×
ఎతేకాఫ్ పాటించటం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

    ఎతేకాఫ్ (ఏకాంతవాసం) గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం ఏమిటి?

    అల్ హమ్ దులిల్లాహ్ - సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును.

    ఎతేకాఫ్ గురించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం అత్యంత ప్రామాణికము మరియు సమతూకంతో కూడిన మార్గదర్శకత్వము.

    (లైలతుల్ ఖదర్ అంటే 1000 నెలలకంటే మహోన్నతమైన రాత్రి. ఆ ఒక్క రాత్రిలో చేసే ఆరాధనలు దాదాపుగా 1000 నెలల ఆరాధనల కంటే ఉత్తమమైనవి.) అటువంటి లైలతుల్ ఖదర్ అనే దివ్యమైన రాత్రి కోసం అన్వేషిస్తూ, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ మాసపు మొదటి పది దినాలలో ఎతేకాఫ్ పాటించారు, తర్వాత రమదాన్ మాసపు మధ్యలోని పది దినాలలో ఎతేకాఫ్ పాటించారు. అయితే రమదాన్ మాసపు చివరి పది రాత్రులలో లైలతుల్ ఖదర్ వస్తుందని అల్లాహ్ ఆయనకు తెలియజేసెను. అప్పటి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అంతిమ శ్వాస వరకు, ప్రతి సంవత్సరం రమదాన్ మాసపు చివరి పది దినాలలో ఎతేకాఫ్ పాటించేవారు.

    ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ మాసపు చివరి పది దినాలలో ఎతేకాఫ్ పాటించలేక పోయారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన షవ్వాల్ నెలలోని మొదటి పది దినాలలో ఎతేకాఫ్ పాటించినారు. (రమదాన్ నెల తర్వాత వచ్చే నెల పేరే షవ్వాల్ నెల). ఇది సహీహ్ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీథ్ గ్రంథాలలో ఉల్లేఖించబడినది. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని 2040 వ హదీథ్ ఉల్లేఖన ప్రకారం, తన అంతిమ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇరవై దినాల పాటు ఎతేకాఫ్ పాటించారు.

    దానికి కారణం, తన అంతిమ సమయం సమీపిస్తున్నదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు తెలిసిపోయినది. కాబట్టి, మిగిలిన ఆ స్వల్పకాలంలో తన పుణ్యాలను పెంచుకోవాలని ఆయన భావించి ఉంటారు. పుణ్యాలు సంపాదించుకునే అవకాశం సమాప్తమవుతున్నప్పడు అంటే జీవిత అంతిమ దశ సమీపిస్తున్నప్పుడు, తమ సృష్టికర్తను ఉత్తమమైన పద్ధతిలో కలుసుకోవటానికి అవసరమయ్యే పుణ్యాలను సమకూర్చుకోవటానికి ఎంత గట్టిగా ప్రయత్నించాలో స్వీయ ఆచరణల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు దారి చూపినారు. దానికి కారణం ప్రతి సంవత్సరం రమదాన్ నెలలో అప్పటి వరకు అవతరించిన ఖుర్ఆన్ భాగాన్ని జిబ్రయీల్ దైవదూత (అలైహిస్సలాం) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒకసారి పునశ్చరణ చేయించేవారు, కాని వారి అంతిమ సంవత్సరపు రమదాన్ నెలలో రెండుసార్లు పునశ్చరణ చేయించినారు. అందుకని ఆ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మామూలు సంవత్సరాలకు రెండింతల పాటు అంటే ఇరవై దినాల పాటు ఎతేకాఫ్ పాటించారు.

