×
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.

    మనకున్న కొద్దపాటి జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ మహత్తర సృష్టిని ఒకసారి పరిశీలిస్తే దీన్నంతటినీ సృష్టించినవాడు ఒకడున్నాడు, ఆయన “సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, వివేచనాపరుడు, సర్వజ్ఞాని" అని మనకు అర్థం అవుతుంది.

    ఆయన్నే మనం “సృష్టికర్త, దేవుడు, ప్రభువు" అంటాము. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. సృష్టికార్యకలాపాలన్నింటినీ ఆయనే స్వయంగా ఎవరి సహాయమూ లేకుండా నడుపుతున్నట్లు కూడా అవగతమపుతుంది.

    సర్వశక్తిగల దేవుడు సువిశాలమైన తన రాజ్యంలోని ఒక భాగమైన ఈ భూమండలం పై మనిషిని సృష్టించి, అతడి మనుగడకై కావలసిన అన్ని భౌతిక అవసరాలను సమకూర్చాడు. ఆలోచించే శక్తిని, అర్థం చేసుకునే బుద్ధిని కూడా ప్రసాదించాడు.

    ఆ కరుణామయుడైన సృష్టకర్త మానవుడికి లెక్కించలేనన్ని మరియు విలువ కట్టలేనన్ని కానుకలు, అనుగ్రహాలు ప్రసాదించాడు. పరమదాత అయిన ఆ సృష్టికర్త సృష్టిలోని సమస్తమూ అల్పజీవి అయిన ఈ మానవుడికే వశపరచాడు.

    అలాంటప్పుడు ఈ మానవుడు దయామయుడైన ఆ సృష్టికర్తను సేవించక, ఆయన్ని కాదని లేక ఆయనకు ఇతరులను భాగస్వాములుగా కల్పించి, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా స్వకల్పిత సిద్ధాంతాలకు లోబడి తోటి మానవులకు దాసులుగా మెలిగటం కంటే ఘోరమైన విశ్వాసఘాతకం ఇంకేమైనా ఉంటుందా?

    మానవులను సృష్టించి వారి జీవిత అవసరాలకు కావలసినవన్నీ సమకూర్చిన దయాసాగరుడైన ఆ సృష్టికర్త మానవుల జీవిత లక్ష్యాన్ని తెలుపకుండా ఉంటాడా? ఆ లక్ష్యసాధనకై అవసరమయ్యే మార్గాన్ని మరియు తన ఇష్టాఇష్టాలను ఆయన మానవాళికి తెలుపకుండా ఉంటాడా?

    ఆయన మానవులలో నుండే సజ్జనులు, సద్వర్తనులు, నీతిమంతులు, పరాపకారులు అయిన వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకుని, వారి ద్వారా సర్వమానవాళికి తన ఇష్టాఇష్టాలను తెలుపుతూ, వారినే మానవ మార్గదర్శకులుగా నియమించాడు.

    సృష్టకర్త వీరిపై మార్గదర్శక గ్రంధాలను అవతరింపజేసి అందులో తన ఆదేశాలను, తన ఇష్టాఇష్టాలను తమ ప్రసన్నత పొందే విధానాలను, మానవుడు తన జీవిత లక్ష్యానికి చేరే మార్గాన్ని సర్వజ్ఞాని అయిన ఆ సృష్టికర్త తెలియజేశాడు.

    సత్పురుషులైన ఆ ప్రవక్తలు మానవాళికి సన్మార్గాన్ని చూపారు. సృష్టికర్త ఆజ్ఞలు పాటిస్తే లభించే బహుమానం గురించి సువార్తను ఇచ్చారు. ఆయన ఆదేశాలను ధిక్కరిస్తే కలిగే పర్యవసనాల (శిక్ష) గురించి హెచ్చరించారు. ఆ సద్బోధకులు తాము మానవులకు బోధించిన వానిని ఆచరించి చూపారు.

    వారిలో ఉదాహరణకు నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, మోషే, యేసు, మొదలగువారున్నారు. వీరే కాక ఇంకనూ అనేక ప్రవక్తలు ఉన్నారు. సద్వర్తనులైన ఈ ప్రవక్తలు జీవించి ఉన్నంత కాలం వీరిని విశ్వసించి, వీరు చూపిన మార్గాన్ని అనుసరించారు ఈ మానవులు.

