, సేవాభావం, కృతజ్ఞత, దాతృత్వం, స్వాభిమానాలకు నిదర్శనం.

    కొన్ని ముఖ్య సంఘటనలు:

    మదీనాలో ఇస్లామీయ ప్రభుత్వం రోజురోజుకు విస్తరించసాగింది. ముస్లిముల ప్రభావం దినదినానికి పెరుగుతూ ఉంది. అనేక దేశాలు జయించబడుతూ, యుద్ధప్రాప్తి మదీనాకు చేరుతూ ఉండింది. ఆ యుద్ధప్రాప్తి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతుల మీదుగా పంపిణీ అయ్యేది. కానీ హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) లభించేది పిడికెడు పిండి, దైవధ్యాన సూత్రాలు, దుఆలు మాత్రమే. ఆ మారాజు కూతురి చేతులు పిండి విసిరి కాయలు కాసేవి, నీరు మోసి భుజాలు కందిపోయేవి. అల్లాహ్ ను సంతోష పెట్టె ఆమె జీవితం ఇదే. అల్లాహ్ ప్రసన్నతయే ఆమె జీవిత ధ్యేయం. భర్త అలీ పగలంతా చెమటోడ్చి శ్రమిచి ఇంటికి చేరుకునేటప్పుడు, ఏ బీదసాదైనా చేయి చాపితే తన చేతిలో ఉన్నది కాస్తా అతని చేతిలో పెట్టి ఖాళీ చేతులతో ఇంటికి చేరుకునే వారు. అప్పుడప్పుడు భర్త ఇంటికేమైనా తెస్తే హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) వండి పెట్టేవారు. వారందరూ సపరివారంగా భోజనం చేసేవారు. ఒకసారి వారందరూ కూర్చుని భోజనం చేయనారంభించారు. అప్పుడే ఒక యాచకుడు అన్నం పెట్టమని కేక వేశాడు, అంతే నోటి వరకు పోతున్న చేతులు ఆగిపోయాయి. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) లేచి తమ వంతు అన్నాన్ని ఫకీరుకు పెట్టి, నీరు త్రాగి అల్లాహ్ కు కృతజ్ఞతలర్పించుకున్నారు. ఇలా ఎన్నో సార్లు వారందరూ నోటి కాడికి వచ్చిన అన్నాన్ని ఫకీర్లకిచ్చి పస్తులుండేవారు. ఆ పూట మంచి నీళ్ళతో సరిపెట్టుకునేవారు.