    తమ అంతిమ సంవత్సరంలో ఇరవై దినాల పాటు ఎతేకాఫ్ పాటించటానికి ఇంకో కారణం, దానికి పూర్వపు సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉండటం కూడా కావచ్చు అని అన్నిసాయి మరియు అబూ దావుద్ హదీథ్ గ్రంథాలలోని ఉల్లేఖనలు తెలుపు తున్నాయి. ఇబ్నె హబ్బాన్ మరియు ఇతర ఇస్లామీయ పండితులు వీటిని సహీహ్ (ప్రామాణికమైన) ఉల్లేఖనలుగా వర్గీకరించారు. ఆ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరుడైన (సహాబా) అయిన ఉబై ఇబ్నె కఆబ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా రమదాన్ నెల చివరి పది దినాలు ఎతేకాఫ్ పాటించేవారు. కాని ఒక సంవత్సరపు రమదాన్ నెలలో ఆయన ప్రయాణంలో ఉండటం వలన, ఆ తర్వాతి సంవత్సరంలో వారు ఇరవై దినాల పాటు ఎతేకాఫ్ పాటించారు. ఫతహ్ అల్ బారీ గ్రంథం.

    ఎతేతాఫ్ పాటించటం కోసం మస్జిద్ లో ఒక గుడారం వంటిది వేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించేవారు. దానిలో వారు ప్రజలకు దూరంగా, తన ప్రభువును ధ్యానిస్తూ, సంపూర్ణ ఏకాగ్రతతో అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాలను పొందటానికి చిత్తశుద్ధితో మనస్పూర్తిగా ప్రయత్నించేవారు.

    ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం రెల్లు లేక వెదురు చాపు ద్వారం పై వ్రేలాడదీసిన అతి చిన్న గుడారంలో ఎతేకాఫ్ పాటించారు. సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథం, 1167.

    జాద్ అల్ మఆద్, 2/90 అనే గ్రంథంలో ఇబ్నె అల్ ఖయ్యూమ్ ఇలా తెలిపారు:

    మానసిక, నైతిక, ఆత్మశక్తి సంపాదించటమే ఎతేకాఫ్ యొక్క ఉద్దేశ్యం. అజ్ఞానుల ఆచరణ పద్ధతికి అంటే ఒక చోట గుమిగూడి, పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోవటానికి ఎతేకాఫ్ సందర్భాన్ని ఉపయోగించే విధానానికిది వ్యతిరేకమైనది. ఇలాంటి అజ్ఞానపు పద్ధతి ఒక రకమైనదైతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించిన అసలు ఎతేకాఫ్ పద్ధతి ఇంకో విధమైనది.

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎతేకాఫ్ సమయం మొత్తాన్ని మస్జిద్ లోనే గడిపేవారు. కేవలం అత్యవసరపు పనులకు అంటే కాలకృత్యాలు తీర్చుకోవటానికి మాత్రమే మస్జిద్ ను వదిలి వెళ్ళేవారు. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని హదీథ్ నెం 2029లో మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలోని హదీథ్ నెం. 297లో ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథ్ లో ఇలా నమోదు చేయబడినది: “ఆయన ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు, అవసరమైతే తప్ప, తన ఇంటిలో ప్రవేశించేవారు కాదు.” ముస్లిం హదీథ్ గ్రంథపు ఉల్లేఖనలో: “కేవలం మానవ అవసరాల కోసం.” అని ఉన్నది. మానవ అవసరాలు అంటే మలమూత్ర విసర్జన అని అజ్జుహరీ తన వివరణలో తెలిపారు.

    ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాగ్రత్త వహించేవారు. తల ఎతేకాఫ్ పాటిస్తున్న సమయంలో, తలవెంట్రుకలను శుభ్రంగా కడిగి, నీటుగా దువ్వటానికి వీలుగా, మస్జిద్ కు ఆనుకునే ఉన్న తన భార్య ఆయేషా ఇంటి యొక్క కిటికీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను పెట్టేవారు.

    సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని 2028 వ హదీథ్ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలోని 297 వ హదీథ్ లలో ఆయేషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “మస్జిద్ లో ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను నా వైపుకు వంచేవారు మరియు నేను బహిష్టులో ఉన్నా కూడా వారి తలవెండ్రుకలను దువ్వేదానిని.” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఉల్లేఖన ప్రకారం: “మరియు నేను (శుభ్రంగా తలను) కడిగే దానిని.”