    అయితే ఆ ప్రవక్తలు తనువు చాలించి, ఈ లోకాన్ని వీడి వెళ్ళిన తర్వాత వీరి అనుచర సంఘంలోని కొందరు స్వార్ధపరులు, పరాన్నజీవులు ఆ మహానీయుల బోధనలను తారుమారు చేసి, లేని పోనివి కల్పించి, ఏకదైవారాధన వైపుకు ఆహ్వానించిన సత్యసంధులనే సష్టికర్తకు భాగస్వాములుగా చేశారు. ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో మతాలు ఉనికి లోనికి వచ్చాయి.

    సృష్టికర్త మనకు ప్రసాదించిన బుద్ధిజ్ఞానాలను ఉపయోగించి ఈ విభిన్న మతాలలో స్వచ్ఛమైన సత్యమతం ఏది? అని పరిశీలించి, దానిని అవలంభించటంలోనే మన ఇహపరాల సాఫల్యం దాగి ఉన్నదన్న యదార్థాన్ని మరువరాదు.

    ఈ లోకంలో వ్యాపించి ఉన్న అనేక మతాలలో క్రైస్తవమతం కూడా ఒకటి. ఈ మతం బోధించే మౌలిక విశ్వాసాలు ఏవి? అవి ఎంత వరకు స్వీకారయోగ్యమైనవి? నేటి క్రైస్తవ విశ్వాసాలను పరిశుద్ద గ్రంధము ధృవీకరిస్తున్నదా? లేదా? పరిశీలిద్దాము.

    క్రైస్తవ మత మౌళిక విశ్వాసాలు -

    a) మానవుడు పుట్టుకతో పాపాత్ముడు

    b) యేసు దేవుడి ఏకైక కుమారుడు

    c) యేసు సర్వమానవాళిని రక్షించుటకై అవతరించాడు.

    ఆది మానవుడైన ఆదాము పాపం చేసి నీతిని కోల్పోయాడు. కాబట్టి , సృష్టికర్త ఆదామును స్వర్గం నుండి బహిష్కరించాడు. మానవులమైన మనము ఆదాము సంతానము కనుక మనమంతా పాపులము. ఈ లోకంలో ఏ ఒక్కడునూ నీతిమంతుడు లేడు. ఏ బేధమును లేకుండా అందరూ పాపాత్ములయిన కారణంగా సృష్టికర్త అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. అయితే సృష్టికర్త మానవాళిని పాపము నుండి విముక్తి కలిగించుటకై తన అద్వితీయ కుమారుడిని పంపెను. సృష్టికర్త కుమారుడైన యేసు తన పాపములను భరించి మనకు ప్రతిగా శిలువ ఎక్కాడు. పాపము ఎరుగని యేసును సృష్టికర్త మన కొరకు విమోచన క్రియాధనముగా చేసేను.

    కనుక ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచి, మన పాపములకు ప్రతిగా చనిపోయాడని నమ్మితే చాలు మనము రక్షణ పొందగలము - ఇదే క్రైస్తవుల విశ్వాసము. అయితే పరిశుద్ధ గ్రంధమైన బైబిలు ఈ విశ్వాసాన్ని ఎంత వరకు ప్రోత్సహిస్తుందో మనం పరిశీలిద్దాము.

    a) క్రైస్తవుల మొదటి వాదన - మానవుడు జన్మత: పాపి.

    ఈ క్రింది వచనాలను క్షుణ్ణంగా పరిశీలించి పై వాదనను బైబిలు ఎలా ఖండిస్తుందో గమనించండి.

    1. ఆ దినములలో - తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాటవాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళె పులియును. (యిర్మియా 31:29,30)

    2. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుడి దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. (యేహెజ్కేలు 18:20)

    3. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. (ద్వీతీయోపదేశకాండము 24:16)

    4. ఆయన (యేసు) మార్గమును పోవుచుండగా పుట్టుగ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన (యేసు) శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసేను, వీడా? వీని కన్న వారా? ఆని ఆయనను అడగగా, యేసు - వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. (యొహను 9:1-3)

    పై వచనాలను పరిశీలించినప్పుడు మనకు తెలిసే నగ్నసత్యమేమిటంటే ఒకరు చేసిన పాపాలకు మరొకరు బాధ్యులు కాదు. పెద్దలు చేసిన నేరానికి మనము బాధ్యులమా? ప్రపంచంలోని ఏ చట్టమైనా ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుందా? కనీస జ్ఞానమున్న ఏ మనిషీ దీన్ని ఆమోదించడు.