    అలీ (రదియల్లాహు అన్హు) ఒకసారి తన ప్రియ సతీమణి చేతుల్లోని పొక్కులు చూసి చలించిపోయారు. “ధనాగారానికి యుద్ధప్రాప్తి వచ్చి చేరింది. మీ నాన్నగారి వద్దకెళ్ళి ఇంటి పనులు చేయుటకు ఒక సేవకురాలినివ్వమని అడుగు” అని సలహా ఇచ్చారు. తండ్రిని అడగాలనే ఊహకే ఆమెకు చెమటలు పట్టాయి. కాని భర్త ప్రోద్బలంపై తండ్రి వద్దకు వెళ్ళనైతే వెళ్ళారు కాని తమ అవసరాన్ని నోరెత్తి చెప్పలేక పోయారు. ఆమె వెనకే అలీ (రదియల్లాహు అన్హు) కూడా వచ్చారు. తన భార్య సిగ్గు, ఆత్మాభిమానాలు తెలుసు గనక ఆయనే ప్రవక్త ముందు విషయాన్ని విశదపరచారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్లామీయ రాజ్యానికి అధిపతి, అడిగినవారికెప్పుడూ కాదనని వారు, కాని అటువంటి తండ్రే, “అమ్మా! నీకన్నా బద్ర్ అనాథుల హక్కు ప్రధానమమ్మా” అంటూ సున్నితంగా త్రోసి పుచ్చారు. తండ్రి వద్ద నుండి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన కూతుర్ని చూశారు ఆరోజు ప్రజలు! కాని ఆ మహా భాగ్యురాలు అదే ఆస్థానంనుండి తమకవసరమైన ప్రాపంచిక వస్తువులకు బదులు కనువిప్పు వాక్యాలనండుకుని తిరిగి వచ్చారు. మరొకసారి అలాగే యుద్ధప్రాప్తి సంగతి విని హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) ప్రవక్త వద్దకు వెళ్ళగా అది గమనించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అడిగారు “ఫాతిమా! ఈ వస్తువులకు మించిన వస్తువును నీకివ్వనా? నిద్రకు ముందు 33 మార్లు సుబ్హానల్లాహ్, 33 మార్లు అల్హందులిల్లాహ్, 34 మార్లు అల్లాహు అక్బర్ పఠించు. ఇదే నీకు మేలైనది” అని బోధించినారు. ఈ దైవస్మరణే ‘తస్బీహే ఫాతిమా’ గా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ప్రతి భర్తా తన భార్యకు ఏదన్నా కానుక ఇవ్వాలని కోరుకుంటాడు. అలాగే అలీ (రదియల్లాహు అన్హూ) కూడా భార్యను సంతోషపరచే యత్నాలు చేసేవారు. ఒకసారి యుద్ధప్రాప్తిలో వాటాగా ఆయనకు ఒక బంగారు హారం లభించింది. దాన్ని తన భార్యకు కానుకగా ఇచ్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఈ విషయం తెలియగానే ఆయన హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) ను పిలిపించి, ‘ఓ ఫాతిమా! ప్రజల నోట దైవ ప్రవక్త కూతురు అగ్ని హారం ధరిస్తుందని అనిపించుకోవాలని ఉందా?” అని అడిగారు. ఈ మాటలు విన్న వినయ విధేయతలు గల కూతురు వెంటనే ఆ హారాన్ని అమ్మి ఒక బానిసను కొని విడుదల చేశారు.
    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా యుద్ధం నుండి మరలి వచ్చినప్పుడు అందరూ ఆనందంతో చక్కగా ముస్తాబై ఆహ్వానం పలికేవారు. అలాగే ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక యుద్ధం నుండి తిరిగి రాగా హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) కూడా ఇల్లు సర్ది, గుమ్మానికి తెర వ్రేలాడదీసి పిల్లలకు దుస్తులు, వెండి కంకణాలు తొడిగించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకకై నిరీక్షించసాగారు. ఈ అలంకరణలు చూసిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూతురింట్లోకి ప్రవేశించక, గుమ్మం నుండే వెనుక తిరిగి వెళ్ళి పోయారు. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా)కు వెంటనే అర్థమై పరదాలు చించేశారు, పిల్లల చేతి కంకణాలు తీసేశారు. వారిద్దరూ ఏడుస్తూ తాతయ్య వద్దకు వెళ్లి తల్లి నిర్వాహకాన్ని తెలియ పరచారు. అంతా విన్న ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీరు నా ఇంటి సదస్యులు, నా కుటుంబీకులు ఇలా మట్టి నాణాలతో మాసిపోవడం నాకిష్టం లేదు” అన్నారు.

    సామాన్యంగా కూతురు వివాహం తరువాత తల్లిదండ్రులు ఆమె జీవితంలో జోక్యం చేసుకోరు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కూతురి శిక్షణ విషయంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండలేదు. ఆమె లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ, ఆమెను ఇహపర లోక సాఫల్యవంతురాలిగా మార్చే ఏ అవకాశాన్నీ వదిలేవారు కాదు. తండ్రిచ్చే సూచనలను గ్రహిచడమే కూతురి ధ్యేయం కూడా.

    దాంపత్య జీవితం:

    హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) వివాహమైనప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు, చిన్న వయస్సు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మాత్రం ప్రవక్త సాంగత్యంలో ఉత్తమ శిక్షణ పొందారు. కాని నిరుపేదగా జీవితాన్ని గడిపేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అలీ (రదియల్లాహు అన్హు)పై పూర్తినమ్మకం. తాను తీర్చిదిద్దినట్లుగానే జీవితం గడుపుతారు అన్న ధీమా కూడా. తన కూతురు అమాయకురాలని తెలుసు గనుక, అప్పుడప్పుడు ఆమెలోనున్న లోపాలను చూసి పరలోకాపేక్షకుడైన తండ్రిగా సలహాల ద్వారా సరిదిద్దేవారు.