    అల్ హాఫిజ్ ఇలా వివరించినారు:

    ఈ హదీథ్ సూచిస్తున్నదేమిటంటే – ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు, స్వయంగా తనను పరిశుభ్రపరచుకోవటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం, స్నానం చేయటం, తల దువ్వుకోటం మొదలైన పనులు ఆచరించవచ్చును. పండితులందరి ఏకాభిప్రాయం ప్రకారం మస్జిద్ లో చేయకూడని మక్రూహ్ (అయిష్టమైన) ఆచరణలు తప్ప, మిగిలిన పనులు మక్రూహ్ (అయిష్టమైనవి) కావు.

    ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యంతో ఉన్న రోగస్థులను దర్శించలేదు మరియు అంత్యక్రియలలో పాల్గొనలేదు. దీనికి కారణం ఎతేకాఫ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం అల్లాహ్ యొక్క ధ్యానానికి మరియు ఎతేకాప్ ఆరాధనా పద్ధతి యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని పొందటానికి, బాహ్యప్రపంచంతో తెగతెంపులు చేసుకుని, అల్లాహ్ కు దగ్గర కావటానికి ఏకాగ్రతతో మనస్పూర్తిగా ప్రయత్నించటం.

    ‘ఆయేషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: ఎతేకాఫ్ పాటిస్తున్నప్పడు రోగస్థులను దర్శించటం లేదా అంత్యక్రియలలో పాల్గొనటం లేదా తన భార్యతో ఏకాంతంగా గడపటం వంటివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ విధానం (సున్నత్) లో లేదు. కాని తన అవసరాలు తీర్చుకోవటానికి (మలమూత్రవిసర్జన కోసం) బయటకు వెళ్ళటంలో ఎటువంటి తప్పూ లేదు. అబూ దావుద్ హదీథ్ గ్రంథంలోని 2473 వ హదీథ్; దీనిని తన సహీహ్ అబి దావూద్ అనే గ్రంథంలో అల్ అల్బానీ సహీహ్ (ప్రామాణికమైన) హదీథ్ వర్గీకరించారు.

    “లేదా తన భార్యతో ఏకాంతంగా గడపటం” అంటే సంభోగం జరపటం. దీనిని నయల్ అల్ ఔతార్ అనే తన గ్రంథంలో అల్ షౌకానీ వివరించారు.

    ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఆయనను దర్శించేవారు. వారు వెళ్ళటానికి లేచి నిలబడినప్పుడు, రాత్రి సమయం కావటం వలన ఆయన ఆవిడను ఆమె ఇంటి వద్ద విడిచి వచ్చేవారు.

    సఫియా రదియల్లాహు అన్హా (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య) ఇలా ఉల్లేకించారు - ఆవిడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు అంటే రమదాన్ నెలలోని చివరి పది దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఎతేకాఫ్ పాటిస్తున్నప్పుడు ఆయనను సందర్శించారు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత, వెళ్ళటానికి ఆవిడ లేచి నిలబడగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడను ఆమె ఇంటి వద్ద వదిలి రావటానికి తను కూడా లేచి నిలబడినారు. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని 2035 వ హదీథ్; సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలోని 2175 వ హదీథ్.

    చివరిగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించి చూపిన ఎతేకాఫ్ ఆచరణ సరళమైనదీ మరీయు సులభమైనదే కాని కఠినమైనదీ మరియు కష్టతరమైనదీ కాదు. ఆ సమయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా అల్లాహ్ యొక్క ధ్యానంలో గడిపేవారు. మరియు లైలతుల్ ఖదర్ అనే దివ్యమైన రాత్రి కోసం అన్వేషిస్తూ, తన ఆరాధనల ద్వారా అల్లాహ్ వైపు మరలేవారు. మరికొన్ని వివరములకు ఇబ్నె అల్ ఖయ్యూమ్ వ్రాసిన జాద్ అల్ మఆద్ అనే పుస్తకాన్ని, డాక్టర్ అబ్దుల్లతీఫ్ బాల్తో వ్రాసిన అల్ ఎతేకాఫ్ నజ్రహ్ తర్బోవియ్యాహ్ అనే పుస్తకాన్ని చదవ వలెను.

    Islam Q&A