    దీన్ని బట్టి మానవులు పుట్టుకతో పాపులు అనడానికి ఏ ఆస్కారమూ లేదు సరికదా ఆదాము సంతతి నుండి సృష్టికర్త పంపిన ఏ సత్యప్రవక్త యూ ఈ విషయాన్ని ఏ నాడూ తెలపలేదు. కాగా పరిశుద్ధ గ్రంధమైన బైబిలు కూడా దీన్ని స్పష్టంగా ఖండిస్తుంది. కనుక మానవుడు పుట్టుకతో పాపాత్ముడు అనే సిద్ధాంతం కల్పితమన్నది సుస్పష్టం.

    b) క్రైస్తవుల రెండవ వాదన: యేసు దేవుని అద్వితీయ కుమారుడు.

    కన్యక మరియంకు పురుష స్పర్శలేకుండానే యేసు పుట్టాడు. కాబట్టి తండ్రి లేకుండానే జన్మించిన యేసు దేవుని కుమారుడని క్రైస్తవులు భ్రమపడి ఉంటారు.

    అయితే తల్లితండ్రులు లేకుండానే సృష్టింపబడిన ఆదాము ను ఏమనాలి? తల్లి తండ్రి ఇరువురూ లేకుండానే ఆదామును సృష్టించిన సర్వశక్తిగల సృష్టికర్త, పురుష స్పర్శ లేకుండా స్త్రీలకు సంతానం కలిగించలేడా? “సర్వశక్తిగల దేవుడను" (ఆదికాండము 17:1) అనే దైవ వాక్యాన్ని క్రైస్తవులు విశ్వసించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది.

    వాస్తవానికి దేవుడు తన మహిమతో యేసును పుట్టించాడు. ఇది సృష్టికర్త గొప్పతనానికి నిదర్శనం.

    యెహోవా గొప్ప వాడనియు, ఆయన తన కిష్టమైనదంతయూ జరిగించువాడు, ఆయనే సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. (కీర్తనలు 135: 5,6,9)

    యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసానికి మౌళిక ఆధారం యేసు కొరకు కుమారుడు, దేవుని కొరకు తండ్రి, అనే పదాలు బైబిల్లో వాడబడటటమే తప్ప మరే ఆధారమూ లేదు. బైబిల్లో కుమారుడు లేక కుమారులు అనే పదమును సర్వసామాన్యంగా ఉపయోగించడం జరిగినది. అటువంటప్పుడు “యేసే దేవుని అద్వితీయ కుమారుడు" అనటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ధారించండి.

    ఇంకా ఈ క్రింది వాక్యాలను కూడా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి:

    1. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుడి కుమారులనబడుదురు (ముత్తయి 5:9)

    2. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. (ముత్తయి 5:44)

    3. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు(రోమా 8:14)

    ఇంకా కుమారుడు అనే పదము ఒక్క యేసుకే కాదు ఇతర ప్రవక్తల కొరకు కూడా ఉపయోగించబడింది. అలాంటప్పుడు యేసు యే దేవుని కుమారుడని భావించడం న్యాయమా? మీరే ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సత్యాన్ని గ్రహించండి:

    1. ఆదాము దేవునికి కుమారుడు (లూకా 3:38)

    2. నీవు (దావీదు) నా (యెహోవా) కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను (కీర్తనలు 2:7)

    3. నేను నీ కుమారుడైన సోలోమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను(1 దివృత్తాంతం 28:6)

    4. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయేము నా జ్యేష్టకుమారుడు కాడా? (యిర్మియ 31:9)

    5. ఇశ్రాయేలు నా కుమారుడు. నా జ్యేష్టపుత్రుడు ? (నిర్గమ 4:22)

    ఈ వచనాల ద్వారా యేసు మాత్రమే కాక దైవ ప్రవక్తలు, పరిశుద్ధులు నీతిమంతులు కూడా దేవుని కుమారులేనని బోధపడుతుంది.

    వాస్తవమేమిటంటే బైబిల్లో కుమారుడు అనే పదము విధేయుడు, దాసుడు, ప్రియమైనవాడు, అనే అర్థాలలో ఉపయోగించబడటం జరిగినది. దేవుడు పవిత్రుడు, సర్వ బలహీనతలకు అతీతుడు కనుక దేవునికి కుమారుడు గాని కుమార్తెలు గాని ఉండరు. లేరు కూడా.

    c) క్రైస్తవుల మూడవ వాదన : యేసు ప్రపంచ మానవుల కొరకు రక్షకుడు

    బైబిలు ఈ వాదనను కూడా వ్యతిరేకిస్తుంది. కేవలం ఇస్రాయేలీయులను రుజుమార్గము దైవ దాస్యం వైపునకు ఆహ్వానించడానికే యేసు వచ్చారని బైబిలు అంటుంది. క్రింది వాక్యాలను చదివి చూడండి.