    పాత్రలున్నచోట శబ్దం సహజమే. భార్యాభార్తలున్న చోట చిరు కోపాలు, చిటపటలు సహజమే. అలాగే అలీ-హజ్రత్ ఫాతిమా(రదియల్లాహుఅన్హుమ్)ల మధ్య కూడా అప్పుడప్పుడు చిరుకలతలు రేగేవి. అలాంటి సందర్భాల్లో వారిరువురూ ప్రవక్తను సంబంధించేవారు. ఒకసారి ఏదో మాటపై హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) భర్త మనసు నొప్పించారు. అది తెలుసు కున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే వారి వద్ద కెళ్ళి వారిలో చేరిన ఆ కలతలను దూరంచేసి, సర్దుబాటు చేశారు. సంతోషంగా “నాకు అత్యంత ప్రియులైన వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చానని” ప్రకటించారు. మరోసారి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కు హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) యొక్క ఏదో వ్యవహారం నచ్చక, ఆమె ముందే తన అయిష్టాన్ని వ్యక్త పరచారు. దానికి హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఆత్మాభిమానం గాయ పడింది. సహించలేక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అలీ (రదియల్లాహు అన్హు) కూడా ఆమె వెనకే వెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) తో ఇలా అన్నారు: “ఎంతమంచి భర్త కాకపోతే తన భార్య వెనకే నిశ్శబ్దంగా వస్తాడు?” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాటలకు వారిరువురూ ప్రభావితులయ్యారు. అప్పటి నుండి హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) జీవితాంతం నోటికి తాళం బిగించుకున్నారు.

    అలీ (రదియల్లాహు అన్హు) తమ నిర్ణయాన్ని ఇలా తెలియపరచారు: “ఈనాటి నుండి ఇంకెప్పుడూ నీకు ఇష్టం లేని పని చేయను, అల్లాహ్ యే అన్ని ప్రశంసలకు అర్హుడు.” ఇద్దరు వ్యక్తులు జీవితాంతం దారిద్ర్యంతో రాజీపడిపోయి సంతృప్తిగా గడపడం మామూలు విషయం కాదు. హజ్రత్ ఫాతిమా(రదియల్లాహు అన్హా) ధార్మికంగా, నైతికంగా ఎంత ఎత్తుకు ఎదిగారంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చే ఆమె మెచ్చుకోబడినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూతురి పై ప్రేమతో కాక, ఆమె ఉత్తమమైన నడవడికను చూసి పొగిడారు. ప్రవక్త జీవిత చరిత్ర చదివిన ప్రతి వ్యక్తికీ, ప్రవక్త తమ కుటుంబీకులను సమావేశ పరచి లెక్కల ఘడియ గురించి హెచ్చరించిన ఆ హెచ్చరిక గుర్తుండాలి. ఆయన తన చిన్నాన్న అబ్బాస్ (రదియల్లాహు అన్హు), అత్త సఫియ్యా (రదియల్లాహు అన్హా), కూతురు హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) లను సంబోధిస్తూ హెచ్చరించారు. ముఖ్యంగా కూతురును ఉద్దేశించి, “ఫాతిమా! ప్రవక్త కూతుర్నని మిదిసిపడకు. పరలోకంలో తీర్పుదినాన ఆచరణల లెక్క జరిగేటప్పుడు నేను నిన్ను ఏవిధంగానూ ఆదుకోలేను. జాగ్రత్త!”

    సంతాన శిక్షణ:

    హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) తమ పిల్లల శిక్షణ కూడా తన పితామహుని

    (సల్లల్లాహు అలైహి వసల్లం) శైలిలో చేయసాగారు. అల్లాహ్ ను ప్రసన్నుణ్ణి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లల ముందు “అల్లాహ్ యే మన ప్రభువు, ఆయన అనంత కరుణామయుడు, ఆయన కోపాగ్ని చాలా భయంకరమైనది. ఆయన ఈ పనినిష్ట పడడు, ఆ పనంటే అయిష్టం” అని అల్లాహ్ గుణగణాలను, ఇష్టాయిష్టాలను తెలియ పరచేవారు. పిల్లల యందు అల్లాహ్ పట్ల ప్రేమ, భయభక్తులు జనింపజేసేవారు. వారి ఆలోచనలు, చర్యలు అదే దిశలో నడిచేలా శిక్షణ ఇచ్చేవారు.