    1. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును (ముత్తయి 2:5)

    2. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసు ను పుట్టించెను. (అపోస్తుల కార్యములు 13:23)

    3. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. (ముత్తయి 15:24)

    4. మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల యే పట్టణములోనైనా ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల వద్దకు వెళ్ళుడి (ముత్తయి 10:5,6)

    పై వచనాల ద్వారా తెలిసినదేమిటంటే యేసు ప్రపంచమానవాళి కొరకు రాలేదు. కేవలం ఇశ్రాయేలు జాతి కొరకే వచ్చారు. అంతే కాదు. ఇతరుల వద్దకు వెళ్ళవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించారు. బైబిల్లో ఇశ్రాయేలేతరులను కుక్కలు, పందులుగా ఉదహరించడం జరిగినది.

    పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి; వేసిన యెడల అవి యొక వేళ వాటిని కాళ్ళలో త్రోక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును. (ముత్తయి 7:6)

    ఈ పరిశీలన ద్వారా స్పష్టమైనదేమిటంటే:

    1. మానవుడు పుట్టుకతో పాపాత్ముడు కాదు

    2. యేసు దేవుని అద్వితీయ కుమారుడు అంతకన్నా కాదు.

    3. యేసు సర్వమానవాళికి రక్షకునిగా వచ్చి మానవుల పాపాలను తన వీపుపై మోసుకుని శిలువ పై ఎక్కాడన్నది అసలే కాదు.

    అని బైబిలు చాటి చెబుతున్నది.

    కనుక పరలోకంలో మోక్షం పొందాలంటే, రోషము గల దేవుని పట్టు నుండి మనము రక్షింపబడి ఆయన ప్రసన్నత చూరగొనాలంటే యేసు ప్రార్థించిన అద్వితీయదేవుడినే ఆరాధించాలి.(మార్కు 12:29, ద్వితీ 6:4) యేసు చూపిన శాంతి మార్గాన్నే అనుసరించాలి. (యోహాను 15:27, ముత్త 11:29,30)

    యేసు ఆరాధించిన అద్వితీయ ప్రభువు యెహోవాయే అని ఆయన చూపిన మార్గము సత్యమైనదని, శాంతి మార్గమని మనకు బైబిలు ద్వారా సుస్పష్టమైయ్యింది. యేసు ఆరాధించిన అద్వితీయ సత్యదేవుడైన యెహోవా యే అల్లాహ్ అని, యేసు స్వయంగా ఆచరించి మనకు అనుసరించమని ఆదేశించిన సుళువైన శాంతిమార్గము, సత్యమార్గము ఇస్లాం అని యేసు తరువాత వచ్చిన ఆదరణ కర్త అయిన ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ఖుర్ఆన్ గ్రంధం బోధిస్తుంది. (యెహోను 16: 12-14)

    (ఈసా ఇలా అన్నాడు) అల్లాహ్ నాకూ ప్రభువే మీకూ ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చెయ్యండి. ఇదే ఋజుమార్గం ఖుర్ఆన్ 3:51, 19:36

    కాబట్టి ఓ సత్యప్రియులారా! పవిత్రుడైన యేసు (ఈసా అలైహిస్సలాం) చే తెలుపబడిన అల్లాహ్ నే విశ్వసించి, ఆరాధిస్తూ ఆదరణకర్త అయిన ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా సంపూర్ణం గావించబడిన ఇస్లాం ధర్మాన్ని అనుసరించి పరలోక రాజ్యంలో విజయవంతంగా ప్రవేశించండి.

    అంతిమ దైవ గ్రంధమైన దివ్యఖుర్ఆన్ సందేశం

    “గ్రంధప్రజలారా! మాకూ, మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అదేమంటే) మనం అల్లాహ్ ను తప్ప మరెవ్వరరీకీ దాస్యం చేయకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవ్వరూ అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు; అని ఓ ప్రవక్తా ! (వారిని) ఆహ్వానించండి. ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు (క్రైస్తవులు) వైముఖ్యం కనబరిస్తే వారికి మేము ముస్లిములము (అనగా కేవలం ఆల్లాహ్ కు మాత్రమే దాస్యం చేసేవారము. ఆయన విధేయతను మాత్రమే పాటించే వారము). దీనికి మీరే సాక్షులు: అని స్పష్టంగా ప్రకటించండి" ఖుర్ఆన్ 3:64